• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర ఆర్థిక స‌ర్వే 2021-22

2021-22 ఆర్థిక సర్వేను 2022 జ‌న‌వరి 31న‌ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 9.2శాతంగా నమోదవ్వొచ్చని సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ముందు నాటి స్థితికి తిరిగి చేరుకుంటుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. మహమ్మారి వల్ల అతి తక్కువగా ప్రభావితమైందని సర్వే చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 3.9శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. ఇక, సేవల రంగంలో 8.2 శాతం, వినియోగంలో 7.0శాతం వృద్ధి ఉండొచ్చని సర్వే తెలిపింది. 

ముఖ్యాంశాలు

వచ్చే ఏడాది చమురు ధరలు పీపాకు 70 - 75 డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాల ప్రాతిపదికన సర్వేలో లెక్కలు కట్టారు. అయితే ప్రస్తుతం ముడి చమురు ధర 90 డాలర్లుగా ఉంది. రాబోయే సీజన్‌లో సాధారణ వర్షపాతం ఉండొచ్చని, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు ఒక క్రమపద్ధతిలో ద్రవ్య లభ్యతను తగ్గించుకోవచ్చన్న అంచనాలూ దీనికి ఆధారభూతమయ్యాయి. 2022 - 23 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటుకు సంబంధించి సర్వేలో పేర్కొన్న అంచనాలు ప్రపంచబ్యాంకు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) వేసిన 9 శాతం అంచనా కన్నా ఇది తక్కువగా ఉంది. ఎస్‌ అండ్‌ పీ, మూడీస్‌ కట్టిన లెక్కల కన్నా ఇది స్వల్పంగా ఎక్కువగా ఉంది. 

తక్కువ ప్రాతిపదికేమీ కాదు.. 

2022 - 23లో అంచనా వేసిన 8 - 8.5 శాతం వృద్ధి అనేది తక్కువ ప్రాతిపదికన రూపొందించింది కాదు. 2021 - 22లో వాస్తవ జీడీపీ వృద్ధి 9.2 శాతంగా ఉండొచ్చని ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. కొవిడ్‌ ముందు నాటి (2019 - 20) ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ప్రాతిపదికన చూస్తే దాన్ని 10 శాతంగా పరిగణించొచ్చు. 

పెరిగిన రాబడి 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి పెరిగింది. దీంతో ప్రభుత్వ పెట్టుబడి వ్యయాన్ని కొనసాగించడానికి, అవసరమైతే పెంచడానికి సర్కారుకు వెసులుబాటు లభించింది. 2021 - 22 బడ్జెట్‌లో పేర్కొన్న 6.8 శాతం ద్రవ్యలోటుకు పరిమితం కావడానికి ఇది వీలు కల్పిస్తోంది.

రెండుగా చీలిక..  

గత రెండేళ్లలో కొవిడ్‌ ఉద్ధృతి దేశ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీల్చింది. ఎంఎస్‌ఎంఈ రంగాలు, వాణిజ్యం, రవాణా, పర్యాటకం, చిల్లర వ్యాపారం, హోటల్, వినోదం వంటి రంగాలతో కూడిన ఒక భాగం మొదటే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. ఆ ప్రభావం నుంచి చివరిగా బయటపడేది కూడా ఆ రంగాలే. మరోవైపు పలు రంగాలు కొవిడ్‌ మహమ్మారిని సమర్థంగా తట్టుకొన్నాయి. కొన్ని మహమ్మారి సమయంలోనూ వృద్ధి సాధించాయి. మొత్తం మీద 2019 - 20లో సేవారంగం వాటా 55 శాతంగా ఉండగా 2021 - 22లో అది 53 శాతానికి తగ్గింది. 

పంట మార్పిడి జరగాలి 

కొవిడ్‌-19 షాక్‌ను వ్యవసాయ రంగం అద్భుతంగా తట్టుకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 3.9 శాతం మేర వృద్ధిని సాధించే వీలుంది. అంతకుముందు సంవత్సరంలో అది 3.6 శాతంగా ఉంది. పంట మార్పిడికి, సేద్యానికి సంబంధించిన అనుబంధ రంగాలకు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి; సేంద్రియ సేద్యాన్ని మరింత పెంచాలి. అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మత్స్య వంటి విభాగాల వల్ల వ్యవసాయ కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందుతోంది. వారి సరాసరి నెలవారీ ఆర్జనలో అది 15 శాతంగా ఉంటోంది. పంట మార్పిడికి సాధనంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సమన్వయంతో చర్యలు చేపట్టాలి. తద్వారా అధిక విలువ కలిగిన పంటలవైపు మళ్లి, పంటలకు నీటి వినియోగాన్ని తగ్గించాలి. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఇది దోహదపడుతుంది. డ్రోన్లు, కృత్రిమ మేధ ఆధారిత విధానాలను విరివిగా ఉపయోగించాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. 

మెరుగుపడ్డ ఉపాధి సూచికలు 

కొవిడ్‌ వల్ల విధించిన లాక్‌డౌన్‌తో 2020 ఏప్రిల్‌ - జూన్‌లో దేశవ్యాప్తంగా ఉపాధికి సంబంధించిన భిన్న సూచికలు భారీగా పడిపోయాయి. ప్రస్తుతం అవి కోలుకొని, తిరిగి వృద్ధి బాటపట్టాయి. పట్టణాల్లో ఉపాధి మెరుగుపడింది. కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో అసంఘటిత నుంచి సంఘటిత రంగంలోకి ఉద్యోగాల మార్పిడి కొనసాగినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) చందాదారుల సంఖ్య సూచిస్తోంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంతో నిరుద్యోగిత రేటు, కార్మిక శక్తి భాగస్వామ్య రేటు, కార్మిక జనాభా రేటు.. దాదాపుగా కొవిడ్‌ ముందునాటి స్థితికి చేరాయి. 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కాలంలో ఉపాధి హామీ పథకంలో చేరిన వారి సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది. 

అంతరిక్షంలో ప్రైవేటు జోరు

రోదసి రంగంపై ప్రైవేటు రంగం, విద్యా సంస్థల ఆసక్తి పెరుగుతోంది. వాహకనౌకల తయారీ నుంచి భూ పరిశీలన కోసం ఉపగ్రహాలను పంపడం వరకూ వివిధ అంశాలకు సంబంధించి 40 ప్రతిపాదనలు ఈ సంస్థల నుంచి వచ్చాయి. ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం తెచ్చిన విధానాల వల్ల అంతరిక్ష వాణిజ్యంలో భారత్‌ తన వాటాను మరింత పెంచుకోవడానికి వీలు కలుగుతోంది. భారతీయ విద్యా వ్యవస్థపై కరోనా ప్రభావం చూపింది. 6 - 14 ఏళ్ల గ్రామీణ విద్యార్థుల నమోదు పడిపోయింది. 

ఎరువుల రాయితీ రూ.85,300 కోట్లు 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో ఎరువులపై ప్రభుత్వ రాయితీ రూ.85,300 కోట్లు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తి 2.85 కోట్ల టన్నులకు చేరింది. 2020-21లో ఎరువులపై ఇచ్చిన రాయితీ రూ.1,38,500 కోట్లు. 
కార్మిక సంస్కరణల్లో దేశంలో పురోగతి కనిపిస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత తదితర అంశాలపై 17 రాష్ట్రాలు ముసాయిదా నిబంధనల్ని ప్రచురించాయి. 

రవాణా రంగంలో అనిశ్చితి 

కరోనా వైరస్‌లో ఒమిక్రాన్‌ రకం కారణంగా అంతర్జాతీయంగా పర్యాటక రంగంలో అనిశ్చితి నెలకొంది. భారత్‌ సహా అన్నిచోట్లా దీని ప్రభావం కనిపిస్తోంది. 2020లో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ పర్యాటకుల రాక 74% మేర తగ్గిపోయింది. 

టీకాలే కీలకం.. 

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశంగానే భావించరాదు. స్థూల ఆర్థిక సూచీగా దీన్ని పరిగణించాలి. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడంలో ఇదే కీలకం. జనవరి 16 నాటికి దేశంలో 156 కోట్ల డోసుల టీకాలను వేశారు. మరణాలను తగ్గించడంలో, ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని ప్రోది చేయడంలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషించాయి. 
2021 - 22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవల రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేసిన వ్యయం రూ.71.61 లక్షల కోట్లకు చేరింది. 2020 - 21 నాటితో పోలిస్తే ఇది 9.8 శాతం అధికం. విద్యపై రూ.6.21 లక్షల కోట్లు, ఆరోగ్యంపై రూ.3.5 లక్షల కోట్లు వెచ్చించారు. 2019 - 20తో పోలిస్తే 2021-22లో ఆరోగ్య రంగంపై వ్యయం 73 శాతం పెరిగింది. కరోనా మహమ్మారి విజృంభణే ఇందుకు కారణం. 

రైల్వేలో పెట్టుబడుల దశాబ్దం 

సామర్థ్య పెంపు చర్యలను వేగవంతం చేస్తున్న దృష్ట్యా రైల్వే రంగంలో రాబోయే పదేళ్లలో భారీ స్థాయి మూలధన పెట్టుబడులు రానున్నాయి. 2030 నాటికి డిమాండు కంటే రైల్వే అన్ని విధాలా ముందుంటుందని అంచనా. సరకు రవాణాలో రైల్వే వాటా ఇప్పుడున్న 26 - 27% నుంచి 40 - 45 శాతానికి చేరుతుంది. 2014 వరకు ఏటా సగటున రూ.46,000 కోట్ల లోపు పెట్టుబడులు రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.2,15,000 కోట్లు దాటింది. రైలు మార్గాల విద్యుదీకరణ 2023 డిసెంబరుకు పూర్తవుతుంది. ఏటా 1835 కి.మీ. మేర నూతన రైలు మార్గాలు సిద్ధమవుతున్నాయి. 2030 నాటికి సామర్థ్యం ఇప్పుడున్న 470 కోట్ల టన్నుల నుంచి 820 కోట్ల టన్నులకు చేరుతుంది.
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 2020 - 21లో 13,327 కి.మీ. మేర జాతీయ మార్గాలు నిర్మించారు. మునుపటి ఏడాది కంటే ఇది 30% ఎక్కువ. రహదారులకు కేటాయింపులు పెరగడంతో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.


ఆర్థిక సర్వే.. 
ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 9.2 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 - 8.5 శాతంగా నమోదు కావచ్చు. పన్ను వసూళ్లలో వృద్ధి బడ్జెట్‌ అంచనాలకు మించి, గణనీయంగా రెండంకెల్లో పుంజుకుంటోంది. జీఎస్‌టీ వసూళ్లు గత జులై నుంచి రూ.లక్ష కోట్లు తగ్గలేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 7.3%  క్షీణించిందని గతంలో అంచనా వేయగా, దానిని 6.6 శాతానికి పరిమితం చేస్తూ తాజాగా జాతీయ గణాంక కార్యాలయం ప్రకటించడం మరింత ఉత్సాహం కలిగించే అంశమే. మౌలిక రంగ వృద్ధిగా పిలిచే 8 కీలక రంగాల ఉత్పత్తి 2021 డిసెంబరులో 3.8% పెరిగింది. టీకాల కార్యక్రమం జోరుగా సాగుతున్నందున, కొవిడ్‌ పరిణామాలు ఆర్థిక వ్యవస్థను ఆటంకపరచవనే విశ్వాసాన్ని ఆర్థిక సర్వే వ్యక్తం చేసింది. 2022 - 23 బడ్జెట్‌ రూపకల్పనకు ఆధారమయ్యే ఈ సర్వే ఏం చెప్పిందంటే..

‘మౌలికానికి’ 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చిస్తేనే..

2024 - 25 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.375 లక్షల కోట్ల) స్థాయికి  చేరాలంటే.. మౌలిక వసతుల రంగంలో 1.4 లక్షల కోట్ల డాలర్ల (రూ.105 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2008 - 17 ఆర్థిక సంవత్సరాల్లో మౌలిక వసతుల కోసం 1.1 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.82 లక్షల కోట్ల)ను భారత్‌ వెచ్చించింది. ‘2020 - 25 మధ్య రూ.111 లక్షల కోట్ల (1.5 ట్రిలియన్లు) మౌలిక పెట్టుబడుల అంచనాలతో 6835 ప్రాజెక్టులున్న నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ)ను ఇప్పటికే ప్రకటించారు. 34 మౌలిక ఉప రంగాలకూ వర్తించేలా 9000కు పైగా ప్రాజెక్టులకు విస్తరించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద 2014 - 15 నుంచి 2020 - 21 వరకు రూ.1,37,218 కోట్ల వ్యయంతో మొత్తం 66 ప్రాజెక్టులు చేపట్టారు.

ఇంధన సుంకాలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులోకి

ఈ సారి రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలను ప్రకటించలేదు. అయితే సరఫరా వ్యవస్థ మెరుగు పడి, ఇంధనంపై సుంకాలను తగ్గిస్తే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. 2021-22 ఏప్రిల్‌-డిసెంబరులో 6 శాతం లోపే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉంది. కానీ ఆర్థిక కార్యకలాపాలు పెరగడం; అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ప్రియం కావడం, రవాణా వ్యయాలూ పెరగడం వల్ల టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 12 శాతం పైకి చేరింది. పప్పు ధాన్యాలు, వంట నూనెల ధరలు తగ్గించడం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కేంద్రం ఎక్సైజ్‌ సుంకంలో, పలు రాష్ట్రాలు వ్యాట్‌లో కోత వేయడంతో డీజిల్, పెట్రోలు ధరలు కొంత తగ్గాయి. కూరగాయల వంటి త్వరగా పాడయ్యే పంట ఉత్పత్తులకు శీతల గిడ్డంగుల వ్యవస్థ బలంగా ఉండాలి. 

2021లో 14వేల కొత్త అంకురాలు

దేశీయ అంకుర వ్యవస్థ సత్తా చాటుతోంది. గత ఆరేళ్లలో అంకురాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. 2016 - 17లో 733 అంకురాలు ప్రారంభం కాగా 2021లో కొత్తగా 14,000 సంస్థలు వెలిశాయి. ఇందులో అత్యధికంగా సేవారంగానికి చెందినవే. ఈ ఏడాది జనవరి 10 నాటికి దేశంలో 61,400 అంకురాలున్నాయి. దేశంలో 555 జిల్లాల్లో కనీసం ఒక అంకుర సంస్థ ఉంది. 2016 - 17లో 121 జిల్లాల్లో మాత్రమే కనీసం ఒక అంకురం ఉంది. 
అత్యధిక యూనోకార్న్‌ (సుమారు రూ.7500 కోట్ల అంకురం)ల సంఖ్యలో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారత్‌ నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 14 నాటికి దేశంలో 44 అంకురాలు కొత్తగా యూనికార్న్‌ హోదా సాధించాయి. వీటితో కలిపి భారత్‌ యూనికార్న్‌ల సంఖ్య 83కి చేరింది. వీటి విలువ దాదాపు రూ.20.77 లక్షల కోట్లు (277.77 బిలియన్‌ డాలర్లు).

2020 - 21లో క్షీణత 6.6 శాతమే 

2020 - 21లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6 శాతం క్షీణించింది. అప్పుడు జీడీపీ 7.3 శాతం క్షీణించిందని 2021 మేలో వేసిన అంచనా కంటే ఇది మెరుగే. కొవిడ్‌ పరిణామాల వల్ల ముందుగా అనుకున్నంత అధ్వానంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదని జాతీయ గణాంక కార్యాలయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
2019 - 20లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటును 3.7 శాతానికి సవరించారు. అంతక్రితం అంచనా 4 శాతంగా ఉంది. 
వాస్తవ జీడీపీ లేదా 2011 - 12 స్థిర ధరల వద్ద జీడీపీ 2020 - 21; 2019 - 20 ఏడాదులకు వరుసగా రూ.135.58 లక్షల కోట్లు; రూ.145.16 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే 2020 - 21లో 6.6 శాతం తగ్గింది. 
2021 జనవరి సవరణలో 2019-20 వాస్తవ జీడీపీలో 4 శాతం వృద్ధి(రూ.145.69 లక్షల కోట్లు) నమోదవుతుందని అంచనా వేశారు. 
2019 - 20; 2020 - 21లలో తలసరి ఆదాయం వరుసగా రూ.1,32,115; రూ.1,26,855గా నమోదైంది. 

‘విమానం’ పుంజుకుంటోంది

భారత విమానయాన రంగం పుంజుకోవడం ప్రారంభించింది. కరోనా టీకా కార్యక్రమం వేగవంతం కావడం; అంతర్జాతీయంగా ప్రయాణ షరతులు సడలిస్తుండడం ఇందుకు నేపథ్యం. 2013 - 14లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 6.1 కోట్లు కాగా, 2019 - 20 కల్లా 13.7 కోట్లకు చేరింది. ఏటా 14% పైగా వృద్ధి నమోదైంది. విమానాశ్రయాల ఆధునికీకరణతో పాటు విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవరాల్‌(ఎమ్‌ఆర్‌ఓ)కు ప్రోత్సాహకాలను ప్రభుత్వం చేపట్టింది. మెట్రోల నుంచి చిన్న నగరాలకు ఉడాన్‌ పేరిట విమాన సర్వీసులు నిర్వహిస్తున్న కార్యక్రమంతో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 153కు చేరింది. 

50% పెరిగిన పన్ను రాబడి

2021 ఏప్రిల్‌ - నవంబరులో ఆదాయం 67.2 శాతం (వార్షిక ప్రాతిపదికన) పెరిగింది. వాస్తవానికి 2021 - 22 బడ్జెట్‌ అంచనాల్లో 9.6 శాతం వృద్ధి మాత్రమే అంచనా వేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు రెండూ బలంగా పుంజుకున్నాయి. ఆర్‌బీఐ మిగులు నిధులు రూ.99,000 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయడంతో పన్నేతర రాబడి బాగా పెరిగింది. స్థూలంగా పన్ను రాబడి 2021 ఏప్రిల్‌ - నవంబరులో 50 శాతం మేర పెరిగింది. కొవిడ్‌ ముందు (2019 - 20) పరిస్థితుల కంటే కూడా పన్ను రాబడి మెరుగ్గా ఉంది. 2021 ఏప్రిల్‌ - నవంబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.10.74 లక్షల కోట్లకు చేరాయి. 2020 ఏప్రిల్‌ - డిసెంబరుతో పోలిస్తే ఇది 61.5 శాతం అధికం.

కొవిడ్‌ను బ్యాంకులు తట్టుకున్నాయ్‌

కొవిడ్‌ పరిణామాల వల్ల తలెత్తిన ఆర్థిక షాక్‌ను దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇప్పటివరకు సమర్థంగా తట్టుకుంది కానీ.. ఇప్పటికీ కొంత ప్రతికూలత ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) మొత్తం నికర లాభం 2020-21 ప్రథమార్థంలో రూ.14,688 కోట్లు కాగా, 2021-22 ప్రథమార్థంలో రూ.31,144 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకుల నికర లాభం రూ.32,762 కోట్ల నుంచి రూ.38,234 కోట్లకు చేరింది. మొత్తంగా షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల నికర లాభం 2020 సెప్టెంబరు చివరకు 59,426 కోట్లు కాగా 2021 సెప్టెంబరుకు రూ.78,729 కోట్లకు వృద్ధి చెందింది.

‘సాఫ్ట్‌వేర్‌’లోకి భారీ విదేశీ పెట్టుబడులు

2021 ఏప్రిల్‌ - నవంబరులో స్థూలంగా 54.1 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) దేశంలోకి వచ్చాయని.. నికరంగా మాత్రం 24.7 బి. డాలర్లకు తగ్గాయని ఆర్థిక సర్వే తెలిపింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఐటీ - బీపీఎం) రంగ ఆదాయాలు 2020 - 21లో (ఇ-కామర్స్‌ మినహా) 2.26 శాతం వృద్ధితో రూ.14.55 లక్షల కోట్లకు (194 బిలియన్‌ డాలర్లు) చేరుకున్నాయని సర్వే పేర్కొంది. కొత్తగా 1.38 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.

ఔషధ రంగంలోకీ ఎఫ్‌డీఐలు

కొవిడ్‌ సంబంధిత ఔషధాలు, టీకాలకు గిరాకీ పెరగడంతో 2020 - 21లో ఫార్మా రంగంలోకి ఎఫ్‌డీఐలు బాగా పెరిగాయి. 2021 ఏప్రిల్‌ - సెప్టెంబరులో రూ.4,413 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2020 ఇదే సమయంతో పోలిస్తే ఇవి 53 శాతం అధికం. ప్రపంచంలో ఉత్పత్తి పరంగా భారత ఔషధ పరిశ్రమ మూడో స్థానంలో ఉంది. 2020 - 21లో మొత్తం ఫార్మా ఎగుమతులు 24.2 బి. డాలర్ల మేర జరిగితే, దిగుమతులు 7 బి. డాలర్లు మాత్రమే. మొత్తం ప్రపంచంలోనే జనరిక్‌ ఔషధాల సరఫరాలో భారత్‌ వాటా 20 శాతంగా ఉంది.

ఐపీఓల ద్వారా రూ.89,066 కోట్లు

2021 ఏప్రిల్‌ - నవంబరులో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా 75 కంపెనీలు రూ.89,066 కోట్లు సమీకరించాయి. 2020 ఇదే కాలంలో 29 కంపెనీలు రూ.14,733 కోట్లే సమీకరించాయి. అంటే నిధుల సమీకరణ 504.50 శాతం పెరిగింది. దశాబ్దకాలంలోనే ఒక ఏడాదిలో అత్యధిక నిధుల సమీకరణ ఇదే. షేర్లు ఆకర్షణీయ ప్రతిఫలాలను అందివ్వడంతో, 2021 ఏప్రిల్‌ - నవంబరులో కొత్తగా 2.21 కోట్ల మంది డీ-మ్యాట్‌ ఖాతాలు తెరిచారు. 2019 - 20లో ఎన్‌ఎస్‌ఈ  టర్నోవరులో చిన్న మదుపర్ల పెట్టుబడి వాటా 38.8 శాతం కాగా.. 2021 ఏప్రిల్‌- అక్టోబరులో 44.7 శాతానికి చేరింది. 

టెలికాం సంస్కరణలు భేష్‌

టెలికాం సంస్కరణల వల్ల 4జీకి మద్దతు లభించడంతో పాటు 5జీ నెట్‌వర్క్‌లకు పెట్టుబడులను సిద్ధం చేసుకునే వాతావరణం ఏర్పడిందని ఆర్థిక సర్వే పేర్కొంది. ‘కరోనాతో డేటా వినియోగం భారీగా పెరిగినా, బ్రాడ్‌బ్యాండ్, టెలికాం అనుసంధానతలో అంతరాయాలు ఏర్పడలేదు. సగటు వినియోగదారు నెలవారీ డేటా వినియోగం 2017 - 18 తొలి త్రైమాసికంలో 1.24 జీబీ కాగా 2021 - 22లో అది 14.1 జీబీకి పెరిగింది. డిసెంబరు 2021 కల్లా మొబైల్‌ టవర్ల సంఖ్య 6.93 లక్షలకు చేరింది. 

ఎయిరిండియా విక్రయంతో ప్రైవేటీకరణకు జోష్‌

భారీ నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను విక్రయించగలగడంతో, దేశంలో ప్రైవేటీకరణ ప్రక్రియకు జోష్‌ వచ్చినట్లయ్యింది. అన్ని రంగాల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా, వ్యాపార కార్యకలాపాల్లో ప్రభుత్వ రంగ పాత్రను ఇది పునర్నిర్వచించింది. ఆత్మనిర్భర్‌ భారత్, స్వయంసమృద్ధి లక్ష్యాల సాకారానికీ ఇది దోహదం చేస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని సాధించేందుకే కాదు.. 20 ఏళ్ల తరవాత జరిగిన తొలి ప్రైవేటీకరణ ప్రక్రియగా ఇది ఎంతో కీలకం. బీపీసీఎల్, షిప్పింగ్‌ కార్పొరేషన్, పవన్‌హాన్స్, ఐడీబీఐ బ్యాంక్, కాంకర్, బీఈఎం, విశాఖ స్టీల్‌ వంటివీ ప్రైవేటీకరణ బాటలో ఉన్నాయి. 

సీపీఎస్‌ఈల ఆస్తుల అమ్మకంపై రూ.6 లక్షల కోట్లు!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈలు) స్థలాలు, ప్రధానేతర ఆస్తుల విక్రయ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.విక్రయ నిమిత్తం ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, బీపీసీఎల్, బీఅండ్‌ఆర్, బీఈఎంఎల్, హెచ్‌ఎంటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్‌ లాంటి సీపీఎస్‌ఈల నుంచి 3,400 ఎకరాల స్థలం, ఇతర ప్రధానేతర ఆస్తులను ఇప్పటివరకు గుర్తించారు. 2021 - 22 నుంచి 2024 - 25 వరకు నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ కీలక ఆస్తుల విక్రయం ద్వారా రూ.6 లక్షల కోట్లు సమకూరొచ్చు. 

సెమీ కండక్టర్ల కొరత.. ఉత్పత్తి కోత

సెమీ కండక్టర్ల కొరత వల్ల వివిధ రంగాలకు చెందిన చాలా సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించడం లేదా నిలిపివేయాల్సి వచ్చింది. అందుకే సెమీ కండక్టర్లు, డిస్‌ప్లేల తయారీ విభాగం కోసం ప్రభుత్వం రూ.76,000 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. ఇందువల్ల దేశంలో వాటి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, అంతర్జాతీయ సరఫరా ఆటంకాల నుంచి ఊరట లభిస్తుందని పేర్కొంది. ఇది దేశీయ ఎలక్ట్రానిక్‌ కంపెనీలకు ఉపయుక్తమే కాక, అంతర్జాతీయంగానూ పోటీ పడొచ్చని పేర్కొంది. చిప్‌సెట్ల కొరత వల్ల గత డిసెంబరు ఆఖరుకు వాహన కంపెనీల వద్ద 7 లక్షల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. 

అమెరికా ఫెడ్‌ నిర్ణయాలనూ  భారత్‌ తట్టుకుంటోంది

అమెరికా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థల కేంద్ర బ్యాంకులు పరపతి విధానాన్ని ‘సాధారణీకరణ’ చేసినా కూడా భారత్‌ తట్టుకోగలదని ఆర్థిక సర్వే పేర్కొంది.అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపునకు సంకేతాలు ఇవ్వడంతో పాటు ద్రవ్యోల్బణ అదుపునకు ద్రవ్యలభ్యతను తగ్గించే చర్యలు చేపట్టనుంది. దీనిని పరపతి విధాన ‘సాధారణీకరణ’ ప్రణాళిక ప్రారంభంగా భావిస్తున్నారు. భారత్‌ వద్ద 630 బిలియన్‌ డాలర్లకు పైగా ఉన్న విదేశీ మారకపు నిల్వలకు తోడు ఎటువంటి పరిస్థితులతోనైనా పోరాడేంత ‘విధానపరమైన అవకాశాలు’ ఉన్నాయని తెలిపింది. ఇప్పటిదాకా అమెరికా ఎటువంటి ‘టాపర్‌ టాంట్రమ్‌’ చర్యలు చేపట్టినా.. భారత్‌ తొణకలేదని.. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లినా.. ఆ తర్వాత బలంగా పుంజుకుందని సర్వే గుర్తు చేసింది.

నౌకాశ్రయాల పనితీరు కీలకం

దేశ ఆర్థిక వ్యవస్థకు నౌకాశ్రయాల పనితీరు కీలకం. పోర్టుల పాలన, సామర్థ్య వినియోగ పెంపు, అనుసంధాన విస్తరణ కోసం పలు చర్యలు చేపడుతోంది. 2014 మార్చి నాటికి 13 ప్రధాన పోర్టుల సామర్థ్యం 871.52 మిలియన్‌ టన్నులు కాగా.. 2021 మార్చి చివరకు 79% వృద్ధితో 1560.61 మిలియన్‌ టన్నులకు చేరింది. కరోనా పరిణామాల వల్ల పోర్టుల వద్ద రద్దీ 2020-21లో అంతక్రితం ఏడాదితో పోలిస్తే 4.6% తగ్గింది.

విదేశాల్లో ఆస్తుల రికవరీ అవసరం

కంపెనీలకు విదేశాల్లో ఉన్న ఆస్తుల నుంచీ బకాయిలు రికవరీ చేసేందుకు సహాయం చేసే ఒక ‘ప్రామాణీకరించిన విదేశీ దివాలా ప్రణాళిక’ అవసరమని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ప్రస్తుతం విదేశీ రుణదాతలు భారత్‌లోని దేశీయ కంపెనీపై క్లెయిమ్‌ చేసుకునే వీలుంది. కానీ ఇతర దేశాల్లో దివాలా ప్రక్రియకు అనుమతి లేదు. ఈ నిబంధనలను సవరించాలని సర్వే అంటోంది. మరో వైపు, దివాలా స్మృతి(ఐబీసీ) వల్ల కార్పొరేట్‌ రుణస్వీకర్తల ప్రవర్తనలో మార్పులు వచ్చాయని చెబుతోంది. వేలకొద్దీ కంపెనీలు ముందస్తు దశల్లోనే రుణ ఒత్తిడిని పరిష్కరించుకోడానికి ముందుకు వస్తున్నాయని పేర్కొంది. 2021 సెప్టెంబరు వరకు దివాలా ప్రక్రియకు 18,629 దరఖాస్తులు వచ్చాయి. వీటి విలువ రూ.5,89,516 కోట్లు.

7 లక్షలకు పైగా వాహన ఆర్డర్లు పెండింగ్‌

2021 డిసెంబరు నాటికి వాహన తయారీ సంస్థల వద్ద 7 లక్షలకు పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం సెమీ కండక్టర్ల కొరతే. ఇవి లేనందున, ఎలక్ట్రానిక్‌ పరికరాలు సమయానికి సరఫరా కావడం లేదు. ఫలితంగా ఒక వాహనానికి ఆర్డర్‌ తీసుకున్నప్పటి నుంచి డెలివరీ ఇచ్చేందుకు అంతర్జాతీయంగా 14 వారాల సమయం పడుతోంది. భారత్‌లోనూ ఇదే ధోరణి ఉంది. భారత వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ గణాంకాల ప్రకారం, 2020 డిసెంబరుతో పోలిస్తే 2021 డిసెంబరులో కార్ల విక్రయాలు 13 శాతం క్షీణించి 2,19,421కు పరిమితమయ్యాయి.  సరఫరా ఇబ్బందులతోనే ఇది చోటుచేసుకుంది.

 తిరోగమనంలో తెలంగాణ సేవా రంగం వృద్ధి రేటు 

- 2021 - 22 ఆర్థిక సర్వేలో వెల్లడి 
హైదరాబాద్‌లో గృహ నిర్మాణ రంగం వేగంగా పరుగులు తీస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021 - 22 ఆర్థిక సర్వే వెల్లడించింది. అత్యధిక గృహ లావాదేవీలు జరుగుతున్న టాప్‌-8 నగరాల్లో హైదరాబాద్‌ ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. కానీ తెలంగాణలో సేవారంగం వృద్ధి రేటు గత మూడేళ్లుగా తగ్గుతూ వస్తున్నట్లు సర్వే తెలిపింది. 2018 - 19లో 7.91% మేర ఉన్న ఈ రంగం వార్షిక వృద్ధి రేటు 2019 - 20లో 5.69%కి తగ్గిపోయింది. 2020 - 21 నాటికల్లా అది మైనస్‌ 3.94%కి పడిపోయిందని పేర్కొంది. మరోవైపు కొవిడ్‌ ముందునాటి పరిస్థితులతో పోలిస్తే దాని రెండో దశలో భాగ్యనగరంలో ఇళ్ల ధరలు, లావాదేవీలు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. ఈ విషయంలో ముంబయి, థానే, పుణె, నోయిడా, బెంగళూరుల సరసన హైదరాబాద్‌ నిలిచినట్లు తెలిపింది. ఇదే సమయంలో గాంధీనగర్, అహ్మదాబాద్, చెన్నై, రాంచీ, దిల్లీ, కోల్‌కతాల్లో మాత్రం లావాదేవీలు తగ్గినట్లు పేర్కొంది. అయితే కొవిడ్‌ విజృంభణ ఉన్నప్పటికీ హైదరాబాద్‌తో పాటు గాంధీనగర్, అహ్మదాబాద్, రాంచీల్లో ఇళ్ల ధరలు నిరంతరం పెరుగుతున్నట్లు తెలిపింది. 2019 ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంతో పోలిస్తే హైదరాబాద్‌లో కొవిడ్‌ తొలి ఉద్ధృతి (2020 ఏప్రిల్‌ - జూన్‌ మధ్య) ఇళ్ల లావాదేవీలు 37.6% పడిపోయినా, 2021 ఏప్రిల్‌ - జూన్‌ల మధ్య 37.9% పెరిగినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. ఇదే సమయంలో ఇళ్ల ధరలు తొలి దశలో కేవలం 12.3% పెరగ్గా, కరోనా రెండో దశలో 21.3% పెరిగినట్లు తెలిపింది. గాంధీనగర్, అహ్మదాబాద్‌ తర్వాత గృహాల ధరల పెరుగుదల ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 

ఈ నివేదిక ప్రకారం 

హైదరాబాద్‌లో అటవీ విస్తరణ 2011తో పోలిస్తే 2021 నాటికి 146.8% వృద్ధి చెందింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయితో పోలిస్తే పెరుగుదల హైదరాబాద్‌లోనే ఎక్కువ నమోదైంది. 
గ్రామీణ ప్రాంతాల్లో 100% కుటుంబాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది. 
మెరుగైన పారిశుద్ధ్య వసతులతో కూడిన ఇళ్లలో జీవించే జనం సంఖ్య 2015 - 16 నాటి కుటుంబ ఆరోగ్య సర్వే - 4 ప్రకారం తెలంగాణలో 76.2% ఉండగా, 2019 - 21 నాటి సర్వే - 5 నాటికి ఆ సంఖ్య 52.3%కి పడిపోయింది. 
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే - 4 ప్రకారం రాష్ట్రంలో శిశుమరణాల రేటు 27.7 ఉండగా, సర్వే-5 నాటికి అది 26.4కి తగ్గింది. అయిదేళ్లలోపు పిల్లల మరణాల రేటు ఇదే సమయంలో 46.5 నుంచి 45.6కి తగ్గింది. 
రాష్ట్రంలో సంతాన సాఫల్యరేటు (ఒక్కో మహిళకు జన్మించే సగటు పిల్లల సంఖ్య)లో మార్పు లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4, 5ల్లో ఇది 1.8కి పరిమితమైంది. 
నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020 - 21లో తెలంగాణ 69 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది.
నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం కింద తెలంగాణకు నిధులు తగ్గాయి. రాష్ట్రానికి 2019 - 20లో దీనికింద రూ.11 కోట్లు విడుదల చేయగా, 2020 - 21లో అది రూ.3 కోట్లకు తగ్గిపోయింది. 
తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో పొగాకు పండించే రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకోసం వీటన్నింటికీ రూ.10 కోట్లు కేటాయించారు. 
దేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావానికి గురైన 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో రోడ్డు అనుసంధానత మెరుగుపరిచారు. అందులో తెలంగాణ కూడా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో సేవల రంగం తిరోగమనం 

- విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల ప్రైవేటీకరణ 
ఆంధ్రప్రదేశ్‌లో సేవల రంగం వృద్ధి రేటు భారీగా పడిపోయింది. గత మూడేళ్లుగా ఇది తిరోగమనంలో సాగుతోంది. 2018 - 19లో 8.24%, 2019 - 20లో 6.20%గా నమోదైన ఈ రంగం వార్షిక వృద్ధి రేటు 2020 - 21లో మైనస్‌ 6.71%కి పడిపోయినట్లు కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే వెల్లడించింది. రాష్ట్ర స్థూల అదనపు విలువలో ఈ రంగం వాటా 2018 - 19లో 42.25% ఉండగా, 2019 - 20లో అది 41.86%, 2020 - 21లో 41.64%కి పడిపోయింది. తెలంగాణలోనూ సేవల రంగం వృద్ధి రేటు మూడేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. 2018 - 19లో 7.91% ఉన్న ఈ వృద్ధిరేటు 2019 - 20లో 5.69 శాతానికి చేరింది. 2020 - 21లో అది ఏకంగా మైనస్‌ 3.94 శాతానికి పడిపోయింది. 
ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన పారిశుద్ధ్య వాతావరణంలో జీవించే వారి సంఖ్య తగ్గిపోయింది. చక్కటి పారిశుద్ధ్య వసతులున్న ఇళ్లలో నివసించే జనసంఖ్య 2015 - 16 ఆరోగ్య సర్వే - 4 ప్రకారం 77.3% ఉండగా 2019 - 21 ఆరోగ్య సర్వే - 5 నాటికి 54.4%కి పడిపోయింది. వంట కోసం శుద్ధ ఇంధనం వాడే కుటుంబాల సంఖ్య ఇదివరకు 83.6% ఉండగా, తాజాగా 62%కి పడిపోయింది. 
విశాఖ పోర్టులో సరకు రవాణాకు వెచ్చించే రోజులు దేశంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ ఒక్కో నౌక టర్న్‌ అరౌండ్‌ (సరకు లోడింగ్, అన్‌లోడింగ్‌)కు సగటున 3.15 రోజులు పడుతోంది. కోల్‌కతా, మర్మగోవా, వైజాగ్‌ పోర్టులు తప్ప దేశంలోని మిగిలిన అన్ని పోర్టుల్లో అత్యధిక సరకు రవాణా ట్రాఫిక్‌ నమోదైంది. 
2022 - 25 మధ్యకాలంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ప్రైవేటీకరణ (మానిటైజ్‌) చేయాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. 
లక్ష హెక్టార్లలో ప్రకృతి సేద్యంతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో తొలి స్థానంలో ఉంది. 
నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020 - 21లో ఆంధ్రప్రదేశ్‌ 4వ స్థానంలో నిలిచింది. దేశంలోని కోస్తా రాష్ట్రాలపరంగా చూస్తే ఒడిశా తర్వాతి స్థానాన్ని ఏపీ దక్కించుకొంది. 

మైనస్‌లో నికర ఉత్పత్తి వృద్ధి రేటు 

ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తొలి ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రెండంకెల మేర నమోదైన రాష్ట్ర నికర ఉత్పత్తి వృద్ధిరేటు 2020 - 21లో ఏకంగా 1.6%కి పడిపోయింది. 2011 - 22 సిరీస్‌ను అనుసరించి తాజా ధరల ప్రకారం ఏపీ నికర ఉత్పత్తి వృద్ధి రేటు 2014 - 15లో 14%, 2015 - 16లో 15.7%, 2016 - 17లో 12.4%, 2017 18లో 15.3%, 2018 - 19లో 10.8%, 2019 - 20లో 11.3% నమోదుకాగా 2020 - 21లో మాత్రం 1.6%కి పడిపోయింది. రాష్ట్ర నికర ఉత్పత్తి విలువ 2019 - 20లో రూ.8,70,064 కోట్లుగా నమోదుకాగా, 2020 - 21లో రూ.8,84,199 కోట్లకు, తలసరి నికర ఉత్పత్తి విలువ రూ.1,68,480 నుంచి రూ.1,70,215కి చేరింది. 

ఆర్థిక సర్వే అంటే..

గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్‌ సర్వే. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా భావించే ఈ సర్వే ఆధారంగానే ప్రతిఏటా బడ్జెట్‌ రూపకల్పన జరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే.. రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలు చేస్తుంది. సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) ఆధ్వర్యంలో ఈ నివేదిక రూపొందిస్తారు. అయితే ఈ ఏడాది సీఈఏ కృష్ణమూర్తి సుబ్రమణియం పదవీకాలం డిసెంబరుతో ముగియడంతో సీఈఏ పదవికి ఖాళీ ఏర్పడింది. దీంతో ప్రధాన ఆర్థిక సలహాదారు ఆధ్వర్యంలో ఈసారి ఆర్థిక సర్వేను రూపొందించారు. కేంద్ర నూతన ముఖ్య ఆర్థిక సలహాదారుగా వి.అనంత నాగేశ్వరన్‌ నియమితులయ్యారు. అయితే ఆర్థిక సర్వే రూపకల్పన నాటికి ఈయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు.

ఈ సారి ఒకే విభాగంలో..

సాధారణంగా ప్రతి ఏటా ఈ సర్వేను రెండు విభాగాలుగా ప్రవేశపెట్టేవారు.  తొలి విభాగంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రముఖంగా ప్రస్తావిస్తారు. రెండో విభాగంలో మాత్రం ప్రస్తుత ఏడాదికి సంబంధించిన దేశ ఆర్థిక పనితీరును సవివరంగా పొందుపర్చేవారు. అయితే ఈ ఏడాది అన్ని వివరాలను ఒకే దాంట్లో కలిపి సింగిల్‌ వాల్యూమ్‌గా ఆర్థిక సర్వేను విడుదల చేశారు.

సర్వేలో ఏముంటుంది..

బడ్జెట్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఈ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయడమే కాకుండా ప్రధాన రంగాలైన వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలనూ ఈ సర్వే విశ్లేషిస్తుంది. వీటితో పాటు వచ్చే ఏడాది ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, వాటిని ఎదుర్కొనే వ్యూహాలను కూడా ఈ సర్వే సూచిస్తుండడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

బడ్జెట్‌కు దీనికి తేడా ఏంటంటే..

కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే పేర్కొంటారు. కానీ ఆర్థిక సర్వేలో మాత్రం ప్రస్తుత సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు విశ్లేషణ, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టాల్సిన సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అందుకే ఈ ఆర్థిక సర్వే ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ను రూపొందిస్తారు.

బడ్జెట్‌ కన్నా ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఈ ఆర్థిక సర్వేను 1950-51 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1964 వరకు సాధారణ బడ్జెట్‌తోనే కలిపి ప్రవేశపెట్టేవారు. కానీ, 1964 నుంచి దీన్ని బడ్జెట్‌ కన్నా ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలికగా అర్థం చేసుకోవడం కోసమే ఆర్థిక సర్వేను ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు.

ఆర్థిక సర్వే 2021-22 డౌన్‌లోడ్‌ చేసుకోండి

Read Latest Budget 2022, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-02-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం