• facebook
  • whatsapp
  • telegram

  అఫ్గాన్‌లో ఆశారేఖ?

శాంతికోసం యుద్ధం అన్న నయా సిద్ధాంతాన్ని సహస్రాబ్ది తొలి ఏళ్లలోనే ప్రపంచ దేశాలపై రుద్ది అఫ్గానిస్థాన్‌లో ఆపరేషన్‌ ఎండ్యూరింగ్‌ ఫ్రీడమ్‌ను 2001లో అమెరికా ప్రారంభించింది. అగ్రరాజ్యంపై సెప్టెంబరు 11నాటి భయానక దాడులకు ప్రతీకారంగా అఫ్గాన్‌లో తాలిబన్ల తలకొట్టి మొలేసి వాళ్ల దన్నుతో ఉగ్రవాద కోరసాచిన అల్‌ఖైదాను అంతం చెయ్యడమే లక్ష్యంగా నాటో దేశాలనూ కదనరంగంలో అమెరికా కదం తొక్కించింది. ఒబామా జమానాలోనే ఒసామా బిన్‌ లాడెన్‌ కడతేరిపోగా అల్‌ఖైదా దిక్కులేని పక్షి కావడం, పదవీచ్యుతులైన తాలిబన్లు చింత చచ్చినా పులుపు చావనట్లు ఉగ్ర పంథాలో ఉనికి చాటుకొంటుండటం తెలిసిందే. గల్ఫ్‌ యుద్ధానికిది భిన్నమైనది... కనీసం మన జీవితకాలంలో ఇది పూర్తి కాదు అని అఫ్గాన్‌ సమరంపై నాటి ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ భవిష్యద్దర్శనం చేసినా, 18 నెలల చర్చల దరిమిలా 18ఏళ్ల యుద్ధానికి తెరదించేందుకు తాలిబన్లతో అమెరికా ఒప్పందం కుదుర్చుకోవడం- ఎంతో ప్రభావశీల పరిణామమే! ఖతార్‌ రాజధాని దోహాలో అమెరికా, తాలిబన్ల ప్రతినిధులు సంతకాలు చేసిన ఒప్పందం- సంక్షుభిత అఫ్గాన్‌లో చిరశాంతికి ప్రోది చేస్తుందన్న ఆశాభావాలు మిన్నంటుతున్నాయి. పరస్పర ఆధారిత నాలుగు అంశాలే మూలస్తంభాలుగా కుదిరిన సమగ్ర శాంతి ఒడంబడికలో- అమెరికా, దాని మిత్రపక్షాల భద్రతకు భంగకరంగా ఏ వ్యక్తీ లేదా బృందం అఫ్గాన్‌ భూభాగాన్ని వినియోగించుకోకుండా నియంత్రించాలన్నది మొట్టమొదటిది. అఫ్గాన్‌నుంచి నిర్ణీత కాలావధుల్లో విదేశీ దళాలన్నీ నిష్క్రమించాల్సి ఉంటుందన్నది రెండోది. ఈ నెల పదో తేదీనుంచి అఫ్గాన్‌లో భిన్న పక్షాల మధ్య చర్చల ప్రక్రియ మొదలు కావడం, చిరశాంతే ఆ సంప్రదింపుల ప్రధాన అజెండాగా ఉండటం, దేశ భవిష్యత్‌ రాజకీయ మార్గ సూచీ నిర్ధారణ, దాని అమలుకు సంయుక్త యంత్రాంగాల్ని సిద్ధం చెయ్యడం- తాజా ఒప్పందంలోని మలి అంశాలు. ఒప్పందానుసారం పదోతేదీలోగా జైళ్లలో ఉన్న వెయ్యిమంది తాలిబన్‌ ఖైదీల విడుదల తనకు సమ్మతం కాదని అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తాజాగా ప్రకటించారు. బాంబుల భాష, కలష్నికోవ్‌ల ఘోషలతో రణరక్త ప్రవాహసిక్తమైన అఫ్గాన్‌లో తాజాగా ఎగరేసిన శాంతికపోతం ఏమి కానున్నదో ఎవరు చెప్పగలరు?

అఫ్గాన్‌లో యుద్ధాన్ని పదిరోజుల్లో ముగించేయగలను... కోటిమంది ప్రజలు మృత్యువాత పడి భూమండలం మీద ఆ దేశం నామరూపాల్లేకుండా పోతుందనే వెనకాడుతున్నానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిరుడు జులైలో ప్రకటించారు. మానవాళికే మహోపద్రవంగా ఉగ్రవాదం ఉరుముతోందని ఇండియా ఎన్నో ఏళ్లుగా మొత్తుకొన్నా పెడచెవిన పెట్టిన అమెరికన్లు, ఆ ఉగ్ర సెగ తమకు తగిలాకే సర్వానర్థ కారకమైన యుద్ధానికి సిద్ధపడ్డారు. నిర్దిష్ట యుద్ధ రంగాలేవీ లేని పోరులో ప్రచ్ఛన్న శత్రువుతో సాగించాల్సిన వినూత్న సంఘర్షణ అంటూ నాటి అధ్యక్షుడు బుష్‌ ప్రారంభించిన యుద్ధం- కాబూల్‌, కాందహార్‌, జలాలాబాద్‌, హజారే షరీఫ్‌, హీరత్‌ వంటి పరగణాల్లో అగ్ని వృష్టికి, వేలమంది అభాగ్య జనహననానికీ కారణమైంది. 2014లోనే అఫ్గాన్‌ యుద్ధానికి అమెరికా సూత్రప్రాయ ముగింపు పలికినా, నిరుడు తొలి ఆరు నెలల్లో ప్రభుత్వ దళాలు, విదేశీ సైనికుల చేతుల్లో 717మంది పౌరులు మరణించగా, తాలిబన్ల దమనకాండ మరో 531 మందిని బలిగొందని ఐక్యరాజ్య సమితే వెల్లడించింది. ఈ యుద్ధం అమెరికాకు ఏం ఒరగబెట్టిందనే జమాఖర్చుల లెక్కల్లో- లక్ష కోట్ల డాలర్ల వ్యయం, 2,400 మంది అమెరికన్‌ సైనికుల బలిదానాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రంప్‌- ఇక ఆ ఖాతాను మూసేయాలనే నిర్ణయించారు. మనిషి నెత్తురు రుచి మరిగిన తాలిబన్లు ఉగ్రవాద దుశ్చర్యలను వీడిన దాఖలా మచ్చుకైనా లేకున్నా- అఫ్గాన్‌ ఉచ్చునుంచి ఏదో ఒక రకంగా బయటపడి, అదే తన ఘనతగా పునరధికారానికి బాటలుపరచుకోవాలన్నదే శ్వేత సౌధాధిపతి అభిమతం. వచ్చే నాలుగున్నర నెలల్లో మెజారిటీ బలగాల ఉపసంహరణకు ప్రణాళికలు అల్లినా- యుద్ధ కాముక తాలిబన్‌ శక్తులు శాంతిని భ్రాంతి చెయ్యకుండా ఉంటాయా అన్నదే సందేహాస్పదం!

అల్‌ఖైదా దాదాపుగా తాలిబన్‌లో కలిసిపోయిందని, 20కిపైగా ఉగ్రవాద సంస్థలకు తాలిబన్లు గొడుగుపడుతున్నారని 2018 ఏప్రిల్‌నాటి సమితి భద్రతామండలి నివేదిక ఎలుగెత్తి చాటుతోంది. అఫ్గాన్‌లో దాదాపు సగభాగంపై అజమాయిషీ చేస్తున్న తాలిబన్‌ను విశ్వసించడం అంటే- రొయ్యల బుట్టకు పిల్లిని కాపలా పెట్టినట్లేనన్న నిస్పృహ స్వరాలు వినవస్తున్నాయి. అమెరికా కోరినట్లు అంతర్జాతీయ దాడులకు తమ దేశం వేదిక కాబోదని భరోసా ఇచ్చిన తాలిబన్లు- అసలు ఉగ్రవాదానికి సరైన నిర్వచనం ఏమిటని నిరుటి చర్చల్లో నిగ్గదీశారు. ఉగ్రవాదానికి ఐక్యరాజ్య సమితే సరైన నిర్వచనం ఇవ్వలేని పరిస్థితుల్లో- తమ జోలికి రానంతవరకు వాళ్ల చావు వాళ్లు చచ్చినా పర్లేదన్నట్లుగా అగ్రరాజ్యం శాంతి ఒప్పందాన్ని రూపుదిద్దింది. అఫ్గాన్‌లో పరిస్థితి కుదుటపడాలని ఆకాంక్షించి, రూ.75,000 కోట్లకుపైగా అక్కడి మౌలిక సదుపాయాలపై వెచ్చించిన ఇండియా, అడపాదడపా ఉగ్ర బీభత్సానికి తాను మూల్యం చెల్లిస్తూనే ఉంది. అఫ్గాన్‌ భద్రతా దళాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న ఇండియాకు- తాలిబన్లకు పెత్తనం దక్కితే ఏమవుతుందో తెలియనిది కాదు. ప్రపంచవ్యాప్తంగా హెరాయిన్‌ సరఫరాల్లో 90శాతం అఫ్గాన్‌ పుణ్యమే; తాలిబన్ల సంపాదనలో 60శాతం దాకా మాదక వాణిజ్యం ద్వారా ఒనగూడుతున్నదే! హెరాయిన్‌ తయారీకి అవసరమైన కీలక రసాయనం ఇండియానుంచే వారికి అందుతున్నట్లు అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ సంస్థ తాజాగా వెల్లడించింది. దేశీయంగా మాదక మాఫియా వెన్ను విరిచి, అఫ్గాన్‌లో తాలిబన్ల దూకుడుకు పగ్గాలేసే వ్యూహంతోఇండియా జాగ్రత్తగా ముందడుగేయాల్సిన సమయమిది!

Posted Date: 18-03-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం