• facebook
  • whatsapp
  • telegram

  పారని ట్రంప్‌ పాచిక

 ‘డబ్ల్యూహెచ్‌ఓ’కు నిధుల నిలిపివేత వ్యవహారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో తన వైఫల్యాల్ని కప్పిపుచ్చే ప్రయత్నాల్ని చేస్తున్నారా? ఈ విషయంలో అందరి దృష్టి మళ్లించేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధుల్ని నిలిపేశారా అనేవి తాజా పరిణామాల నుంచి ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు. ప్రస్తుతం ప్రపంచమంతా ప్రాణాంతక వైరస్‌పై పోరాడుతున్న వేళ ఇది. ఇలా క్లిష్ట సమయంలో ఆ సంస్థకు నిధులు ఆపేయడం వల్ల దాని కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. డబ్ల్యూహెచ్‌ఓకు సంబంధించి ఇప్పటికే ఉన్న పలు లోపాలకు తోడు, సంస్థ నేతలు చూపే దుర్విచక్షణపై విమర్శలెన్ని ఉన్నా వ్యాధులపై పోరాటంలో సంస్థ పలు ప్రొటోకాల్స్‌ను అందిస్తుంది. వివిధ దేశాల్లో పరిశోధన, అభివృద్ధి ఆధారంగా శాస్త్రీయ సమాచారాన్ని, ఉత్తమ పద్ధతుల్ని అన్ని దేశాలతో విస్తృతంగా పంచుకుంటుంది. పేద, అల్పాదాయ దేశాల్లో పలు రకాల వ్యాధుల వ్యాప్తిని ముందస్తుగానే నివారించేందుకు, నిరోధించేందుకు టీకాల పంపిణీ వంటి కార్యక్రమాలకు నిధులను సమకూర్చే బాధ్యతల్ని చేపడుతుంది. ఇటీవలి కాలంలో ప్రపంచంలోని పెద్ద దేశాల మధ్య వివాదాలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తూ కొంత పక్షపాతంతో వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో ఉపయుక్తమైన పనులు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలసత్వ ధోరణి
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌(డీజీ) టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయస్‌ ఇథియోపియాలో మాజీ విదేశాంగ మంత్రి. డబ్ల్యూహెచ్‌ఓ చరిత్రలో వైద్యుడు కాకుండా డీజీ పదవి చేపట్టిన తొలి వ్యక్తి. వాస్తవానికి వైద్య శాస్త్ర నేపథ్యం లేని వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టి ఉండాల్సింది కాదు. క్షేత్రస్థాయిలో శాస్త్ర పరిజ్ఞానం ఉండే వ్యక్తి అయితే మరింత మెరుగైన సేవలు అందించేవారనే అభిప్రాయాలున్నాయి. అదంతా పక్కనపెడితే, కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న ప్రస్తుత కాలంలో గత మూడు నెలలుగా సరైన రీతిలో వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. చైనాలోని ఉహాన్‌లో డిసెంబర్‌ మధ్యలోనే కరోనా వైరస్‌ బయటపడి, థాయ్‌లాండ్‌, తైవాన్‌, దక్షిణకొరియా తదితర దేశాలకు వ్యాప్తి చెందకముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేతగా ప్రారంభంలోనే తగిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలకు తావిచ్చారు. మరోవైపు చైనా ఈ విషయంలో అన్నీ దాచిపెట్టింది. వైరస్‌ బయటపడిన ప్రారంభ వారాల్లో అమెరికా వినతుల్ని పెడచెవిన పెట్టింది. కొత్త రోగకారకంపై అధ్యయనం చేపట్టేందుకు వైద్య నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని పంపాలన్న ప్రతిపాదననూ విస్మరించింది. కరోనా వైరస్‌ ‘మనిషి నుంచి మనిషికి’ వ్యాపించదంటూ చైనా చేసిన ప్రకటననే టెడ్రోస్‌ డబ్ల్యూహెచ్‌ఓ వేదికపై నుంచి పునరుద్ఘాటించారు. అంతటి పెద్ద అబద్ధం మానవ జాతి ఆరోగ్యాన్నే పెద్ద ప్రమాదంలో పడేసిందన్న సంగతి ఇప్పుడు అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఉహాన్‌లో బయటపడిన వైరస్‌ను ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడంలో టెడ్రోస్‌ చాలా ఆలస్యం చేశారన్న అమెరికా ఆరోపణలకూ తగినంత బలముందనే చెప్పొచ్చు. అమెరికా ప్రభుత్వం టెడ్రోస్‌కు రాసిన లేఖలో మహమ్మారి వ్యాప్తిలో డబ్ల్యూహెచ్‌ఓ పాత్రపై పూర్తిస్థాయి విచారణ జరిగే వరకూ నిధుల్ని నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. డబ్ల్యూహెచ్‌ఓ అధినేతగా ఇప్పటిదాకా చైనా ప్రభుత్వ పారదర్శకతను మెచ్చుకోవడానికే సరిపోయిందంటూ విమర్శలూ గుప్పించింది. చైనా ప్రపంచానికి అదేపనిగా అబద్ధాలు చెబుతూ వచ్చిందని, ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన వాస్తవిక పరిస్థితిని, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపించిందని ఆ లేఖలో పేర్కొంది. కానీ, టెడ్రోస్‌ ఉద్దేశ్యపూర్వకంగానే అబద్ధాలను ప్రపంచానికి అందించారనేది ఆరోపణ. టెడ్రోస్‌ తన స్వదేశమైన ఇథియోపియాలో చైనా పెట్టిన భారీ పెట్టుబడులకు ప్రభావితమయ్యారనే విమర్శ కూడా ఉంది. కరోనాతో విలవిల్లాడుతున్న ప్రపంచం సరైన మార్గదర్శకత్వం కోసం టెడ్రోస్‌ వైపు చూస్తున్న తరుణంలో ఆయన నిజాయతీగా వ్యవహరించలేదని చెప్పడం అతిశయోక్తి కాదనే అభిప్రాయాలున్నాయి.

ఘర్షణ వాతావరణం
అమెరికా ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థకు 50 కోట్ల డాలర్లను అందజేస్తుంది. ప్రస్తుతం మహమ్మారి వ్యాప్తితో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింతగా నిధులు అవసరమైన పరిస్థితిలో, ఇకపై నిధుల అందజేతను నిలిపేయాలని ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడంతో సంస్థ పనితీరుపై తప్పకుండా తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికా ఇస్తున్న విరాళంలో చైనా కేవలం పదింట ఒక వంతు మాత్రమే అందిస్తోంది. ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉదారంగా సహాయం అందించినప్పటికీ, అది మరో శక్తిమంతమైన దేశం వైపు మొగ్గుచూపింది. ఐరాస పరిధిలోని పలు సంస్థల్ని ఆయా దేశాలు తమ గుప్పిట్లోకి లాక్కోవడం కొత్త వ్యవహారమేమీ కాదు. అమెరికా, చైనాల మధ్య శత్రుత్వం, ఘర్షణ వాతావరణం పెరుగుతున్న క్రమంలో, ప్రపంచ రాజకీయాల ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఇలాంటి సంస్థలు ముందుకు సాగుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరోనాపై పోరులో చేసిన తప్పుల నుంచి స్వదేశంలో ప్రజల దృష్టి మరల్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల నిలిపివేత ద్వారా చేసిన ప్రయత్నాలు అంతగా ఫలితం ఇవ్వలేదని తెలుస్తోంది.

Posted Date: 23-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం