• facebook
  • whatsapp
  • telegram

పెట్టుబడులు ప్రవహించేనా?

* యూఎస్‌ - చైనా పోరుతో ఇండియాకు లబ్ధి

   కరోనా వైరస్‌ గురించి ప్రపంచాన్ని చైనా ముందస్తుగా హెచ్చరించకపోవడంవల్లే కొవిడ్‌ మహమ్మారి మానవాళికి పీడలా దాపురించిందని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా తమ దేశంలోకి వచ్చే చైనా ఎగుమతులపై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల హెచ్చరించారు. కొన్నేళ్ల నుంచి అమెరికా, చైనాల మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలకడానికి ఈ ఏడాది జనవరిలో రెండు దేశాలు కుదుర్చుకున్న మొదటి దశ సయోధ్య ఒప్పందమిక నీరు కారిపోయినట్లే. ఆ ఒప్పందం ప్రకారం చైనా రానున్న రెండేళ్లలో అమెరికా నుంచి అదనంగా 20,000 కోట్ల డాలర్ల వస్తుసేవలను కొనాల్సి ఉంది. దీనికి బదులుగా చైనా ఎగుమతులపై ట్రంప్‌ ఇటీవల ప్రతిపాదించిన అదనపు సుంకాలను ఉపసంహరించాల్సి ఉంది. తీరా ఇప్పుడు చైనా ఎగుమతులపై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించడంతో పరిస్థితి మొదటికి వచ్చి మళ్లీ వాణిజ్య యుద్ధం రాజుకునేట్లుంది.
సాధించాల్సిందెంతో...
   ప్రపంచం తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారిపోతున్న సమయంలో అమెరికా-చైనా వాణిజ్య వైరం విపరిణామాలకు దారితీస్తుంది. ఈ భయంతోనే భారత్‌లో, ఇతర ప్రపంచ దేశాల్లో స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. మే 4వ తేదీన సెన్సెక్స్‌, నిఫ్టీలు ఆరు శాతం నష్టాలను చవిచూశాయి. భారత స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నా అమెరికా-చైనా వాణిజ్య వైరం భారతదేశానికి ప్రయోజనకరంగా మారగలదు. చౌక కార్మిక శక్తి, వ్యాపారాలు, పరిశ్రమలకు అనువైన విధానాలు, డాలర్‌ కన్నా యువాన్‌ విలువ తక్కువగా ఉండేట్లు చూసుకోవడం ద్వారా చైనా తన ఎగుమతులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలిగింది. చైనా తన కరెన్సీ విలువను వక్రమార్గాల్లో తక్కువ స్థాయిలో ఉండేట్లు చూసుకొంటోందని ట్రంప్‌ ఆరోపించడానికి కారణమిదే. భారతదేశం తన కరెన్సీ విలువను పనిగట్టుకుని తగ్గు స్థాయిలో పట్టినిలపడంలేదు. అలా చేస్తే ఇప్పటికే విదేశాలతో ఉన్న వాణిజ్య లోటు అలవికానంతగా పెరిగిపోతుంది. తక్కువ వేతనాలకు మేలైన కార్మికులను అందించడం, వ్యాపారానుకూల విధానాలను రూపొందించి అమలు చేయడం భారత్‌కు చేతిలోని పనే. విద్యుత్‌, రహదారులు, రేవులు తదితర మౌలిక వసతుల్లో లోపాలను సరిదిద్ది, నైపుణ్య శిక్షణతో మన కార్మికులను ప్రపంచస్థాయిలో నిలిచేలా తీర్చిదిద్దడం వంటివి తక్షణం చేపట్టాలి. మన దేశ జనాభాలో అత్యధిక శాతం ఆక్రమిస్తున్న యువజనానికి అధునాతన నైపుణ్యాలను అలవరచి 21వ శతాబ్దిలో తిరుగులేని శ్రామిక సైన్యంగా తయారుచేయాలి. అంటే మన మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధికి విస్తారంగా పెట్టుబడులు పెట్టాలి. నైపుణ్యాభివృద్ది సాధించాలి. సులభతర వాణిజ్య సూచీలో మరెన్నో మెట్లు పైకి ఎక్కాలి.
వ్యవస్థాగత సంస్కరణలతో ప్రయోజనం
   ఈ సందర్భంగా మనం విస్మరించకూడని వాస్తవం ఒకటుంది. చైనాలోనూ కార్మిక వ్యయం పెరుగుతున్నందువల్ల తన పరిశ్రమలు కొన్నింటిని చౌకగా కార్మిక శక్తి లభించే దేశాలకు తరలిస్తోంది. మరోవైపు తన అధునాతన వస్తుసేవలకు కొత్త మార్కెట్లనూ అన్వేషిస్తోంది. ఇతర దేశాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవసరమని చైనాకు తెలుసు. తన వస్తుసేవలకు భారతదేశం సువిశాల మార్కెట్‌ను అందించగలుగుతుంది కాబట్టి, ఇక్కడ తన పెట్టుబడులు పెంచాలని చైనా చూస్తోంది. భారత్‌లో కొత్త పరిశ్రమలనూ నెలకొల్పుతోంది. భారతదేశానికి చైనా అతిపెద్ద మార్కెట్‌ కానుంది. 2019లో భారత్‌, చైనాల మధ్య 9,268 కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. 2018లోకన్నా 300 కోట్ల డాలర్ల తక్కువ వ్యాపారమే జరిగినా, ఇది మున్ముందు మరింత పెరిగే అవకాశాలు దండిగా ఉన్నాయి. భారత్‌ ఇంతకాలం ప్రధానంగా ముడిసరకులను, వ్యవసాయోత్పత్తులనే చైనాకు ఎగుమతి చేస్తున్నా- ఇకపైన టెలికమ్యూనికేషన్‌, సాఫ్ట్‌వేర్‌ సేవలు, వస్తువులనూ ఎగుమతి చేయవచ్చు. అలా చేస్తే చైనాతో మనకున్న 5,677 కోట్ల డాలర్ల పైచిలుకు వాణిజ్య లోటును బాగా తగ్గించుకోవచ్చు. చైనా ఎగుమతులపై భారీగా సుంకం వేస్తానని అమెరికా ప్రకటిస్తున్న నేపథ్యంలో- బహుళజాతి సంస్థలు చైనా నుంచి ఉత్పత్తి కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించి, అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతులు చేపట్టే అవకాశం ఉంది. అంటే అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో కొన్ని చైనా నుంచి తరలిపోతాయన్నమాట. చైనా కూడా కొన్ని ప్లాంట్లను ఇలా తరలించే అవకాశముంది. ఈ పరిశ్రమల వలస ప్రవాహంలో గణనీయ భాగాన్ని భారత్‌ వైపు మళ్లిస్తే కొత్త పరిశ్రమలు చాలా వస్తాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. ఆ పరిశ్రమల వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతాయి. ఇవన్నీ సాకారం కావాలంటే భారత్‌ వేగంగా వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలి. అలా చేసినప్పుడు మాత్రమే అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం నుంచి భారత్‌ ప్రయోజనం పొందగలుగుతుంది.
అమెరికాతో కార్యకలాపాల విస్తరణ!
   చైనాకు అమెరికా వాణిజ్యపరంగా దూరమవుతున్న కొద్దీ భారత్‌కు దగ్గరయ్యే అవకాశాలు హెచ్చుతాయి. చైనా నుంచి అమెరికా ఇప్పటివరకు కొనుగోలు చేస్తున్న వస్తుసేవల్లో గణనీయ భాగాన్ని భారతదేశం అందించగలుగుతుంది. ప్రస్తుతం భారత్‌, అమెరికాల మధ్య ఏటా 12,000 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుండగా, అది మున్ముందు ఇంకా పెరిగే అవకాశాలు పుష్కలం. ఉదాహరణకు కొవిడ్‌ వ్యాధిని ఎదుర్కోవడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, పారాసెటమాల్‌ మందులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇంకా అనేక మందుల తయారీకి కావలసిన ముడిసరకైన యాక్టివ్‌ ఫార్మస్యూటికల్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ (ఏపీఐ)లో 55 శాతం చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. కానీ చైనా ఏపీఐలు, వాటితో తయారయ్యే మందుల నాణ్యతపైన ప్రపంచదేశాలకు అనుమానాలున్నాయి. నాణ్యమైన ఏపీఐలను తయారుచేసే సామర్థ్యం భారతదేశానికి ఉంది. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలి. పన్ను రాయితీలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలనిచ్చి దేశమంతటా విస్తృతంగా ఏపీఐ యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎలక్ట్రానిక్స్‌, బొమ్మలు, ఫర్నిచర్‌ ఎగుమతుల్లో ఇంతకాలం చైనాయే అగ్రస్థానం ఆక్రమిస్తూ ఉంది. ఈ వస్తువుల తయారీని భారత్‌ చేపట్టవచ్చు. ఒకప్పుడు చైనా ఎగుమతుల్లో 34 శాతం వాటాను ఫర్నిచర్‌, జౌళి, బొమ్మలే ఆక్రమించేవి. వీటిని తయారు చేసే కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోతున్నందువల్ల ఇప్పుడు ఈ వస్తువుల వాటా 12 శాతానికి తగ్గిపోయింది. చైనాలో కార్మిక వ్యయం పెరగడమే దీనికి కారణం. బొమ్మలు, జౌళి, ప్లాస్టిక్‌ వస్తువుల తయారీని సంప్రదాయ పరిశ్రమలు చేపడుతుంటాయి. చైనా ఇంతకన్నా ఉన్నత సాంకేతికత అవసరమైన ఎలెక్ట్రానిక్స్‌, ఎలెక్ట్రికల్‌, కంప్యూటర్‌ సంబంధిత వస్తువుల తయారీకి మళ్లుతున్నప్పటికీ, అక్కడి నుంచి సంప్రదాయ వస్తు ఎగుమతుల విలువ 28,500 కోట్ల డాలర్లుగా ఉంది. వీటిలో జౌళి, ప్లాస్టిక్‌ వంటి వస్తువుల తయారీని భారత్‌ చేపట్టగలుగుతుంది. వీటికితోడు ఎలెక్ట్రికల్‌, విద్యుత్‌ మోటారు వాహనాలు, ఇనుము ఉక్కు వస్తువుల పరిశ్రమలనూ చైనా నుంచి ఆకర్షించవచ్చు. ఉన్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అధునాతన సాంకేతికతను ఉపయోగించి కార్మికుల ఉత్పాదకతను పెంచాలి. ఈ మేలురకం వస్తువులకు ఐరోపా, అమెరికాలలో విస్తృత మార్కెట్లు ఏర్పడి భారత్‌ భారీగా విదేశ మారక ద్రవ్యం ఆర్జించగలుగుతుంది.

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం