• facebook
  • whatsapp
  • telegram

జపాన్‌ స్ఫూర్తిదాయక పోరు


   కొవిడ్‌పై జపాన్‌ సాగించిన పోరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఈ మహమ్మారితో తీవ్రంగా విలవిల్లాడిన చైనాయేతర దేశాల్లో జపాన్‌ ఒకటి. ఒక దశలో వైరస్‌ బాధితుల సంఖ్యలో జపాన్‌ ప్రపంచంలో రెండోస్థానంలో ఉండేది. ప్రస్తుతం 36వ స్థానానికి చేరింది. ఇతర దేశాలతో పోలిస్తే జపాన్‌ కేసుల సంఖ్యను మెరుగైన రీతిలో ఎలా కట్టడి చేయగలిగిందనేది ఆసక్తికరం.
   విదేశీ మీడియా ప్రతినిధులతోపాటు, ఇతర దేశాల సాంక్రామిక వ్యాధుల నిపుణులు సైతం జపాన్‌ అనుసరించిన విజయవంతమైన నమూనాను గుర్తించడంలో విఫలమయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌ సమీపిస్తున్న కారణంగా కరోనా వైరస్‌ ప్రభావిత కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపించారనే ఆరోపణల్నీ లేవనెత్తారు. కొవిడ్‌పై పోరులో జపాన్‌ నమూనా బాగా ప్రభావం చూపిందనేందుకు- మిగతా దేశాలతో పోలిస్తే అక్కడ తక్కువ సంఖ్యలో నమోదైన మరణాలే సాక్ష్యంగా నిలిచాయి.
   హొక్కైడో యూనివర్సిటీలో అంతర్జాతీయ రాజకీయ విభాగంలో ఆచార్యులు కజుటో సుజుకీ చెప్పిన ప్రకారం... జపాన్‌ సమూహ ఆధారిత విధానమనే నమూనాతో పనిచేసింది. చైనా నుంచి సేకరించిన డేటా ఆధారంగా చేపట్టిన సాంక్రామిక వ్యాధులకు సంబంధించిన అధ్యయనం ద్వారా గుర్తించిన అంశాల నుంచి ఆ సమూహ ఆధారిత విధానాన్ని రూపొందించారు. ప్రాథమికంగా ఈ అధ్యయనాన్ని ఫిబ్రవరి మూడున యొకొహామా ఓడరేవులోకి ప్రవేశించిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ నౌకపై చేపట్టారు. ఈ విధానంలో ప్రతి సమూహాన్ని పరిశీలించి, రుగ్మతకు కారణమవుతున్న మూలాన్ని గుర్తించడం, వ్యాధి వ్యాపించకుండా ఐసోలేషన్‌లో ఉంచడం అనే పద్ధతులను పాటించారు. ఈ నమూనా ప్రకారం ప్రజలకు ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. రుగ్మతకు గురైన వ్యక్తులు తక్కువ సంఖ్యలో ఉండి, సమూహాల్ని ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితేనే ఈ విధానం ద్వారా విజయం సాధించే అవకాశం ఉంటుంది. జపాన్‌లో తొలుత ఆత్యయిక పరిస్థితిని ప్రకటించిన హొక్కైడో ప్రాంతంలో సైతం తాము సమూహ ఆధారిత నమూనాను పాటించడం ద్వారా మహమ్మారి వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకోగలిగినట్లు ప్రకటించడం గమనార్హం.
   కరోనా కట్టడికి జపాన్‌ మూడు కీలకాంశాలతో కూడిన మరో పద్ధతిని కూడా అనుసరించింది. గాలి వెలుతురు సరిగా ప్రసరించని ప్రదేశాలు, చాలామంది గుమిగూడిన జనసమ్మర్ధ ప్రాంతాలు, ఒకరికొకరు తాకే పరిస్థితులు... ఈ మూడింటికీ ప్రజలు దూరంగా ఉండాలని సూచించింది. ఇలాంటి నమూనాలు, సూచనలతోపాటు, కొన్ని సామాజిక అలవాట్లను రోజువారీ జీవితంలో భాగంగా మార్చింది. పరిచయస్తులు కలుసుకున్నప్పుడు కరచాలనం, హత్తుకోవడంవంటివి పరిహరించి తలవంచుతూ నమస్కరించడం, వ్యక్తిగత పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం, రెస్టారెంట్లలో వేడి తువ్వాళ్లు ఉపయోగించడం, మాస్కులు ధరించడం వంటి అలవాట్లను పెంపొందించింది. పరిస్థితి ఇప్పుడు బాగానే ఉన్నా మహమ్మారి మళ్లీ తిరగబెడితే ఎలాగనే సందేహాలున్నాయి. ఒకవేళ కొవిడ్‌ కేసులు తిరిగి విజృంభించినా జపాన్‌ పరిస్థితి ప్రపంచ దేశాలన్నింటిలోకీ సురక్షితంగానే ఉంటుందని చెప్పవచ్ఛు ఎందుకంటే, ప్రతి వెయ్యిమందికి 13 పడకలతో, ఆస్పత్రి సౌకర్యాల్లో జపాన్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
   కొవిడ్‌ సంక్షోభం అనంతరం ప్రపంచం చాలా విషయాల్లో మార్పులు సంతరించకోక తప్పని పరిస్థితి ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. కొవిడ్‌ సంక్షోభ సమయంలో భారత్‌ నాయకత్వ పాత్ర పోషించడమే కాకుండా, భవిష్యత్తు అవకాశాలను ఒడిసిపట్టడంపై దృష్టిసారించింది. జపాన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. అయితే, చైనా తన కర్మాగారాలను మూసివేయడంతో జపాన్‌ తయారీదారులు దెబ్బతిన్నారు. ఉత్పాదక స్థావరంగా చైనాను ఎంచుకోవడం ద్వారా ఆ దేశంపై మరీ ఎక్కువగా ఆధారపడ్డామనే కోణంలో జపాన్‌లో కొత్త చర్చ తలెత్తింది. చైనా నుంచి తమ తయారీ పరిశ్రమలను బయటికి తరలించే దిశగా జపాన్‌ ప్రణాళికల్ని ప్రారంభించింది. ఇందుకోసం పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఆర్థిక మద్దతు కల్పించేందుకు 220 కోట్ల డాలర్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇది భారత పరిశ్రమలకు గొప్ప వార్తే. జపాన్‌ ప్రధాని షింజో అబె- భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న అనుబంధం ద్వారా సదరు పెట్టుబడుల్లో భారత్‌ ప్రధాన వాటాను సొంతం చేసుకోగలిగే అవకాశాలు దండిగా ఉన్నాయి.
   జపాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అత్యధికంగా ప్రయోజనం పొందే దేశాల్లో భారత్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌ ఉంటాయి. ఈ అవకాశాన్ని దక్కించుకునేందుకు, జపాన్‌ కంపెనీలను ఆకర్షించేందుకు భారత్‌ సానుకూల వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. జపనీయులు చాలా సున్నిత మనస్కులు. వారి మనోభావాల్ని, వ్యాపార సంస్కృతిని అర్థం చేసుకోవడం అంత తేలికైన పనేమీ కాదు. సరైన వ్యూహాలు, విధానాలతో ముందడుగు వేస్తే, కొవిడ్‌ సంక్షోభం తరవాతి దశ భారత్‌, జపాన్‌ సంబంధాల్లో సమూల మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది.

 

- అనిల్‌రాజ్‌
(రచయిత- టోక్యోలో వ్యాపారవేత్త)

Posted Date: 13-06-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం