• facebook
  • whatsapp
  • telegram

  మహమ్మారిపై ప్రపంచయుద్ధం

* కబళిస్తున్న కరోనా

‘ఇళ్లలోనుంచి బయటకు వస్తే మూడు నెలల జైలుశిక్ష విధిస్తాం’- ఇటలీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలివి. పెద్దయెత్తున సామాజిక సంఘర్షణలు జరిగినప్పుడో... మతకల్లోలాలు చెలరేగినప్పుడో మాత్రమే ప్రభుత్వాలు అరుదుగా జారీచేసే ఆదేశాలివి. కానీ, ఓ వైరస్‌ బారినుంచి సమాజాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయంతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వాలు ఆదేశాలు వెలువరించడం ఇదే తొలిసారి. కరోనా ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అనేక దేశాల్లో పర్యాటకం పడకేసింది. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని దేశాల్లో అత్యవసరమైతే తప్ప జనం ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. రెండు మాసాల క్రితం చైనాలోని ఊహాన్‌ ప్రాంతంలో తెరమీదకు వచ్చిన ఈ వైరస్‌ అతి తక్కువ సమయంలో ప్రపంచ దేశాల్లో విస్తరించింది. కరోనా వైరస్‌ విజృంభణ వేగం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)ను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. జనవరి 30న అంతర్జాతీయ ఆత్యయిక స్థితి(హెల్త్‌ ఎమర్జెన్సీ)ని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. వైరస్‌ కట్టుతప్పి విస్తరిస్తున్న పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్‌ఓ వేగంగా నియంత్రణ చర్యలు ప్రారంభించింది. ఇప్పటివరకూ ఆ సంస్థ సుమారు 1.30లక్షల వైద్య నిపుణులకు ‘ఆన్‌లైన్‌ కోర్సు’ల ద్వారా ఏడు భాషల్లో వైరస్‌ నివారణకు సంబంధించిన శిక్షణ ఇవ్వగలిగింది. వివిధ దేశాల అధికారుల సమన్వయంతో చర్యలు ప్రారంభించినప్పటికీ చెప్పుకోదగిన ఫలితం లేకుండాపోతోంది.

నానాటికి తీవ్రతరం
వైరస్‌ బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆందోళన పెంచుతున్న వైరస్‌ తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రజల్లో తీవ్ర అలజడి మొదలైంది. చైనా సహా అనేక ఇతర దేశాల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్‌ ఏ క్షణాన ఎవరి రూపంలో తమ ప్రాంతంలోకి ప్రవేశిస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని 109 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించింది. దీంతో యావత్‌ వైద్యరంగం అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్దిష్ట ఆరోగ్య వ్యవస్థలను నిర్మించుకుని, కరోనా బాధితులకు సకాలంలో వైద్యం అందించగలిగిన దేశమే బాధ్యతయుతంగా స్పందిస్తున్నట్లు లెక్క. ఒకవేళ ఏ దేశమైనా అవసరమైన వైద్యం అందించలేక చేతులెత్తేస్తే దానివల్ల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదమూ కొట్టిపారేయలేనిది. ప్రపంచ దేశాల అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యూహాత్మక సమన్వయంతో పనిచేయాల్సిన సమయమిది. వైరస్‌ బారిన పడినవారికి తక్షణం వైద్య సేవలందించి, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. వైద్యసేవలను అందించడానికి సంబంధించి ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా- సమస్య సంక్షోభం స్థాయికి చేరే ప్రమాదం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 3,850కిపైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. ఒక్క చైనాలోనే 3,120మంది మరణించారు. ఇటలీలో 366, ఇరాన్‌లో 237 మృత్యువాత పడ్డారు. వ్యాధి సోకినవారి సంఖ్య 1.11 లక్షలు దాటింది. కరోనా నివారణకోసం చైనా యుద్ధప్రాతిపాదికన రోజుల వ్యవధిలో పెద్ద ఆసుపత్రిని సైతం నిర్మించింది. ప్రధాన బాధిత ప్రాంతం ఊహాన్‌కు ఎవరు వెళ్లకుండా దిగ్బంధించింది. ప్రపంచవ్యాప్తంగా గడచిన యాభై సంవత్సరాల్లో అనేక రకాల వైరస్‌లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాయి. 1967లో మర్‌బర్గ్‌, 1976లో ఎబోలా, 1994లో హెరా, 1994లో బర్డ్‌ ఫ్లూ, 1998లో నిఫామ్‌, 2002లో సార్స్‌, 2009లో స్వైన్‌ఫ్లూ, 2012లో మెర్స్‌, 2013లో బర్డ్‌ ఫ్లూ విరుచుకుపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 762.6 కోట్లమంది ప్రజలు ఈ వైరస్‌ల బారినపడ్డారు. 2009లో సంభవించిన స్వైన్‌ఫ్లూ ఎక్కువమందిని బలి తీసుకుంది. బర్డ్‌ఫ్లూ ఉపద్రవం తరవాత ఏడేళ్లకు కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను కమ్మేస్తూ ప్రజలను భయం గుప్పిట్లో పెట్టేసింది. ఫలితంగా ఆర్థిక రంగం కుదేలైపోతోంది. ప్రధానంగా చైనా, ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇరాన్‌, యూఏఈ లాంటి దేశాల్లో ఇది ప్రమాదకరంగా విస్తరిస్తోంది. ఆయా దేశాల్లో అధికార యంత్రాంగం సూచనల మేరకు ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో సంచారానికి భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఆహార పదార్థాలు అందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చైనా నుంచి దిగుమతులను కొన్ని దేశాలు నియంత్రిస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చే ముడి ఔషధాలపై పరిమితులవల్ల ఔషధరంగంపైనా ప్రభావం పడుతోంది. దేశాల మధ్య ప్రజల రాకపోకలు తగ్గిపోతుండటంతో పర్యాటక రంగమూ ప్రభావితమవుతోంది. దీంతో హోటళ్ల రంగం మందగమనంతో నడుస్తుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయంలోనే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ తప్పనిసరిగా మారింది. సదస్సులు, సమావేశాలు, క్రీడోత్సవాల నిర్వహణపైనా ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. గత నెల 26 నుంచి 29 వరకు వాషింగ్టన్‌లో నిర్వహించిన కన్జర్వేటివ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఇద్దరికి కరోనా సోకిందని నిర్ధారణ కావడంతో అమెరికా ఉలిక్కిపడింది. ఆ సమావేశానికి అధ్యక్షుడు ట్రంప్‌ సైతం హాజరు కావడమే అందుకు కారణం. కరోనా ప్రపంచాన్ని ఎంతగా హడలెత్తిస్తుందో చెప్పడానికి ఈ ఉదంతమే దాఖలా. అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ అంచనా ప్రకారం కరోనా ప్రభావం వల్ల సుమారు 11,300 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ఒక్క విమానయానంలోనే ఇంత నష్టం నమోదైతే ఇతర రంగాల భవిష్యత్తు ఏమిటన్నది అంచనాకు అందదు. కరోనా దుష్ప్రభావం ఉత్పత్తి రంగంపైనా తీవ్రస్థాయిలో పడింది. ఎక్కడికక్కడ ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఉపాధి చూపే సంస్థల తాత్కాలిక మూసివేత కారణంగా కార్మికులు, ఉద్యోగులు ఇక్కట్లపాలవుతున్నారు. ప్రజల అవసరాలను దళారీ సంస్థలు సొమ్ముచేసుకోవడమూ మొదలైంది. వైరస్‌ సోకకుండా వాడే మాస్కుల ధరలకు రెక్కలొచ్చాయి. వైద్యం చేసే సిబ్బందికి సైతం అవి అందుబాటులో లేని దుస్థితి దాపురించిందని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే వాపోతోంది. గిరాకీకి తగ్గట్లు వాటి తయారీకి సిద్ధం కావాలని సూచించింది. కరోనా వైరస్‌ బారిన పడిన దేశాలను ఆదుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ ముందుకు వచ్చింది. ఆయా దేశాల నుంచి విరాళాల స్వీకరణ ప్రారంభించింది. మహమ్మారిపై సమరానికి 1,200 కోట్ల డాలర్ల నిధులను సిద్ధం చేసినట్లు ప్రపంచ బ్యాంక్‌ సైతం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యథాశక్తి నిధులను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలను పటిష్ఠపరచుకుంటున్నాయి.

దేశం అప్రమత్తం
వివిధ దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే మనదేశంలో ప్రస్తుతానికి పరిస్థితి కాస్త అదుపులోనే ఉందని చెప్పాలి. ఇప్పటివరకు 45మందికి పైగా వైరస్‌ సోకిందని నిర్ధారించారు. వారిలో 16 మంది ఇటలీ పర్యాటకులే ఉన్నారు. మిగిలినవారి ఆరోగ్యం నిలకడగా ఉన్నందువల్ల ఆందోళన చెందనవసరం లేదు. దేశంలో ముందస్తు చర్యలు తీసుకోవడం కారణంగా వివిధ దేశాల నుంచి భారత్‌కు చేరుకున్న ఆరు లక్షల మందికి ముందుగా పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందిస్తున్న కారణంగా అంతగా ప్రమాదం లేదు. అంతమాత్రాన ఉదాసీనంగా ఉండటమూ మంచిది కాదు. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన ఉద్యోగికి వైరస్‌ ఉందని నిర్ధారణ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్తలు చేపట్టాయి. ప్రసార, సామాజిక మాధ్యమాల క్రియాశీలత కారణంగా ప్రజలూ అప్రమత్తమవుతున్నారు. కరోనా నిధులు దుర్వినియోగం కాకుండా అధికారులు బాధ్యతగా పనిచేయాలి. అవసరమైన పరికరాలు వైద్య సంస్థలకు సమకూర్చాలి. అత్యాధునిక పరిశోధన కేంద్రాలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలి. వైరస్‌ బారిన ప్రజలు పడకుండా తీసుకోవాల్సిన పద్ధతులను అధికార యంత్రాంగం వీలైనన్ని మార్గాల ద్వారా జనావళికి చేరవేయాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో సమర్థంగా బాధ్యతలు నిర్వహించినట్లయితే కరోనా ముప్పును చాలావరకు తప్పించుకోవచ్చు.
చదువులకు ఆటంకం
విద్యారంగంపైనా కరోనా ప్రభావం పడుతోంది. దీనిపై ‘యునిసెఫ్‌’ ఆందోళన వ్యక్తీకరించింది. ‘యునిసెఫ్‌’ తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లో సుమారు 29 కోట్ల విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారని తెలిపింది. 13 దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా మార్చి 15వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. మిగిలిన తొమ్మిది దేశాల్లో ప్రభావిత ప్రాంతాల్లో సెలవులు ప్రకటించారు. అత్యధికంగా చైనాలో 23 కోట్లకు పైగా విద్యార్థులు ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. విద్యాసంస్థల మూసివేత కారణంగా చదువులో విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ‘యునెస్కో’ ప్రత్యామ్నాయంగా దూరవిద్య విధానాలు అవలంబించాలని సూచించింది. అంతర్జాలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఈ ఏర్పాటు సాధ్యమే. లేనిచోట్ల అవస్థలు తప్పవు. ముఖ్యంగా పేద విద్యార్థుల చదువులకు అవాంతరాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క నిరుపేద వర్గాల విద్యార్థుల ఆరోగ్యం క్షీణించే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే భారత్‌ తరహాలోనే మధ్యాహ్న భోజనం మాదిరి పథకాలు ఇతర దేశాల్లోనూ అమలవుతున్నాయి. అనేక దేశాల్లో పేదవర్గాల విద్యార్థులు రెండుపూటలా పాఠశాలల్లో అందించే ఆహారం మీదే ఆధారపడుతుంటారు. అలాంటి విద్యార్థులకు పాఠశాలలు మూసివేయడం అంటే విద్య, ఆరోగ్యాలకు వారు దూరమైనట్లే!

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌
(రచయిత- ‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

Posted Date: 30-04-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం