• facebook
  • whatsapp
  • telegram

నేపాల్‌కు అటూ ఇటు.....

భారత్‌ లక్ష్యంగా చైనా కుయుక్తులు

రాముడి జన్మస్థలంపైనా, బుద్ధుడి భారతీయతపైనా నోరుపారేసుకుని దుందుడుకుతనం చాటుకున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ- పది రోజుల క్రితం ఉన్నట్టుండి పార్లమెంటును రద్దుచేసి ఇంటా బయటా తనది ఒకటే తీరని చాటుకున్నారు. భారత్‌తో మూడు దిక్కులా సరిహద్దులున్న నేపాల్‌- మన భూభాగాల్ని తమ చిత్రపటంలో చూపి ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టింది మొదలు ఉభయపక్షాల సంబంధాలు క్షీణముఖం పట్టాయి. నేపాల్‌ పాలకవర్గం మునుపెన్నడూ లేని స్థాయిలో చైనా సానుకూల ధోరణి కనబరుస్తున్న నేపథ్యంలో- ఆ దేశంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం భారత విదేశాంగ విధానానికి సవాలు విసురుతోంది. వామపక్ష వైరి వర్గాలను ఏకం చేసి నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ (సీపీఎన్‌)గా మార్చి, రెండేళ్ల క్రితం ఆ దేశ రాజకీయాలపై పట్టు బిగించిన చైనాకూ ప్రస్తుత పరిణామాలు కళ్లు బైర్లు కమ్మించాయి. లెఫ్ట్‌ పార్టీల మధ్య సంధి కుదిర్చి, నేపాల్‌లో తమ కనుసన్నల్లో మెలిగే ప్రభుత్వానికి ప్రాణం పోసే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ)కు చెందిన నలుగురు సభ్యుల అత్యున్నత స్థాయి బృందం కొన్ని రోజులుగా సాగిస్తున్న సంప్రదింపులు ఫలిస్తున్న జాడలు లేవు. వామపక్ష భావజాల అనుబంధం ఒకవంక, ఆర్థిక సహకార బంధం మరోవంక పెనవేసి- నేపాల్‌ను గుప్పిట పట్టాలని చైనా ఉరకలెత్తుతోంది. ఈ తరుణంలో- దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా హిమాలయ రాజ్యంతో ఆచితూచి వ్యవహరించడమే భారత్‌ ముందున్న మార్గం.

ఆర్థిక సాయం... ఓ పాచిక!

ఒక దేశ అంతర్గత రాజకీయ వ్యవహారాలపై మరో దేశం వ్యాఖ్యానించకపోవడం సంప్రదాయంగా అమలవుతున్న దౌత్య నీతి. ప్రాబల్య విస్తరణే ఏకైక దౌత్య నీతిగా నమ్మి పాటిస్తున్న ‘బీజింగ్‌’ నాయకత్వానికి అందుకు భిన్నమైన సంప్రదాయాలేవీ గిట్టవు. ఎవరూ పిలవకపోయినా నేపాల్‌ రాజకీయ సంక్షోభ పరిష్కారానికి సీపీసీ నుంచి నలుగురు సభ్యుల బృందాన్ని హుటాహుటిన ఖాట్మండూకు తరలించడమే ఇందుకు నిదర్శనం. అవసరానికి మించిన చొరవ కనబరచి తమ దేశ వ్యవహారాల్లో చైనా వేలుపెట్టడాన్ని నేపాల్‌ అంతటా వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు అవి భారీ నిరసన ప్రదర్శనలూ నిర్వహిస్తున్నాయి. ఓలీ నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించింది మొదలు ఆ దేశ వ్యవహారాల్లో చైనా ప్రత్యక్ష జోక్యం పెరిగింది. సీపీసీ బృందాలు ఖాట్మండూలో తిష్ఠవేసి- నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీకి సిద్ధాంత పాఠాలు బోధించడం, ఆ పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించడం, ఓలీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడం... గడచిన రెండేళ్లుగా జరుగుతున్న తంతు!

టిబెట్‌ను ఆనుకుని 1389 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉన్న నేపాల్‌పై పట్టు బిగించడం భౌగోళిక వ్యూహాత్మక అవసరాల రీత్యా అత్యవసరమని చైనా భావిస్తోంది. దశాబ్దాలుగా నేపాల్‌కు పెద్దదిక్కుగా ఉంటున్న భారత్‌ను తెరవెనక్కి తప్పించి- ఖాట్మండూ నాయకత్వాన్ని పూర్తిగా తనవైపు తిప్పుకొనేందుకు ‘డ్రాగన్‌’ భారీ పథకమే రచించింది. ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌’ ప్రాజెక్టులో భాగంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు గుమ్మరించడంతోపాటు, ఆ దేశంలోకి ప్రవహిస్తున్న పెట్టుబడుల్లో చైనా తన వాటాను అనూహ్యంగా పెంచుతోంది. నేపాల్‌లో 14 కోట్ల డాలర్ల వ్యయంతో రెండో సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాజాగా సిద్ధమవుతోంది. నేపాల్‌కు 2015లో భారత్‌ 22కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించగా- నేపాల్‌ మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా 38కోట్ల డాలర్ల సాయం చేసి చైనా అగ్రభాగాన నిలిచింది. సుమారు 23ఏళ్ల తరవాత నేపాల్‌లో పర్యటించిన చైనా అధినేతగా జిన్‌పింగ్‌ నిరుడు ఆ దేశంతో భారీయెత్తున రవాణా, ఆర్థిక సహకార ఒప్పందాలు కుదుర్చుకున్నారు

పరిణత దౌత్యం అవసరం

రాజకీయ, ఆర్థిక వ్యూహాలను గడసరిగా మేళవించి గడచిన అయిదేళ్లుగా నేపాల్‌ గడ్డపై బలంగా అస్తిత్వం చాటుకుంటున్న చైనాకు- తాము స్వయంగా పురుడుపోసి ప్రాణప్రతిష్ఠ చేసిన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడి, రాజకీయ సంక్షోభం తలెత్తడం మింగుడుపడని పరిణామం. ఈ పరిస్థితుల్లో నేపాల్‌ రాజకీయ ముఖచిత్రం ఎలా మారినా- ఆ దేశంతో పెనవేసుకున్న చారిత్రక బంధాన్ని పునరుద్ధరించుకోవడం మాత్రం భారత్‌కు అత్యవసరం. ‘పొరుగుదేశాలకే ప్రథమ ప్రాధాన్యం’ అన్న మాటను తరచూ ప్రవచించే ప్రధాని నరేంద్ర మోదీ- ఆ మేరకు వ్యూహాత్మకంగా స్పందించాలి. నేపాల్‌తోపాటు భూటాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి పొరుగు దేశాలనూ వ్యతిరేకంగా మార్చి మన దేశాన్ని అష్టదిగ్బంధం చేయాలన్న చైనా కుయత్నాలను పరిణత దౌత్యంతో తిప్పికొట్టడంలో భారత్‌ ఆచితూచి అడుగులు వేయాలి!

- శ్రీదీప్తి
 

Posted Date: 02-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం