• facebook
  • whatsapp
  • telegram

అమెరికాలో కొత్త పొద్దు!

‘మేము ఏం చేయడానికి వచ్చామో, అదే చేశాం... అంతకంటే ఎక్కువే చేశాం’ అంటూ వీడ్కోలు సందేశం పలికి ట్రంప్‌ నిష్క్రమించగా- అగ్రరాజ్యంలో కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతోంది. స్వేచ్ఛ సమానత్వం సంప్రదాయాల అమెరికన్‌ ఆత్మను పరిరక్షించుకోవడమే లక్ష్యంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత వయోవృద్ధ నేతగా బైడెన్‌, మహిళలకు ఓటుహక్కు దఖలుపడిన వందేళ్లకు ఉపాధ్యక్ష పదవికి ఒక స్త్రీ, అందునా దక్షిణ భారత మూలాలు గల కమలా హారిస్‌ల ప్రమాణ స్వీకారంతో- అమెరికాలో కొత్త పొద్దు పొడిచింది. అమెరికాకే తొలి ప్రాథమ్యం (అమెరికా ఫస్ట్‌) అని నినదిస్తూ 45వ దేశాధ్యక్షుడిగా చక్రం తిప్పిన డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుగేళ్ల పాలన- అమెరికాను అక్షరాలా పెను సంక్షోభాల సుడిగుండంలోకి నెట్టేసింది. 1861లో దేశం అంతర్యుద్ధంలోకి జారిపోతున్న వేళ అబ్రహాం లింకన్‌, 1933లో మహా మాంద్యం తాకిడికి అతలాకుతలమవుతున్న తరుణంలో ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ ఎదుర్కొన్న సవాళ్లతో సరిపోల్చదగ్గ, లేదంటే అంతకంటే ఎక్కువ సంక్షుభిత స్థితినే కొత్త అధ్యక్షుడు బైడెన్‌ ఎదుర్కొంటున్నారని చరిత్రకారులే తేల్చి చెబుతున్నారు. దశాబ్దాల కాలంలో కొత్త యుద్ధాలేవీ మొదలుపెట్టని మొదటి అధ్యక్షుడు కావడం తనకెంతో గర్వకారణమని ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా శాసనసభా సౌధం (క్యాపిటల్‌)పైకి అనుయాయుల్ని దండెత్తించిన అధ్యక్షుడిగా అభిశంసనకు గురైన ట్రంప్‌- వర్గ విద్వేషాలకు ఆజ్యం పోశారు. ఓటమి పాలైనా 7.4కోట్ల ఓట్లు సాధించి, అతి మితవాద భావజాలంతో రిపబ్లికన్‌ పార్టీ మనుగడనే అనుశాసించిన ‘ట్రంపిజం’ దుష్ప్రభావాలను తుడిచిపెట్టేయడం అంత సులభమేమీ కాదు. ట్రంప్‌లాగా అబద్ధాలతో పాలించినవారు, రాజ్యాంగ వ్యవస్థల్నే నిర్వీర్యం చేసినవారూ ఎవరూ లేరు. ఎనిమిదేళ్లలో దేశాన్ని రుణ విముక్తం చేస్తానంటూ గద్దెనెక్కిన పెద్దమనిషి నాలుగేళ్లలోనే అదనంగా 8.3 లక్షల కోట్ల డాలర్లు పాత పద్దుకు జోడించిన ఘనాపాటి. మత్తగజం మట్టగించిన వ్యవస్థల్ని చక్కదిద్ది, సామాజిక ఆర్థిక సంక్షోభాల్ని ఉపశమింపజేయడమే బైడెన్‌ హారిస్‌లకు తొలి సవాలు కానుంది!

మాటల నసేగాని చేతల పసలేని ట్రంప్‌ వాక్‌శూరత్వం అమెరికా గడ్డపై కొవిడ్‌ విశ్వరూపానికి కారణమై ఇప్పటికే ఏకంగా నాలుగు లక్షల మందికిపైగా అభాగ్యుల్ని బలిగొంది. రెండో ప్రపంచ యుద్ధంలో అసువులు బాసిన అమెరికన్‌ సైనికుల సంఖ్యకు దీటుగా మరణ మృదంగం మోగిస్తున్న కొవిడ్‌- సాక్షాత్తు ట్రంప్‌పైనా పంజా విసిరాకే ఆయనకు ప్రాప్తకాలజ్ఞత రహించింది. అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లోనే పదికోట్లమందికి టీకాలందిస్తామన్న బైడెన్‌కు ఆ మహాయజ్ఞమే తొలి సవాలు కానుంది. కొవిడ్‌ కాటు పడనంతవరకు 50 ఏళ్ల కనిష్ఠానికి చేరిన నిరుద్యోగిత రేటు- దరిమిలా దారుణంగా పెరిగిపోయింది. మొన్న డిసెంబరులోనే లక్షా 40వేల ఉద్యోగాలు ఊడిపోగా, సామాజిక సంక్షోభం రాజ్యమేలుతోంది. నేడు అమెరికాలోని ప్రతి ఆరు కుటుంబాల్లో ఒకటి ఆకలితో అలమటిస్తోందని, 20శాతం పౌరులు ఇంటి అద్దె చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని, మూడోవంతు కుటుంబాలు నిత్యావసరాల బిల్లులు చెల్లించలేకపోతున్నారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వెల్లడించారు. లక్షా 90వేల కోట్ల డాలర్ల వ్యయ ప్రణాళిక ద్వారా ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దడానికి తక్షణ వ్యూహాన్ని బైడెన్‌ సిద్ధం చేసినా- రిపబ్లికన్ల చేయూతా లభిస్తేనే బండి సజావుగా సాగే వీలుంది. టీకాల ద్వారా కొవిడ్‌ను, వ్యయ ప్రణాళికతో ఆర్థిక పునరుత్తేజాన్ని, ఉపాధి కల్పనను లక్షిస్తున్న బైడెన్‌- అమెరికన్‌ సమాజంలో లోతుగా పాతుకున్న అసమానతలపైనా దృష్టి సారించడం తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లో, శ్రామిక వర్గాల్లో గూడు కట్టిన ఆగ్రహావేశాలే ట్రంపిజానికి ఇంధనమయ్యాయన్న వాస్తవాన్ని గుర్తించాలి. సంక్షోభాల్ని అవకాశాలుగా మలచుకొని, ప్రజల్ని ఏకతాటిపై నడిపించిన లింకన్‌, రూజ్‌వెల్ట్‌ల ఆదర్శం బైడెన్‌కు నేడు చుక్కాని కావాలి. తన పరిణతిపై అమెరికన్లు పెట్టుకొన్న నమ్మకాన్ని బైడెన్‌ నిలబెట్టుకున్నప్పడే అగ్రరాజ్యంగా అమెరికా తలెత్తుకునేది!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 23-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం