• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌ సం‘గ్రామ’ సన్నాహం

కుట్రలకు చైనా కొత్త దారులు

భారత్‌-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు రేగడానికి చాలా ముందు నుంచే అక్కడ చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కనీస వసతులు, ఉపాధి అవకాశాలు లేక భారతీయ సరిహద్దు గ్రామాల ప్రజలు ఇళ్లూవాకిళ్లు ఖాళీ చేసి పట్టణాలకు తరలిపోతుంటే, చైనా వైపు కొత్తగా స్వయంసమృద్ధ గ్రామాల నిర్మాణం వేగంగా జరిగిపోతోంది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, లద్దాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి నిర్మానుష్య భారతీయ గ్రామాలు దిగాలుగా కనిపిస్తుంటే, ఎల్‌ఏసీకి అవతల కొత్తగా 628 ఆదర్శ, సౌభాగ్యపూర్ణ పల్లెల నిర్మాణానికి చైనా నడుంకట్టింది. షియావోకాంగ్‌ (సంపన్న పల్లెల) పథకం కింద 2021 చివరికల్లా 628 గ్రామాలను నిర్మించాలని 2017 చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పిలుపిచ్చారు. వీటిలో 200 గ్రామాలు భారత్‌ సరిహద్దుకు ఆనుకుని ఉన్న చైనా ఆక్రమిత టిబెట్‌ భూభాగంలో నిర్మితమవుతున్నాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అరుణాచల ప్రదేశ్‌ వరకు సరిహద్దుకు ఆవల అవతరిస్తున్నాయి. 

రక్షణ దుర్గాలుగా...

షియావోకాంగ్‌ గ్రామాల నిర్మాణం 2019 సెప్టెంబరు నాటికే 358 పూర్తయింది. ఇవి ఆదర్శ గ్రామాలే కాదు... రక్షణ దుర్గాలు కూడా. ఇక్కడ నివసించేది ప్రధానంగా చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, విధేయులే. షియావోకాంగ్‌ గ్రామాల్లో 62 వేలకుపైగా కుటుంబాలకు చెందిన 2,41,850 మంది కాపురముంటున్నారు. భూమి మీద, సముద్ర జలాల్లో సైనికపరమైన విస్తరణకు మొదట రైతులు, పశువుల కాపరులు, జాలర్లను పంపి, తరవాత ఆ ప్రాంతాలు తమవేనంటూ జెండా పాతడం చైనా విధానం. తూర్పు లద్దాఖ్‌లో, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఇదే ఎత్తుగడ అమలు చేసింది. గతంలో సంచార కాపరులను పంపిన చైనా, ఈసారి ఏకంగా పార్టీ విధేయులతో స్థిర నివాసాలు ఏర్పరచి, రేపు అవసరమైతే వాటిని సైనిక శిబిరాలుగా వాడుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. షియావోకాంగ్‌ గ్రామస్థులు భారత్‌ మీద కళ్లూచెవులూ వేసి చైనా సైన్యానికి వర్తమానం అందిస్తూ ఉంటారు. ఈ సరిహద్దు గ్రామాల్లో పక్కా రోడ్లు, విద్యుత్, తాగు నీరు, ఇంటర్నెట్, స్మార్ట్‌ ఫోన్‌ సౌకర్యాలు, విద్యావైద్య వసతులను ఏర్పాటుచేశారు. చైనా సైన్యం భారతదేశంతో లడాయికి దిగదలచుకుంటే- ఈ రోడ్లు, కమ్యూనికేషన్‌ సదుపాయాలు అక్కరకొస్తాయి. గతేడాది ఆగస్టులో, అంటే గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన కొద్దివారాలకే చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి సరిహద్దు గ్రామాలను సందర్శించి, అక్కడ మౌలిక వసతులను తనిఖీ చేశారు. షియావో కాంగ్‌ పథకానికి 2017లోనే 450 కోట్ల డాలర్లు కేటాయించారు. ఈ గ్రామాలను పూర్తిగా టిబెట్‌ భూభాగంలో నిర్మిస్తున్నా, అక్కడ నివసించేవారిలో అత్యధికులు చైనీయులే. వీరికి స్థానిక టిబెటన్లకన్నా ఎక్కువ ఆదాయం, సదుపాయాలు సమకూరుస్తున్నారు. చైనా చాలా కాలం నుంచి టిబెట్‌లోకి చైనీయుల రాకపోకలను, స్థిర నివాసాన్ని ప్రోత్సహిస్తోంది. ఒక్క 2019లోనే నాలుగు కోట్ల మంది చైనా పర్యాటకులు టిబెట్‌ పీఠభూమిలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. షియావోకాంగ్‌ పథకం చైనీయులు టిబెట్‌లో గట్టిగా తిష్ఠ వేయడానికి దోహదపడుతుంది. 2019లో టిబెట్‌లో 6,28,000 మందిని పేదరికం నుంచి ఉద్ధరించి, షియావోకాంగ్‌ గ్రామాలకు తరలించినట్లు కమ్యూనిస్టు పార్టీ టిబెట్‌ శాఖ అధిపతి వూ యింగ్జీ ప్రకటించారు. అక్కడ టిబెటన్ల పొరుగునే చైనీయులూ నివసిస్తుంటారు. టిబెటన్లు దలైలామా విధేయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా కన్నువేసి ఉంచుతారు. 

షియావోకాంగ్‌ గ్రామాల్లో ఒకటి గతేడాది డోక్లాం సమీపంలో భూటాన్‌ భూభాగంలో పుట్టుకొచ్చింది. ఇటీవల వాస్తవాధీన రేఖ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో భారత భూభాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో మరో షియోవోకాంగ్‌ గ్రామం వెలసింది. 1959 నుంచి చైనా ఆక్రమించుకొని ఉన్న  ప్రదేశంలో 101 ఇళ్లతో ఈ గ్రామాన్ని నిర్మించారు. మరోవైపు చైనా సరిహద్దును ఆనుకుని ఉన్న భారతీయ గ్రామాలు సరైన వసతులు లేక ఖాళీ అయిపోతున్నాయి. ఒక్క ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే చైనాను ఆనుకుని ఉన్న మూడు జిల్లాల్లో 180 గ్రామాలు ఖాళీ అయ్యాయి. సరిహద్దుకు ఆవల చైనా సకల సదుపాయాలతో నిర్మిస్తున్న షియావోకాంగ్‌ గ్రామాలు, భారతీయ సరిహద్దు ప్రజలను గాఢంగా ప్రభావితం చేస్తాయని చైనా అంచనా. మన తూర్పు సరిహద్దు గ్రామాల ప్రజలకు, టిబెటన్లకు మధ్య భాషాసంస్కృతుల పరంగా చాలా సాన్నిహిత్యం ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని చైనీయులు మన సరిహద్దు గ్రామాల్లో రాజకీయ కార్యకలాపాలు సాగించే అవకాశాలు పుష్కలం. చివరకు జనం వలసతో ఖాళీ అయిన నిర్మానుష్య భారతీయ గ్రామాల్లోకి రేపు చైనీయులు చొచ్చుకొచ్చి, అవి తమవేనని బుకాయించే ప్రమాదం లేకపోలేదు. ఈ సందర్భంలో చైనా-భూటాన్‌ల మధ్య వివాదగ్రస్త ప్రదేశంలో వెలసిన  షియావోకాంగ్‌ గ్రామం గురించి చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి చైనా గొర్రెల కాపరులు భూటాన్‌ పచ్చిక మైదానాల్లోకి చొచ్చుకొస్తున్నారు. ఈ బయళ్లు సాంప్రదాయికంగా తాము గొర్రెలను మేపుకొనే ప్రాంతాలని గ్రామపెద్ద చెప్పుకొంటున్నాడు. షియావోకాంగ్‌ గ్రామాల నుంచి ముంచుకొస్తున్న ముప్పును భారత సైన్యం గుర్తెరిగి- సరిహద్దుల్లో జోరుగా రహదారులు, వంతెనల నిర్మాణాన్ని చేపట్టింది. 

భూ సేకరణలో భారత్‌

వాస్తవాధీనరేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యోర్ని గ్రామంలో భారత సైన్యం 14 ఎకరాల భూమిని సేకరించింది. ఈ గ్రామంలో నివసిస్తున్న 150 మందికి ధన రూపేణా పరిహారం, పునరావాసం కల్పించి, అక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు. యోర్నితోపాటు చైనా సరిహద్దు వెంబడి వ్యూహరీత్యా కీలకమైన ఇతర చోట్ల కూడా భారత సైన్యం భూసేకరణ జరుపుతోంది. ఉదాహరణకు 1986లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన సుందొరాంగ్‌ చు ప్రాంతానికి సమీపంలో 200 ఎకరాల పచ్చిక బయలునూ భారత సైన్యం సేకరించింది. ఇలా సరిహద్దు అతిక్రమణలను తిప్పికొట్టడానికి జాగ్రత్త పడనారంభించింది. మన సరిహద్దు గ్రామాలు ఖాళీకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దయెత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. దీన్ని గుర్తించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న 100 గ్రామాల అభివృద్ధికి కేంద్ర సహాయాన్ని కోరింది. ఉత్తరాఖండ్‌లో సరిహద్దు ప్రజలు గొర్రెలను, పశువులను మేపుకొంటూ 100 కిలోమీటర్ల పరిధిలో సంచరిస్తుంటారు. చైనా సైనికులు సరిహద్దు దాటి వస్తే ఆ సమాచారాన్ని మన సేనలకు అందించి అప్రమత్తం చేస్తుంటారు. దీన్ని గమనించిన చైనీయులు భారతీయ కాపరులు ఏర్పాటు చేసుకున్న క్యాంపులను కూల్చేస్తూ, వారు అక్కడ భద్రపరచుకున్న ఆహారాన్ని చిందరవందర చేస్తుంటారు. ఆ సంగతి తెలుసుకున్న మన సరిహద్దు భద్రతా దళాలు కాపరులకు రేషన్‌ ఇచ్చి ఆదుకుంటారు. చైనా సరిహద్దులోని భారతీయ భూభాగాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయం, తోటల పెంపకం వంటి కార్యకలాపాలకు ఊతమివ్వడం ద్వారా, రహదారులు, కమ్యూనికేషన్లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రభుత్వం ఇక్కడి నుంచి వలసలను నిరోధించవచ్చు. చైనా పన్నాగాలను మొగ్గలోనే తుంచేయవచ్చు. 

- ప్రసాద్‌ 
 

Posted Date: 16-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం