• facebook
  • whatsapp
  • telegram

ఇరుగుపొరుగుల్లోనూ చైనా కుంపట్లు

ఒప్పందాల్లో కొర్రీలు

భారత భాగస్వామ్యంతో నడిచే ప్రాజెక్టులను ఏదో రకంగా అడ్డుకునేందుకు చైనా పన్నుతున్న కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయి. భారత, జపాన్‌ భాగస్వామ్యంతో నిర్మించతలపెట్టిన ‘ఈస్ట్‌ కంటెయినర్‌ టర్మినల్‌ (ఈసీటీ)’ త్రైపాక్షిక ఒప్పందాన్ని శ్రీలంక ప్రభుత్వం ఉన్నట్లుండి ఉపసంహరించుకోవడమే ఇందుకు నిదర్శనం. శ్రీలంక రాష్ట్రపతి మైత్రీపాల సిరిసేన, ప్రధాని రణిల్‌ విక్రమసింఘెల జమానాలో కొలంబో ఓడరేవులో ఈసీటీని అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై 2019లో సంతకం చేశారు. ఈ భాగస్వామ్యంలో శ్రీలంక వాటా 51శాతం, భారత్‌ జపాన్‌ల వాటా 49శాతంగా ఉంది. శ్రీలంకలో అంతకంతకూ పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేసే ఉద్దేశంతో భారత్‌, జపాన్‌లు అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తి కనబరిచాయి. కొలంబోకు సమీపంలోని ఈ ఓడరేవు ద్వారా ఆ ప్రాంతంలో 70శాతం వ్యాపారం జరుగుతోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కొలంబో ఓడరేవులో వాణిజ్య భాగస్వామ్యం స్థిరపడితే శ్రీలంకలో భారత్‌ ప్రాబల్యం విస్తరిస్తుందన్న భయం చైనా అధినాయకత్వానిది. చైనా అనుకూలురుగా ముద్రపడ్డ రాజపక్స సోదరులు ఈ త్రైపాక్షిక ఒప్పందానికి వ్యతిరేకంగా మొదటినుంచీ గళం విప్పుతూనే ఉన్నారు. నిరుడు జరిగిన ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని వారు బలంగా ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందారు. కొలంబో ఓడరేవులోని కార్మిక సంఘాలనూ ఆ మేరకు పరోక్షంగా రెచ్చగొట్టి, నిరసన జ్వాలలు ఎగిసేందుకు కారణమయ్యారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఈసీటీ త్రైపాక్షిక ఒప్పందాన్ని తిరగదోడతామని రాజపక్స కార్మికులకు వాగ్దానం చేశారు.

శ్రీలంకను రుణ ఉచ్చులో బిగించి 140 కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులో సింహభాగం దక్కించుకున్న చైనాకు- ఈసీటీలో భారత్‌ ప్రవేశం కంటగింపుగా మారింది. ఆసియా, ఐరోపాల్లో వివిధ దేశాలతో భాగస్వామ్యాలు నెలకొల్పుకొని ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు బీజింగ్‌ నాయకత్వం కొన్నేళ్లుగా వ్యూహాత్మకంగా కదులుతోంది. ఆ క్రమంలో అది తొలుత ఆసియాలోని చిన్న దేశాలపై దృష్టిపెట్టింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ కార్యక్రమం, నౌకా వాణిజ్య మార్గ నిర్మాణాల రూపంలో ఏదోరకంగా ఆసియా, ఐరోపాల్లో ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. భౌగోళిక పరిమాణం, రాజకీయ పలుకుబడి రీత్యా భారత్‌ను చైనా అతిపెద్ద సవాలుగా భావిస్తోంది. తాము ఆడింది ఆట పాడింది పాట అన్నట్లుగా చలాయించుకునే క్రమంలో భారత్‌ను తమకు అతిపెద్ద అడ్డంకిగా బీజింగ్‌ నాయకత్వం పరిగణిస్తోంది. అందుకే అది భారత్‌ను నీడలా వెన్నాడుతోంది. వివిధ దేశాలతో భారత్‌ కుదుర్చుకునే భాగస్వామ్య ఒప్పందాలను ఏదోరకంగా భగ్నం చేయడమే పనిగా పెట్టుకొంది. ఆ రకంగా భారత్‌ను రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బకొట్టాలన్నది చైనా వ్యూహం. ఈసీటీ త్రైపాక్షిక ఒప్పందం నుంచి భారత్‌ను శ్రీలంక అర్ధాంతరంగా తప్పించడానికీ చైనా కుట్రలే కారణం. మరోవంక ఇరాన్‌తో కలిసికట్టుగా భారత్‌ నిర్మించతలపెట్టిన చాబహర్‌-జహెదన్‌ రైల్వే మార్గం ప్రాజెక్టుకు బ్రేకులు పడటానికీ ‘బీజింగ్‌’ జోక్యమే కారణం. భారత్‌కు చెందిన ‘ఇర్కాన్‌’ నిర్మాణ ఏజెన్సీ ఈ రైల్వే మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ, చైనా ప్రభుత్వం ఇరాన్‌మీద ఒత్తిడి తీసుకురావడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారం మధ్యలోనే నిలిచిపోయింది. అయితే,ఇప్పటికీ ప్రయత్నిస్తే ఈ విషయంలో ముందడుగు వేసేందుకు భారత్‌ ముందు కొన్ని అవకాశాలున్నాయి. ఇక్కడే మరోవిషయాన్నీ గమనించాల్సి ఉంది. అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ వైదొలిగాక- ఇరాన్‌తో కలిసి భారత్‌ చేపట్టిన చాబహార్‌ రేవు నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.

శ్రీలంక ప్రభుత్వం ఈసీటీ త్రైపాక్షిక ఒప్పందం నుంచి భారత్‌ను తప్పించడం వెనక రాజపక్స సోదరుల చైనా సానుకూల ధోరణితోపాటు- బౌద్ధ, సింహళీ వర్గాల్లో పట్టునిలుపుకోవాలన్న వారి తాపత్రయమూ కారణమే. శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పీపీ) పేరిట వారు కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ- ఇప్పటికే శ్రీలంకలో ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీ, యునైటెడ్‌ నేషనల్‌ పార్టీలను ఎన్నికల్లో చిత్తు చేసింది. మహింద రాజపక్స గతంలో ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ పార్టీ తరఫున శ్రీలంక ప్రధానిగా ఉన్నప్పటికీ- ఆ తరవాత చైనా ప్రోద్బలంతో గొటబయ రాజపక్స స్థాపించిన ఎస్‌ఎల్‌పీపీతో కలిసి ముందుకు సాగారు. గత ప్రభుత్వ జమానాలో చైనా ప్రయోజనాలకు భిన్నంగా జరిగిన ఒప్పందాల రద్దు ద్వారా ఇప్పుడు రాజపక్స సోదరులు అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారు. ఈసీటీలో భాగస్వామ్యాన్ని కోల్పోవడం భారత ప్రయోజనాలరీత్యా పెద్ద దెబ్బే. చైనా ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొట్టే దౌత్యవ్యూహాలతో భారత్‌ సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని తెలియజెప్పిన పరిణామమిది.

- బిలాల్‌ భట్‌
 

Posted Date: 12-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం