• facebook
  • whatsapp
  • telegram

అణువంత చిత్తశుద్ధీ కరవు

ఎవరికీ పట్టని అణ్వస్త్ర నిషేధ ఒప్పందం

ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల మద్దతు లేకుండానే అణ్వాయుధాల నిషేధానికి ఐక్యరాజ్యసమితి నడుం బిగించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ), అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందాలకు భిన్నంగా మరో ఒప్పందాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. దీనిలో భాగంగానే జనవరి 22వ తేదీ నుంచి అణు ఆయుధాల నిషేధ ఒప్పందం (టీపీఎన్‌డబ్ల్యూ) అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలు అణు ఆయుధాల తయారీ, భద్రపరచడం, కొనుగోలు, అభివృద్ధి వంటివి చేయకూడదు. ఇతర దేశాలకూ సహకరించకూడదు. ఈ ఒప్పందం లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. దీనిపై 2017లో ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 122 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. అణ్వస్త్ర తయారీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇరాన్‌, సౌదీ అరేబియాలూ ఈ జాబితాలో ఉన్నాయి. తరవాత ఈ ఒప్పందంలో చేరేందుకు సంతకాల సేకరణ మొదలైంది. గత ఏడాది హోండురస్‌ చట్టసభ ఆమోద ముద్రతో అంతర్జాతీయ చట్టంగా అమలు కావడానికి అవసరమైన 50 దేశాల సంపూర్ణ మద్దతు లభించినట్లయింది. ఇప్పటి వరకు 86 దేశాలు సంతకాలు చేయగా, వాటిలో 52 దేశాల చట్టసభలు ఆమోదముద్ర వేశాయి. సంతకం చేయని దేశాలు దీనికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.

వాస్తవిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండానే టీపీఎన్‌డబ్ల్యూ అమలు విధానాలను రూపొందించినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం అణ్వస్త్ర సామర్థ్యం సంతరించుకొన్న తొమ్మిది దేశాలు ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నాయి. ఇక ఎన్‌పీటీ, సీటీబీటీ వంటి ఒప్పందాల్లో కీలక పాత్ర పోషించిన భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలు సైతం దీన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఈ కొత్త ఒప్పందం లక్ష్య సాధన ప్రశ్నార్థకంగా మారింది. చివరికి అణుదాడికి గురైన జపాన్‌ సైతం దూరంగా ఉండటం గమనార్హం. నాటో కూటమి దేశాల్లో ఒక్క నెదర్లాండ్స్‌ మాత్రమే ఐరాస చర్చల్లో పాల్గొన్నా తీర్మానంపై ఎన్నిక సమయంలో వ్యతిరేకంగా ఓటేసింది. ఈ ఒప్పందం భవిష్యత్తులో అలంకార ప్రాయంగా మిగిలే అవకాశాలే ఎక్కువ. ఒప్పందానికి దూరంగా ఉన్న దేశాలను ఒప్పించి సంతకాలు చేయించే శక్తి ఇందులోని భాగస్వాములకు లేదు. చివరికి తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 122 దేశాలూ ఇప్పటికీ పూర్తిగా ఒప్పందంపై సంతకాలు చేయలేదు. ప్రస్తుతం అణుశక్తులుగా ఉన్న దేశాల్లో పాక్‌, ఉత్తర కొరియాలను పక్కనపెడితే- మిగిలినవి ఆర్థికంగానూ బలమైనవే. ఆయా దేశాలను ఆర్థిక ఆంక్షలతో ఒప్పించే పరిస్థితి లేదు. 2018లో అమెరికా, ఫ్రాన్స్‌, యూకేల నేతృత్వంలోని 40 దేశాల బృందం నేరుగా ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది. ఎన్‌పీటీ ప్రాధాన్యాన్ని టీపీఎన్‌డబ్ల్యూ తగ్గిస్తుందనే భయం కూడా పీ5 దేశాల్లో ఉంది. ‘గుర్తింపు పొందిన అయిదు అణ్వస్త్ర దేశాలు సంతకం చేసిన ఎన్‌పీటీని విశ్వస్తున్నాం’ అని అమెరికా పేర్కొనడానికి కారణమదే.

భారత్‌ మొదటి నుంచీ టీపీఎన్‌డబ్ల్యూను వ్యతిరేకిస్తోంది. దీనికి సంబంధించిన కీలక సమావేశాలు, ఓటింగ్‌లోనూ భాగస్వామి కాలేదు. కట్టుబడి ఉండాల్సిన అవసరం కూడా తమకు లేదని తేల్చిచెప్పింది. కొత్త ఒప్పందం అమలును పరిశీలించే పటిష్ఠ వ్యవస్థ లేకపోవడమే దీని డొల్లతనాన్ని తెలియజేస్తోందన్న భారత్‌ వాదన నిజమే అనిపిస్తుంది. ఒకవేళ ప్రపంచ దేశాలన్నీ సంతకాలు చేసినా- ఉత్తర కొరియా, ఇరాన్‌, పాక్‌, చైనా వంటి దేశాల్లో ఇలాంటి ఒప్పందం అమలును స్వేచ్ఛగా తనిఖీ చేయగల వ్యవస్థ ఉంటుందా అనేది అనుమానమే. ఇలాంటి ఒప్పందాల వల్ల ఏ ప్రయోజనం లేదని చరిత్ర చెబుతోంది. ‘ది అగ్రీడ్‌ ఫ్రేమ్‌వర్క్‌’ తరవాత ఉత్తరకొరియా అణు కార్యక్రమం ఏ మాత్రం ఆపలేదు. ఎన్‌పీటీపై సంతకం చేసిన చైనాయే పాక్‌కు అణుసహకారం అందిస్తోంది. మరోపక్క ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళికపై సంతకం చేసిన ఇరాన్‌, రహస్యంగా అణు కార్యక్రమం కొనసాగిస్తున్న విషయమూ బయటపడింది. ఇలాంటి ఉదంతాలను చూస్తే- ఐరాస కొన్ని మౌలిక అంశాలను మరిచి నేలవిడిచి సాము చేస్తోందనిపిస్తుంది. పాక్‌, చైనా వంటి బాధ్యతారహిత అణుశక్తుల మధ్య ఉన్న భారత్‌ కొత్త ఒప్పందంపై సంతకం చేయడం ఏమాత్రం సరికాదు. ఐరాస కూడా సమగ్ర రీతిలో నియమ నిబంధనలు లేకుండా, అమలు తీరును పర్యవేక్షించే శక్తిమంతమైన వ్యవస్థను సృష్టించకుండా అణ్వాయుధ నిషేధ ఒప్పందాన్ని ప్రపంచంపై రుద్దడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎన్నో ఐరాస తీర్మానాల్లా ఇదీ ఓ కాగితం పులిలా మిగిలిపోక తప్పదు.

- పెద్దింటి ఫణికిరణ్‌
 

Posted Date: 16-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం