• facebook
  • whatsapp
  • telegram

చాబహార్‌ ప్రాజెక్టుపై నీలినీడలు

‣ చైనా-ఇరాన్‌ ఒప్పందంతో భారత్‌కు ఇక్కట్లే

చైనా, ఇరాన్‌ మధ్య కుదిరిన భారీ వ్యూహాత్మక ఒప్పందం- భారత్‌ తలపెట్టిన చాబహార్‌ ప్రాజెక్టుపై ప్రతికూల ప్రభావం కనబరచే అవకాశాలున్నాయి. ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ పేరిట చైనా, ఇరాన్‌ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. 25ఏళ్లపాటు అమలులో ఉండే సుమారు 40వేల కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందంపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ, ఇరాన్‌ విదేశాంగ మంత్రి మొహమ్మద్‌ జావేద్‌ జరీఫ్‌ మార్చి 27న సంతకాలు చేశారు. దీనివల్ల ఇరాన్‌లో భారత్‌ ఇప్పటికే చేపట్టిన చాబహార్‌ ప్రాజెక్టుపై నీలినీడలు ప్రసరించే ప్రమాదం నెలకొంది. ఆ ఒప్పందంలో భాగంగా ఇరాన్‌లో చైనా భారీ పెట్టుబడులు పెడుతుంది. ప్రతిగా, ఇరాన్‌ రాయితీ ధరలతో చైనాకు చమురు సరఫరా చేస్తుంది. ఇరుదేశాల మధ్య సైనిక సర్దుబాట్లూ జరుగుతాయి. ఇవేకాకుండా, ఇతర రంగాల్లోనూ పాతికేళ్లపాటు సహకరించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒప్పందంలోని వివరాలను రహస్యంగా ఉంచారు. ఇరాన్‌లో తమ పెట్టుబడులు, ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ‘డ్రాగన్‌’ అయిదు వేలమంది సైనికులను మోహరించనున్నట్లు సమాచారం. చైనాతో ఈ ఒప్పందం అనంతరం రష్యాతోనూ ఇదే తరహా ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇరాన్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షలను తట్టుకోవడానికి రష్యాతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్లు ఇరాన్‌ పార్లమెంటుకు చెందిన జాతీయ భద్రత, విదేశీ విధాన సంఘం అధ్యక్షులు మోజ్తబ జొన్నౌర్‌ ఇటీవల వెల్లడించారు. రైలు సేవలు, రహదారులు, శుద్ధి కర్మాగారాలు, పెట్రో రసాయనాలు, వాహన రంగం, చమురు, వాయువు, గ్యాసోలిన్‌, పర్యావరణ, విజ్ఞానాధారిత కంపెనీలు వంటి అంశాల్లో ఆ దేశాలతో సంయుక్త సహకారం, ద్వైపాక్షిక సంప్రదింపుల కోసం ఇరాన్‌ ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఇరాన్‌పై ఆంక్షల ప్రభావం చాలావరకు బలహీనపడుతుంది.

వ్యూహాత్మక చాబహార్‌ ఓడరేవులో భారత్‌ అయిదు బెర్తులతో రెండు టెర్మినళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనివల్ల అఫ్గానిస్థాన్‌, మధ్య ఆసియా, రష్యాలతో వాణిజ్య కార్యకలాపాలు మరింత సులభతరమయ్యే అవకాశం ఉంది. రెండింటిలో ఒకటి 600 మీటర్ల కార్గో టెర్మినల్‌; మరొకటి 640 మీటర్ల కంటెయినర్‌ టెర్మినల్‌. 628 కి.మీ. పొడవైన రైలు మార్గం చాబహార్‌ను అఫ్గానిస్థాన్‌ సరిహద్దు పట్టణమైన జహెదన్‌తో అనుసంధానిస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన ‘క్వాడ్‌’లో భాగస్వామిగా భారత్‌ అగ్రరాజ్యం శిబిరంలో చేరిన సందర్భంలోనే చైనా, రష్యా, ఇరాన్‌ల బంధం కూటమిగా రూపుదిద్దుకోవడం కీలక పరిణామం! భారత్‌, చైనా తూర్పు లద్దాఖ్‌లో సైనిక ఘర్షణలకు దిగడం; సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో ఆసియా దిగ్గజాల మధ్య సంబంధాలు ఇప్పటికీ ఉప్పూనిప్పూగానే ఉన్నాయి. సంప్రదాయంగా రష్యాతో సత్సంబంధాలు నెరిపే భారత్‌కు, అమెరికాతో సాన్నిహిత్యం పెరగడంతో ‘మాస్కో’తో అనుబంధంపై ప్రభావం పడింది. అఫ్గాన్‌ సమస్య పరిష్కార చర్చల ప్రక్రియ నుంచి భారత్‌ను రష్యా ఉద్దేశపూర్వకంగానే పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది. 

చారిత్రకంగా సాంస్కృతిక ఉమ్మడి లక్షణాల విషయంలో భారత్‌, ఇరాన్‌ల మధ్య సాన్నిహిత్యం ఉంది. రాజకీయంగా, పశ్చిమ ఆసియా ప్రాంతంలో భారత్‌కు బలమైన మిత్రపక్షంగా ఇరాన్‌ వెలుగొందింది. కానీ, ఆమెరికా ఆంక్షల కారణంగా; భారత్‌ ఇరాన్‌ చమురును కొనుగోలు చేయడం ఆపేసి, అగ్రరాజ్యం నుంచి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఫలితంగా, ఇరాన్‌ భారత్‌ల మధ్య దూరం పెరిగింది. ఇరుదేశాల మధ్య సాన్నిహిత్యం తరిగిన దరిమిలా- మునుపెన్నడూ లేని రీతిలో 370 అధికరణ రద్దుపై ఇరాన్‌ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. మరోవైపు, అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనా, ఇరాన్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. చాలాదేశాలు అమెరికా ఆంక్షలకు భయపడి ఇరాన్‌ చమురు కొనుగోళ్లకు దూరంగా ఉండిపోయాయి. చైనా మాత్రం గట్టిగా నిలబడింది. చైనా పెద్దమొత్తంలో ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేసింది. చైనా, రష్యా, ఇరాన్‌ల మధ్య బంధం బలపడటంతో ఆ దేశాలతో భారత్‌కూ దూరం పెరిగింది. ఇప్పుడు చాబహార్‌ ప్రాజెక్టు విషయంలో భారత్‌ ప్రయోజనాలు మసకబారినట్లే కనిపిస్తోంది.

- సంజీవ్‌
 

Posted Date: 05-04-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం