• facebook
  • whatsapp
  • telegram

అఫ్గాన్‌పై ఆచితూచి అడుగులు

కశ్మీర్‌లో శాంతిభద్రతల కోసమే

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైతే భారత వ్యతిరేక శక్తులు ఏకమయ్యే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కశ్మీర్‌ మళ్ళీ వేర్పాటువాద శక్తులకు నిలయంగా మారకముందే కేంద్రం తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తాలిబన్లతో సంప్రదింపులు జరపకపోతే అఫ్గాన్‌ పొరుగు దేశాలైన భారత్‌తో పాటు పాక్‌, చైనాకు కూడా తిరుగుబాటు శక్తుల నుంచి ఇబ్బందులు తప్పవని వారు విశ్లేషిస్తున్నారు. తాలిబన్లకు చైనా, పాకిస్థాన్‌, ఇరాన్‌ మద్దతుగా ఉంటాయనే విషయంలో సందేహం లేనప్పటికీ- ఆ దేశాలు తాలిబన్లను ఇంకా అధికారికంగా గుర్తించలేదు. అమెరికా బలగాల ఉపసంహరణ తరవాత గాలులు ఎలా వీస్తాయోనని ప్రస్తుతానికి వేచి చూసే ధోరణినే అవలంబిస్తున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ తరవాత తాలిబన్ల శక్తి క్రమంగా పెరిగింది. ఇది ఇతర తిరుగుబాటు సమూహాలకు ధైర్యాన్నివ్వడమే కాకుండా, శక్తిమంతమైన దేశాలతో చర్చించేలా విశ్వాసాన్ని నింపింది. అఫ్గానిస్థాన్‌ పొరుగు దేశాలు తిరుగుబాటు శక్తుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనాలో వీఘర్లు, ఇరాన్‌లో ఐసిస్‌, పాకిస్థాన్‌లో తెహ్రీకే-తాలిబన్‌ (టీటీపీ), భారత్‌లో కశ్మీర్‌ వేర్పాటువాద శక్తులు ఆయా దేశాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. తాలిబన్లతో ఈ దేశాలు సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ- తిరుగుబాటు శక్తులు మరింత బలపడతాయేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉగ్ర సంస్థల బెడద

అఫ్గాన్‌ బదక్షన్‌ ప్రావిన్సులోని తూర్పు టర్కిస్థాన్‌ ఇస్లామిక్‌ ఉద్యమం(ఈటీఐఎం) చైనాకు పెద్ద తలనొప్పిగా మారింది. వాళ్లు తాలిబన్లతో కలిసి అమెరికా సంకీర్ణ దళాలకు వ్యతిరేకంగా పోరాడారు. చైనా షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులోని వీఘర్‌ ముస్లిముల కోసం వీరు ఉద్యమిస్తున్నారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోతే వారి మద్దతుతో ఈటీఐఎం మరింత బలపడుతుందని చైనా ఆందోళన చెందుతోంది. కాకసస్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ చెచెన్‌ పోరాట సమూహాలతోనూ రష్యా ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటోంది. టీటీపీ దశాబ్దకాలంగా పాకిస్థాన్‌కు పక్కలో బల్లెమైంది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న తరవాత అఫ్గాన్‌లోని నార్తర్న్‌ అలయెన్స్‌పై తాలిబన్లు దాడి చేశారు. ఈ పోరాటంలో తాలిబన్లతో టీటీపీ కలిసి నార్తర్న్‌ అలయెన్స్‌ను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో టీటీపీకి తాలిబన్లు మద్దతిస్తే తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవని పాక్‌ భావిస్తోంది. తాలిబన్ల వల్ల పాక్‌, చైనా కంటే భారత్‌కే ఎక్కువ ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదముంది. పోర్చుగీస్‌ పాస్‌పోర్టుతో భారత్‌లోకి ప్రవేశించి కశ్మీర్‌లో ఉగ్రవాదుల నియామకాలు చేపడుతున్నాడని మసూద్‌ అజార్‌ను 1990లలో పోలీసులు అరెస్టు చేశారు. 1999లో భారత విమానాన్ని హైజాక్‌ చేసిన ఉగ్రవాదుల డిమాండ్‌ మేరకు అతడిని విడిచిపెట్టారు. మసూద్‌ అజార్‌ విడుదల- భారత వ్యతిరేక ఉగ్రశక్తులు ఏకమై ప్రణాళికలు రచించేందుకు తోడ్పడింది. ఇప్పుడు మళ్ళీ మసూద్‌ అజార్‌ తాలిబన్ల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాడు. అఫ్గాన్‌ తమ అధీనంలోకి వచ్చిందని తాలిబన్లు ప్రకటించిన వెంటనే అతడు కాందహార్‌ వెళ్ళి నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.  

మారిన పరిస్థితులు

కొన్నేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలతో- కశ్మీర్‌ ప్రాంత నాయకులు గతానికి భిన్నంగా వేర్పాటువాదుల భాషను గుర్తు తెచ్చేలా మాట్లాడుతున్నారు. వేర్పాటు వాదాన్ని సమర్థించే హురియత్‌కు ప్రాక్సీలుగా మారిపోయారు. 370 అధికరణను రద్దు చేసిన తరవాత నెలకొన్న పరిస్థితులను వేర్పాటువాద శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుని- అఫ్గాన్‌ నుంచి కశ్మీర్‌కు మకాం మారిస్తే భారత్‌కు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదముంది. మసూద్‌ అజార్‌ వంటి వ్యక్తులు కశ్మీర్‌ యువతను మరోసారి ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. కశ్మీర్‌ మరోసారి ఉగ్రవాద శక్తులకు నిలయంగా మారకముందే తాలిబన్లతో చర్చలు జరిపి ప్రణాళికలు రూపొందించాలని వస్తున్న సూచనలను కేంద్రప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. తాలిబన్లు అఫ్గాన్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకున్న తరవాత తొలిసారి వారితో భారత్‌ అధికారిక చర్చలు జరిపింది. ఖతార్‌లోని భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌, తాలిబన్‌ నేత షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానెక్జాయ్‌- దోహా వేదికగా ఇటీవల భేటీ అయ్యారు. భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవారికి అఫ్గాన్‌ మద్దతివ్వకూడదని భేటీలో మిత్తల్‌ తాలిబన్లకు తేల్చిచెప్పినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. భద్రత, అఫ్గాన్‌లోని భారతీయుల తరలింపుపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు పేర్కొంది. వీటిపై తాలిబన్లు సానుకూలంగా స్పందించినట్టు స్పష్టం చేసింది. అఫ్గాన్‌ను ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే తాలిబన్లకు ప్రపంచ దేశాల సహకారం కావాల్సిందే. అందుకని పొరుగు దేశాలతో పాటు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు. భారత్‌తో తాము స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నట్లు తాలిబన్‌ నేతలు ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించారు. తాలిబన్లు కశ్మీర్‌ వ్యవహారాల్లో తలదూర్చకుండా వారితో ఒప్పందం కుదుర్చుకోవడం భారత విదేశాంగ విధాన నిపుణులు, సంధానకర్తల దౌత్య చతురతపై ఆధారపడి ఉంది!            

- బిలాల్‌ భట్‌

(కశ్మీరీ వ్యవహారాల నిపుణులు)
 

Posted Date: 03-09-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం