• facebook
  • whatsapp
  • telegram

చిరకాల మిత్రుల సహకార సవారీ

ఫలప్రదమైన పుతిన్‌ భారత పర్యటన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాజా దిల్లీ పర్యటన అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. కొవిడ్‌ మహమ్మారి ప్రబలిన తరవాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ కోసం జీ-7 సదస్సులో పాల్గొనేందుకు జెనీవా వెళ్లిన పుతిన్‌, రెండో పర్యటనగా భారత్‌ను ఎంచుకున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా ఇంటా బయటా భారత ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్‌ 19 సార్లు కలుసుకున్నారు. పాత చెలిమికి కొత్త చిగుళ్లను తొడగాలన్న బృహత్సంకల్పం ఇరు దేశాధినేతల తాజా ద్వైపాక్షిక వార్షిక సదస్సు సంయుక్త ప్రకటనలో ప్రస్ఫుటమైంది. శాంతి, సుస్థిరత, పరస్పర ఆర్థిక వృద్ధికోసం, సైనిక సాంకేతిక పరిశోధన రంగాల్లోనూ ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించడం గొప్ప ముందడుగు.

ఉమ్మడిగా ఉత్పత్తి

‘తన అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేవారినే మిత్రులుగా/ భాగస్వాములుగా ఎంచుకోవాలి’ అన్న పుతిన్‌ వ్యాఖ్య- దిల్లీ, క్రెమ్లిన్‌ల మధ్య ఎడం తగ్గాలన్న సంకేతాలిచ్చింది. ‘విశిష్ట వ్యూహాత్మక భాగస్వామితో కలిసి ఈరోజు వేసిన అడుగులు మున్ముందు కొంగొత్త రంగాల్లో సహకారానికి బీజం వేస్తా’యని ప్రధాని మోదీ అభిలషించారు. అంతకుముందు ఇరుదేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు సెర్గీ లావ్రోయ్‌, సెర్గీ షోయిగు; రాజ్‌నాథ్‌సింగ్‌, జైశంకర్‌ల 2+2 భేటీ జరిగింది. ఆ తరవాత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా జారీచేసిన ప్రకటనలో ‘సైనిక సహకారంతో పాటు సాయుధ సంపత్తిని సుసంపన్నం చేసేందుకు, సాంకేతికతను బదలాయించేందుకు రష్యా ముందుకురావడం మన మిత్రత్వానికి నిదర్శన’మని పేర్కొన్నారు. ద్వైపాక్షిక శిఖరాగ్ర సదస్సు ఒప్పందం మేరకు ఈ నెలలోనే అత్యంత అధునాతన ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలు రష్యానుంచి భారత్‌కు రానున్నాయి. వాటి కొనుగోలుపై అమెరికా ‘కాట్సా’ ఆంక్షలు విధిస్తుందా లేదా అన్న అంశం జోలికే వెళ్ళలేదు. ఆరు లక్షల ఏకే-203 అసాల్ట్‌ రైఫిళ్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా తొలుత 70 వేల తుపాకులను దిగుమతి చేయనున్న రష్యా- అనంతరం సాంకేతికతనూ బదిలీ చేసి అమేఠీలో నెలకొల్పనున్న ఆయుధ కర్మాగారంలో ఉమ్మడిగా ఉత్పత్తిని ప్రారంభించనుంది. తద్వారా భారత్‌ కొనుగోలుదారు స్థితి నుంచి తయారీ భాగస్వామిగా ఎదగడం కీలక పరిణామం. 1971లో మొదలైన ఇరుదేశాల శాంతి సహకార ఒప్పందానికి స్వర్ణోత్సవం జరుపుకొంటున్న వేళ- ఇది చిరకాల మిత్రుడి నుంచి అందిన ఆయుధ కానుక.

భారత్‌, రష్యా మధ్య మొత్తం 28 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో ఆర్థిక ప్రయోజనాలే కాదు, హార్దిక ప్రాథమ్యాలూ మిళితమై ఉన్నాయి. ప్రభుత్వాలతో పాటు సర్కారు, ప్రైవేటు సంస్థలకూ ఒప్పందాల్లో ప్రాతినిధ్యం దక్కింది. రక్షణ సామగ్రి, అంతరిక్ష, అణుపాటవ పరిజ్ఞానాన్నీ భారత్‌కు రష్యా అందించనుంది. చమురు, సహజవాయు, పెట్రోకెమికల్స్‌, బొగ్గు, రసాయనాలు, ఎరువుల తయారీ, పరిశోధన రంగాల్లో పరిజ్ఞానాన్ని ఇరు దేశాలూ పంచుకోనున్నాయి. సైబర్‌ భద్రత, డేటా బదలాయింపుపైనా ఒప్పందాలు కుదిరాయి. ఒకనాటి పట్టు రహదారిని పునరుద్ధరించే దిశగా చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌కు ప్రత్యామ్నాయంగా వ్లాదివొస్తాక్‌-చెన్నై తూర్పు సముద్ర నడవాను పట్టాలెక్కించడంపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో జరిగే ‘వైబ్రంట్‌ గుజరాత్‌’ సదస్సులో దానిపై రష్యా ప్రతినిధి బృందం చర్చించనుంది. మాస్కో, దిల్లీల సౌభ్రాతృత్వానికి దర్పణం పట్టే అంశాలూ చర్చకు వచ్చాయి.

స్నేహ బంధం సడలకుండా...

సోవియట్‌ విచ్ఛిన్నం తరవాత వాషింగ్టన్‌కు దిల్లీ చేరువైంది. చిరకాల స్నేహానికి విఘాతం కలగకుండా ఇండియా, రష్యాలు లౌక్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవల ఇండో పసిఫిక్‌ సముద్రంలో చైనా దూకుడుపై రష్యా సానుకూల వైఖరి, భారత్‌ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా పాక్‌, అఫ్గాన్‌లతో సంబంధాలు నెరపడం ఇరు దేశాల మధ్య ప్రధాన వైరుధ్యాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాల గురించీ దేశాధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికాను నిలువరించగలదన్న అంచనాలు, వ్యాపార, వాణిజ్య అవసరాలవల్లనే బీజింగ్‌కు రష్యా చేరువవుతోందన్నది మాస్కో వర్గాల విశ్లేషణ. అఫ్గాన్‌లో తాలిబన్లను వ్యతిరేకించినా ప్రయోజనం లేనందువల్ల వారి ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం, అక్కడి ఉగ్రకార్యకలాపాలు తన సరిహద్దు దేశాలకు విస్తరించకుండా చూడటమే రష్యాకు కీలకంగా మారింది. భారత్‌ మాత్రం అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలని, అక్కడి పౌరులను మానవతా సంక్షోభంనుంచి గట్టెక్కించాలని ప్రయత్నిస్తోంది. ఈ సంక్లిష్టతల నడుమ పాత చెలిమిని కాపాడుకునేందుకు పుతిన్‌ గట్టి సంకల్పంతో ఉన్నట్లు అవగతమవుతోంది. గతంలో రష్యాపై ఆధారపడిన భారత్‌- నేడు ఇచ్చిపుచ్చుకొనే దశకు ఎదిగింది. కొవిడ్‌ మొదటి దశ ఉద్ధృతిలో మందులు, వైద్యసామగ్రిని విస్తృతంగా రష్యాకు అందించింది. రెండో దశలో అక్కడినుంచి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, మందులను దిగుమతి చేసుకుంది. క్రెమ్లిన్‌, దిల్లీల సహకారం అన్ని రంగాలకూ విస్తరిస్తే స్నేహబంధం పటిష్ఠం కావడంతోపాటు ఇరు దేశాలకూ ఉభయతారకంగా ఉంటుంది.

- బోండ్ల అశోక్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నీరుగారుతున్న ‘సహ’ స్ఫూర్తి

‣ మద్దతు దక్కని కడగండ్ల సాగు

‣ చిన్నారులకు మెరుగైన భవిష్యత్తు

‣ కొండలకూ వ్యర్థాల ముప్పు

Posted Date: 13-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం