• facebook
  • whatsapp
  • telegram

భద్రతా విధానంలోనూ పెడపోకడే

తీరుమారని పాకిస్థాన్‌

తీవ్ర ఆర్థిక సమస్యలతో తిప్పలు పడుతున్న పాకిస్థాన్‌ ఇటీవల కొత్త ‘జాతీయ భద్రతా విధానం (ఎన్‌ఎస్‌పీ)’ విడుదల చేసింది. ఆర్థిక ఇక్కట్ల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు చెబుతోంది. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా తప్పుకోవడం పాక్‌కు సరికొత్త ఆర్థిక చిక్కులు తీసుకొచ్చింది. సోవియట్‌ ఆక్రమణ, తాలిబన్లపై యుద్ధ సమయంలో అమెరికా సంకీర్ణ సేనలకు చేదోడు వాదోడుగా ఉంటూ, ఆర్థిక లబ్ధి పొందింది. ఇప్పుడు అమెరికా సంకీర్ణ సేనలు అఫ్గాన్‌ను వీడటంతో పాక్‌కు ఆదాయ మార్గాలు తగ్గాయి. తాలిబన్లకు బహిరంగ మద్దతు పలకడం ద్వారా అమెరికా సహా మిగిలిన దేశాల ఆగ్రహానికి గురైంది. దీంతో అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు అందడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని వీడి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న దేశంగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం జాతీయ భద్రతా విధానాన్ని విడుదల చేసింది. ఏడేళ్లపాటు వందల మంది నిపుణులతో కలిసి విశ్లేషణలు జరిపి కొత్త విధానాన్ని రూపొందించినట్లు అందులో పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థికంగా పటిష్ఠ పరచి ఇస్లామిక్‌ సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దడం, సంపద పంపిణీ, భిన్నత్వంలో ఏకత్వం సాధించడం వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. దాదాపు 110 పుటల విధాన పత్రంలో కేవలం 48 పుటల్ని మాత్రమే బహిర్గతం చేసి, మిగిలిన వాటిని గోప్యంగా ఉంచారు. 2022-26 వరకు అమల్లో ఉండేలా ఈ పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో నిర్దేశించిన సామాజిక, ఆర్థిక, వ్యాపార లక్ష్యాల సాధనకు అవసరమైన ప్రణాళికల ప్రస్తావన మాత్రం లేదు.

పాకిస్థాన్‌ వద్ద విదేశీ కరెన్సీ నిల్వలు బాగా తగ్గిపోయాయి. కేవలం కశ్మీర్‌ లేదా అఫ్గానిస్థాన్‌ను బూచిగా చూపించి ఎక్కువ కాలం మనుగడ సాగించలేమనే విషయం ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి తెలిసొచ్చింది. అందుకే దేశం దృష్టిని భౌగోళిక రాజకీయాల (జియో పాలిటిక్స్‌) నుంచి భౌగోళిక ఆర్థిక వ్యవస్థల (జియో ఎకనామిక్స్‌)పైకి మళ్ళించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విదితమవుతోంది. దేశ విదేశాంగ విధానం మొత్తం వాణిజ్యం, ప్రాంతీయ అనుసంధానత పైనే దృష్టిపెట్టనున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ, మధ్య ఆసియా ప్రాంతాలను, అఫ్గానిస్థాన్‌ ప్రాంతాన్ని మిగిలిన దేశాలతో అనుసంధానించేందుకు తమ దేశమే కీలక మార్గమంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షించే యత్నం చేయాలని పాకిస్థాన్‌ నిర్దేశించుకొంది. వాస్తవానికి పాక్‌ చెబుతున్న ఈ మార్గం చాలా దేశాలకు పెద్దగా ఉపయోగపడదు. పాకిస్థాన్‌ జాతీయ భద్రతా విధానం భారత్‌తో వందేళ్ల శాంతి కోరుకుంటోందంటూ జనవరి 14వ తేదీకి ముందు అక్కడి పత్రికలు ఊదరగొట్టాయి. తీరా బహిర్గతం చేసిన వివరాల్లో ఆ ప్రస్తావనే లేదు. ఎన్‌ఎస్‌పీ అయిదో భాగంలో భారత్‌తో సంబంధాలను ప్రస్తావించారు. బహిర్గతం చేసిన మొత్తం 48 పుటల్లో 14 సందర్భాల్లో భారత్‌ పేరును పేర్కొంది. ఒక్కసారి మాత్రమే భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. మిగిలిన అన్నిసార్లు ప్రతికూల వ్యాఖ్యలే చేసింది.

భారత్‌ పేరు ప్రస్తావించకుండా హిందూ మహాసముద్రంలో ఏ ఒక్క దేశాన్నీ ‘నెట్‌ సెక్యూరిటీ ప్రొవైడర్‌’గా అంగీకరించబోమని పేర్కొంది. అత్యాధునిక సాంకేతికతలను భారత్‌ అభివృద్ధి చేయడం ప్రాంతీయ సమతౌల్యాన్ని దెబ్బతీస్తుందంటూ లేనిపోని భయాలను సృష్టించేందుకు ప్రయత్నించింది. భారత్‌లో విస్తరిస్తున్న ప్రమాదకర తిరోగమన భావజాలంతో పాక్‌కు సాయుధ ఘర్షణల ముప్పు పొంచి ఉందని ఆరోపించింది. పొరుగు దేశం ఉద్దేశపూర్వకంగానే బలప్రయోగం చేసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. పాక్‌లోని మత ఛాందసవాదానికి కళ్ళెం వేసే ఎటువంటి ప్రణాళికలకూ ఈ పత్రంలో చోటుదక్కలేదు. పాక్‌ జాతీయ భద్రతలో కశ్మీర్‌ సమస్య పరిష్కారమే కీలకమని పేర్కొంది. కశ్మీర్‌లో అధికరణ 370 ఉపసంహరణ తమకు ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. కశ్మీరీ ప్రజలకు నైతిక, దౌత్య, రాజకీయ, న్యాయ సహాయాలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొనడం ఆ దేశ దుర్నీతిని తెలియజేస్తోంది. పాక్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పతనం అంచుకు చేరింది. ఫిబ్రవరిలో ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశమై ఆ దేశ భవితను నిర్ణయించనుంది. మరో రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లనున్న ఇమ్రాన్‌ఖాన్‌కు ఇవన్నీ సవాళ్లే. ఈ నేపథ్యంలో సానుకూల మార్పు కోసం ప్రయత్నిస్తున్న దేశంగా ప్రపంచం ముందుకు వెళ్లేందుకు ఈ తరహా ప్రయత్నం చేసింది. కానీ, పాక్‌కు సహజంగానే భారత్‌పై ఉన్న గుడ్డి ద్వేషం తాజా జాతీయ భద్రతా విధాన పత్రాన్నీ కమ్మేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- ఫణికిరణ్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఓటరు మౌనం... పార్టీల్లో ఉత్కంఠ!

‣ అందరికీ అందని వైద్య సేవలు

‣ ప్రాథమిక హక్కులకే అగ్రాసనం

‣ ఈశాన్యంలో ఉగ్రవాదుల అలజడి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 26-01-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం