• facebook
  • whatsapp
  • telegram

త్రైపాక్షిక సహకారంతో వ్యూహాత్మక ముందడుగు

అణుశక్తి, పర్యావరణం, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా ఇండియా, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) కీలక ముందడుగు వేశాయి. ప్రత్యేకంగా త్రైపాక్షిక సహకార కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టాయి. దీనివల్ల గల్ఫ్‌, పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో దిల్లీకి పలు వ్యూహాత్మక ప్రయోజనాలు ఒనగూడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇండియా, ఫ్రాన్స్‌, యూఏఈ దీర్ఘకాలంగా మిత్రదేశాలు. ప్రధానంగా రక్షణ రంగంలో వీటి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నిర్మాణాత్మక స్నేహబంధాన్ని బలోపేతం చేసుకోవాలని, ఉమ్మడి ప్రయోజనాలున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని మూడు దేశాలూ భావించాయి. అందులో భాగంగానే నిరుడు సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో వాటి విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. తదనుగుణంగా త్రైపాక్షిక సహకార కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పడంతోపాటు అంతర్జాతీయ స్థిరత్వ సాధన కోసం కృషి చేయడమూ ఈ కూటమి ఏర్పాటు లక్ష్యాల్లో భాగమే.

సౌర విద్యుత్తు, అణుశక్తి, నవకల్పనలు, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో ఇండియా, ఫ్రాన్స్‌, యూఏఈ మరింత కలిసికట్టుగా పనిచేసేందుకు త్రైపాక్షిక సహకార కార్యక్రమం వీలు కల్పించనుంది. ప్రధానంగా హరిత ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టుల రూపకల్పన-అమలుకు, పర్యావరణంలో ప్రతికూల మార్పులపై ఉమ్మడి పోరాటానికి బాటలు పరవనుంది. ఇందులో భాగంగా హిందూ మహాసముద్రంలో జీవవైవిధ్య పరిరక్షణకు ఇండియన్‌ ఓషన్‌ రిమ్‌ అసోసియేషన్‌ (ఐఓఆర్‌ఏ)తో కలిసి పనిచేసే అవకాశాలను మూడు దేశాలు అన్వేషించనున్నాయి. తమ సాయుధ బలగాలకు మెరుగైన ఉమ్మడి శిక్షణ అందించేందుకు, సైనిక సాధనాలను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు ప్రాధాన్యమివ్వనున్నాయి. దిల్లీ, పారిస్‌, అబుధాబీ రూపొందించుకునే ఆర్థిక, సాంకేతిక, సామాజిక విధానాలు పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా ఉండేలా చూడటంలోనూ త్రైపాక్షిక సహకార కార్యక్రమం కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం ఇండియా జీ-20 అధ్యక్ష పీఠంపై ఉంది. ఈ ఏడాది కాప్‌-28 సదస్సుకు యూఏఈ ఆతిథ్యమివ్వనుంది. దాంతో తాజా కూటమి ఏర్పాటు పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఆహార భద్రతపైనా ఇండియా, ఫ్రాన్స్‌, యూఏఈలు దృష్టి సారించే అవకాశాలున్నాయి. తాజా త్రైపాక్షిక కూటమి ప్రధానంగా గల్ఫ్‌, పశ్చిమ హిందూ మహాసముద్ర భౌగోళిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. పశ్చిమ హిందూ మహాసముద్రం అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ పరిధిలోకి వస్తుంది. ఆ కమాండ్‌తో భారత నౌకాదళానికి అంతగా సన్నిహిత సంబంధాలు లేవు. ఫలితంగా గల్ఫ్‌, ఎర్రసముద్రంలోని పలు చెక్‌పాయింట్ల వద్ద; హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా  పాంతం వెంబడి దిల్లీ భద్రతా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ఫ్రాన్స్‌, యూఏఈలతో జట్టుకట్టడం ఈ విషయంలో మనకు ప్రయోజనకరంగా మారుతుంది.

పశ్చిమ హిందూ మహాసముద్రంలో పారిస్‌ సైనిక ప్రాబల్యం దీర్ఘకాలంగా కొనసాగుతోంది. దానికి జిబూటిలో మిలిటరీ బేస్‌, అబు ధాబీలో నౌకాస్థావరం ఉన్నాయి. బాబ్‌-ఎల్‌ మాండెబ్‌ చెక్‌పాయింట్‌, హర్మూజ్‌ జలసంధి వద్ద ఫ్రాన్స్‌ బలగాల ఉనికి వ్యూహాత్మకంగా దిల్లీకి లాభదాయకం అవుతుంది. మరోవైపు- యూఏఈకి ప్రాంతీయంగా మంచి పట్టు ఉంది. యెమన్‌ తీరం వెంబడి కార్యకలాపాలను అది నియంత్రించగలదు. బాబ్‌-ఎల్‌ మాండెబ్‌ జలసంధి మధ్యలోని పెరిమ్‌ దీవులపైనా, కీలకమైన వ్యూహాత్మక ప్రాంతంలోని సొకోట్రా దీవులపైనా యూఏఈ పెత్తనం చలాయించగలదు. అది ఇండియాకు కలిసివచ్చే అంశమే. ఇక తూర్పు ఆఫ్రికాలో ఇప్పటికే చైనా ప్రాబల్యం పెరిగింది. దానికి ముకుతాడు వేయాలంటే- వ్యూహాత్మకంగా కీలకమైన మొజాంబిక్‌, కెన్యా, మడగాస్కర్‌, సీషెల్స్‌ వంటి దేశాలతో ఇండియా-ఫ్రాన్స్‌-యూఏఈ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలి. ఎర్రసముద్రం వెంబడి అనేక ఓడ రేవులను అభివృద్ధి చేయడంపై యూఏఈ ఇప్పటికే దృష్టి సారించింది. దిల్లీ, పారిస్‌ల నైపుణ్యాలు తోడైతే ఆ ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. తాజా త్రైపాక్షిక కూటమి ఏర్పాటు పాకిస్థాన్‌కు మింగుడుపడని అంశమే. యూఏఈ ఇప్పటికే ఐ2యూ2 కూటమిలో ఇండియాతో కలిసి ఉంది. మళ్ళీ అది దిల్లీతో జట్టుకట్టి కొత్త వేదికను ఏర్పాటు చేసుకోవడం- ఇస్లామాబాద్‌తో దాని సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పేందుకు నిదర్శనంగా భావించవచ్చు!

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చేయూత దక్కని రైతన్న

‣ ఉపాధిలేని వృద్ధితో ఉపయోగమెంత?

‣ ప్రమాదంలో చిత్తడి నేలలు

‣ భారత్‌వైపు ఈజిప్టు చూపు

Posted Date: 17-02-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం