• facebook
  • whatsapp
  • telegram

తృణమూల్‌కు కమలం సవాళ్లు

పశ్చిమ్‌ బంగలో ఉద్విగ్న పోరు

పశ్చిమ్‌ బంగలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను స్థాపించి ఇరవై మూడేళ్లు అవుతోంది. ఒకప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతగా ఉన్న మమతా బెనర్జీ వేరు కుంపటి పెట్టి తృణమూల్‌ కాంగ్రెస్‌ పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటికే సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వంపై అలుపెరగని రీతిలో పోరాడారు. క్షేత్రస్థాయి పోరాటాల ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర రాజకీయాలపై గట్టిపట్టు సంపాదించిన ‘దీదీ’ రెండోసారి సైతం ప్రజల ఆదరణ దక్కించుకున్నారు. మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఎదురులేకుండా సాగుతున్న మమతా బెనర్జీ పాలనకు తాజాగా అనుకోని రీతిలో భాజపా నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. వరసగా ఇబ్బందికర పరిణామాలు, శరాఘాతాలు తగులుతున్నాయి. 

మమతా బెనర్జీకి కుడిభుజంలా వ్యవహరించే, అత్యంత విశ్వసనీయ నేతగా పేరొందిన సువేందు అధికారి నిరుడు డిసెంబరు 19న భాజపా శిబిరంలోకి చేరిపోయారు. తాజాగా ఆయన సోదరుడు, కాంతి పురపాలక సంఘం మాజీ అధ్యక్షులు సౌమేందు అధికారి సైతం కాషాయ దళంలో కలిసిపోయారు. అధికారి కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అదే బాట పట్టే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాలు చెబుతున్నాయి. సువేందు మరో సోదరుడు దిబ్యేందు, తండ్రి శిశిర్‌ అధికారి సైతం కమలం దారిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 2020 డిసెంబర్‌ నుంచి పెద్దయెత్తున తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు భాజపా వైపు ఆకర్షితులవుతున్నారు. తృణమూల్‌ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ అగ్రనేత మమతా బెనర్జీ స్పందిస్తూ ‘తృణమూల్‌కు 23ఏళ్లు నిండాయి. 1998 జనవరి ఒకటిన మనం ప్రయాణం ప్రారంభించాం. ఇన్నేళ్లూ పోరాటాలతోనే గడిచిపోయింది. ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలనే లక్ష్య సాధన కోసం చిత్తశుద్ధితో పోరాటం కొనసాగించాం. మెరుగైన, బలమైన బెంగాల్‌ను తీర్చిదిద్దేందుకు మనతో కలిసి పోరాటం సాగిస్తున్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే సంవత్సరాల్లోనూ తృణమూల్‌ కుటుంబం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇటీవలి కాలంలో ఎదురవుతున్న పరిణామాలను బట్టి చూస్తే- భవిష్యత్తులో ఎంతమంది నేతలు దీదీతో కొనసాగుతారు, ఎన్నికల లోపు ఎంతమేర నష్టం కలగజేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కాకపోతే, 42 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రంలో ఒకే ఒక ఎంపీని కలిగి ఉన్న స్థితి నుంచి 34 మందిని గెలిపించుకున్న స్థితికి చేరిన మమత, చెడ్డ రోజులను ఇప్పటికే దాటేశారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కానీ, మరోవైపు, ఏడాది కాలంగా రాష్ట్రంలో భాజపా దూసుకొస్తోంది. ఒకప్పుడు రాష్ట్రంలో పెద్దగా ప్రభావమే లేని కమలం పార్టీ, ప్రస్తుతం తన ఖాతాలో 18 లోక్‌సభ స్థానాలు జమ చేేసుకొంది. పశ్చిమ్‌ బంగ ఎన్నికల ప్రస్థానంలో సాధారణ స్థాయి నుంచి ప్రయాణం మొదలుపెట్టి- ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి వామపక్షాలను, కాంగ్రెస్‌ను విజయవంతంగా పక్కకు తప్పించి మమతకు ప్రధాన సవాలుగా నిలిచింది. ఇప్పటికీ రాష్ట్రంలో భాజపాకున్న ప్రతికూలత ఏమిటంటే- మమతకు దీటైన నేత ఆ పార్టీలో లేకపోవడమే! ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేయడానికి బయటి వ్యక్తి అవసరం పార్టీకి లేదని, రాష్ట్రానికే చెందిన వ్యక్తే ఆ పదవిలో ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నా, ప్రస్తుతానికి అలాంటి వ్యక్తి భాజపాలో ఉన్నట్లు కనిపించడం లేదు. 2006లో 30 స్థానాలు పొందిన మమత- 2016 ఎన్నికల్లో 211 స్థానాలు సాధించారు. 34ఏళ్ల వామపక్ష సుదీర్ఘ పాలనకు తెరదించిన మమతా బెనర్జీ స్థాయి జనాకర్షణగల నేత భాజపాకు కావాలిప్పుడు. 

సింగూరులో నాలుగు పర్యాయాల ఎమ్మెల్యే రబీంద్రనాథ్‌ భట్టాఛార్జీ ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సంబరాలకు దూరంగా ఉండిపోవడం తృణమూల్‌లో అంతఃకలహాలను సూచిస్తోంది. ఈ పరిణామం ఇప్పుడందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మమతకు ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లలో సింగూరు, నందిగ్రామ్‌ నాణేనికి రెండు పార్శ్వాల్లా మారాయి. త్వరలో పాతికేళ్ల వ్యవస్థాపక ఉత్సవాలు జరుపుకోనున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికలు సంతోషాన్ని అందిస్తాయా, విషాదాన్ని మిగులుస్తాయా అనేది మరికొద్ది నెలల్లో తేలనుంది.

- దీపాంకర్‌ బోస్‌
 

Posted Date: 06-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం