• facebook
  • whatsapp
  • telegram

వైద్యరంగానికి సమగ్ర చికిత్స

శతాబ్దపు ఉత్పాతంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి పటిష్ఠ ఆరోగ్య వ్యవస్థలు గల దేశాల్నీ చిగురుటాకుల్లా వణికించేస్తోంది. వైద్య ఆరోగ్యరంగం దుస్థితిగతులు ముంజేతి కంకణమైన ఇండియా వంటి దేశాల దురవస్థ గురించి చెప్పేదేముంది? దేశ ఆరోగ్య వ్యవస్థలోని లోపాలన్నింటినీ కరోనా బయటపెట్టిందన్న పార్లమెంటరీ స్థాయీ సంఘం- ప్రజావైద్యం కోసం ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం ఏమాత్రం సరిపోవడం లేదని నిష్ఠుర సత్యం పలికింది. మితిమీరిన వైద్య ఖర్చుల్లో మూడింట రెండొంతుల్ని తమ జేబుల్లో నుంచే భరిస్తున్న జనవాహినిలో ఏటా ఆరు కోట్లమంది ఆ కారణంగానే దారిద్య్రరేఖ దిగువకు జారిపోతున్న దేశం మనది. ఆ విషయాన్ని ప్రస్తావించిన స్థాయీసంఘం- సర్కారీ వైద్య సేవల్ని మెరుగుపరచడానికి పెట్టుబడుల్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, వచ్చే రెండేళ్లలోనే స్థూలదేశీయోత్పత్తిలో రెండున్నర శాతం నిధుల్ని ప్రత్యేకించాలని సూచించింది. పేదలకు కొవిడ్‌ వ్యాక్సిన్లను సబ్సిడీ ధరల్లో అందించాలని, ఐఏఎస్‌ తరహాలో ఇండియన్‌ హెల్త్‌ సర్వీసును నెలకొల్పాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం జీడీపీలో ఒక్కశాతం కంటే తక్కువ కేటాయింపులతో ఈసురోమంటున్న వైద్యసేవారంగం సముద్ధరణకు 2.5 శాతం నిధుల బదిలీ అత్యవసరమన్న పదిహేనో ఆర్థిక సంఘం- ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మరింత అర్థవంతంగా పెనవడాల్సిన ఆవశ్యకతను ఎలుగెత్తుతూ దానికోసం ఓ అధ్యాయాన్నే ప్రత్యేకించింది. రుణభారం తడిసిమోపెడైన రాష్ట్రాలకు వచ్చే కొన్నేళ్లు గడ్డుకాలమేనని ఆర్‌బీఐ నివేదిక స్పష్టీకరించిన దశలో- ఆరోగ్య రంగంలో ఇతోధిక పెట్టుబడులకు రాష్ట్రాలూ కూడిరావాలని ఆర్థిక సంఘం అభిలషిస్తోంది! దేశవ్యాప్తంగా ఆరులక్షల మంది వైద్యులు, 20 లక్షలమంది నర్సులకు; 20-30 శాతం ప్రాథమిక, సామాజిక స్వాస్థ్య కేంద్రాలకు కొరత పట్టిపీడిస్తున్న వేళ- చికిత్స ఏదైనా జాతీయ స్థాయిలోనే సర్వ సమగ్రంగా జరగాలి!
 

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను సార్వత్రికం చెయ్యడమే కాదు, 2000 సంవత్సరానికల్లా ‘అందరికీ ఆరోగ్యం’ సాధిస్తామని డబ్ల్యూహెచ్‌ఓ సభ్య దేశాలు 1978లో ప్రతినబూనాయి. తలసరి కేటాయింపుల పరంగా దేశరక్షణకంటే ప్రజారోగ్య భద్రతకే అధిక ప్రాధాన్యం ఇస్తున్న అమెరికా, ఫ్రాన్స్‌, యూకే, జర్మనీ, ఇటలీ వంటి దేశాలూ కొవిడ్‌ విజృంభణకు తట్టుకోలేక పోతున్న వైనం- ఆరోగ్య రంగ పటిష్ఠీకరణ నిరంతరంగా సాగాలని ఎలుగెత్తుతోంది. సర్‌ జోసెఫ్‌ భోర్‌ సారథ్యంలో ఇండియా ఆరోగ్య స్థితిగతులపై 1946లో వెలువడిన నివేదిక- క్షేత్రస్థాయి వాస్తవాల్ని మదింపు వేసి పదిహేనేళ్లలో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు విధివిధానాల్ని కూర్చింది. పెట్టుబడి వ్యయాలతో కలిపి స్థూల జాతీయోత్పత్తిలో 1.33 శాతాన్ని కేటాయిస్తే సరిపోతుందన్న కమిటీ సూచనల్ని భరింపశక్యం కానివంటూ 1947 నాటి ఆరోగ్య మంత్రుల సదస్సు తిరస్కరించింది. కనీసావసరాల కార్యక్రమం కింద డెబ్భై ఎనభయ్యో దశకాల్లో గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల్ని కల్పించినా- క్రమంగా అవీ కొరతల కోమాలోకి జారిపోయాయి. కొవిడ్‌ లాంటి ప్రాణాంతక వైరస్‌ల దాడి మునుముందు మరింత పెరుగుతుందంటున్న అధ్యయనాల నేపథ్యంలో- ఆరోగ్య సేవలపై ప్రభుత్వాల దృక్కోణమే గుణాత్మకంగా మారాలి. అంటువ్యాధులపై నిఘా, పరీక్షలు, ఎవరిద్వారా వ్యాపిస్తోందో కనుగొనడం వంటివాటిపై ఇండియా సరైన దృష్టి సారించడం లేదని ప్రపంచబ్యాంక్‌ బృందం ఇటీవల హెచ్చరించింది. జీవనశైలి వ్యాధులకు జతపడి, వాతావరణ మార్పులు, వాయుకాలుష్యం, పట్టణీకరణలు కొత్తగా తెచ్చిపెట్టే ఆరోగ్య సమస్యల్నీ పరిగణనలోకి తీసుకొని- వైద్య ఆరోగ్య రంగానికి కాయకల్ప చికిత్స చేయాలి. పౌరుల్లో ఆరోగ్య చేతనను పెంచి, క్రమపద్ధతిలో వైద్యసేవలు సదుపాయాల విస్తరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే- స్వస్థ భారతం సాక్షాత్కరిస్తుంది!
 

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌

Posted Date: 23-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం