• facebook
  • whatsapp
  • telegram

గ్రామాభివృద్ధిలో ప్రణాళికలే కీలకం

ప్రజాభాగస్వామ్యంతోనే పురోగతి
 

ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించడంలో, సేవల నందించడంలో స్థానిక సంస్థల పాత్ర ఎనలేనిది. అందుకు సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ, పటిష్టమైన పాలనా యంత్రాంగం, ప్రణాళిక వ్యవస్థ, ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి అనేది ఉత్తుత్తి నినాదం కాకుండా సువ్యవస్థిత విధానం అవుతుంది. రాజ్యాంగంలోని అధికరణ 243జి ప్రకారం గ్రామ పంచాయతీలు తమ పరిధిలోని ప్రజల ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయసాధన కోసం తప్పనిసరిగా గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి. ప్రజా భాగస్వామ్య పద్ధతిలో రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్‌ లోని 29 అంశాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలను సమన్వయం చేసుకుని, విస్తారమైన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి.
 

ప్రజలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ నిర్ణయాలలో పాలుపంచు కోవడంతోపాటు పథకాల ప్రాధాన్యాల్ని నిర్ణయించడంలో, విధాన రూపకల్పనలో, వనరుల కేటాయింపులో వారిని భాగ స్వాములను చేసే విధానమే భాగస్వామ్య ప్రణాళిక. అక్టోబర్‌ 2, 2020 నుంచి జనవరి 31, 2021 వరకు సబ్‌ కీ యోజనా సబ్‌ కా వికాస్‌ (అందరి ప్రణాళిక అందరి అభివృద్ధి) కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించాలి. అందుకు గ్రామసభలు నిర్వహించి, పంచాయతీరాజ్‌ సంస్థలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో, నిర్దిష్ట కార్యాచరణతో 2021-22 సంవత్సరానికి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. గ్రామసభలో ఆమోదించిన ప్రణాళిక వివరాలను ఇ-గ్రామస్వరాజ్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి. అలాగే గ్రామ పంచాయతీలలో మిషన్‌ అంత్యోదయ సర్వే నిర్వహించి, సమాచారం సేకరించి, నమోదు చేయాలి. దేశవ్యాప్తంగా సుమారు 31 లక్షల మంది ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, 5.25 కోట్ల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. వీరందరినీ ప్రణాళికలో భాగస్వాములను చేసి వారి పాత్రను బలోపేతం చేయడం కూడా దీని ముఖ్య ఉద్దేశం.
 

ప్రణాళిక రూపకల్పనలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ, 13 కీలకమైన అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. గ్రామాల సమగ్రాభివృద్ధికి ఆయా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో పాటు, గ్రామస్థాయి ఉద్యోగుల సమన్వయం ఎంతో కీలకం. అందుకు కీలకమైన గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం. రైతుల సంక్షేమం, తాగునీరు, పారిశుధ్యం, పాఠశాల విద్య అక్షరాస్యత, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం సామాజిక న్యాయం- సాధికారతా శాఖల లాంటి సుమారు 16 విభాగాల సమన్వ యంతో ప్రణాళికలను రూపొందించాల్సి ఉం టుంది. గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా గ్రామసభకు హాజరై తమ శాఖ కార్యకలాపాలను వివరించాలి. ప్రజల భాగస్వామ్యంతో, జవాబుదారీతనం, నిధుల సక్రమ వినియోగం, ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, గ్రామ పంచాయతీల పట్ల ప్రజలకు నమ్మకం కలిగి సమగ్ర ప్రణాళికలు రూపొందుతాయి.
 

15వ ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికిగాను స్థానిక సంస్థలకు రూ.60,750 కోట్లు కేటాయించింది. ఈ నిధుల విడుదలకు అభివృద్ధి ప్రణాళిక తయారుచేయడం తప్పనిసరి. పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక వెబ్‌ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2,69,532 గ్రామ పంచాయతీలలో, 2,14,934 గ్రామ పంచాయతీలలో మాత్రమే ‘ఫెసిలిటేటర్ల’ను నియమించగా, 1,31,226 పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించారు. అలాగే 26,657 గ్రామ పంచాయతీలలో మాత్రమే ప్రణాళికలు ఆమోదం పొందాయి. కానీ నేటికీ ఇ-గ్రామస్వరాజ్ల్‌ో ప్రణాళికలను చేర్చక పోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రణాళికల రూపకల్పనను ప్రజా ఉద్య మంగా మార్చడానికి, సరైన అవగాహన పెంపొందిం చేందుకు సుశిక్షితులైన సిబ్బంది అవసరం, అందుకు పరిపూర్ణమైన శిక్షణ తప్పనిసరి. సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు సిబ్బంది నడుమ సమన్వయ లేమిని నివారించాలి. సంబందిత అధి కారులు విస్తృతంగా పర్యటించి, సభలు నిర్వహించి అన్ని వర్గాల భాగస్వామ్యం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. సమగ్ర ప్రణాళిక కోసం వార్డు, మహిళ, బాల సభలు నిర్వహించాల్సి ఉండగా ఆచరణలో అంతగా అమలు కావడం లేదని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం కొవిడ్‌ దృష్టా సిబ్బంది భద్రతతో కూడిన అంత్యోదయ సర్వే నిర్వహించడానికి అయ్యే ఖర్చు రూ.101.4 కోట్లు అని అంచనా. ఇలా ప్రణాళిక రూపకల్పనకయ్యే కోట్లాది రూపాయల ఖర్చు, సమయం వృథా కాకూడదంటే ప్రజలను గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీలో ప్రత్యక్ష భాగస్వాములను చేస్తేనే సుస్థిర, సత్వర అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. అప్పుడే గ్రామ పంచాయతీలు నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకలుగా వెలుగొంది గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది.
 

- ఎ. శ్యామ్‌ కుమార్‌
 

Posted Date: 24-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం