• facebook
  • whatsapp
  • telegram

విశృంఖల వినోదానికి ముకుతాడు!

ప్రభుత్వ నియంత్రణ - సాధ్యాసాధ్యాలు
 

సినిమాలు, సీరియళ్లకు పోటీగా వినోదరంగంలో నయా ఆకర్షణగా మారిన ఓటీటీలు... అశ్లీల దృశ్యాలు, అసభ్య సంభాషణలు, హింసను ప్రసారం చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, హంగామా, వూట్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌ సహా దేశంలోని దాదాపు 40 ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) వేదికలను ఇక నిశితంగా పర్యవేక్షించనుంది. ఓటీటీలు అశ్లీల, హింసాత్మక దృశ్యాలున్న వెబ్‌సిరీస్‌లు, సినిమాలను ప్రసారం చేస్తున్నాయని, వీటిని సెన్సార్‌ చేసేందుకు ఓ స్వతంత్ర సంస్థ ఉండాలని శశాంక్‌ శేఖర్‌ ఝా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ అంశంపై కేంద్ర వైఖరిని స్పష్టం చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఓటీటీలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ ఇచ్చిన గెజెట్‌ నోటిఫికేషన్‌ను రాష్ట్రపతి ఆమోదించారు.
 

కట్టుతప్పుతున్నాయని...
మన దేశంలో ఓటీటీలపై నియంత్రణకు ఎలాంటి వ్యవస్థా లేదు. దీంతో అవి హింసాత్మక, అశ్లీల, అసభ్య దృశ్యాలు, సంభాషణలకు వేదికలవుతున్నాయి. కొన్ని పేరొందిన వెబ్‌సిరీస్‌లలో అసభ్య సంభాషణలు, అశ్లీల దృశ్యాలు లెక్కకు మిక్కిలిగా ఉంటూ యువతను పక్కదోవ పట్టిస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. నిరుడు అక్టోబర్‌లో ప్రభుత్వం నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ వంటి సంస్థలకు ప్రసారం చేయకూడని అంశాల జాబితాను ఇస్తామని; స్వీయ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసుకోవాలనీ సూచించింది. ప్రభుత్వం పదేపదే స్పష్టంచేయడంతో సెప్టెంబర్‌లో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, వూట్‌, ఆల్ట్‌ బాలాజీ, హంగామా వంటి 15 ఓటీటీ సంస్థలు కలిసి భారత అంతర్జాల, మొబైల్‌ సంఘం(ఐఏఎంఏఐ) కింద పని చేసేందుకు ముందుకొచ్చాయి. సార్వత్రిక స్వీయనియంత్రణ స్మృతి పేరిట తమ విధానాన్నీ ప్రతిపాదించాయి. అంశాల వివరాల వెెల్లడి, వయసుల వారీగా ప్రసారాల వర్గీకరణ, అందుకు తగ్గట్లుగానే ప్రసారాలు చూడగలిగేలా నియంత్రణ వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఓటీటీ ప్రసారాలపై ఫిర్యాదుల స్వీకరణకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేస్తుందని, ఫిర్యాదులపై చర్చించి సలహాలివ్వడానికి ముగ్గురు సభ్యులతో సలహా మండలినీ నియమించుకుంటుందని పేర్కొన్నాయి. కేంద్ర సమాచార ప్రసారశాఖ దీన్ని తోసిపుచ్చింది. ఓటీటీలన్నీ కలిసి తమ ప్రసారాలను స్వతంత్రంగా పర్యవేక్షించగలిగే ఓ సంస్థను ఏర్పాటు చేసుకోవాలని, నిషేధిత అంశాలు ఏ మేరకు ప్రసారమవుతున్నాయో గణించడానికి ఏర్పాట్లు కచ్చితంగా ఉండాలని ఐఏఎంఏఐకి సూచించింది. దీనిపై ఓటీటీలు స్పందించకపోవడంతో తాజాగా వాటిని సమాచార ప్రసారాల శాఖ తమ పర్యవేక్షణలోకి తీసుకుంది.
 

ఎంఎక్స్‌ప్లేయర్‌ లాంటి కొన్ని ఓటీటీలు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానించాయి. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి పెద్ద సంస్థలు ప్రస్తుతానికి ఏమీ స్పందించలేదు. ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు సెన్సార్‌ అనే విధానమే సరికాదని దర్శకుడు అలంక్రితా శ్రీవాస్తవ్‌ వ్యాఖ్యానించారు. బ్రిటీష్‌వారు పెట్టిన ఈ విధానాన్ని మనం ఇంకా వదిలించుకోలేకపోతున్నామని పలువురు ఓటీటీ నటులు, సాంకేతిక నిపుణులు విమర్శిస్తున్నారు.
 

ఏం జరగనుంది?
ఓటీటీలను కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ పరిధిలోకి తీసుకురావడంతో ఇవి ప్రసారాల విషయంలో గీత దాటకుండా కొన్ని పరిమితులు విధించే అవకాశం ఉంది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి విదేశీ ఓటీటీలు వాటిని ప్రభుత్వం వద్ద నమోదు చేయించుకోవడం తప్పనిసరి కానుంది. కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ నియంత్రణ చట్టం-1995 ప్రకారం కేబుల్‌ టీవీల్లో ఎలాంటి అంశాలు ప్రసారం చేయకూడదనే విషయంలో స్పష్టత ఉంది. దాన్ని అనుసరించే ఓటీటీల్లో ప్రసారాల నియంత్రణకూ నిబంధనలు రూపొందించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అదే జరిగితే ఓటీటీలు స్వీయ నియంత్రణ పాటించడం తప్పనిసరవుతుంది. అయితే ఓటీటీల ప్రసారాలపై నిరంతర పర్యవేక్షణకు పెద్దయెత్తున యంత్రాంగం, ఎంతో కసరత్తు అవసరం. ఆ మేరకు వ్వవస్థలను పటిష్ఠంగా రూపొందించగలిగితేనే అవి లక్ష్మణరేఖను దాటకుండా చూడగల వీలుంటుంది.
 

విదేశాల్లో ఇలా...
అమెరికాలో ఎలెక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ సర్వీసులను నియంత్రించడానికి ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ ఉంది. ఈ సంస్థ రేడియో, టీవీ, వైర్‌, శాటిలైట్‌, కేబుల్‌ ప్రసారాలు కట్టుతప్పకుండా పర్యవేక్షిస్తుంది. సింగపూర్‌లో ఓటీటీ సర్వీస్‌ ప్రొవైడర్లు తమ ప్రసారాల్లో అశ్లీలత, మాదకద్రవ్యాల వినియోగం, సెక్స్‌, హింస వంటి వివరాలను కచ్చితంగా ప్రదర్శించాలి. బ్రిటన్‌లో ఓటీటీలను కూడా మిగతా ప్రసార సాధనాల మాదిరిగానే నిశితంగా పరిశీలిస్తారు. ఆస్ట్రేలియాలో ఓటీటీల ప్రసారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక చట్టం ఉంది. ఇండొనేసియా, టర్కీ, సౌదీ అరేబియాల్లో ఓటీటీలపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఏ మాత్రం నిబంధనలు మీరినా వేటు తప్పదు. సింగపూర్‌, వియత్నాం, జర్మనీ, న్యూజిలాండ్‌ దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న కొన్ని వెబ్‌సిరీస్‌లను నిషేధించారు.
 

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి
 

Posted Date: 28-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం