• facebook
  • whatsapp
  • telegram

ఆరోగ్యమే ‘టీకా’ తాత్పర్యం!

కొవిడ్‌ సవాళ్లకు సమాధానాలు
 

ప్రపంచదేశాల్లో మహమ్మారి కొవిడ్‌ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్కడో ఒక చోట చిన్న పొరపాటు దొర్లడం, తద్వారా కరోనా పెచ్చరిల్లడం జరిగింది. సమస్య మరింత విస్తృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో... దీనికి శాశ్వత పరిష్కారంగా టీకా ఆవిష్కరణ అంతే తప్పనిసరి అని ప్రపంచ దేశాలన్నీ పరితపించాయి. ఆరు నెలల ఎదురుచూపులకు తెరదించుతూ టీకాలు సిద్ధమవుతున్నాయన్న వార్తలు వెలుగుచూడటం సంతోషదాయకం. మొదటి శుభవార్త అమెరికా ఔషధ దిగ్గజం ఫైజర్‌, జర్మనీ ‘బయోన్‌టెక్‌ సంస్థల నుంచి వెలువడింది. ఆ వెంటనే మరో అమెరికా సంస్థ మోడెర్నా నుంచి రెండో వార్త వచ్చింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉత్పాతాన్ని సృష్టించిన కొవిడ్‌ మహమ్మారి ఆట కట్టించేందుకు ఈ సంస్థలు కనిపెట్టిన టీకా ఔషధాలు అత్యంత సమర్థమైనవి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఈ విజయం పట్ల ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకోవడమే ఈ వార్తల గొప్పతనం చాటిచెబుతోంది.
 

ఒక విషయం మరచిపోకూడదు... టీకా విజయంతోనే మన కష్టాలన్నీ తీరిపోవు. యావత్‌ మానవాళీ ఈ బెడద నుంచి పూర్తిగా బయటపడాలి. తిరిగి ఇది కోరసాచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వార్థ రాజకీయ ఆకాంక్షలకు అతీతంగా క్రియాశీల కార్యాచరణతో ముందుకురికి ప్రభుత్వాలన్నీ ఏక దీక్షతో పనిచేసినప్పుడే కరోనా నుంచి మానవాళికి శాశ్వత విముక్తి అనడంలో సందేహం లేదు. పాశ్చాత్య దేశాలు తమ ప్రజలకు సత్వరం టీకా మందు ఇవ్వడమెలా అనే విషయమై ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నాయి. వెంటనే కాకపోయినా త్వరలోనే పలు వ్యాక్సిన్లు దేశ ప్రజలకూ అందుబాటులోకి రానున్నాయి. అయితే అప్పటివరకూ ప్రజలంతా అలసత్వానికి ఏమాత్రం తావివ్వకుండా అత్యంత అప్రమత్తంగా మసలుకోవాలి.
 

ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. జనం వీధుల్లోకి వచ్చారు. పనులకు వెళ్తున్నారు. విద్యార్థులు ఇంకా నష్టపోకుండా వీలైనంత త్వరగా విద్యాసంస్థల గేట్లు తెరిచేందుకు దేశవ్యాప్తంగా రాష్ట్రప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఒకటీ అరా ప్రాంతాల్లో మినహా దేశమంతటా కొవిడ్‌ కొత్త కేసుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలోనే తగ్గుతోంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగితేనో లేదా  చేజేతులా ముప్పు కొనితెచ్చుకుంటేనో తప్ప కేసుల సంఖ్య క్షీణిస్తున్న ప్రస్తుత సానుకూల ధోరణి రానున్న రోజుల్లోనూ కొనసాగనుంది.
 

కొన్ని నగర ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు రెండో విడత లేదా మూడోసారి తిరిగి వెల్లువెత్తకుండా అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు వైద్యసిబ్బంది పరస్పర సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలి. మహమ్మారిపై పోరులో సాధించిన అవగాహన, అనుభవం దృష్ట్యా ఇది అసాధ్యమేమీ కాదు. ఎక్కడెక్కడ ప్రమాదం పొంచి ఉందో నిరంతరం కాపుగాస్తూ భారత ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తంగా ఉండటం, అవసరాన్ని బట్టి వైద్యసదుపాయాలను ఎక్కడికక్కడ తిరిగి అందుబాటులోకి తీసుకురావడం చెప్పుకోదగిన విషయం.
 

మూడో దశ విస్తృత క్షేత్రస్థాయి ప్రయోగాల్లో 90శాతం పైగా కేసుల్లో విజయం సాధించిన ఔషధ రంగ దిగ్గజాలు ఇప్పటికే వ్యాక్సిన్‌ ఉత్పత్తి మీద దృష్టి సారించాయి. అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా రానున్న కొద్దివారాల్లోనే భారీస్థాయి ఉత్పత్తికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. కంపెనీ ఏదైనప్పటికీ, ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ టీకా మందు కొత్త సంవత్సరం తొలినాళ్లలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇంతగా నిరీక్షించిన ఈ టీకా ఔషధాన్ని ముందుగా వినియోగించుకునే హక్కు- వైద్యరంగంలో పనిచేస్తున్నవారిది, ముందువరసలో ఉండి మహమ్మారిపై నిత్యం పోరాడుతున్న పోలీసులు, పురపాలక పారిశుద్ధ్య కార్మికులు తదితరులది. కొవిడ్‌ ప్రాణాంతక వైరస్‌ నుంచి అత్యధిక ప్రమాదం ఎదుర్కొనే మరో వర్గం... వయోవృద్ధులు! వారికి సైతం మొదటి పంక్తిలోనే టీకాలు వేయాలి. భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన అనంతరం- బలహీనుల రక్షణ ప్రభుత్వాల తొలి ప్రాథమ్యం అయితీరాలి.
 

- డాక్టర్‌ అనిల్‌ కృష్ణ గుండాల (హృద్రోగ నిపుణులు)
 

Posted Date: 28-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం