• facebook
  • whatsapp
  • telegram

సంక్షోభం సృష్టించిన సదవకాశం!

‘కొవిడ్‌’తో కొత్త జీవన విధానం
 

కొవిడ్‌ అత్యంత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా కాటేసింది. అయినా మానవాళి కుంగిపోలేదు. తన ప్రస్థానంలో ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని, ప్రతి దురవస్థను మెరుగైన జీవనం కోసం, ఓ మహదావకాశంగా మలచుకునే శక్తిసామర్థ్యాలు మనిషికున్న విలక్షణత. సరైన పాఠాలు నేర్చుకోగలిగితే, కరోనా విలయాన్నీ ఒక అవకాశంగా మార్చుకోగలం. నా వ్యక్తిగత అనుభవమే ఇందుకు ఉదాహరణ. అది మార్చి 2020. డెహ్రాడూన్‌లో సమాచార హక్కుపై కార్యశాల ఏర్పాటైంది. అందులో నేను పాల్గొనాలి. అప్పుడు నేను ముంబయిలో ఉంటున్నా. ప్రయాణం ఖరారైంది. కానీ, లాక్‌డౌన్‌ కారణంగా కార్యక్రమం రద్దయింది. డెహ్రాడూన్‌లో కార్యశాల నిర్వహించాలంటే కనీసం 60గంటలు నేను ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. నా ప్రయాణానికి ఎంతలేదన్నా ఓ 20వేల రూపాయలు ఖర్చు అవుతాయి. కరోనా సంక్షోభంవల్ల మేం దీన్ని ఏప్రిల్‌కు వాయిదా వేసి, ‘వెబినార్‌’గా నిర్వహించాం. అందుకోసం నేను, ఇందులో పాల్గొన్నవారు వెచ్చించిన సమయం రెండు గంటలు. కచ్చితంగా చెప్పాలంటే 125 నిమిషాలు. పైసా ఖర్చు లేకుండా కార్యక్రమం పూర్తయింది. అనుకున్నదానికంటే ఆ కార్యక్రమం ఎంతో బాగా జరిగింది. నేను డెహ్రాడూన్‌ వెళ్లినా ఇంతకంటే గొప్పగా ఏమీ జరిగి ఉండదు. ఒక్క తేడా మాత్రం ఉంది... కరచాలనాలు, ఫొటోగ్రాఫులు మాత్రం లేవు... అంతే!
 

ఇ - వేదికలు
కొన్ని న్యాయస్థానాలు ఇ-హియరింగ్‌లు నిర్వహిస్తున్నాయి. అయితే తప్పనిసరైనప్పుడు, అత్యవసర వ్యవహారాల్లో మాత్రమే అవి ఈ సదుపాయం వినియోగిస్తున్నాయి. దీన్ని ఆర్జిత సెలవుదినం (పెయిడ్‌హాలిడే)గా పరిగణిస్తున్న సమాచార కమిషన్‌ వంటి అత్యధిక న్యాయ సదృశ (క్వాజీ జుడీషియల్‌) సంస్థలు ‘పని లేదు కాబట్టి పూర్తి జీతం’ ఇవ్వలేం అన్న తప్పుడు భావనలో ఉన్నాయి. ఇ-హియరింగ్‌లను కొత్త రివాజుగా గుర్తించడానికి వారి మనసులు అంగీకరించలేకపోతున్నాయి. ఇలాంటి ధోరణి మార్చుకుని ఇ-హియరింగూ ఒక పద్ధతే అని గుర్తించేట్లయితే వ్యాజ్యదారులు, సాక్షులు, న్యాయవాదులు వందల గంటల సమయాన్ని ఆదా చేసుకోగలరు. న్యాయస్థానాలకు ఇప్పుడు అందుబాటులో ఉన్న స్థల పరిధిలోనే న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేయడమూ సాధ్యపడుతుంది. న్యాయస్థానాల్లో, కమిషన్లలో ఎటూ అన్ని వాద ప్రతివాదాలూ వ్యవహారాలూ రికార్డు అవుతాయి. ప్రత్యక్షప్రసారంలో వేలమంది కళ్లు గమనిస్తూ ఉంటాయి కాబట్టి, అవి అప్పుడు నిజమైన బహిరంగ న్యాయస్థానాలు అవుతాయి.
 

నిత్యం చోటుచేసుకునే చాలా కార్యకలాపాలకు భౌతిక సాన్నిహిత్యం అవసరం లేదు. ప్రధానమంత్రి మంత్రిమండలి సమావేశాలు, దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులతో, ఇతర ఉన్నతాధికారులతో కీలక సమావేశాలూ వీడియో కాన్ఫరెన్సింగ్‌ తదితర పద్ధతుల్లో జరిగిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావించి తీరాలి. చివరికి సాధారణ ప్రజలు సైతం వ్యక్తిగత కార్యక్రమాలకు ఇ-వేదికలను వినియోగిస్తున్నారు. పాఠశాలలు ఎంతో ఉత్సుకతతో వర్చువల్‌ తరగతి గదుల ద్వారా బోధన చేపట్టాయి. వీటికి స్పందన ప్రోత్సాహకరంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్లు సమకూరుస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాల వినియోగం తక్కువగా ఉండటం, అందరికీ కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం వంటి సమస్యలున్నా- ఆన్‌లైన్‌ విధానం క్రమంగా ఒక సమగ్ర రూపం సంతరించుకుంటోంది. ఇక మీదట భౌతిక సమావేశాలు ఉండవని కాదు... వాటి సంఖ్యను గతంతో పోలిస్తే మూడో వంతుకు తగ్గించడం సాధ్యమేనని చెప్పవచ్చు.
 

కొత్త పద్ధతిలో చాలా కార్యాలయాలకు అవసరమైన స్థలాన్ని కనీసం సగానికి సగం తగ్గించవచ్చు. ఇక కేంద్ర సమాచార కమిషన్‌లో ఆర్టీఐ సంబంధిత విచారణలను వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారానే నిర్వహించే ఆనవాయితీ పదేళ్లకు పైగానే ఉంది. ఒకసారి ప్రజలు ఈ భావనకు అలవాటు పడితే, విచారణలకు పట్టే సమయం సాధారణ విచారణల కంటే ఎక్కువేమీ ఉండదు. న్యాయసంస్థలు, న్యాయ సదృశ సంస్థలు తక్షణం వర్చువల్‌ హియరింగ్‌లను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెండింగ్‌ కేసుల భారం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. న్యాయస్థానాల్లో త్వరలో భౌతిక విచారణలు పునరుద్ధరించాలన్న వాదన వినిపిస్తోంది.
 

సాంకేతికత ఊతంగా...
ఇంటినుంచే పని అనేది గతంలో ఏవో కొన్ని వ్యాపారాలకు, అదీ పరిమితంగా మాత్రమ ఉండేది. భౌతిక సమావేశాలు, ఒక కార్యాలయంలో కలిసి పనిచేయడం తప్పనిసరి అనే భావన సర్వసాధారణంగా ఉండేది. విదేశాల్లో ఒక గంటపాటు సెమినార్‌ ఇచ్చేందుకో, ఏదైనా వివరణకోసమో వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. సదస్సులు, సమావేశాల్లో పాల్గొనే సమయం కంటే వాటికి హాజరై వచ్చేందుకు పట్టే సమయమే ఎంతో ఎక్కువగా ఉండేది. ప్రయాణానికి, హోటళ్లలో బస చేసేందుకే ఎక్కువ వ్యయమయ్యేది. ముంబయినే తీసుకోండి... నగరంలో ఎక్కడైనా అరగంట సమావేశానికి రెండు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కరోనా కష్టకాలంలో ఇలాంటి సమావేశాలకు, ఇతరత్రా సమాచార బదిలీ అవసరాలకు ప్రజలు పలురకాల ఇ-వేదికలు ఉపయోగిస్తున్నారు.
 

సరళి మారుతోంది
ప్రస్తుత పరిస్థితి చూస్తే, భౌతిక దూరం పాటింపు కనీసం మరికొన్ని నెలలపాటు తప్పేట్లు లేదు. ఇందులో అతిశయోక్తి లేదు. సాంకేతికతను వినియోగించుకున్నట్లయితే, సమయాన్ని వనరులను మరింత లాభసాటిగా మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ దీన్నొక కొత్త ఆనవాయితీగా పరిగణించాలి. వ్యయం, ప్రయాణ సమయం ఆదా అవుతాయి. ప్రజల రాకపోకలు గణనీయంగా తగ్గితే కాలుష్య నియంత్రణ సాధ్యమవుతుంది. కర్బన ఉద్గారాలు క్షీణిస్తాయి. మనం పనిచేసే పద్ధతికి కొత్త రూపు ఇచ్చేందుకు కొవిడ్‌ సంక్షోభాన్ని మంచి అవకాశంగా మలచుకోవాలి. దీన్నుంచి కలకాలం నిలిచే ప్రయోజనం పొందాలి. మన పాత రివాజులను సవాలు చేయడానికి, నగర కేంద్రాలు విధులు నిర్వర్తించే తీరును మార్చుకోవడానికి ఇది సరైన సమయం. ప్రయాణ ఒత్తిడిని, వాహన రద్దీ కాలుష్యాన్ని తగ్గించే మేలైన జీవన సరళి దిశగా మన అడుగులు పడాలి. పట్టణ ప్రాంతాల్లోనైనా దీన్ని మన నయా విధానంగా మార్చుకోవాలి. ఒకటి గుర్తుంచుకోవాలి... పని తగ్గించుకోవడానికి కరోనా వైరస్‌ను సాకుగా చేసుకుంటే, మహమ్మారి విలయం నుంచి మనం నేర్చుకున్న పాఠాలు వృథా అయినట్లే. ప్రజలు ఇంటి నుంచి పని చేయడానికి అనువైన విధంగా పని పద్ధతులను శాశ్వతంగా మార్చేయాలి. భిన్న సంస్థలు ఈ కరోనా సంక్షోభ సమయంలో దీనిపై దృష్టి సారించడం తప్పనిసరి. ఇంటి నుంచి పని చేయడానికి చాలిన స్థాయిలో కొందరి ఇళ్లు ఉండకపోవచ్చు. వారికి వీలుగా పని ప్రదేశాలను వికేంద్రీకరణ పద్ధతిలో ఏర్పాటు చేయాలి. వైరస్‌ పోయేదాకా వేచిచూడకుండా, మార్పులను అమలు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో పని విధానాలు మార్చేందుకు మహమ్మారి మంచి అవకాశం కల్పించింది. సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత!

 

Posted Date: 28-11-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం