• facebook
  • whatsapp
  • telegram

విశ్వనగరాల తళుకులీవి!

సేవారంగం, పరిశ్రమలే దేశ ప్రగతికి ప్రధాన చోదక శక్తులు. ఈ శక్తులు ప్రధానంగా నగరాల్లో కేంద్రీకృతమవుతాయి. గతేడాది భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో నగరాలు, పట్టణాల వాటా 63 శాతమైతే, 2030కల్లా ఇది 75 శాతానికి పెరుగుతుందని సీబీఆర్‌ఇ-క్రెడాయ్‌ అధ్యయనం తేల్చింది. అంతకుముందు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌, బెంగళూరులను ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలుగా వర్ణించింది. కరోనా వల్ల ఈ ఆశావహ అంచనాలు ఫలించడం కొంత ఆలస్యమైనా, కొవిడ్‌ కేసులు అదుపులోకి వచ్చేలోగా మన నగరాల్లో మౌలిక వసతులను భారీ ఎత్తున విస్తరించి ఉజ్జ్వల భవిష్యత్తుకు సిద్ధం చేయాలి.
 

నేడు ప్రపంచంలో సుసంపన్నమైనవిగా వెలుగుతున్న దేశాలు వైశాల్యం రీత్యా, జనాభా రీత్యా హైదరాబాద్‌ కన్నా చాలా చిన్నవి. వాటిలో సింగపూర్‌, లగ్జెంబర్గ్‌ వంటి నగర రాజ్యాలూ ఉన్నాయి... న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ వంటి చిన్న దేశాలూ ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 2020 అంచనాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన పది అగ్రశ్రేణి దేశాల జాబితాలో ఒక్క అమెరికా తప్ప మిగిలినవన్నీ చిన్న దేశాలే. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి ఏటేటా ప్రకటించే జాబితాలదీ ఇదే కథ. ఉదాహరణకు అన్ని టాప్‌ టెన్‌ జాబితాల్లో ఆనవాయితీగా చోటుచేసుకునే స్విట్జర్లాండ్‌ జనాభా 86 లక్షలు మాత్రమే. అంటే, దాదాపు హైదరాబాద్‌ జనాభా(90 లక్షలు) అంత. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 195 దేశాల్లో 91 దేశాల జనాభా కోటికి లోపే. చిన్న దేశాల సంపదకు కారణాలు వేర్వేరు. 50 లక్షల జనాభా అయినా లేని బ్రునై, ఖతార్‌, కువైట్‌ వంటి దేశాలు చమురు నిక్షేపాలతో కోట్లకు పడగలెత్తగా- కోటి లోపు జనాభా కలిగిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఇ) ప్రధానంగా వ్యాపారం, సాంకేతికత, రవాణా, పర్యాటక రంగాలతో వృద్ధిపథంలో దూసుకెళుతోంది. 88 లక్షల జనాభా కలిగిన ఇజ్రాయెల్‌ అంకుర పరిశ్రమలకు ప్రపంచ రాజధానిగా పేరుపడింది. ఆదాయపన్ను రద్దు చేసి, కార్పొరేట్‌ పన్నులను నామమాత్ర రేట్లకు పరిమితం చేయడం ద్వారా మొనాకో తలసరి ఆదాయపరంగా ప్రపంచంలో ఒకటీ, రెండు స్థానాలను ఆక్రమిస్తూ ఉంటుంది. జూదశాలలతో మకావ్‌, అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా హాంకాంగ్‌ సుసంపన్నమయ్యాయి. ఇవి రెండూ చైనా అధీనంలోని భూభాగాలే  కానీ, ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన నగరాలుగా అభివృద్ధి సాధించాయి.


 

లక్ష్మీనివాసాలు
మకావ్‌, మొనాకో, సింగపూర్‌, లగ్జెంబర్గ్‌ల సంపద స్థానికంగా ఉత్పన్నమైనది కాదు, ఆకర్షణీయ పన్ను చట్టాల వల్ల ఇతర దేశాల నుంచి తరలివచ్చినది. అలాగని అన్ని చిన్న సంపన్న దేశాలదీ ఇదే కథ అనుకోరాదు. ఐరోపాలో 60 లక్షల లోపు జనాభా కలిగిన నార్వే, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌లు సొంత వనరులతోనే అభివృద్ధి చెంది, సంక్షేమ రాజ్యానికి విశిష్ట ప్రతీకలుగా మన్ననలు అందుకొంటున్నాయి. ఐఎంఎఫ్‌ 2020 అంచనాల ప్రకారం ఈ పది అగ్ర దేశాల తలసరి ఆదాయాలు 51,000 డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు ఉంటే భారత తలసరి ఆదాయం 1,877 డాలర్లు మాత్రమే. నగరాలవారీ  తలసరి ఆదాయంపై సాధికార లెక్కలు లేవు కానీ, మెకిన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా ప్రకారం 2015లో హైదరాబాద్‌ తలసరి ఆదాయం 3,628 డాలర్లు. ఐఎంఎఫ్‌ గణాంకాల ప్రకారం ఆ ఏడాది భారతదేశ తలసరి ఆదాయం కేవలం 1,629 డాలర్లు. ఈ విషయంలో జాతీయ సగటుకన్నా మహా నగరాల సగటు అధికంగా ఉండటం సహజం. దీన్ని మరింత పెంచుకోవడం ముమ్మాటికీ సాధ్యం. అందుకు అనుసరించాల్సిన మార్గాలను అధ్యయనం చేయాలి. చిన్న, అతి సంపన్న దేశాల పన్నులు, పెట్టుబడి విధానాలను మక్కీకి మక్కీగా అనుసరించడం హైదరాబాద్‌కు సాధ్యంకాదు కానీ- భాగ్యనగరానికి పనికొచ్చే ఇతర అంశాలు, విధానాలు చాలానే ఉన్నాయి.
 

స్విట్జర్లాండ్‌
జనాభా: 86 లక్షలు
తలసరి ఆదాయం: 82,000 డాలర్లు (ఐఎంఎఫ్‌ అంచనా)
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు సంబంధించి స్విట్జర్లాండ్‌, భారత్‌ దాదాపు ఒకే తరహా విధానాలను అవలంబిస్తున్నాయి. రెండు దేశాల్లోని రాష్ట్రాలు ఎంతో చొరవగా అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానిస్తాయి. భారతదేశానికి ఫార్మా రాజధాని అయిన హైదరాబాద్‌లోని జినోమ్‌ వ్యాలీ అనేక బయోటెక్‌ కంపెనీలను ఆకర్షిస్తోంది. భాగ్యనగరంలో వ్యవసాయ బయోటెక్‌, వ్యాక్సిన్‌ ఉత్పత్తి, బయోఫార్మా, క్లినికల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు నెలకొని ఉండగా- స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో 700కు పైగా లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు, 1,000 పరిశోధక సంస్థలు వర్ధిల్లుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ తదితర భారతీయ ఫార్మా కంపెనీలూ ఇక్కడ ఉత్పత్తి సాగిస్తున్నాయి. నోవార్టిస్‌, రోష్‌ వంటి స్విస్‌ ఫార్మా కంపెనీలకు ఇప్పటికే హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. దీన్ని మరింత బలపరచుకోవడం హైదరాబాద్‌ ప్రగతికి ఊతమిస్తుంది.

సింగపూర్‌

జనాభా: 58.5 లక్షలు
తలసరి ఆదాయం: 58 వేల డాలర్లు (ఐఎంఎఫ్‌ అంచనా)
ఇక్కడ మూల ధన లాభాలపైన, డివిడెండ్ల పైన పన్నులు ఉండవు కాబట్టి దేశదేశాల సంపన్నులు ఇక్కడికొచ్చి స్థిరనివాసం ఏర్పరచుకుంటారు. జనాభాలో 97శాతం అక్షరాస్యులు. అంతర్జాతీయ వ్యాపారం, పారిశ్రామికోత్పత్తి, ఫైనాన్స్‌ రంగాలు సింగపూర్‌ ప్రగతికి పట్టుగొమ్మలు. ఈ దేశం తన పౌరులకు గృహ వసతి కల్పిస్తున్న తీరు నుంచి హైదరాబాద్‌తో పాటు దేశమంతా నేర్చుకోవలసింది ఎంతో ఉంది. మురుగు నీటి శుద్ధి, తాగు నీటి సరఫరాలో కూడా సింగపూర్‌ తనకుతానే సాటి.

లగ్జెంబర్గ్‌
జనాభా: 6.26 లక్షలు
తలసరి ఆదాయం: 1,09,000 డాలర్లు (ఐఎంఎఫ్‌ అంచనా)
బ్యాంకింగ్‌, బీమా, పర్యాటక రంగాలు ఈ దేశానికి కామధేనువులు. కార్పొరేట్లకు, సంపన్నులకు అత్యంత ఆకర్షణీయమైన పన్ను విధానాలు ఈ దేశానికి కల్పతరువుగా పరిణమించాయి. లగ్జెంబర్గ్‌ ప్రధాని జేవియర్‌ బెటెల్‌ ఇటీవల భారత పర్యటనకు వచ్చినప్పుడు రెండు దేశాల మధ్య ఆర్థిక రంగంలో ఒప్పందం కుదిరింది. బ్యాంకింగ్‌, బీమా, ఫైనాన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో లగ్జెంబర్గ్‌తో హైదరాబాద్‌ సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలి. నగరంలోని నానక్‌రాంగూడా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఇప్పటికే భర్తీ అయిపోయినందువల్ల రెండో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి. నేటి ఫైనాన్స్‌ రంగాన్ని నడిపిస్తున్నది టెక్నాలజీయే. ఇక్కడి టెక్‌ కంపెనీల భుజాలపై హైదరాబాద్‌ బీఎఫ్‌ఎస్‌ఐ రాజధానిగా ఎదగగలదు.
 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
జనాభా: 99 లక్షలు
తలసరి ఆదాయం: 32,000 డాలర్లు (ఐఎంఎఫ్‌ అంచనా)
యూఏఇలో అతిపెద్ద నగరమైన దుబాయ్‌ జనాభా కేవలం 34 లక్షలు. నగర ఆదాయంలో కేవలం ఒక శాతమే చమురు ద్వారా లభిస్తుండగా, మిగతా ఆదాయమంతా 30 స్వేచ్ఛా వాణిజ్య మండళ్ల నుంచి లభిస్తోంది. అరబ్‌ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే దేశం కనుకనే యూఏఈ ఈ ఏడాది కుజ గ్రహ శోధనకు ఉపగ్రహాన్ని ప్రయోగించింది. హైదరాబాద్‌, ఇతర తెలంగాణ జిల్లాల నుంచి ఉపాధి కోసం దుబాయ్‌కి వలసలు జాస్తి. కొవిడ్‌ తాకిడికి వలస కార్మికులు పెద్దయెత్తున తిరిగివస్తున్నా, హైదరాబాద్‌ ప్రగతి గాథలో దుబాయ్‌ ప్రమేయం తక్కువేమీ కాదు. కొవిడ్‌ సంక్షోభం తరవాత ఆర్థిక సంబంధాలు మళ్ళీ పుంజుకోనున్నాయి. చమురు లేదా ఇతర ఖనిజ నిక్షేపాల ఎగుమతులపై ఆధారపడకుండా పెట్టుబడులకు అనుకూల విధానాలను అనుసరిస్తూ స్వశక్తితో, చొరవగా ఈ చిన్న దేశాలు సాధించిన అభివృద్ధి ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. సింగపూర్‌, లగ్జెంబర్గ్‌ వంటి నగర రాజ్యాలు సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొందుతూ, ఆ విజయాలకు దోహదపడిన విధానాలను మన దేశకాల పరిస్థితులకు అనుగుణంగా అమలు చేస్తే హైదరాబాద్‌ విశ్వనగరమవుతుంది.
 

ఐర్లాండ్‌
జనాభా: 50 లక్షలు
తలసరి ఆదాయం: 80,000 డాలర్లు (ఐఎంఎఫ్‌ అంచనా)
కార్పొరేట్‌ పన్ను రేట్లను భారీగా తగ్గించి గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌, ఫైజర్‌ వంటి బహుళజాతి సంస్థలను ఐర్లాండ్‌ ఆకర్షించింది. ఇటువంటి బహుళ జాతి సంస్థలు తీసుకొచ్చిన భారీ పెట్టుబడులతో దేశం ఆర్థికంగా ఎదిగింది. నేడు ఐర్లాండ్‌ వస్తుసేవల ఎగుమతుల్లో 90 శాతం బహుళజాతి కంపెనీల ద్వారానే జరుగుతోంది. ఐర్లాండ్‌ అనుసరిస్తున్న పన్నులు, పెట్టుబడుల విధానాలు బహుళజాతి కంపెనీలను సూదంటురాయిలా ఆకర్షిస్తున్నాయి. అనేకానేక టెక్‌ దిగ్గజాలకు నెలవైన హైదరాబాద్‌ ఈ విషయంలో ఐర్లాండ్‌ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది.
 

- వరప్రసాద్‌
 

Posted Date: 07-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం