• facebook
  • whatsapp
  • telegram

నియామకాల్లో సమన్యాయమేదీ?

ప్రాంతీయ భాషల్లోనూ పోటీ పరీక్షలు!
 

చక్కని తెలివితేటలు, ఎవరికీ తీసిపోని సామర్థ్యాలు ఉన్నప్పటికీ కేవలం భాషాపరమైన అవరోధం ఎంతోమంది యువతీయువకులను ఉన్నతోద్యోగాలకు దూరం చేస్తోంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలు ఆంగ్లం, హిందీల్లోనే ఉంటాయి. వీటిని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలన్న ఆకాంక్ష ఎప్పటినుంచో ఉంది. పాలనపరమైన కోణంలో చూసినా- తొలి ప్రధాని నెహ్రూ చెప్పినట్లు, ‘విద్యాప్రణాళికలు విజయవంతం కావాలంటే ప్రాంతీయ భాషలను బోధన మాధ్యమాలుగా వినియోగించాలి’. సర్కారీ కొలువుల రాత పరీక్షలను స్థానిక భాషల్లోనూ నిర్వహించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాయడంతో ఈ అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. చదువు, ఉపాధి పరస్పర సంబంధమైనవి. ప్రాథమిక విద్యను మాతృభాషలో చదివేవారి సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. తెలుగు మాధ్యమం విద్యార్థులకు సాధారణంగా ఉండే విషయ అవగాహన ఆంగ్ల మాధ్యమం వారికి ఏ మేరకు వస్తున్నదన్నది ప్రశ్నార్థకం. భాషా జ్ఞానం విషయంలోనూ ఇదే పరిస్థితి. ప్రీ నర్సరీ నుంచి పదహారు, పదిహేడేళ్లు ఆంగ్ల   మాధ్యమంలో చదువుకున్న పిల్లల్లో చాలామంది పట్టుమని పది వాక్యాలైనా తప్పుల్లేకుండా ఇంగ్లిష్‌లో సరిగ్గా రాయలేని దుస్థితి నెలకొంది. నాణ్యమైన బోధకులు లేకపోవడం లాంటి కారణాలు   ఎన్నయినా ఉండవచ్చు. సక్సెస్‌ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివి ఇబ్బందులు పడ్డ విద్యార్థుల అనుభవం ఉండనే ఉంది.
 

నష్టపోతున్న గ్రామీణ విద్యార్థులు
మాతృభాషలో చదివితే విద్యార్థుల మేధ వికసిస్తుందని, సృజనాత్మక శక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. కానీ, ఆంగ్ల మాధ్యమ పెనుతుపానుకు ప్రాంతీయ భాషలు రెపరెపలాడుతూనే ఉన్నాయి. మాతృభాషలో ప్రాథమిక విద్యకే ఆదరణ లేనప్పుడు ఉన్నత, వృత్తివిద్యల సంగతి వేరే చెప్పే పనే లేదు. ఈ నిరాశామయ వాతావరణంలో వచ్చే ఏడాది నుంచి సాంకేతిక (ఇంజినీరింగ్‌) విద్యను మాతృభాషలో ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందన్న వార్త- సానుకూల సంకేతాలు అందించగలిగేదే. సాంకేతిక పదజాల అనువాదం, పాఠ్య పుస్తకాల ప్రచురణ, బోధకులకు శిక్షణ... ఇవన్నీ నిజంగా సవాళ్లే. అయినప్పటికీ నిర్దిష్ట ఐఐటీలు, నిట్‌లలో దీనికి నాందీ ప్రస్తావన జరగాలి. అత్యున్నత ప్రమాణాలతోనే ఈ నిర్ణయం అమలవుతుందని ఆశించవచ్చు. మరోపక్క ఇంజినీరింగ్‌ జాతీయ ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్‌ను 2021 నుంచి- తెలుగు, ఉర్దూలతో కలిపి తొమ్మిది ప్రాంతీయ భాషల్లో నిర్వహించబోతున్నారు. మాతృభాషా మాధ్యమంలో ఇంటర్మీడియట్‌ చదివేవారికి ప్రోత్సాహకంగా ఉండే అంశమిది.
 

సాధారణ డిగ్రీలను, వృత్తి విద్యా కోర్సులను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అదనపు లాభం ఉంటుందని, ప్రాంతీయ భాషల్లో చదివినవారు తీవ్రంగా నష్టపోతున్నారని విద్యారంగ నిపుణుల వాదన. ‘అన్ని ప్రాంతాల విద్యార్థులకూ సమాన అవకాశాలు’ అనే లక్ష్యానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, భారతీయ రైల్వే, రక్షణ సేవలు, జాతీయ బ్యాంకులు తదితర పోస్టుల రాత పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ జరపాలన్న వినతి సముచితం, సహేతుకం. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఆర్‌బీఐ, యూపీఎస్‌సీల ద్వారా నిర్వహించే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాల రాతపరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తే ఈ అసమానతకు తావుండదు. దీనివల్ల తమ రాష్ట్ర ఉద్యోగార్థులకు జరిగే ప్రయోజనం దృష్ట్యా హిందీయేతర భాషా ప్రాంతాల ముఖ్యమంత్రులూ దీనిపై తమ గళం విప్పగలిగితే కేంద్రం దీనిపై వేగంగా దృష్టి సారించే అవకాశం ఉంటుంది.  గ్రామీణ ప్రాంత, పేద, బలహీన వర్గాలు, గిరిజన తెగల విద్యార్థుల్లో చాలామంది కేవలం తాము చదవని మాధ్యమం కారణంగా యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీలు నిర్వహించే నియామక పరీక్షలకు దూరమవుతున్నారు. ఎన్‌డీఏ, సీడీఎస్‌సీ వంటి రక్షణ సేవల ఉద్యోగాలకు పోటీపడటం వీరికి కష్టంగా ఉంది. ఆంగ్లాన్ని ఒక సబ్జెక్టుగా ఎలాగోలా చదివి అధిగమించేవారు సైతం ఆ భాషలో ఉండే రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, వర్తమాన అంశాల్లో ప్రశ్నలను వేగంగా అర్థం చేసుకుని సమాధానాలు రాయడంలో వెనకబడుతున్నారు. ఇవే మాతృభాషలో ఉంటే, మిగతావారితో సమంగా పోటీ పడగలుగుతారు.  
 

ప్రభుత్వోద్యోగాల విషయంలో పౌరులందరికీ సమానావకాశాల హక్కు గురించి భారత రాజ్యాంగంలోని 16వ అధికరణ ఉద్ఘోషిస్తోంది. ఆంగ్లం, హిందీల్లో మాత్రమే పోటీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ ప్రవచిత లక్ష్యానికి విరుద్ధం. చాలా కుటుంబాల్లో మగపిల్లలను ఇంగ్లిష్‌ మీడియం కాన్వెంట్లకు, బాలికలను తెలుగు మాధ్యమ పాఠశాలలకు పంపించే ధోరణి కనిపిస్తుంది. సమాజంలో విస్తరించిన ఈ తరహా ధోరణి- బాలికలకు పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని అడ్డంకిగా మారుస్తోంది. వారిని ఉపాధి అవకాశాలకు దూరం చేస్తోంది. ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహిస్తే- ప్రాథమిక విద్యనుంచి డిగ్రీ, పీజీల వరకు మాతృభాషా మాధ్యమం చదివినవారే కాకుండా ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల, ఇంటర్మీయట్‌ల వరకు ఏదో ఒక స్థాయిలో ఈ మాధ్యమం చదివినవారూ లబ్ధి పొందగలుగుతారు. పోటీ పరీక్షల శిక్షణ సందర్భంగా సంక్లిష్ట విషయాలను తెలుగు మాధ్యమంలో వివరించినప్పుడు ఇంగ్లిష్‌ మీడియం వారికి సుబోధకంగా ఉంటోందని బోధన నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివారిలో కొందరైనా మాతృభాషా మాధ్యమంలో పరీక్షలు రాసే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
 

రాజ్యాంగ ఆదర్శాలకు విరుద్ధం
మాతృభాషా మాధ్యమంలో పోటీ పరీక్షలు రాసే వెసులుబాటు వచ్చినా- అధిక సంఖ్యలో విద్యార్థులు ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటేనే దానికి సార్థకత. సంబంధిత పాఠ్య పుస్తకాలు, సమాచార సేకరణ వంటివి ఈ క్రమంలో ప్రధాన సమస్యలుగా మన ముందున్నాయి. తెలుగు మాధ్యమంలో రాతపరీక్షలు రాసేవారి సంఖ్య పెరుగుతుంటే- పుస్తకాల ముద్రణ దానికదే ఇనుమడిస్తుంది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష మెయిన్స్‌లో ప్రశ్నలు ఇంగ్లిష్‌, హిందీల్లో ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని తెలుగులో రాయవచ్చు. కానీ తెలుగులో నాణ్యమైన ‘స్టడీ మెటీరియల్‌’ తగినంత అందుబాటులో లేక అభ్యర్థులు అనివార్యంగా ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ఎంచుకోక తప్పడం లేదు. మాతృభాషకే పరిమితమై ఇంగ్లిష్‌ను దూరం చేసుకుంటే- ప్రపంచీకరణ అందించే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందన్న వాదన ఉంది. అయితే విజ్ఞానశాస్త్రం, ఆంగ్లం వేర్వేరు అన్న విషయాన్ని గుర్తించాలి. ఆంగ్లం రాకుండానే విజ్ఞానశాస్త్రంలో- ప్రత్యేకించి వైద్యరంగంలో నిపుణులుగా పేరు పొందినవారున్నారు. చైనా, ఫ్రాన్స్‌లాంటి దేశాల్లో ప్రాంతీయ భాషల్లోనే సైన్స్‌ అంశాల బోధన జరుగుతోంది. మనదేశంలో అది సాధ్యమై విజయవంతమయ్యేవరకు ఆంగ్ల ప్రాముఖ్యాన్ని విస్మరించలేం. ఇప్పటి పరిస్థితుల్లో మాతృభాషపై అభిమానం ఉన్నప్పటికీ మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఆంగ్ల మాధ్యమం వైపు మొగ్గుతున్నవారు ఎందరో ఉన్నారన్నది నిష్ఠుర సత్యం. ప్రాంతీయ భాషల్లో చదివినా తప్పకుండా ఉపాధి లభిస్తుందనే భరోసాను ప్రభుత్వాలు కల్పించగలిగితే ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తుంది!
 

- సీహెచ్‌.వేణు
 

Posted Date: 07-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం