• facebook
  • whatsapp
  • telegram

హెచ్‌ఐవీ నిర్మూలనే లక్ష్యంగా...

నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినం
 

శాస్త్రీయ విజ్ఞానం గడచిన 30ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించింది. 1980లో ఎయిడ్స్‌ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోయేది. కోట్లకు పడగలెత్తిన వ్యక్తి సైతం హెచ్‌ఐవీ సోకగానే ఒంటరి పోరు చేస్తూ నిరాశా నిస్పృహలతో చరమాంకం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. నేడు వైద్యశాస్త్రం సాధించిన ప్రగతివల్ల హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలినా- నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సాధారణ జీవనం సాగించే అవకాశముంది. త్వరలోనే ఎయిడ్స్‌ మహమ్మారిని పారదోలే రోజూ రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3.30కోట్ల మంది ప్రజలు హెచ్‌ఐవీతో మరణించారు. ప్రజారోగ్యానికి ఇది పెద్ద సవాలు. ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగిసేనాటికి ప్రపంచంలో 3.80కోట్లమంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. గడచిన ఏడాది హెచ్‌ఐవీ సేవల లోపం వల్ల 6.90 లక్షల మంది చనిపోగా, 17 లక్షల మంది కొత్తగా హెచ్‌ఐవీకి గురయ్యారు. ఇందులో 15-49 సంవత్సరాల మధ్య వయసువారు 62శాతం. బాధితుల్లో 59శాతానికి వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చింది. హెచ్‌ఐవీ కారక మరణాలు 51శాతం మేర తగ్గాయి.
 

భారత్‌లో మారుతున్న పరిస్థితి
భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమం 2030నాటికి ఎయిడ్స్‌వల్ల ప్రజారోగ్యానికి ప్రమాదం లేని స్థాయికి చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. 2017లో దేశంలో 88వేల కొత్త హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్లు, 69వేల మరణాలు సంభవించినట్లు గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా సుమారు 20లక్షల మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారు. ప్రస్తుతం 21లక్షలకు పైగా ప్రజలు హెచ్‌ఐవీతో బాధపడుతుండగా, ఇందులో 56శాతమే ‘యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ’ చికిత్స తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 2.7శాతం స్వలింగ సంపర్కులున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌ఐవీ వ్యాప్తి 0.63శాతం; తెలంగాణలో ఇది     0.70శాతం. 1987నుంచి ఏటా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్‌ దినం పాటిస్తున్నాం. దీని ముఖ్యోద్దేశం- జన బాహుళ్యంలో ఎయిడ్స్‌ నివారణ చర్యల గురించి అవగాహన పెంచడం; అశ్రద్ధ చేస్తే కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం చేయడం.  
 

పోషకాహారం, వ్యాయామం, ధ్యానం, క్రమశిక్షణల ద్వారా హెచ్‌ఐవీ బాధితులు సైతం సుమారు 80 సంవత్సరాలపాటు ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రఖ్యాత బ్రిటిష్‌ జర్నల్‌ ‘లాన్‌సెట్‌’ ఇటీవల ప్రకటించింది. మణిపూర్‌లోని జాతీయ ఎయిడ్స్‌ పరిశోధన సంస్థలో హెచ్‌ఐవీ పాజిటివ్‌ రక్తనమూనాల్లో ఎయిడ్స్‌ కారక కొత్త వైరస్‌ను ఇటీవల కనుగొన్నారు. ఇది భారతీయ శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తోంది. ఇండో మియన్మార్‌ సరిహద్దులో కొనసాగుతున్న శృంగార పర్యాటకం కారణంగా దేశంలో కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొత్తగా రానున్న రిల్పివిరిన్‌ ఇంజక్షన్‌ ద్వారా ఎయిడ్స్‌ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చు. ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి దీన్ని తీసుకోవడంవల్ల హెచ్‌ఐవీని నివారించవచ్చు. ఎయిడ్స్‌ నిర్మూలన క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు అంతిమ దశకు చేరుకున్నాయి. 45ఏళ్ల బ్రిటిష్‌ హెచ్‌ఐవీ బాధితుడికి వొరినోస్టాట్‌ అనే మందు ఉపయోగించి రక్తంనుంచి వైరస్‌ను పూర్తిగా తొలగించినట్లు బ్రిటన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. ఈ మధ్యే కనుక్కున్న ‘ఇబాలీజుమాబ్‌’ అనే ఇంజక్షన్‌ను మొండి హెచ్‌ఐవీ రోగులకు ప్రతి రెండు వారాలకు ఒకటి ఇస్తే వారిలో వ్యాధి పూర్తిగా తగ్గిపోయినట్లు రుజువైంది. 2020 జెనీవాలో జరిగిన అంతర్జాతీయ ఎయిడ్స్‌ సదస్సులో- వ్యాధి నిర్మూలన పరిశోధనలు ఓ కొలిక్కి   వచ్చినట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ప్రకటించింది.
 

ఊపందుకుంటున్న పరిశోధనలు
కరోనా వైరస్‌ ఆర్‌ఎస్‌ఏ వర్గానికి చెందినది. హెచ్‌ఐవీ కూడా అదే వర్గానికి సంబంధించినది. హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌ రోగులకు రోగనిరోధక శక్తి క్షీణించి ఉంటుంది. వీరికి కరోనా అతి సులువుగా సోకే అవకాశం ఉంది. కరోనా బారిన పడకుండా ఆరోగ్యవంతులకంటే హెచ్చుగా వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌ ధరించడం, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం, కరచాలనాలు ఆలింగనాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. హెచ్‌ఐవీ సోకినవారు సైతం పెళ్ళి చేసుకుని సంతోషంగా జీవిస్తూ, హెచ్‌ఐవీ రహిత సంతానం కంటున్నారు. గ్లైకాన్‌మేపింగ్‌ అనే అధునాతన పద్ధతిలో హెచ్‌ఐవీకి వ్యాక్సిన్‌ తయారవుతోంది. ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌, కరోనా వైరస్‌లకు కొన్ని రకాల క్యాన్సర్‌ కణాలకు సైతం గ్లైకాన్‌ రక్షణ కవచం (తొడుగు)ఉండటంవల్ల వీటికి వ్యాక్సిన్లు కనుక్కునేందుకు గ్లైకాన్‌మేపింగ్‌ దారులు తెరిచింది. ఇది ఒక అద్భుత ఆవిష్కరణ. లాస్‌ఆలామోస్‌, మెక్సికో శాస్త్రజ్ఞులు గ్లైకాన్‌ తొడుగు ఉనికిని నిర్ధారించడంతో ప్రయోగశాలలో తయారైన ఎన్‌వలప్‌ ప్రొటీన్‌ను ఉపయోగించి హెచ్‌ఐవీని రూపుమాపే అరక్షకాలను (యాంటీబాడీలు) ఉత్పత్తి చేయబోతున్నారు. ఈ తరహా వ్యాక్సిన్‌ హెచ్‌ఐవీని, కరోనాను శక్తిమంతంగా నిరోధిస్తుంది. నేడో, రేపో సురక్షితమైన ఎయిడ్స్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోనికి రానుంది.


 

Posted Date: 07-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం