• facebook
  • whatsapp
  • telegram

ఈ వైకల్యం విధానాలది!

వికలాంగుల దినోత్సవం సందర్భంగా...
 

ఏ వర్గానికైనా దివ్యత్వాన్ని ఆపాదిస్తున్నారంటే వారి హక్కులను హరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. దేశంలో వైకల్యం బారినపడిన రెండు కోట్ల 60 లక్షల మంది ఉద్వేగాలను, బాధలను, సమస్యలను సమదృష్టితో చూసి, అర్థం చేసుకొని, పరిష్కారాలు అన్వేషించే బాధ్యత పట్టని సమాజం వారికి దివ్యత్వాన్ని అంటగట్టి హక్కుల మాటను వాటంగా విస్మరిస్తోంది. వైకల్యం ఉన్నవారి సమస్యలను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం, సమాజాలది వేటి అజెండా, జెండా వాటిదే అన్నట్లుగా ఉంది. ఆవేదన కలిగించే పరిణామాలివి. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన ఓ ‘వెబినార్‌’లో ఇటీవల పాల్గొన్నాను. వికలాంగ మహిళలు, వారి హక్కులపై దీర్ఘకాల అనుభవం ఉన్నప్పటికీ- దక్షిణాసియాకు చెందిన వైకల్య మహిళలను, వారి సమస్యలను విభిన్న కోణాల్లో అర్థం చేసుకునేందుకు ఆ రకంగా ఓ అవకాశం లభించింది. వికలాంగత్వం అనగానే అదొక జీవితకాలపు వ్యవహారం కాబట్టి, ఇక చేయగలిగిందేమీ లేదన్న నిర్వేదం నిండిన సమూహాలు కొన్ని! వైకల్యాన్ని జీవన వైవిధ్యం (డైవర్సిటీ)గా భావించి, వారిని సమాజ అంతర్భాగంగా, తమలో ఒకరిగా, సమానంగా పరిగణించే సమాజాలు మరికొన్ని! ఈ వికలాంగుల దినోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. మునుపెన్నడూ లేని విధంగా కొవిడ్‌ వైరస్‌ ఈ ఏడాది ప్రపంచాన్ని వణికించింది. దాంతో హక్కులకు సంబంధించి వికలాంగులు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు, సవాళ్లను ప్రపంచానికి కొత్త కోణంలో పరిచమయ్యాయి. ‘లాక్‌డౌన్‌’ కారణంగా దేశం అంతా స్తంభించి, ప్రజలు ఇళ్లకు బందీలయ్యారు. ఈ సందర్భంగా బయటికి వెళ్ళేందుకుగానీ, ప్రపంచాన్ని చూసేందుకుగానీ వీలు లేకుండా, ఇళ్లకే పరిమితమైన వికలాంగుల సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.
 

సమాజ అభిప్రాయం మారాలి
సంక్షోభం కారణంగా సమాజంలో స్థిరపడిన జీవన సరళి (న్యూ నార్మల్‌) గురించి, ఇంటినుంచే పని (వర్క్‌ ఫ్రం హోం) గురించి ఇప్పుడు పదేపదే మాట్లాడుకుంటున్నారు. మానవాళి నిఘంటువులో కొత్తగా చోటు చేసుకున్న పదాలివి. విద్యార్హతలు, నైపుణ్యాలు ఉన్నప్పటికీ సౌలభ్యం లేని కారణంగా ఎంతోమంది వికలాంగ యువత ఇళ్లకే పరిమితమై ఉన్నారు. వారి తెలివితేటల్ని నైపుణ్యాలను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని తాజా పరిణామాలు తెలియజెబుతున్నాయి. మహిళలపై హింస, పొరపొచ్చాల కారణంగా కుటుంబాల్లో తలెత్తే హింసాత్మక వాతావరణం వంటి విషయాలు ‘లాక్‌డౌన్‌’ కారణంగా చర్చకు వచ్చాయి. దాదాపు ఇదే తరహా ఉద్రిక్త పరిస్థితుల్లో వికలాంగులు ఎప్పటినుంచో బతుకు నెట్టుకొస్తున్నారు. కొవిడ్‌ కారణంగా ఇళ్లకు బందీలైన వికలాంగుల జీవితంలోని ఒత్తిళ్లు, ఉద్రిక్తతలు చర్చనీయాంశాలయ్యాయి.
 

వైకల్య బాధితుల మానవ హక్కులపై చర్చ జరగాల్సి ఉంది. వికలాంగులపట్ల సమాజ అభిప్రాయం సహేతుకంగా మారాలి. వారి హక్కుల ప్రాధాన్యాన్ని మానవీయ కోణంలోనే కాకుండా ఓ రాజకీయ అంశంగానూ గుర్తించి చర్చించాలి. పేదరికం, వికలాంగత్వం ఒకదానికొకటి పెనవేసుకు ఉంటాయన్నది అనేక అధ్యయనాల సారాంశం. కొవిడ్‌ వల్ల సమస్య తీవ్రత రెట్టింపైంది. ‘లాక్‌డౌన్‌’ కారణంగా ఎందరో ఉపాధి కోల్పోవడంతో ఆర్థిక సంక్షోభం విస్తరించింది. దానివల్ల ఇళ్లలో ఉన్న వికలాంగులకు అవసరమైన పౌష్టికాహారాన్ని, మందులను సైతం కొందరు ఇవ్వలేకపోయారు. అనేక కంపెనీలు ఎలాంటి ప్రత్యేక కారణాలూ లేకుండానే వికలాంగులను ఉద్యోగాలనుంచి తొలగించాయి. ఈ పరిణామంపై మరింత లోతైన అధ్యయనం జరగాల్సి ఉంది. దీనివల్ల అసలే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి జీవితాలు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆరోగ్యం, ఆహారం, భద్రతకు సంబంధించి వికలాంగులకు కనీస హక్కులు లభించని ఈ వాతావరణంలో ‘దివ్యాంగుల హక్కుల చట్టం’ వంటివి ఎన్ని తెచ్చినా నిష్ప్రయోజనమే.
 

భద్రత లేని పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఓ ప్రభుత్వ కార్యాలయంలో ‘మాస్క్‌’ వేసుకుని రమ్మన్నందుకు ఓ వికలాంగ ఉద్యోగిపై అమానుష దాడి జరిగింది. దేశంలోనే కనీస భద్రత లేని పరిస్థితుల్లో బతుకులు నెట్టుకొస్తున్న అతి పెద్ద మైనారిటీ వర్గం... వికలాంగులు! కుటుంబాలు, సమాజాలు విధించిన ఆంక్షల చట్రంలో చిక్కి, అడుగడుగునా దుర్విచక్షణను ఎదుర్కొంటూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న వికలాంగులనుంచి ఈ సమాజం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఎలా ఉంటుందో తెలియని ఒక వైరస్‌ మన వ్యవస్థను, జీవన సరళిని మార్చివేసింది. కరోనా కారణంగా భౌతిక దూరం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎప్పటినుంచో ‘సోషల్‌ డిస్టెన్సింగ్‌’ అనుభవిస్తున్న వికలాంగులు-  సంక్షోభ వాతావరణంలో ఎలా బతకాలో ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్నారు. జాతి నిజమైన అభివృద్ధి- అక్కడి దుర్బలురు, నిస్సహాయుల హక్కులను పరిరక్షించడంపై; వారిని ప్రగతి పథంలో భాగస్వాములను చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ దిశగా చైతన్యం మొగ్గతొడగనినాడు వైకల్యం బారిన పడినవారిని ఉద్దేశించి ఎన్ని దినోత్సవాలు చేసుకున్నా ఫలితం సున్నా!
 

- సాయి పద్మ (సామాజిక కార్యకర్త)
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం