• facebook
  • whatsapp
  • telegram

అమ్మభాషే భవితకు సోపానం

ఊహ తెలియని పసిప్రాయంలోనే శిశువులు అమ్మమాటను గుర్తుపడతారు. నేర్చుకునే, తెలుసుకునే ప్రక్రియలో అది తొలి అడుగు. శారీరక ఆరోగ్యానికి తల్లిపాలు, మానసిక వికాసానికి మాతృభాషల ప్రాశస్త్యం, ప్రాముఖ్యం ఎనలేనివని ఎన్నెన్నో అధ్యయనాలు శ్లాఘిస్తున్నాయి. ఇటీవలి ఒక సదస్సులో ప్రధాని మోదీ చెప్పినట్లు- ఏ భాషలోనైతే పిల్లలు సులభంగా చదువుతూ చురుగ్గా కొత్త విషయాలు నేర్చుకుంటారో అదే బోధన మాధ్యమంగా ఉండాలనడాన్ని విజ్ఞులెవరైనా హర్షిస్తారు. ఆ స్ఫూర్తికి గొడుగు పడుతున్న నూతన విద్యావిధానం అమలులో భాగంగా వైద్య, ఇంజినీరింగ్‌, న్యాయవాద తదితర వృత్తివిద్యా కోర్సుల్ని మాతృభాషలో బోధించడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తుండటం హర్షణీయ పరిణామం. వాస్తవానికి ‘స్వయం’ పోర్టల్‌ ద్వారా కేంద్రప్రభుత్వం ఆంగ్లంలో అందిస్తున్న ఇంజినీరింగ్‌ కోర్సుల్ని తెలుగు, తమిళం, కన్నడ సహా ఎనిమిది భారతీయ భాషల్లో అందుబాటులోకి తేవాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆరేడు నెలలక్రితం సంకల్పించింది. ఆ కసరత్తుతో పోలిస్తే భిన్న వృత్తివిద్యా కోర్సుల్ని 22 భారతీయ భాషల్లో విద్యార్థులకు చేరువ చేయడమన్నది, బృహత్తర యజ్ఞమే. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్దేశాల ప్రకారం మాతృభాషలో వృత్తి విద్యాభ్యాసానికి అనువైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసే బాధ్యత అమిత్‌ ఖరే నేతృత్వంలోని ప్రత్యేక బృందానికి దఖలుపడింది. నెల్లాళ్ల గడువులో ఆ కార్యదళం నివేదిక వెలుగు చూడనుందంటున్నారు. మాతృభాషలో విద్యాబోధన నెరపుతున్న దేశాలే అత్యధిక నోబెల్‌ పురస్కారాలు సముపార్జిస్తున్నాయన్న విశ్లేషణల నేపథ్యంలో- భారత్‌ భావి గతిరీతుల్ని విశేష ప్రభావాన్వితం చేయగల విధాన నిర్ణయాన్ని సక్రమంగా పట్టాలకు ఎక్కించడంలో ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి!
 

మాతృభాషలో అభ్యసిస్తే ఆలోచన, అభివ్యక్తీకరణలకు సమాన ప్రాధాన్యం దక్కుతుందన్న వాస్తవిక స్పృహతో రష్యా, చైనా, జపాన్‌, జర్మనీ, ఇటలీ ప్రభృత దేశాలు స్వీయ విద్యాప్రణాళికలకు నిరంతరం పదును పెట్టుకుంటున్నాయి. ఆంగ్లానికన్నా ఎన్నో రెట్లు జర్మన్‌, స్పానిష్‌ వంటి భాషల్లో విజ్ఞాన ఆవిష్కరణలు, పరిశోధన పత్రాలు అబ్బురపరుస్తున్నాయి. అదే తరహాలో దేశీయంగా మాతృభాషాధ్యయనంపై కేంద్రం కనబరుస్తున్న చొరవ సఫలీకృతం కావాలంటే, సంకుచిత రాజకీయాలను అసంబద్ధ రాగద్వేషాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసిరావాలి. మున్ముందు లోతైన విజ్ఞానాంశాల అన్వేషణకు విశేష దోహదకారి కాగల మాతృభాషా బోధనకు ప్రాముఖ్యమిచ్చి, జీవన నైపుణ్యాల మెరుగుదలకు ఆంగ్లం నేర్పితే ఎవరూ అభ్యంతరపెట్టరు. లోగడ మద్రాస్‌ హైకోర్టు స్పష్టీకరించినట్లు- ఆయా భాషల అభివృద్ధి, ప్రాధాన్యం వాటి వాడుకపైనే ఆధారపడి ఉంటాయి. ఇటు బోధనలో, అటు పాలనలో మాతృభాషా వినియోగానికి ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. అనివార్యమైన, అత్యంత అరుదైన పరిస్థితుల్లో మినహా పాలన వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు స్థానిక భాషలోనే సాగేలా విధివిధానాల్ని ప్రక్షాళించాలి. ఉద్యోగార్థులు దేశంలో ఏ ప్రాంతానికి చెందినవారన్న దానితో నిమిత్తం లేకుండా- స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చినవారికే నియామకాలు ఖరారయ్యేలా చర్యలు చేపడితే, మాతృభాషాధ్యయనం సజీవ స్రవంతిలా కొనసాగుతుంది. దక్షిణ కొరియా, ఫిన్లాండ్‌, సింగపూర్‌ వంటివి అపార ప్రజ్ఞావంతుల్ని బోధన రంగంలోకి ఆహ్వానించి ఆకర్షణీయ వేతనాలందించి నిరంతర శిక్షణ సమకూర్చి రేపటి తరాన్ని సృజన శక్తుల సమూహంగా తీర్చిదిద్దుతున్నాయి. ఇక్కడా పునాది నుంచి పైస్థాయి వరకు అటువంటి నాణ్యమైన బోధన సిబ్బందికి కొరత లేకుండా కాచుకునే వ్యవస్థాగత ఏర్పాట్లే, నూతన విద్యావిధానాన్ని సాకారం చేయడంలో అత్యంత కీలక భూమిక పోషిస్తాయి. మాతృభాషలో బోధనకు పట్టం కట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధ కృషి- జాతికి అశేష రత్నమాణిక్యాల్ని అందించగలుగుతుంది!
 

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం