• facebook
  • whatsapp
  • telegram

జీవ సౌభాగ్యం... భూమికి ఆరోగ్యం

నేడు ప్రపంచ మృత్తికా దినోత్సవం
 

పోషక విలువలు కలిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తికి నేల ఆరోగ్యం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యవంతమైన నేలకు దానిలోని జీవవైవిధ్యమే మూలం. ఏటా డిసెంబరు అయిదోతేదీన ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ‘మట్టిలో జీవవైవిధ్య సంరక్షణతో నేల ఆరోగ్యాన్ని పరిరక్షిద్దాం’ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, ప్రాంతాల్లోని ప్రజలకు ఈ అంశంపై అవగాహన కల్పించాలని రోమ్‌లోని ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ పిలుపిచ్చింది. ఈ సంస్థ ఏటా అన్ని దేశాల్లో నిర్వహించే ప్రపంచ మృత్తికా దిన సంరంభాలకు నేతృత్వం వహిస్తుంది.
 

నేలలో నివసించే వానపాములు, ఏలికపాములు, రోకలిబండలు, పెంకుపురుగులు, కోశస్థ దశలోని కీటకాలు, ఎలుకలతోపాటు బ్యాక్టీరియా, ఫంగస్‌, ఇతర సూక్ష్మజీవులవల్ల నేల జీవవ్యవస్థ వ్యక్తమవుతుంది. ఆయా జీవుల్లో ఉండే విభిన్నజాతులు, ప్రజాతులు, వ్యత్యాసాలను నేల జీవవైవిధ్యంగా పరిగణిస్తారు. ఒక చదరపు మీటరు విస్తీర్ణం కలిగిన నేలలో వెయ్యి రకాలకుపైగా వివిధ జీవులు జీవనం సాగిస్తాయి. ఒక గ్రాము సారవంతమైన మట్టిలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివసిస్తాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. సాగుభూముల్లో ఎలుకలు, రోకలిబండలు, పెంకుపురుగులు, కోశస్థదశలోని కీటకాలు, 20 నుంచి 30 రకాల మైట్స్‌, 50-100 రకాల సాధారణ పురుగులు, పదుల సంఖ్యలో నిమటోడ్లు, వందల రకాల ఫంగస్‌, వేలరకాల బ్యాక్టీరియా, ఆక్టినోమైసీట్స్‌ జీవిస్తాయి. వీటిలో ఎంతో జీవవైవిధ్యం గోచరించడంవల్ల ఈ జీవులు వాతావరణ మార్పుల వంటి వివిధ ఆటుపోట్లను తట్టుకొంటాయి.
 

రైతు నేస్తాలు
నేలలోని వివిధ రకాల జీవులు మట్టిలోకి చేరే పంటల వ్యర్థాలు, జీవ పదార్థాలను సేంద్రియ ఎరువులుగా మార్చి- వాటిలోని పోషకాలను పైర్లకు అందిస్తాయి. మట్టి కణాల్లో ఉన్న లవణాలను కరిగింపజేసి వాటిని పంట మొక్కలకు అందేట్లు చేస్తాయి. నేలకు చేరే పట్టణ వ్యర్థాలు, కాలుష్య కారకాలను స్థిరీకరింపజేసి వాటివల్ల కలిగే హానిని తగ్గిస్తాయి. మానవాళికి ఉపయోగపడే ఔషధాల తయారీకి నేలలోని కొన్నిరకాల సూక్ష్మజీవులు తోడ్పడతాయి. ఉదాహరణకు పెన్సిలిన్‌ వంటి విలువైన మందులను మట్టిలోని ఆక్టినోమైసీట్స్‌ అనే సూక్ష్మజీవులనుంచి తయారుచేస్తారు. రైజోబియం బ్యాక్టీరియా అపరాల మొక్కల వేరుబుడిపెల్లో ఉండి, గాలిలోని నత్రజనిని స్థిరీకరించి పైర్లకు అందిస్తుంది. సూడోమోనాస్‌, బాసిల్లస్‌ వంటి బ్యాక్టీరియాలు మట్టిరేణువుల్లోని భాస్వరాన్ని కరిగించి పంట మొక్కలకు అందిస్తాయి. మైక్రోరైజా అనే శిలీంధ్రం పండ్లతోటలు, కలపచెట్ల పైర్లపై వృద్ధిచెంది, నేలలోకి విస్తరించి భాస్వరంతోపాటు జింకు, రాగి, ఇనుము వంటి సూక్ష్మధాతువులను పైర్లకు అందిస్తుంది. పైర్ల పరాగసంపర్కానికి ఉపయోగపడే పురుగులు కోశస్థదశకు నేలను ఆశ్రయిస్తాయి. మట్టిలోని సూక్ష్మజీవులు మట్టిరేణువులను పట్టిఉంచి నేలకు భౌతిక స్థిరత్వాన్ని ఆపాదిస్తాయి. నేలలోకి- గాలి, నీటి ప్రసరణకు తోడ్పడటంతోపాటు నేల కోతను నియంత్రించడంలో ప్రధానపాత్ర వహిస్తాయి. తద్వారా ఎంతో సారవంతమైన నేల పైపొర సంరక్షణకు నేలలోని సూక్ష్మజీవులు తోడ్పడతాయి. ఇటీవలి కాలం వరకు ఆహార ఉత్పత్తిలో నేల జీవవైవిధ్యం ప్రాముఖ్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. నేల సారాన్ని లెక్కించడంలో భౌతిక, రసాయన లక్షణాలకు ఇచ్చిన ప్రాధాన్యం నేల జీవ లక్షణాలకు ఇవ్వకపోవడం, వివిధ వాతావరణ పరిస్థితులు, సాంఘిక ఆర్థిక సాంస్కృతిక స్థితిగతుల్లోని వ్యత్యాసం వల్ల నేలలోని జీవవ్యవస్థను కచ్చితంగా గణించకపోవడం వంటివి జీవవైవిధ్యం సంరక్షణలో ఎదురయ్యే ముఖ్యమైన అవరోధాలు.
 

సంరక్షణలో సవాళ్లెన్నో
నేలలోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి సేద్యం చేసే నేలను ఒక ఆవరణ వ్యవస్థగా పరిగణించి, పర్యావరణ వ్యవస్థ వలయానికి జోడించాలి. సహజసిద్ధంగా ఏర్పడే నదీ పరీవాహక ప్రాంతాలను, చిత్తడినేలలను మడ అడవులను, ఎడారులను కొండ ప్రాంత లోయలను సంరక్షించి- అక్కడ సహజంగా పెరిగే మొక్కలను పరిరక్షించాలి. అడవుల నరికివేతను అరికట్టాలి. క్షీణించిన, చౌడు, గనుల భూముల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. సుస్థిర వ్యవసాయ పద్ధతులైన సేంద్రియ సాగు, పంటల మార్పిడి, అంతరపంటలు, మిశ్రమ పంటలు, సూక్ష్మసేద్యం ద్వారా నీటి నిర్వహణను ప్రోత్సహించాలి. భూసార పరీక్ష చేసి ఎరువుల వినియోగం, చీడపీడల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు, జీవన ఎరువుల వినియోగం వంటి వ్యవసాయ పద్ధతుల ద్వారా నేల జీవ వైవిధ్యాన్ని సంరక్షించగలం. వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధన మండలి సారథ్యం వహించే ప్రపంచ మృత్తికా దినోత్సవంలో కర్షకులతో పాటు విద్యార్థులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని నేలలోని జీవవైవిధ్య ప్రాముఖ్యంపై అవగాహన పెంపొందించుకోవాలి.
 

- డాక్టర్‌ గురుమూర్తి 
(రచయిత- నేల శాస్త్ర నిపుణులు)

 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం