• facebook
  • whatsapp
  • telegram

నదిలో దొంగలు పడ్డారు!

బెంబేలెత్తిస్తున్న ఇసుక మాఫియా
 

ప్రపంచంలో చైనా తరవాత భారత్‌లోనే ఇసుక వినియోగం ఎక్కువ. దేశంలో ఏటా 70కోట్ల టన్నుల ఇసుకకు గిరాకీ ఉందని కేంద్ర మైనింగ్‌ ముసాయిదా-2018 పేర్కొంది. భారత్‌లో ఏటా 10.10కోట్ల టన్నుల ఇసుక వినియోగంతో ఉత్తర్‌ ప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ 3.2కోట్ల టన్నులు, తెలంగాణ రెండు కోట్ల టన్నుల ఇసుకను వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఏ మాత్రం సరిపోవడం లేదు.
 

అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం, మైనింగ్‌ను ప్రోత్సహించడం దిశగా 2016లో తీసుకొచ్చిన మార్గదర్శకాలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో కేంద్రం 2020లో ‘మైనింగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మానిటరింగ్‌’ మార్గదర్శకాలు రూపొందించింది. ‘ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైనింగ్‌’ అధికారుల బృందం 14 రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా సొంత లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు గుర్తించింది. హరియాణా, గుజరాత్‌, కర్ణాటక, పంజాబ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర వంటి చాలా రాష్ట్రాలు ఇసుకను కేవలం ఆదాయ వనరుగానే పరిగణిస్తున్నాయని తేల్చింది. తెలంగాణ మాత్రం ప్రజలకు అందుబాటు ధరలో ఉంచుతూనే ఆదాయాన్నీ సమకూర్చుకునే విధానాలు అమలు చేస్తోందని పేర్కొంది. ఇంతా చేసి ఈ బృందం సూచించిన మార్గదర్శకాల్లో- ట్రైబ్యునళ్లు, కోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులే ఉన్నాయని పర్యావరణవేత్తలు నిట్టూరుస్తున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలను నిరోధించేందుకు వాస్తవ దృక్పథంతో నిబంధనలు, విధానాలు తీసుకురావాల్సి ఉంది. తెలంగాణలో ఇసుకను సామాన్యుడు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ అవగాహన, ఇతర వనరులు (లారీలు, అంతర్జాల సౌకర్యం, బుకింగ్‌ సామర్థ్యం) లేక మళ్ళీ దళారులనే ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ధర కంటే పదుల రెట్లు వినియోగదారుడిపై భారం పడుతోంది. అక్రమ మైనింగ్‌ను గుర్తించడానికి డ్రోన్లను ఉపయోగించుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నా- ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పైగా ఈ పరిజ్ఞానాన్ని ఇసుక నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయి. ఒక్క కేరళ మాత్రం తన పరిధిలోని నదులను పూర్తిస్థాయి సమాచారం సిద్ధం చేసుకొని పర్యవేక్షిస్తోంది.
 

ఒక హెక్టారు విస్తీర్ణంలో ఏడాదికి 60వేల టన్నుల ఇసుకే తీయాలి. ఇసుకను పరిమితికి మించి తోడితే నది రూపు కోల్పోయి, పరీవాహక ప్రాంతం ఎండిపోతుంది. ఒక మీటరు లోతు, 100 మీటర్ల వెడల్పు, ఒక కిలోమీటరు పొడవైన ఇసుక బెడ్‌లో 15 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. దీన్ని పూర్తిగా తొలగిస్తే గట్టి మట్టి పైకి తేలి ఎన్నో సూక్ష్మజీవులు అంతరించిపోతాయి. ఒడ్డు కోతకు గురవుతుంది. చిన్న వరదొచ్చినా సమీప ప్రాంతాలు ప్రభావానికి గురవుతాయి. సింగపూర్‌లో కృత్రిమ దీవిని సృష్టించేందుకు కాంబోడియా తన వద్ద ఉన్న ఇసుకను తవ్వి తరలించింది. ఫలితంగా కాంబోడియా ఆగ్నేయప్రాంత ప్రజల జీవనాధారం దెబ్బతింది. మత్స్యసంపద కనిపించకుండా పోయింది.
 

పెరుగుతున్న పట్టణీకరణ, జనాభా అవసరాలు తీర్చేలా ఇసుక నిల్వలు లేనందువల్ల ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ప్లాస్టిక్‌, ఎం-శ్యాండ్‌ (మాన్యుఫాక్చర్‌ శ్యాండ్‌) వంటివి ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలి. రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ దిమ్మలు ఉపయోగించుకోవాలి. ఒక కిలోమీటరు పొడవు,  నాలుగు మీటర్ల వెడల్పు గల కాంక్రీటు రోడ్డు వేయాలంటే 100 నుంచి 110 ట్రక్కుల ఇసుక అవసరం అవుతుంది. అదే ప్లాస్టిక్‌ బ్లాక్స్‌ ఉపయోగిస్తే ఇసుక అవసరం తప్పుతుంది. రోడ్డు నాణ్యత పెరుగుతుంది. ఏటా నిర్వహణ సమస్య ఉండదు.  జియోగ్రిడ్‌(సింథటిక్‌ ఫ్రేమ్స్‌)లనూ ఉపయోగించి సాధారణ మట్టిని నిర్మాణాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. యూఎస్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, జర్మనీ దేశాలు జియోగ్రిడ్‌ నిర్మాణాల్ని విరివిగా వినియోగిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాల నుంచి ఇసుకను వేరు చేసి వాడుకోవచ్చని ఐఐటీ బాంబే నిరూపించింది. దీంతో ఘన వ్యర్థాల నిర్వహణ భారం తప్పుతుంది. ఇవేకాకుండా క్వారీ డస్ట్‌, రాగి, బొగ్గు గనుల్లోంచి తీసిన రాళ్ల పొడి, ఫ్లైఆష్‌ను నిర్మాణాల్లో వినియోగించవచ్చని ఐఐటీ బాంబే విద్యార్థులు రుజువు చేశారు.
 

- బండపల్లి స్టాలిన్‌
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం