• facebook
  • whatsapp
  • telegram

జాతికిదే పెద్ద శత్రువు!

దేశ రాజధాని దిల్లీ మహానగరం కేంద్రస్థలిగా డైరెక్టొరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అరవై మూడేళ్లుగా పనిచేస్తోంది. ఆ సంస్థ వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం 2018-19 సంవత్సరంలో దేశం నలుమూలలా రూ.484కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 2019-20లో ఆ పరిమాణం దాదాపు తొమ్మిదింతలై నాలుగున్నర వేల కోట్ల రూపాయలకు పైగా విస్తరించింది. ఏడాది వ్యవధిలోనే ఇంత పెద్దయెత్తున నార్కోటిక్స్‌ ఎలా వలలో చిక్కాయంటే, నిఘా పెరగడం వల్లనే అన్నది తలతిరుగుడు భాష్యం. ఈ సంవత్సరం మరింత భారీగా సరకు దొరికితే అదంతా నిఘా యంత్రాంగం ఘనకార్యంగా మురిసిపోయి శాలువాలు కప్పాలా... పరిస్థితి దారుణంగా అదుపు తప్పుతున్నందుకు జాతి యావత్తూ చింతాక్రాంతం కావాలా? ఆందోళనకర స్థాయిలో మాదకద్రవ్యాలు తనిఖీల్లో బయటపడుతుంటే- తెర వెనక సూత్రధారుల ఆనుపానులు, మూలాలు పసిగట్టి ఆయా ముఠాల కార్యకలాపాల్ని ఛిన్నాభిన్నం చేయాలి. పోనుపోను వశపరచుకుంటున్న నిల్వలు పెరుగుతుండటం... వ్యవస్థ ఘనత కాదు, సంస్థాగతంగా ఘోరవైఫల్యం!
 

ఐక్యరాజ్యసమితికి చెందిన ‘డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌’ కార్యాలయ వార్షిక నివేదిక ఏనాడో తెగేసి చెప్పినట్లు- ఎక్కడైనా మాదకద్రవ్యాలు పట్టుబడితే, అక్కడ వాటి ఉరవడి ఉద్ధృతంగా ఉన్నట్లే. ఆ లెక్కన దేశంలో కొన్నేళ్లుగా అత్యంత తీవ్ర ఆందోళనకర దుస్థితి ‘నిక్షేపంగా’ కొనసాగుతోంది. అరటి గెలలు, కట్టెలు వంటివి తరలించే వాహనాల్లో వందల కిలోల గంజాయి నిఘా బృందాల చేజిక్కుతున్న ఉదంతాలెన్నో! నిరుడు ఆంబులెన్సులో, ఇటుకల ట్రక్కులో డీఆర్‌ఐ సిబ్బందే వెయ్యేసి కిలోల గంజాయిని పట్టుకున్నారు. తాజాగా బెంగళూరులో, హైదరాబాదులో, ముంబయిలో కోట్లరూపాయల హెరాయిన్‌, ఎఫిడ్రిన్‌ దొరికాయి. ఆమధ్య నొయిడాలోని ఓ ఐపీఎస్‌ అధికారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఎఫిడ్రిన్‌, కొకైన్‌ విలువ- వెయ్యికోట్ల రూపాయలు! పదేళ్లకాలంలో రాజస్థాన్‌, పంజాబ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో 50 లక్షల కిలోలకుపైగా మాదకద్రవ్యాలు పట్టుకున్నట్లు జాతీయ నేర నమోదు గణాంక సంస్థ లోగడ లెక్కచెప్పింది. మత్తు భూతం జడలు విరబోసుకుని మహోత్పాతం సృష్టించకుండా నివారించడానికే కదా... డీఆర్‌ఐ, కస్టమ్స్‌ కమిషన్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో సహా లెక్కకు మిక్కిలి సంస్థలు కొలువు తీరింది? 2004తో పోలిస్తే ఇండియాలో హెరాయిన్‌, నల్లమందు వంటి డ్రగ్స్‌ వాడకం అయిదు రెట్లు పెరిగిందన్న ప్రపంచ మాదక ద్రవ్య నివేదికాంశాలు- ఆ పేరుగొప్ప సంస్థల ‘పనితనం’ ఏపాటిదో చాటుతున్నాయి. ఇటువంటప్పుడు డీఆర్‌ఐ లాంటివి మరింత సరకు వెలికితీస్తున్నామని జబ్బలు చరుచుకోవడం కాదు, అక్రమ దందాసురుల పీచమణచే పటుతర సమర వ్యూహాలకు సిద్ధపడాలి!
 

గతంలో కేంద్ర హోంమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో దాదాపు ఏడుకోట్ల 30లక్షలమంది మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారు. అందులో 70శాతం మత్తుకు బానిసలయ్యారు. ఒక్క పంజాబ్‌లోనే మాదకశక్తుల వ్యాపార పరిమాణం వేలకోట్ల రూపాయలకు చేరిందంటున్నారు. బ్రౌన్‌ సుగర్‌, మెఫిడ్రిన్‌, హెరాయిన్ల జోరుతో కొంతకాలం కనుమరుగైన మార్జువానాకు నాలుగైదేళ్లుగా ముంబయిలోని అనేక కళాశాలల్లో అమాంతం గిరాకీ అధికమైందని క్షేత్రస్థాయి కథనాలు చెబుతున్నాయి. దిల్లీలో 90శాతం వీధి బాలలు మత్తు పదార్థాల ఉచ్చులో చిక్కారని, దేశవ్యాప్తంగా 15శాతం పౌరులు లిక్కరు కిక్కులో మునిగి తేలుతుండగా ఇంకో ఏడెనిమిది శాతం వేర్వేరు మార్గాల్లో డ్రగ్స్‌ వాడకానికి అలవాటు పడ్డట్లు సర్కారీ గణాంకాలే స్పష్టీకరిస్తున్నాయి. యూపీ, పంజాబ్‌, దిల్లీ, ఏపీ, తెలంగాణ... ఇంజక్షన్ల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే వ్యసనపరుల సంఖ్యాపరంగా తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోనే కాదు- పాఠశాలల్నీ వదిలి పెట్టకుండా చాక్లెట్లు, సింథటిక్‌ డ్రగ్స్‌తో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంతలంతలు చేసుకుంటూ పోతున్న మాదక ముఠాలు... జాతి మూలగనే జుర్రేస్తున్నాయి. ఒకర్ని చంపితే ఉరిశిక్ష విధించే దేశంలో తరాన్నే నాశనం చేసే నికృష్టులను ఉపేక్షించడమా? వివిధ నిఘా విభాగాల పనితీరును సమన్వయీకరించి మాదక శక్తులపై ఉక్కుపాదం మోపడానికి ‘అమెరికన్‌ డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ’ తరహాలో పటిష్ఠ వ్యవస్థను సత్వరమే నెలకొల్పాలి.
 

నిఘా యంత్రాంగం, శీఘ్ర విచారణ, కఠిన దండనల అమలుకు సంబంధించి లోటుపాట్లను చక్కదిద్దడం ఒకెత్తు. మత్తుకు బానిసలైనవారి చికిత్స పునరావాసాలకు, కొత్తగా మరెవరూ వాటి బారిన పడకుండా కాచుకునే నియంత్రణ చర్యలకు నిబద్ధత చాటడం మరొకెత్తు. విజయవాడ చుట్టుపక్కల టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విచారణలో- ముక్కుపచ్చలారని చిన్న తరగతుల విద్యార్థులకు సరదా పేరిట అలవాటు చేసి మత్తులో ముంచేస్తున్న ముఠాల ఘాతుకాలు వెలుగు చూశాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇంతలంతలయ్యే గిరాకీని సొమ్ము చేసుకోవడానికి గంజాయి, చరస్‌, హాషిష్‌ ఆయిల్‌ తదితరాల నిల్వలు పేరబెట్టిన ముగ్గుర్ని బెంగళూరు పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. అలాంటిదిప్పుడు, గంజాయి ఏమంత ప్రమాదకర మాదకద్రవ్యం కాదని ఐరాస తీర్మానించడమే విడ్డూరమైతే- అందుకు ఇండియా వత్తాసు పలకడం విస్మయపరుస్తున్న తాజా పరిణామం. ఆ తరహా పెడ వాదనను ప్రభుత్వమే భుజానికి ఎత్తుకుంటే, దేశీయంగా కేసుల గతేంకాను?
 

మత్తు ఊబిలోకి నెట్టుకుపోయేవాటిలో సరదా ఒకటి. ఒత్తిడిదీ అటువంటి భల్లూకం పట్టే. ఉన్నట్లుండి లభించిన పేరు ప్రఖ్యాతులను, అకస్మాత్తుగా ఎదురైన గడ్డు సవాళ్లను, వైవాహిక సమస్యలను, కుటుంబ పరంగా బాధ్యతల బరువును సమర్థంగా నిభాయించలేని వారితోపాటు దుఃఖోద్వేగాలకు అమితంగా స్పందించే వారంతా- మత్తులో తాత్కాలిక ఉపశమనం కోరుకుంటున్న ఉదంతాలెన్నో చూస్తున్నాం. ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ప్రస్తావించినట్లు- మాదక ద్రవ్యాల కారణంగా అంధకారం, విధ్వంసం, వినాశం దాపురిస్తున్నాయి. ఈ మహావిపత్తును ఎదుర్కోవడానికి బహుముఖ కార్యాచరణ తప్పనిసరి. పునరావస కేంద్రాల సంఖ్యను, మానసిక వైద్యుల సేవల్ని ఇనుమడింపజేయాలి. మత్తులో బతుకే ఘోరంగా చిత్తవుతుందన్న యథార్థం బాలల మెదళ్లలో నాటుకునేలా పాఠ్యాంశాల్ని ప్రక్షాళించడంతోపాటు- తమ చిన్నారులు ఏనాడూ గాడి తప్పకుండా తల్లిదండ్రులూ కీలక భూమిక పోషించాలి. కోట్లమందిని మైకంలో ముంచెత్తి తల్లిదండ్రుల ఆశల్ని ఆకాంక్షల్ని దేశ భవితవ్యాన్ని కర్కశంగా ఛిద్రంచేసే మాదక ఉగ్రవాదం- చైనా, పాకిస్థాన్లకన్నా జాతికి పెద్ద శత్రువు. ఏమంటారు?
 

- బాలు
 

Posted Date: 18-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం