• facebook
  • whatsapp
  • telegram

నీటి పొదుపుతోనే భవిత

అందరి భాగస్వామ్యంతో సురక్షిత తాగునీరు
 

భూగోళం అధికంగా నీటితో నిండి ఉన్నప్పటికీ అందులో మంచినీటి లభ్యత 2.5 శాతమే. . మంచినీటిని పొదుపుగా వినియోగించుకొనేందుకు జల సంరక్షణ అత్యంత ఆవశ్యకం. సురక్షితమైన తాగునీటిని ప్రోది చేసుకుని, పంపిణీ చేస్తూ, తగినంతగా వాడుకొనేందుకు ప్రణాళిక అవసరం. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ భారత్‌, గ్రామీణ ఆవాస్‌ యోజన, ఉజ్జ్వల యోజన, సౌభాగ్య యోజన లాంటి పథకాలు విజయవంతంగా అమలవుతూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన జీవనం అందించడానికి తోడ్పడుతున్నాయి. మానవాళికి నిరంతర అవసరమైన సురక్షితమైన తాగునీరు అందక, తగిన జీవన ప్రమాణాలు లభించడం లేదని భావించిన ప్రభుత్వం- ప్రజలకు ఇంటి ఆవరణలో గొట్టాల ద్వారా తాగునీటిని అందించాలని, జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎమ్‌)కు శ్రీకారం చుట్టింది. తద్వారా 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి కనెక్షన్‌ అందించి- గ్రామీణ ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని నిశ్చయించి, చర్యలకు ఉపక్రమించింది.
 

దేశంలో తలసరి వార్షిక నీటిలభ్యత వేగంగా తగ్గిపోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అపరిమిత వాడకం, నీటి సంరక్షణపై దృష్టి పెట్టకపోవడం దీనికి ప్రధాన కారణాలు. గ్రామీణ జనాభాకు సురక్షిత తాగునీరు అందించడానికి తొలుత 1972లో కనీస అవసరాల కార్యక్రమంలో భాగంగా- గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమం (ఏఆర్‌డబ్ల్యూఎస్‌పీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు ఆర్థిక మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమం (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) 2017 ద్వారా సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి ఆవరణలో సురక్షితమైన తాగునీటి లభ్యత ఉండేలా చేయడమనే ధ్యేయంతో కార్యాచరణను వేగవంతం చేసింది. అయినా దేశంలో 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఇంకా 15.81 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్‌ ఇచ్చి, తాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ పథకాన్ని 2019 ఆగస్టులో ప్రారంభించింది. రాష్ట్రాల సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. నీటి సరఫరా ఏ మాత్రం సంతృప్తికరంగా లేని గ్రామాలకు, సురక్షిత నీరు అందని గ్రామాలకు, జిల్లాలకు, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు, సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన గ్రామాలకు, అత్యంత వెనకబడిన గిరిజన గ్రామాలకు, మెదడు వాపు ప్రభావిత జిల్లాలకు అధిక ప్రాధాన్యమిస్తారు.
 

జల్‌ జీవన్‌ మిషన్‌ అమలు కోసం 2019-20లో రూ.10,000 కోట్లు కేటాయించి, సుమారు 84.83 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. 2020-21 సంవత్సరానికి రూ.23,500 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాల గృహాలకు నల్లా కనెక్షన్‌ అందించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గడువు నిర్దేశించారు. గోవా ఇప్పటికే 100శాతం కుళాయి కనెక్షన్లు అందించి లక్ష్యాన్ని చేరుకుంది. 2022 నాటికి హరియాణా, జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, మేఘాలయ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, సిక్కిం కాగా, 2023 నాటికి తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. 2024 నాటికి అసోం, ఆంధ్రప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌, పశ్చిమ్‌ బంగలలో కుళాయి కనెక్షన్లు అన్ని గ్రామీణ కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్‌ భగీరథ కార్యక్రమం ద్వారా సురక్షిత తాగునీరు ప్రతి ఇంటికీ అందించాలనే సంకల్పంతో వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 98శాతం సాధించి, 100శాతం తాగునీరు అందించిన రెండో రాష్ట్రంగా అవతరించనుంది.
 

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 31శాతం గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. 15 లక్షల పాఠశాలలు, 14 లక్షల అంగన్‌ వాడీ కేంద్రాలకు మంచినీటి సౌకర్యం అందించాలని కేంద్రం నిర్ణయించింది. పాఠశాలలకు, అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రాలకు 2020 అక్టోబరు రెండో తేదీ నుంచి 100 రోజుల్లోగా పైపుల ద్వారా తాగునీరు అందించాలనేది లక్ష్యం. గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడం గ్రామ పంచాయతీల ప్రధాన బాధ్యత. సుస్థిర, దీర్ఘకాలిక తాగునీటి భద్రతను ప్రజలకు అందించడానికి సంప్రదాయ నీటివనరులైన చెరువులు, కుంటలను పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. వాన నీటిని భూమిలోకి ఇంకించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలి. పరిశోధన, అభివృద్ధి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సంఘాల మహిళలు, కార్పొరేట్‌ యాజమాన్యాలను నిర్వహణలో భాగస్వాములుగా చేయాలి. అప్పుడే సురక్షిత తాగునీరు తగినంత పరిమాణంలో, తగిన నాణ్యతతో లభిస్తుంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదంచేస్తుంది.
 

- ఎ.శ్యామ్‌కుమార్‌

Posted Date: 21-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం