• facebook
  • whatsapp
  • telegram

బరువు తగ్గనున్న బడి సంచి

కేంద్రం ఆదేశాలతో విద్యార్థులకు ఊరట

దశాబ్దాల తరబడి విద్యార్థులను వేధిస్తున్న సమస్య- పుస్తకాల సంచి బరువు. దీన్ని తగ్గించాలంటూ ఎన్నో కమిటీలు బేషరతుగా చెప్పాయి. న్యాయస్థానాలు సైతం పలుమార్లు తీర్పులిచ్చాయి. అయినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. విద్యారంగంలో ప్రైవేటు సంస్థల ఆధిపత్యం పెరగడం, కార్పొరేట్‌ సంస్కృతి విస్తరించిన నేపథ్యంలో- విద్యార్థుల పుస్తకాల సంఖ్య పెరుగుతూ బడి సంచి మోత పెనుభారమవుతోంది. ఇది విద్యార్థులపై శారీరక, మానసిక ఒత్తిడి పెంచుతోంది. ఈ సమస్యలకు చరమగీతం పాడేందుకు కేంద్ర విద్యాశాఖ విప్లవాత్మక నిర్ణయం తీసుకుని ‘స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020’ వెలువరించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలనూ విడుదల చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోని విద్యాసంస్థల్లో ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది.

అభివృద్ధి చెందిన అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లో బడి సంచుల బరువుపై నియంత్రణ ఎప్పటినుంచో అమలవుతోంది. ‘అమెరికన్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ అసోసియేషన్‌, అమెరికన్‌ ఫిజియోథెరపీ అసోసియేషన్‌’ విస్తృతమైన పరిశోధనలు చేసి విద్యార్థి బరువులో పుస్తకాల బరువు పది శాతం మించకూడదని తేల్చిచెప్పాయి. దేశీయంగా ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో పుస్తకాల సంఖ్య అధికం. విద్యార్థి వికాసమే  ధ్యేయంగా బోధన జరిగితే ఇన్ని పుస్తకాల అవసరం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. బోధన పూర్తిగా పుస్తకాలపై ఆధారపడి ఉండటంవల్లే వాటి సంఖ్య పెరుగుతోందంటున్నారు. ఆ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం లేకపోవడంతో విద్యార్థుల సంచిలో లంచ్‌ బాక్స్‌, నీళ్ల సీసా తప్పనిసరి అవుతున్నాయి. ఇది అదనపు భారంగా మారుతోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ)’ విద్యావిధానం అమలవుతోంది. ‘విద్యాహక్కు చట్టం-2009’ ప్రకారం పాఠ్యపుస్తకాల బరువు తగ్గించాలని సీసీఈ సైతం స్పష్టంగా చెబుతోంది. అందుకే సీసీఈ పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ తక్కువగా ఉంటుంది.

ఇప్పటివరకు ప్రతిపాదించిన మూడు జాతీయ విద్యావిధానాలు, 1964లో కొఠారీ కమిషన్‌ బడి సంచుల బరువు తగ్గించాల్సిన అవసరాన్ని తెలియజెప్పాయి. ఆ తరవాత వచ్చిన యశ్‌పాల్‌ కమిటీ సైతం సంచుల బరువు తగ్గించాల్సిందేనని నొక్కి చెప్పింది. మద్రాసు హైకోర్టు తీర్పు; ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ తదితర సంస్థల నిపుణుల సూచనల మేరకు ఎట్టకేలకు కేంద్రం ఈ అంశంపై నిర్మాణాత్మకమైన విధానాన్ని తీసుకొచ్చింది. పుస్తకాల బరువు విద్యార్థుల బరువులో పది శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. నెలలో కనీసం పది రోజులు అసలు పుస్తకాల సంచి లేకుండానే బడికి వచ్చే విధానాన్ని అమలు చేయాలని సూచించింది. ఏ తరగతికి ఎన్ని పుస్తకాలు ఉండాలో, వాటి బరువు ఎంత ఉండాలో కూడా చెప్పింది. ఈ మార్గదర్శకాల ప్రకారం... ప్రిప్రైమరీకి అసలు పుస్తకాలు ఉండకూడదు. ఒకటో తరగతికి మూడు పుస్తకాలు (1.078 కిలోగ్రాముల బరువుతో), రెండో తరగతికి మూడు పుస్తకాలు (1.080 కి.గ్రా.) ఉండాలి. మూడో తరగతికి నాలుగు (1.572 కి.గ్రా.), నాలుగో తరగతికి నాలుగు (1.804 కి.గ్రా.), అయిదో తరగతికి నాలుగు పుస్తకాలు (1.916 కి.గ్రా.) ఉండాలి. ఆరో తరగతికి పది (3.080 కి.గ్రా.), ఏడో తరగతికి పది (3.508 కి.గ్రా.), ఎనిమిదో తరగతికి 11 పుస్తకాలు నిర్దేశించాలి.  తొమ్మిదో తరగతికి 15 (4.400 కి.గ్రా.) పదో తరగతికి 13 పుస్తకాలు (4.182 కి.గ్రా.) మాత్రమే ఉండాలి. ఆయా తరగతుల్లో పిల్లల సగటు బరువు ఆధారంగా పుస్తకాల బరువును శాస్త్రీయంగా నిర్ధారించారు. తరగతుల్లో విద్యార్థుల మానసిక స్థితిని బట్టి పుస్తకాల సంఖ్యను లెక్కగట్టారు.

‘స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020’ని అమలు చేయడానికి పాఠశాలల్లో యాజమాన్యాలు పాటించాల్సిన మార్పులను సైతం కేంద్ర విద్యాశాఖ తేల్చి చెప్పింది. ఒకటి, రెండు తరగతులకు ఒకే నోట్‌ పుస్తకం ఉండాలి. 3, 4, 5 తరగతులకు రెండు నోట్‌ పుస్తకాల చొప్పున ఉండి- ఒకటి సంచిలో, రెండోది పాఠశాలలో భద్రపరుచుకోవాలి. 6, 7, 8 తరగతులకు కాగితాల్లో రాత పని చేసేలా ఫైళ్లు ఏర్పాటు చేయాలి. బడుల్లో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగులకు ‘పుస్తక బ్యాంకులు’ ఏర్పాటు చేయాలి. ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకోవలసిన పరిస్థితి లేకుండా పరిశుభ్రమైన తాగునీటిని స్కూళ్లలో అందుబాటులో ఉంచాలి. ప్రాథమిక స్థాయిలో అన్ని సబ్జెక్టుల హోమ్‌ వర్కులూ ఒకే నోట్‌ బుక్‌లో చేయించాలి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో బాలురకు సంచుల బరువు నుంచి కాస్త వెసులుబాటు కల్పించడానికి ఒకటి, మూడు శనివారాల్లో బడుల్లో ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేయడం హర్షణీయ పరిణామం.

- చిలుకూరి శ్రీనివాసరావు 
(రచయిత- జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత)

 

Posted Date: 23-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం