• facebook
  • whatsapp
  • telegram

కొవిడ్‌ చీకట్లో కాంతిరేఖలు

ఇరవైకిపైగా ప్రాణాంతక వ్యాధుల్ని నిరోధించే వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఏటా 20-30 లక్షల మంది ప్రాణాలకు అవి రక్షరేకులు అవుతున్నాయి. చైనాలో పుట్టి, అచిరకాలంలోనే ప్రపంచాన్ని చుట్టబెట్టి ఆరుకోట్ల 80 లక్షల మందికి సోకి 15.5 లక్షలమంది అభాగ్యుల ప్రాణాలు తోడేసిన కొవిడ్‌ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ కోసం యావత్‌ మానవాళీ అశ్రునయనాలతో ప్రార్థిస్తోంది. కాలంతో పోటీపడుతూ కొద్ది నెలల వ్యవధిలోనే కొవిడ్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్లు సిద్ధం కావడం- ప్రపంచ దేశాలన్నింటికీ తీపి కబురు. ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరెన్నికగన్న ఇండియా, కొవిడ్‌పై పోరులోనూ తన జోరు చూపించి యుద్ధ ప్రాతిపదికన సరికొత్త సంజీవనుల్ని సిద్ధం చేసిన తీరు స్ఫూర్తిమంతమైందనడంలో సందేహం లేదు. అమెరికన్‌ దిగ్గజం ఫైజర్‌ రూపొందించిన వ్యాక్సిన్‌తో యూకే చరిత్రలోనే అత్యంత భారీ వ్యాధి నిరోధక కార్యక్రమాన్ని బ్రిటన్‌ మొదలు పెట్టేసింది. ఇండియాలోనూ అత్యవసర వినియోగ అనుమతులకు ఫైజర్‌ చేసిన విజ్ఞప్తిని వెన్నంటే కొవాగ్జిన్‌, కొవీషీల్డ్‌ తయారీదారులూ తమ వ్యాక్సిన్ల వాడకానికి సర్కారు సమ్మతి కోరారు. నాలుగు రోజుల క్రితం అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చెప్పినట్లు మరికొన్ని వారాల్లోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ దేశీయంగానూ అందుబాటులోకి రానుంది. ఇండియాలో ఇప్పటికే 97 లక్షలమందికి సోకి, లక్షా 41వేల మంది అభాగ్యుల మరణాలకు కారణమైన కొవిడ్‌ సృష్టించిన సామాజిక ఆర్థిక విధ్వంసం అంతాఇంతా కాదు. తగ్గినట్లే తగ్గి మళ్ళీ కోరసాచిన కొవిడ్‌ దిల్లీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్ని వణికిస్తున్న నేపథ్యంలో తక్షణ ప్రాణావసర ఔషధంగా అక్కరకొచ్చే వ్యాక్సిన్లు జాతి నైతిక ధృతిని ఇనుమడింపజేస్తాయన్నది నిర్వివాదం. ఏటా మూడు కోట్ల టీకాలు వేసే విస్తృతానుభవం ఇండియాకు ఉన్నా- కొవిడ్‌పై పోరులో ముందు వరస యోధులతో మొదలు పెట్టి వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని సార్వత్రికం చేయాలంటే, కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయంనుంచి అన్ని స్థాయుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అత్యవసరం!

తొలివిడతలో దేశవ్యాప్తంగా 30 కోట్లమందికి వ్యాక్సిన్‌ అందించాలని కేంద్రం నిర్ణయించినట్లు వార్తాకథనాలు చాటుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కోటిమంది కాగా, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, పాత్రికేయులు, రవాణా ఉద్యోగుల వంటివారు మరో రెండుకోట్లమంది ఉంటారని అంచనా. 50 ఏళ్ల పైబడినవారు 26 కోట్లమంది,  50 ఏళ్లలోపు ఉన్నా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు మరో కోటి మందికీ తొలివిడత వ్యాక్సిన్‌ అందించడం- జాతీయ స్థాయిలో ఓ మహాయజ్ఞాన్ని తలపించనుంది. ప్రపంచంలోనే అత్యధికంగా 160 కోట్ల డోసుల వ్యాక్సిన్ల కొనుగోలుకు సిద్ధమైన ఇండియా ‘కొవిన్‌ ఐటీ’ వ్యవస్థ ద్వారా ఆ కార్యక్రమం సాఫీగా సాగేలా పర్యవేక్షించనుంది. 2.39 లక్షల మందితో వ్యాక్సిన్‌ వేసే యంత్రాంగాన్ని సంసిద్ధం చేసి, ఎక్కడ దుష్ప్రభావాలు పొడగట్టినా వెంటనే పైకి నివేదించే ఏర్పాట్లూ చేస్తోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తొలి ఏడాదిలోనే వేయించుకోవడానికి 80శాతం భారతీయులు సిద్ధంగా ఉన్నారని అధ్యయనాలు చాటుతున్నందున సర్కారీ కార్యాచరణ విస్తృతం కావాల్సి ఉంది. అరవయ్యో దశకంలో గవద బిళ్లల నివారణకు ఉద్దేశించిన వ్యాక్సిన్‌ నాలుగేళ్ల విస్తృత పరిశోధనల తరవాతే అనుమతులు పొందింది. కొవిడ్‌ కొమ్ములు విరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నా- వ్యాక్సిన్‌ తీసుకొన్నవారిలో యాంటీబాడీలు ఎంతకాలం రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తాయన్నది దీర్ఘకాలం తరవాతగాని నిగ్గుతేలదు. ఒకే వ్యాక్సిన్‌ను రెండుసార్లు ఇచ్చేకన్నా రెండు వేర్వేరు వ్యాక్సిన్లను కలిపి ఒకటిగా ఇస్తే మెరుగైన రక్షణ లభిస్తుందా అన్నదానిపై బ్రిటిష్‌ ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్‌ పరిశోధన మొదలు పెట్టబోతోంది. వ్యాక్సిన్ల ప్రభావశీలత నూరుశాతం రుజువయ్యేదాకా ఎవరూ ఉదాసీనంగా ఉండే వీల్లేదు. ఏమాత్రం అజాగ్రత్త అయినా అనర్థ హేతువన్న స్పృహ ప్రభుత్వాలకు, పౌరులకు ఉన్నప్పుడే కొవిడ్‌ను పారదోలగలమని గుర్తించాలిప్పుడు!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 23-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం