• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ రంగంలో స్వదేశీకే మొగ్గు

రూపే కార్డుకు కేంద్రం ప్రోత్సాహం

రూపే కార్డులను ప్రోత్సహించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకులను కోరుతున్నారు. డిజిటల్‌ రంగంలోనూ స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి పరచాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఆమె చేసిన వినతి అద్దం పడుతోంది. రూపే కార్డు క్రమక్రమంగా అంతర్జాతీయతను సంతరించుకుంటోంది. ఇప్పటికే అది అమెరికా, బ్రిటన్‌, యూఏఈ సహా 12 దేశాలకు విస్తరించింది. దేశీయ బ్యాంకులు రూపే కార్డుకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చితీరాలన్న ఆర్థికమంత్రి పిలుపు ఎంతైనా సహేతుకం. కార్డుల రంగంలో విదేశీ కార్డు సంస్థల గుత్తాధిపత్యానికి తెర దించేందుకు ఇది దోహదపడుతుంది. బ్యాంకులు ఇతర కార్డులు జారీ చేయకూడదని ఆర్థికమంత్రి ఎక్కడా పేర్కొనలేదు కనుక, తమకు దేశీయ బ్యాంకులతో పోటీ పడేందుకు సమాన అవకాశం తిరస్కరించిందంటూ విదేశీ కార్డుల సంస్థలు ప్రభుత్వాన్ని నిందించలేవు; కాంపిటీషన్‌ కమిషన్‌ వద్ద ఫిర్యాదు చేయడమూ కుదరదు. రూపే కార్డు ప్రాచుర్యానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆత్మనిర్భర్‌ భారత్‌ విధానంలో భాగంగా చూడాల్సి ఉంటుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ ఉద్యమం అంటే విదేశీ సంస్థల ప్రవేశాన్ని అడ్డుకోవడం కాదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా వివరణ ఇచ్చింది (చైనా ఇందుకు మినహాయింపు). స్వదేశీ సంస్థలను దేశీయ విపణిలో విదేశీ సంస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దడమే ఈ విధాన ధ్యేయం.

అవకాశాలు అపారం...
రూపే కార్డును ప్రోత్సహించడం వల్ల ఇప్పటికిప్పుడు విదేశీ కార్డు సంస్థల ఉనికికి ముప్పేమీ లేదు. భారత కార్డుల విపణి అతి విశాలమైంది. అందరికీ అవకాశాలు ఉంటాయి. రూ.207 లక్షల కోట్లకు పైబడిన దేశీయ ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత వినియోగ వ్యయం వాటా రమారమి 60 శాతం ఉన్నా, ఇందులో డిజిటల్‌ చెల్లింపుల విలువ 18 శాతం కంటే తక్కువే. వీటి విస్తరణకు ఉన్న అవకాశాలు అపారం. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ కార్డుల వినియోగం భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం రూపే లావాదేవీలను ప్రోత్సహిస్తున్నా- భారత విపణి మీద వీసా, మాస్టర్‌కార్డు ఆసక్తిని తగ్గించుకోవడం లేదు. ఇక్కడి విపణిలో స్థిరపడేందుకు అవి భారీ పెట్టుబడి ప్రణాళికలు రచిస్తున్నాయి. తద్వారా వినూత్న ఆవిష్కరణలను భారతీయులకు అందించనున్నాయి.

భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఐ) ప్రవేశపెట్టిన ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్‌ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌- యూపీఐ) నుంచి వీసా, మాస్టర్‌కార్డుకు సవాలు ఎదురుకానుంది. ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నేరుగా చెల్లింపులు చేయడానికి యూపీఐ ఉపకరిస్తుంది. దీంతో భౌతిక లేదా సాఫ్ట్‌ క్రెడిట్‌ కార్డుల అవసరమే ఉండదు. పేటీఎం, ఫోన్‌పే, మోబిక్విక్‌ ఇత్యాది ఇ-వ్యాలెట్ల ద్వారా జరిపే చెల్లింపులే కాకుండా ఇతరత్రా లావాదేవీలకూ యూపీఐ అత్యంత ఆదరణ పొందుతోంది. 2019లో కార్డుల విపణి 10 శాతం క్షీణించగా, యూపీఐ లావాదేవీలు తొమ్మిది రెట్లు వృద్ధి చెందడం గమనార్హం.2020 జనవరిలో యూపీఐ ఆధారిత లావాదేవీలు భారీగా పెరిగాయి. యూపీఐ బహుళ ప్రాచుర్యం పొందడం, రూపే ద్వారా లావాదేవీల సౌలభ్యం ఉండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ ప్లాస్టిక్‌ కార్డుల కంపెనీలకు ప్రభుత్వం పంపిన నర్మగర్భ సందేశం- ‘మీరు భారత డిజిటల్‌ చెల్లింపుల విపణిలో మనుగడ సాగించాలంటే భారత్‌లో ఆర్థిక లావాదేవీలన్నింటికీ యూపీఐ వేదికను వాడుకోండి’ అన్నదే. భారత ఖాతాదారుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డేటా స్థానికీకరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ వీసా, మాస్టర్‌కార్డు ప్రతినిధులను ‘వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు-2019’ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ప్రశ్నించినప్పుడు ఈ సంకేతం సుస్పష్టంగా వెలువడింది. బిల్లులోని డేటా స్థానికీకరణ (భారత వినియోగదారుల వ్యక్తిగత సమాచారం నకలును భారత్‌లో భద్రపరచడం) నిబంధనను గూగుల్‌, అమెజాన్‌, పేపాల్‌ వంటి సంస్థలు సహా వీసా, మాస్టర్‌కార్డు ప్రతినిధులు జేపీసీ విచారణలో తీవ్రంగా వ్యతిరేకించారు. విదేశాల్లోనే డేటా నిల్వ చేస్తామని, లేకపోతే తమ వ్యయాలు భారీగా పెరిగి భారత్‌లో వ్యాపార సామర్థ్యం దెబ్బ తింటుందని వాదించారు. ఈ అభ్యంతరాలపై జేపీసీ అధ్యక్షులు, భాజపా ఎంపీ మీనాక్షీలేఖీ స్పందిస్తూ- స్వీడన్‌ కంపెనీ ‘ట్రూ కాలర్‌’ డేటా స్థానికీకరణ నిబంధనను ఇప్పటికే అమలు చేెస్తోందని, ట్రూ కాలర్‌ చేయగలిగినప్పుడు వారెందుకు చేయలేరని వ్యాఖ్యానించారు.

విదేశీ సంస్థలకు ముకుతాడు
వీసా, మాస్టర్‌కార్డు కంపెనీలు భారతీయ లావాదేవీల కోసం మనదేశంలోనే కంప్యూటర్‌ సర్వర్‌ నెలకొల్పాలి; లేదా భారతీయ ఖాతాదారుల ఆర్థిక లావాదేవీల కోసం యూపీఐ వేదికను వాడుకుని తీరాల్సి ఉంటుంది. భారతీయులకు ఉద్దేశించిన సర్వర్లను అమెరికా నుంచి భారత్‌కు తరలిస్తే, విదేశీ కార్డు కంపెనీలు భారత జాతీయ చెల్లింపుల సంస్థ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా -ఎన్‌పీసీఐ) నియంత్రణలోకి వస్తాయి. సువిశాల భారత విపణిలో లాభాలు గడించాలంటే ఎన్‌పీసీఐ అధీనంలోని ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌)ను వీసా, మాస్టర్‌కార్డు సంస్థలు వాడుకుని తీరాల్సిందే. వాటికి వేరే దారి లేదు. వేల కోట్ల రూపాయల నిధులను ఎల్లలు దాటిస్తున్న అక్రమార్కుల ఆటకట్టించడానికి, వారికి సహకరిస్తున్న విదేశీ సంస్థలకు ముకుతాడు వేయడానికి ఇంతకు మించిన మార్గం మరొకటి ఉండదు.

- రాజీవ్‌ రాజన్‌
 

Posted Date: 23-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం