• facebook
  • whatsapp
  • telegram

సామాజిక మాధ్యమ ఉచ్చులో బాల్యం

పర్యవేక్షణ బాధ్యత పెద్దలదే!

ఆధునిక యుగంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యక్తి ఆనందం, బాధ తదితర భావోద్వేగాలను పంచుకోవడానికి, ప్రపంచంలో జరిగే సమస్త విషయాలను క్షణాల్లో తెలుసుకోవడానికి, స్నేహితులను కలవడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. ఇటీవల అనేక ఉద్యమాల వ్యాప్తికి, రాజకీయ ప్రచారాలకు సైతం ఈ మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రజలకు ఆపన్నహస్తం అందివ్వడంలో వీటి పాత్ర ఎనలేనిది. ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాల అర్జీలను స్వీకరించడానికి, సమాజంలో జరుగుతున్న నేరాలపై ఫిర్యాదు చేయడానికి సైతం సామాజిక మాధ్యమాలు ఉపయోగపడుతున్నాయి. మరోవైపు వీటి వినియోగం హద్దుమీరడంతో అనేక అనర్థాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పిల్లలు, యువత కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లవలలో ఇరుక్కుని యాంత్రికమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం విద్యాసంస్థల్లో చదివే పిల్లలు పాఠ్యాంశాలతో పాటు మానసిక వికాసం అందించే పాఠ్యేతర పుస్తకాల పట్ల సైతం ఆసక్తి చూపేవారు. ఎప్పుడైతే మనిషి అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్‌ వచ్చిందో, అప్పుడు పుస్తకాలు చదివే అలవాటు కనుమరుగై- సామాజిక మాధ్యమాలతో కాలం వెళ్లబుచ్చే సంస్కృతి నెలకొంది. నేడు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమాలు మనిషిని శాసిస్తున్నాయి.

ఇటీవల కరోనా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాల  వాడకం పెరగడంతో వీటి వినియోగమూ ఎక్కువైంది. ఆన్‌లైన్‌ తరగతులకు చరవాణి తప్పనిసరి కావడంతో పిల్లలు పాఠాలను వినడంతో పాటు ఇతర వ్యాపకాలకూ ప్రేరేపితమవుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిస కావడం, అశ్లీల వెబ్‌సైట్లు చూడటంవంటివీ పెరుగుతున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సామాజిక మాధ్యమాల వినియోగం గణనీయంగా విస్తరించడంతో మేలుతో పాటు కీడు కూడా హెచ్చిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో క్రియాశీలత లోపిస్తూ, చదువులో వెనకబడి ఒత్తిడికి గురవుతున్నారు. విశాల దృక్పథం బదులు సంకుచిత మనస్తత్వం అలవడుతోంది. ఇటీవల పలు రాజకీయ పార్టీలు, మత సంస్థలు సైతం తమ ఉనికిని చాటుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో యువతను ప్రభావితం చేస్తున్నాయి. పలువురు ఆవేశం ఆక్రోశాలతో, పరుష పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ సమస్యల వలలో చిక్కుకుంటున్నారు. అలాంటివారు సమాచార సాంకేతిక చట్టం-2000 సెక్షన్‌ 66 ప్రకారం చట్టపరమైన శిక్షలను ఎదుర్కోవలసి వస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న ఈ మాధ్యమాల వినియోగం, సామాజిక విభజనకు దారితీస్తూ దేశ అంతర్గత భద్రతకు సవాలు విసురుతోంది. మరోవైపు ఇది పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే మానసిక నిపుణుల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక సమయం స్మార్ట్‌ఫోన్లలోనే గడపడంపై తల్లిదండ్రులు మందలిస్తే కొందరు పిల్లలు అనూహ్యంగా స్పందిస్తున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం, కుటుంబ సభ్యులమీదే హింసకు పాల్పడటంవంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.

సామాజిక మాధ్యమాల బారిన పడుతున్న వారిలో యువత, పిల్లలే అధికంగా ఉంటున్నారనేది వాస్తవం. వీటి దండయాత్ర ఇలాగే కొనసాగితే కుటుంబ బంధాలు, బంధుత్వాలు విచ్ఛిన్నమై, యువతరం నిర్వీర్యమయ్యే ప్రమాదమూ ఉంది. కాబట్టి సామాజిక మాధ్యమాల నియంత్రణకు ప్రభుత్వాలు  అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నేటి పోటీ ప్రపంచంలో వాటి అవసరం ఉన్నప్పటికీ, వినియోగం పట్ల జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే వీడియోలను సెన్సార్‌ చేసేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. బాల్యం నుంచే మంచి నడవడిక నేర్పడం ప్రధానంగా తల్లిదండ్రుల బాధ్యత. సామాజిక మాధ్యమాల్లో మంచి, చెడు రెండూ ఉన్నాయి. మంచికి చేరువ కావడం, చెడుకు దూరంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. ఈ మాధ్యమాల వాడకం పట్ల ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించాలి. యువత ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని సన్మార్గంలో నడవడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలి. ఇందుకోసం పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించాలి. భావోద్వేగ సమతౌల్యాన్ని పాటిస్తూ, మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి యువతను ప్రేరేపించాలి. సామాజిక చైతన్య కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేయాలి. ఇది పాఠశాల, కళాశాల స్థాయిలోనే జరగాలి. ప్రతి కళాశాలలో జాతీయ సేవా పథకంవంటి కార్యక్రమాలను అమలు చేయాలి.

- జి.శ్యామల
 

Posted Date: 23-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం