• facebook
  • whatsapp
  • telegram

భూమి హక్కు సైతం మానవ హక్కే!

సంరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే

భూమి ఆస్తి మాత్రమే కాదు. అది ఒక గుర్తింపు... సామాజిక, ఆర్థిక భద్రత. మనిషి జీవితం, జీవన విధానమే భూమి చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. ఇంతటి ముఖ్యమైన సహజ వనరుపై హక్కుల గుర్తింపు, భద్రత ఎప్పుడూ కీలకమైనవి, సున్నితమైనవి. ఒకప్పుడు ఆస్తిహక్కు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఉండేది. పేదలకు భూమి దక్కేలా చేసే భూ సంస్కరణలకు, ప్రజాప్రయోజనాల కోసం చేసే భూసేకరణకు అడ్డుగా ఉందని- దాన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగ హక్కుగా మార్చారు. ప్రాథమిక హక్కుల నుంచి తొలగించినా భూమిహక్కు- మానవ హక్కుగా కొనసాగుతుందని ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదే మాటను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సైతం ఒక తీర్పు ఇచ్చింది. ప్రతి వ్యక్తికీ ఆస్తి కలిగి ఉండే హక్కు ఉంది. ఆ హక్కును ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా తీసుకోవడానికి వీలులేదని ప్రపంచ దేశాలన్నీ కలిసి చేసుకున్న సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన పేర్కొంటోంది. మానవ హక్కుల రక్షణ కోసం చేసిన ఈ ప్రకటనను ఐక్యరాజ్యసమితి ఆమోదించిన దరిమిలా ఏటా డిసెంబర్‌ పదో తేదీని మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహించుకొంటున్నాం.

చట్టప్రకారం సేకరించాలి
ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతి నెలకొనాలంటే మనిషి బతకడానికి కావలసిన కనీస హక్కులను గుర్తించి, రక్షించాలనే ఆశయంతో ప్రపంచ దేశాలన్నీ కలిసి 1948 డిసెంబర్‌ పదో తేదీన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించాయి. మనుషుల మధ్య జాతి, కుల, లింగ, భాష, మత, ప్రాంత, రంగు, ఆస్తి, స్థాయి, అభిప్రాయ భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ఈ ప్రకటన చేశారు. జీవించే హక్కు, హింస, బానిసత్వానికి గురికాకుండా ఉండే హక్కు, సమానత్వ హక్కు, న్యాయం పొందే హక్కులాంటి దాదాపు 30 హక్కులు ప్రతి వ్యక్తికీ ఉన్నాయని ఈ ప్రకటన గుర్తిస్తూ- వాటిని రక్షించే బాధ్యతను సభ్య దేశాలపై ఉంచింది. భారత్‌ కూడా సంతకం చేసిన ఈ ప్రకటనలోని అధికరణ 17 ప్రకారం- ప్రతి వ్యక్తికీ భూమిహక్కు ఉంది. కాబట్టి, ‘భూమి హక్కు రాజ్యాంగం, చట్టం కల్పించిన హక్కు మాత్రమే కాదు, ఇది మానవ హక్కు కూడా’ అని భారత సర్వోన్నత న్యాయస్థానం 2012లో ‘తుకారాం కానా జోషీ వర్సెస్‌ ఎంఐడీసీ’ కేసులో పేర్కొంది. రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో భాగం కాకపోయినా ఆరోగ్యం, ఆహార భద్రత, ఇల్లు, ఉద్యోగం వంటి మానవహక్కుల్లో అది అంతర్భాగమని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పలురూపాలు తీసుకుంటున్న మానవహక్కుల్లో భూమిహక్కు అంతర్భాగమని ప్రకటించింది. ఇదే మాటతో ఏకీభవిస్తూ, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా భూమి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించినా అది మానవహక్కుగా కొనసాగుతుందని, రాజ్యాంగంలోని అధికరణ 300ఎ ప్రకారం అది రాజ్యాంగ హక్కు కూడా అని ఈ సంవత్సరం జనవరిలో ‘విద్యాదేవి వర్సెస్‌ హిమాచల్‌ప్రదేశ్‌’ కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఇదేమాట ఏపీ హైకోర్టు ఈ ఏడాది జులైలో ‘వై.బి.వెంకమ్మ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌’ కేసులో చెప్పింది.

చట్టబద్ధంగా తప్ప ఎవరి ఆస్తిహక్కులకూ భంగం కలిగించకూడదని రాజ్యాంగంలోని అధికరణ 300ఎ పేర్కొంటోంది. ప్రభుత్వం ప్రజాప్రయోజనాల కోసం భూమి తీసుకోవాలనుకున్నా చట్టప్రకారం సేకరించాల్సిందే. ప్రభుత్వం భూమిలేని పేదలకు ఇచ్చిన భూములను తీసుకోవాలన్నా చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించి తీసుకోవాలి. లేదంటే భూ హక్కుకు భంగం కలిగినట్లే. అలా జరగకుండా చూసుకునే బాధ్యతతోపాటు, భూమిలేని వారికి భూమి దక్కేలా, భూమి ఉన్నవారికి ఆ భూమిపై హక్కులకు భద్రత ఉండేలా చూసే బాధ్యత కూడా ప్రభుత్వాలదే. చట్ట ప్రకారం తప్ప మరేవిధంగానూ ప్రభుత్వం భూమి తీసుకోవడానికి వీలులేదు కాబట్టే- భూసేకరణ చట్టం చేసింది. పేదలకు కొద్ది భూమైనా ఉండేలా భూసంస్కరణల చట్టాలు, భూపంపిణీ కార్యక్రమాల ద్వారా ప్రయత్నాలు జరిగాయి. తరతరాలుగా గిరిజనులు అనుభవిస్తున్న అటవీభూమికి హక్కు పత్రాలు ఇవ్వడం కోసం 2005లో పార్లమెంటు అటవీ హక్కుల చట్టం చేసింది. కేంద్రంలో గత ప్రభుత్వ హయాములో గ్రామీణ పేదలకు కనీసం నాలుగు గుంటలు లేదా పదిసెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇచ్చే చట్టం, భూమిలేని గ్రామీణ పేద కుటుంబానికి కొంత వ్యవసాయ భూమిని ఇచ్చే చట్టం ముసాయిదాలు రూపొందించింది. కానీ, చట్టరూపం దాల్చలేదు.

భూ రికార్డుల నవీకరణ
భూమి ఉన్నవారికి ఆ భూమి హద్దులకు, హక్కులకు స్పష్టత, భద్రత ఇచ్చే ప్రయత్నాలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నాయి. భూ రికార్డుల ఆధునికీకరణ కోసం కేంద్రప్రభుత్వం గతంలో జాతీయ భూ రికార్డుల నవీకరణ పథకాన్ని చేపట్టింది. ఇప్పుడు డిజిటల్‌ ఇండియా భూ రికార్డుల పథకం ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలి నీతిఆయోగ్‌ నివేదిక మేరకు ఈ ప్రక్రియలో కర్ణాటక, గుజరాత్‌, హరియాణా, త్రిపుర రాష్ట్రాలు ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, దిల్లీ, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ గణనీయమైన ప్రగతి సాధించాయి. ఇతర రాష్ట్రాల్లో ప్రగతి మందగమనంతో సాగుతోంది. భూముల సర్వే, రికార్డుల ఆధునికీకరణతోపాటు ఆ రికార్డుల్లో ఉన్న వివరాలకు పూర్తి భరోసా ఇచ్చేలా చట్టాన్ని రూపొందించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఇటీవలే నీతిఆయోగ్‌ ఒక ముసాయిదా చట్టాన్ని చేసి రాష్ట్రాలకు పంపింది. ఇప్పటికే అలాంటి చట్టాన్ని రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు చేశాయి. మహారాష్ట్ర ముసాయిదా చట్టం తయారైంది. అభివృద్ధికి కీలక వనరు భూమి. మానవ వికాసానికి భరోసా భూమి. ప్రతి కుటుంబానికి ఎంతో కొంత భూమి ఉంటేనే ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి ఆసరా. అందుకే భూమి, ఆస్తి హక్కును మానవ హక్కుగా అంతర్జాతీయ సమాజం గుర్తించింది. దీన్ని సంరక్షించే బాధ్యత ప్రభుత్వాలదే!

మహిళలకూ సమానం
ఐక్యరాజ్యసమితి 2007లో చేసిన ఆదివాసుల హక్కుల ప్రకటన, గిరిజనులు తరతరాలుగా అనుభవిస్తున్న భూములపై హక్కులను స్పష్టంగా గుర్తిస్తూ- వారి భూముల యాజమాన్య, సాగు, అభివృద్ధి హక్కులను గుర్తించి కాపాడాలని సభ్యదేశాలకు సూచించింది. మహిళలపై అన్నిరకాల దుర్విచక్షణలను తొలగించే తీర్మానం 1981లో అమలులోకి వచ్చింది. మహిళలకు ఆస్తిలో మగవారితోపాటు సమాన హక్కులను కల్పించింది. ఐక్యరాజ్యసమితి 1976లో చేసిన పౌర, రాజకీయ హక్కుల ఒడంబడిక, అదే సంవత్సరంలో చేసిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడిక, 1969లో చేసిన అన్నిరకాల దుర్విచక్షణల్ని తొలగించే ఒడంబడిక, 1990లో చేసిన బాలల హక్కుల ఒడంబడిక, 1989లో అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆదివాసులు, గిరిజన హక్కులపై చేసిన తీర్మానంలో వివిధ రూపాల్లో భూమి హక్కులను గుర్తించాయి. ఆస్తి లేకపోవడం, ఉన్న ఆస్తిపై హక్కులకు భద్రత లేకపోవడం పేదరికానికి ప్రధాన కారణమని ఐక్యరాజ్యసమితి నియమించిన న్యాయ సాధికారత కమిటీ పేర్కొంది.


 

Posted Date: 25-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం