• facebook
  • whatsapp
  • telegram

గురుస్థానం గుండెల్లో పదిలం!

ఉపాధ్యాయులపై తగ్గని గురి

గురువును దైవంతో సమానంగా పూజించే దేశం మనది. తల్లిదండ్రులు, గురువు, వైద్యుల స్థానం భారతీయ ఇతిహాస, చరిత్ర, సంస్కృతిలో వెలకట్టలేనిది. ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుల్లో కొందరే గురువులుగా, మిగతావారు బోధకులుగా మిగిలిన వైనం కనిపిస్తోంది. ఉపాధ్యాయ ఉద్యోగానికి, గురువులకు వివిధ దేశాల ప్రజలు ఏ మేరకు గౌరవం ఇస్తున్నారో అభిప్రాయాలను సేకరిస్తూ ఇటీవల లండన్‌కు చెందిన వార్కీ ఫౌండేషన్‌ నివేదిక విడుదల చేసింది. 35 దేశాల్లో   జరిగిన ఈ సర్వేలో ఉపాధ్యాయుల ప్రేరణాత్మక బోధన, మేధ, బాధ్యతాయుతతత్వం తదితర అంశాలపై ప్రశ్నించారు. ఉపాధ్యాయుల పనితీరు, వారి సాంఘిక, ఆర్థిక స్థితిగతులు, గౌరవ మర్యాదలపై జరిగిన ఈ సర్వేలో వారికి గౌరవం ఇచ్చే విషయంలో భారత్‌ ఆరోస్థానంలో నిలబడగా- చైనా, ఘనా, సింగపూర్‌, కెనడా, మలేసియా వరసగా మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. బ్రెజిల్‌, ఇజ్రాయెల్‌ ఆఖరు స్థానాలు పొందాయి. ఐరోపా, లాటిన్‌ అమెరికా దేశాల్లో ఉపాధ్యాయుల కంటే సాధారణ ఉద్యోగులే ఎక్కువ గౌరవం పొందుతున్నారు. తమ పిల్లలను బోధన వృత్తిలో చేర్పించేందుకు 54శాతం భారతీయ తల్లిదండ్రులు, 50 శాతం చైనీయులు మొదటి రెండు స్థానాల్లో నిలిచి ప్రోత్సహిస్తుండగా- అమెరికన్లు 16వ స్థానాల్లోనూ బ్రెజిల్‌, ఇజ్రాయెల్‌ తల్లిదండ్రులు చివరి స్థానాల్లోనూ నిలిచారు. సమాజంలో ఉపాధ్యాయుడికిచ్చే గౌరవానికి పాఠశాలలో విద్యార్థి సాధించే విజయానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఉపాధ్యాయుడిని గౌరవించడం నైతిక విధి మాత్రమే కాదు, మేలిమి విద్యారంగ ఫలితాలకు అది అత్యవసరం. ఒకదేశ సంస్కృతి, ప్రగతి, భవిష్యత్తుపై విద్యారంగ ఫలితాలు ప్రభావం కనబరుస్తాయి. కొన్ని దేశాలు వైద్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సముచిత నిధులు కేటాయిస్తున్నాయి.  

అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు సామాజిక హోదాకోసం, ఆకర్షణీయమైన వేతనాల కోసం వాణిజ్య, సాఫ్ట్‌వేర్‌ రంగాలపైనే ఆసక్తి చూపుతున్నారు. సముచిత స్థానం, సరైన వేతనాలు ఇచ్చి ప్రతిభావంతులను ఉపాధ్యాయ వృత్తి వైపు మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఫిన్‌లాండ్‌, ఇటలీ, పోర్చుగల్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌, సింగపూర్‌ లాంటి దేశాలు ఉపాధ్యాయులకు అధిక వేతనాలు చెల్లిస్తున్నాయి. ఉపాధ్యాయుల వేతనాలపై భారతీయులు (60శాతంపైగా) స్పందిస్తూ విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉత్తమ విద్యార్థులను తయారుచేసే ఉపాధ్యాయులకు అధిక వేతనాలు ఇవ్వాలని, అలా చేయలేని వారికి అల్పవేతనాలు చెల్లించాలని అభిప్రాయపడ్డారు. పనితీరుకు వేతనాలకు లంకె లేకపోవడంతో కొంతమంది ఉపాధ్యాయులు బాధ్యత విస్మరిస్తున్నారనే విమర్శలున్నాయి. దేశంలో విద్య ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉండటంతో సరైన మౌలిక సదుపాయాలతో, నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుందో తెలియక తల్లిదండ్రులు తికమక పడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల సామాజిక స్థితి ఒక్కోదేశంలో ఒక్కోలాగా ఉంది. ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తున్న అమెరికాలో సాధారణ వృత్తులకంటే ఉపాధ్యాయ వృత్తిని తక్కువగా భావిస్తారు. అక్కడ ఉపాధ్యాయుడి సామాజిక హోదా గ్రంథాలయ సిబ్బందితో సమానం. చైనా, మలేసియాలలో ప్రజలు ఉపాధ్యాయుణ్ని వైద్యుడితో సమానంగా భావిస్తారు. విద్యాభ్యాసం పూర్తయిన తరవాత ఉపాధ్యాయ- విద్యార్థి అనుసంధానం, సంబంధం, గౌరవం కేవలం నైతికం మాత్రమే. గురువు ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని భావించేవారిలో భారతీయులు ముందుంటారు. ఉపాధ్యాయ దినోత్సవం లాంటి సమయాన ప్రత్యేకంగా స్మరించుకుంటారు. తమకు ప్రేరణ కలిగించి, చిరస్మరణీయులుగా ఉండిన గురువులు కనిపించిన వెంటనే శిష్యులు పాదాభివందనం చేస్తారు.

ప్రభుత్వ ప్రణాళికలు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల పనితీరు, వేతనాలు, విద్యార్థుల ప్రతిభ సక్రమంగా ఉంటేనే ఆ విద్యావ్యవస్థ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించగలుగుతుంది. మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల కొరత, నిర్దేశిత ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడం, నాణ్యమైన ఉపాధ్యాయుల లేమి వేతనాల అంతరాయాలు, పాఠ్యప్రణాళికలు, బోధన భాష వంటి సమస్యలు మనదేశంలో ఉన్నాయి. పాఠశాల స్థాయిలో, వృత్తి విద్యలో విద్యార్థుల ప్రతిభ అంతంత మాత్రంగానే ఉందని సర్వేలు తెలియజేస్తున్నాయి. తమ దేశంలో విద్యావ్యవస్థ సరిగానే ఉందని ఫిన్‌లాండ్‌, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, ఇండియా, ఘనా, ఇండొనేసియా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో అమెరికా 11వ స్థానం, ఇంగ్లాండ్‌ 12వ స్థానంలో నిలిచాయి. బ్రెజిల్‌, ఈజిప్ట్‌, పెరూ, టర్కీ ప్రజలు తమ విద్యావ్యవస్థ స్థితిగతులపై పెదవి విరిచారు. మన విద్యావ్యవస్థలో లోటుపాట్లున్నా గురువులు మాత్రం తమ గుండెల్లో పదిలంగా ఉన్నారంటూ ప్రపంచవ్యాప్తంగా ఆరోస్థానమిచ్చి గౌరవించడం భారతీయ సంస్కృతికి అద్దం పడుతోంది!

- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి
 

Posted Date: 25-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం