• facebook
  • whatsapp
  • telegram

మారుతున్న ముఖచిత్రం

భారతీయ తపాలా ప్రస్థానం

పోస్ట్‌మ్యాన్‌, పోస్టాఫీస్‌- ఈ రెండు మాటలూ కొన్నేళ్ల క్రితం వరకు జనజీవితంలో విడదీయలేని అంతర్భాగాలుగా చలామణీ అయ్యేవి. ‘పోస్ట్‌’ అనే పిలుపును వెన్నంటి సైకిల్‌ బెల్‌ గణగణ మోత, విసిరిన ఉత్తరం లోపలికొచ్చి ఏ వరండాలోనో పడ్డ చప్పుడు కోసం... లక్షలమంది చెవులు రిక్కించి వినే దృశ్యాలు కనిపించేవి. సున్నిత భావోద్వేగాలతో ముడివడిన సర్కారీ వ్యవస్థ ఏదన్న ప్రశ్నకు అప్పట్లో ఒకే ఒక్క సమాధానం- తపాలా విభాగం. రోజూ కోట్లాది ఉత్తరాలు, పార్శిళ్ల బట్వాడా ద్వారా జనజీవితంతో మమేకమైన అంతటి కీలక వ్యవస్థ పోనుపోను ప్రాధాన్యం తగ్గి ప్రాభవం కోల్పోయింది. అంతర్జాలం, చరవాణుల సాంకేతిక విప్లవం దరిమిలా కార్డులు, కవర్లు, ఇన్‌లాండ్‌ లెటర్ల సంస్కృతికి గ్రహణం పట్టింది. ఇప్పుడు ఉత్తరాలు రాసేవారేరీ? ఎస్‌ఎమ్‌ఎస్‌, ఈ-మెయిల్‌, లేదంటే- సెల్‌ఫోన్‌... అరచేతిలో ఇమిడే సమాచార వితరణ వ్యవస్థల ఆగమనంతో తపాలా విభాగం ఉనికికే ఎసరొచ్చింది. మరోవైపు- పోస్ట్‌కార్డుపై సగటున ఏడు రూపాయలు, ఇన్‌లాండ్‌ లెటర్‌పై దాదాపు అయిదు రూపాయల మేర నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఆ శాఖను ఆర్థిక సంకటాల్లోకి నెట్టేసింది. తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన దురవస్థనుంచి తిరిగి తేరుకుని కొత్త శక్తి పుంజుకొనే క్రమంలో ‘ఇండియా పోస్ట్‌’ ముఖచిత్రమే మారుతోందిప్పుడు!

ఆరేళ్లక్రితమే సిఫార్సు
దేశానికి స్వాతంత్య్రం లభించేటప్పటికి ఉన్న మొత్తం పోస్టాఫీసుల సంఖ్య 23,344. తరవాతి ఏడు దశాబ్దాల్లో అది లక్షా 55వేలకు పైబడింది. అందులో 90శాతం వరకు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నవే. ఈ సహజ బలిమి సుమారు 40 కోట్లమంది వినియోగదారులు, 17 కోట్లకుపైగా పోస్టాఫీస్‌ పొదుపు ఖాతాల రూపేణా ప్రతిబింబిస్తున్నా- పునాది బీటలు వారకుండా వ్యవస్థను సంరక్షించుకునే క్రమంలో వినూత్న మార్గాన్వేషణ అనివార్యమైంది. ఆ దశలోనే స్పీడ్‌పోస్ట్‌, మై స్టాంప్‌లాంటి సేవలకు తపాలా విభాగం అంటుకట్టింది. క్రమేపీ కొరియర్‌ సర్వీస్‌, బీమా, పింఛన్‌, పాస్‌పోర్ట్‌, ఆధార్‌, తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు, పుస్తకాలూ మందుల బట్వాడా తదితరాలకూ విస్తరించింది. ఇవన్నీ ఒకెత్తు, తపాలా బ్యాంకు అవతరణ మరొకెత్తు.

బ్యాంకింగ్‌ రంగం శాఖోపశాఖలుగా వృద్ధి చెందినా, పూర్తి స్థాయి లావాదేవీల సదుపాయాలకు నోచుకుంటున్న గ్రామాలు నేటికీ యాభైవేలలోపే. వాటితో పోలిస్తే పల్లెపట్టుల్లో తపాలా కార్యాలయాలే జనబాహుళ్యానికి విరివిగా అందుబాటులో ఉన్నాయన్న యథార్థాన్ని గ్రహించిన సుబ్రమణియన్‌ కమిటీ ఆరేళ్లక్రితం కీలక సిఫార్సు చేసింది. కోట్ల సంఖ్యలోని బడుగు జీవులకు బ్యాంకు సేవలు లభ్యం కావాలన్నా, ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు దళారుల పాలబడి గుల్లబారకుండా కాచుకోవాలన్నా తపాలాబ్యాంకు ఏర్పాటే శరణ్యమన్న సిఫార్సు పోస్టల్‌ విభాగం నెత్తిన పాలుపోసింది. అలా పుట్టుకొచ్చిందే, ఐపీపీబీ (ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌). ఒక్కముక్కలో, సంప్రదాయేతర సేవల వితరణకు మళ్ళడమే భారతీయ తపాలా విభాగం తలరాతను తిరగరాసిందని చెప్పాలి. మార్పు అక్కడితో ఆగలేదు. పరివర్తన క్రమంలో ‘డాక్‌ పే’ యాప్‌ తాజా ప్రకరణం.

కొవిడ్‌ సంక్షోభం, వరస లాక్‌డౌన్లు, అసంఖ్యాక వలస శ్రామికుల దుర్భర కడగండ్ల నేపథ్యంలో- ఆధార్‌ ఆధారిత చెల్లింపుల సేవలు ఎందరికో అక్కరకొచ్చాయి. నివాసాల వద్దే వేలి ముద్రల ధ్రువీకరణతో దేశం నలుమూలలా పోస్ట్‌మెన్‌ అందించిన సేవలు అసామాన్యమైనవి. వృద్ధులు, రోగులు, ఉన్నచోటునుంచి కదలలేనివారు, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో చిక్కినవారికి తపాలా సిబ్బందే ఆపద్బాంధవులయ్యారు. మార్చి 23- మే 11 తేదీల మధ్య కేవలం యాభై రోజుల్లో అటువంటి 59 లక్షల లావాదేవీల్లో పంపిణీ అయిన నగదు వెయ్యి కోట్ల రూపాయలకు పైమాటే. తపాలా విభాగ చెల్లింపుల బ్యాంకు అభివృద్ధి చేసిన ‘పోస్ట్‌ ఇన్‌ఫో యాప్‌’ ద్వారా ఇంటివద్దే నగదు పంపిణీ సేవ- సాంకేతికతను సద్వినియోగపరచుకోగలిగితే ఎంతగా ప్రయోజనాలు పొందగల వీలుందో ప్రస్ఫుటీకరించింది. దానితో పోలిస్తే సరికొత్త తపాలా యాప్‌ పరిధి, ప్రయోజనాలు విస్తారమైనవి. గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తరహాలో-  నూతనంగా తెరపైకి వచ్చిన ‘డాక్‌ పే’ పనిచేస్తుందంటున్నారు. తపాలా బ్యాంకు ఖాతా ఉంటే చాలు- దాంతోపాటు తమకున్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఖాతాలు వేటినైనా యాప్‌తో అనుసంధానించుకుని... ఇట్టే నగదు బదిలీ చేసే వీలుంది. విద్యుత్‌, నీటి బిల్లులు, బీమా కిస్తులు, మొబైల్‌ రీఛార్జి, పెట్రోల్‌ బంకుల్లో చెల్లింపులు... ఏవైనా క్షణాల్లో పనేనంటున్నారు. డిజిటల్‌ విభాగంలో తపాలా శాఖ ఎంత చురుగ్గా తనదైన ముద్ర వేయగలదో చూడాలి!

చరిత్రలో మరో మలుపు?
అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ మాదిరిగా సకల సేవలతో భారతీయ తపాలా విభాగాన్ని పరిపుష్టీకరించాలన్న సూచనలు పుష్కరకాలంగా వినవస్తున్నాయి. అక్కడే అనేముంది- చైనా, ఇటలీ, ఫ్రాన్స్‌, యూకే, మొరాకో, అల్జీరియా ప్రభృత దేశాలు తపాలా కార్యాలయాలకు బ్యాంకింగ్‌ సేవల్ని జతకూర్చి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దీటైన కార్యాచరణ ఎలా ఉండాలో సోదాహరణంగా చాటుతున్నాయి. ఆర్థిక సంస్థలతో ‘బ్రెజిల్‌ పోస్ట్‌’ అనుసంధానం వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రజల వద్దకే బ్యాంకింగ్‌ను, ఇతరత్రా ఆర్థిక సేవలను తీసుకెళ్ళడంలో భారతీయ తపాలా విభాగం సైతం విశేషంగా రాణించడానికి వ్యవస్థాగత తోడ్పాటు అత్యవసరం. అంతర్జాల వేగం ప్రాతిపదికన శ్రీలంక, నేపాల్‌, పాకిస్థాన్ల కన్నా ఇండియా వెనకబడి ఉంది. ఈ మందభాగ్యాన్ని చెదరగొట్టి, దేశంలో అయిదోతరం (5జి) నెట్‌వర్క్‌ అందజేతకు నిబద్ధమైనట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ‘డిజిటల్‌ భారత్‌’ మహా స్వప్నం చురుగ్గా సాకారమైతే, ఆ ఘట్టం భారతీయ తపాలా విభాగం చరిత్రను మరో మలుపు తిప్పుతుందేమో!

- సత్యమూర్తి
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం