• facebook
  • whatsapp
  • telegram

వ్యవస్థీకృత నేరం!

మారని సఫాయీ కర్మచారుల జీవనం

ఆత్మాభిమానంగల మనుషులుగా, గౌరవంగా బతికే హక్కు టోకున కొందరికి మాత్రమే ఎందుకు దఖలుపడింది? సాటి మనుషుల మలాన్ని ఎత్తి జీవించే దుస్థితిలో ఈ దేశంలో ఇంకా లక్షలమంది ఎందుకు మగ్గుతున్నారు? మనమిట్లా ఎందుకయిపోయాం అన్న ఈ ప్రశ్నలకు జవాబు వెదికేటప్పుడు చట్టాలనూ, ప్రజాస్వామ్యాన్నీ నిందించడం పరిపాటి. ఆ రకమైన విశ్లేషణ బాహ్య పరిస్థితులను స్పృశించడానికి అక్కరకొస్తుందేమోగానీ- సమస్య మూలాన్ని మాత్రం సజీవంగానే ఉంచుతుంది. సమాజంలో కొన్ని వర్గాలపట్ల శతాబ్దాలుగా పేరుకుపోయిన దుర్విచక్షణకు, కొందరిని ఎప్పుడూ అట్టడుగునే ఉంచి విద్య, ఆర్థిక సమానత్వం దిశగా అడుగులు వేయకుండా నిరోధించే భావజాలానికి వికృత ప్రతీక... పాకీ పని! మనుషుల మలాన్ని ఎత్తివేసే పని చేసేందుకు సాటి మనుషులనే ఉపయోగించే ఈ అనాచారం దేశంలో ఇప్పటికీ సజీవంగానే ఉంది. దీన్ని నిషేధిస్తూ చేసిన చట్టాన్నీ నిబద్ధంగా అమలు చేయలేని ప్రభుత్వాల చేతగానితనానికి; అమానుషం కళ్లకుకడుతున్నా చూసీచూడనట్లు వదిలేసే నీతిలేనితనానికి నిదర్శనంగా నేటికీ కొనసాగుతోంది!

మానవ హక్కులకు విఘాతం  
రాజ్యాంగం వ్యక్తుల గౌరవానికి హామీ ఇస్తోంది. ప్రజారోగ్యానికి భరోసా పలకడం రాజ్యం ప్రాథమిక విధిగా పేర్కొంది. ఆ మేరకు సఫాయీ కర్మచారులను పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ, పొడి పాయిఖానాల నిర్మాణ (నిషేధ) చట్టం చేస్తూ 1993లో ప్రభుత్వం ఒక చట్టం తీసుకువచ్చింది. రాష్ట్రాలు పూర్తిగా మొండికేయడంతో ఏ దశలోనూ ఆ చట్టం సక్రమంగా అమలు కాలేదు. ఆ తరవాత తిరిగి ఇరవయ్యేళ్లకు అంటే 2013లో మానవ విసర్జితాలను శుభ్రం చేసేందుకు మనుషులను వినియోగించడాన్ని నిషేధిస్తూ, వారి పునరావాసానికి చట్టబద్ధ హామీ ఇస్తూ మరో చట్టం తీసుకువచ్చారు. మానవ విసర్జితాలను శుభ్రం చేసేందుకు మనుషులను ఉపయోగిస్తే వారికి అయిదేళ్ల దాకా జైలుశిక్ష, అయిదు లక్షల రూపాయల జరిమానాను ఆ చట్టంలో ప్రతిపాదించారు. కానీ విచిత్రమేమిటంటే దేశంలో లక్షలమంది ఇప్పటికీ ఆ ‘వృత్తి’లోనే మగ్గుతున్నా- 2013నాటి చట్టం ప్రకారం ఈ ఏడేళ్లలో ఒక్కరికైనా శిక్షగానీ, జరిమానాగానీ పడిన దాఖలాలు లేవు. దేశవ్యాప్తంగా నేటికీ 7.7 లక్షలమంది పారిశుద్ధ్య కార్మికులు (డ్రైనేజీ గుంతల్లోకి దిగి శుభ్రం చేసేవారు) పని చేస్తున్నారు. చేతులతో మానవ మలాన్ని ఎత్తి, గంపల్లో మోసుకొంటూ వెళ్ళే అమానుషమైన పనిలో వేలమంది మగ్గుతున్నారు. భారతీయ రైల్వేల్లో సఫాయీ కర్మచారీలుగా ఇప్పటికీ వేలమంది పనిచేస్తున్నారని అంచనా. అధికారిక లెక్కలు ఎలా ఉన్నా- మురుగు కాల్వలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేస్తూ విష వాయువుల బారినపడి; అనారోగ్యంపాలై ఏటా సగటున దేశవ్యాప్తంగా 1700మంది మృత్యువాత పడుతున్నట్లు కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.    

గతంలో తెచ్చిన రెండు చట్టాలూ ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో సఫాయీ కర్మచారీల నియామకాన్ని నిషేధిస్తూ చట్ట సవరణకు పూనుకొన్నారు. ఇందులో గతంతో పోలిస్తే శిక్షల తీవ్రతను పెంచారు. తరాలుగా ఈ వృత్తిని దళిత వర్గానికి అంటగట్టి, సామాజికంగా వారిని ఎన్నటికీ ‘అంటరానివారి’గానే ఉంచాలన్న ఆధిపత్య భావజాలం మలిగిపోనన్నాళ్లూ ఇలాంటి చట్టాలు కంటితుడుపుగానే మిగిలిపోతాయి. పారిశుద్ధ్య కార్మికుల సగటు జీవన కాలం యాభయ్యేళ్లకు మించడం లేదంటే; సెప్టిక్‌ ట్యాంకుల్లో దిగి వాటిని శుభ్రం చేస్తున్నవారు తరచూ ఆస్థమా, హెపటైటిస్‌ సహా దారుణ అనారోగ్య సమస్యల పాలబడి దుర్భర జీవితం గడుపుతున్నారంటే- స్వాతంత్య్ర భారతావని సురాజ్య ప్రస్థానం సరైన దారిన లేనట్లే లెక్క!

జనజాగృతితోనే విముక్తి
అభివృద్ధి పేరిట శరవేగంతో ముందుకు పోతుందంటున్న సమాజంలో పొడి పాయిఖానాలు (డ్రై లెట్రిన్లు) ఇప్పటికీ ఉన్నాయంటే... ఆ పురోగతికి మానవీయ స్పృహ లేదని అర్థం. ఇప్పటికీ దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ‘డ్రై లెట్రిన్లు’ ఉన్నాయంటే- వాటిని శుభ్రం చేసేందుకు అంతకు మించిన చేతులు అవసరమని అర్థం. అందుకే సఫాయీ కర్మచారీ ఆందోళన్‌ (ఎస్‌కేఏ) సంస్థ డ్రైలెట్రిన్‌లను కూల్చివేసే కార్యక్రమాలను నిర్వహించింది. ఈ పాయిఖానాలను పౌర సమాజం ఉపయోగిస్తూ ఉండటం; సఫాయీ పనికి కొంతమందిని అనువంశికంగా ప్రత్యేకించడం వంటివి అమానవీయ లక్షణాలు. కొందరిని అంతులేని పీడనకు, అంటరానితనానికి పరిమితం చేసి... ఇంకొందరు ‘గౌరవనీయులు’గా చెలామణీ అయ్యే సంకుచితత్వానికి తెరవేసే అవగాహన సమాజమంతటా విస్తరించడం చట్టాల రూపకల్పనకన్నా చాలా ముఖ్యం.  ఆ మేరకు స్థానిక సంస్థలను సిద్ధం చేసి; ప్రజల్లో అవగాహన పెంచడమన్నది ఒక ఉద్యమంలా చేపట్టాలి. దాంతోపాటు మురుగునీటి పారుదల వ్యవస్థలను ఆధునికీకరించడం, మానవ వ్యర్థాల శుద్ధి, రవాణా వంటివాటికి యంత్రాలను ఉపయోగించడంపై ప్రభుత్వాలు గట్టి శ్రద్ధ పెట్టాలి. పారిశుద్ధ్యానికి, ఆరోగ్యానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రజలకు ఎరుకపరచి కార్యాచరణ దిశగా కదలనన్నాళ్లూ... ‘పాపం ఈ పేదవాళ్లను మానవ మలం ఎత్తేందుకు ఉపయోగిస్తున్నారు... వీళ్ల సేవలకు వెలకట్టలేం’ వంటి సానుభూతి వచనాలు నయాపైసా విలువ చేయవు!

- ఇందిరాగోపాల్‌
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం