• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థికి లెక్కల చిక్కులు

నేడు జాతీయ గణిత దినోత్సవం

గణితానికి, మానవ జీవితానికి విడదీయరాని బంధం ఉంది. మానవ దైనందిన జీవితంలో ప్రతి చోటా లెక్కలుంటాయి. అనేక వృత్తులు, సంగీతం, ఆటలు, కళలన్నింటిలో గణిత భావనలు ఇమిడి ఉంటాయి. గణితం- శాస్త్ర సాంకేతిక రంగాలకు ఊపిరి వంటిది. ప్రపంచవ్యాప్తంగా గణితం అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఎంతో ఉందని వేదగణితం చెబుతోంది. సంఖ్యామానానికి పట్టుకొమ్మ అయిన సున్నా ఆవిష్కరణే దీనికి నిదర్శనం. ఇది ప్రపంచ గణిత శాస్త్రానికి భారతీయుల అద్భుత కానుక. అందుకే నేడు ‘వేదిక్‌ మ్యాథమెటిక్స్‌’ విస్తృతంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. భారతీయ గణిత శాస్త్రవేత్తగా చిన్న వయసులోనే  అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన శ్రీనివాస రామానుజన్‌ సంఖ్యాశాస్త్రానికి సంబంధించి విశేష కృషి చేశారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్నాం. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతకు గణితం ఆవశ్యకతను తెలియజేసే రోజు ఇది. సాధారణంగా శిశువుకు ప్రకృతి సిద్ధంగానే పరిశీలించడం, పోల్చడం, అంచనా వేయడం, ఫలితాలను ఊహించడం, సాధారణీకరించడం వంటి గణిత భావనలు, నైపుణ్యాలు అలవడతాయి. వీటి పట్ల వ్యవస్థీకృతమైన జ్ఞానం పాఠశాల స్థాయిలో పడుతుంది. గణిత అభ్యసనం వల్ల తార్కిక ఆలోచన, విశ్లేషణ, వివేచన, క్రమశిక్షణ మొదలైనవి పట్టుబడతాయి. గణిత భావనలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి- జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతాడని విద్యావేత్తలు చెబుతారు.

పాఠశాల స్థాయి నుంచి గణితం ప్రత్యేక అంశం(సబ్జెక్టు)గా ఉన్నప్పటికీ, ఇతర సబ్జెక్టులలోనూ పరోక్షంగా దీని వినియోగం ఉంటుంది. అయినా, గణితమంటే చిన్నతనం నుంచి చాలామందిలో తెలియని భయం ఉంటుంది. దీంతో కొంతమంది విద్యార్థులు ఒత్తిడికి గురి కావడంతో పాటు  పాఠశాలకూ దూరమవుతుంటారు. కానీ, ఇష్టపడి చదివితే లెక్కలు నేర్చుకోవడం ఎంతో సులభం. ఇది అంకెలు, సంఖ్యలు, సంజ్ఞలు, సూత్రాలతో పాటు- తర్కం, కచ్చితత్వంతో కూడిన అమూర్త భావనల కలయిక. మెజార్టీ విద్యార్థులు కఠినంగా భావించే సబ్జెక్టుల్లో ఇదొకటి. దీంతో ఈ సబ్జెక్టు కోసం పట్టణాల్లో ప్రత్యేకంగా ట్యూషన్లూ పెట్టించుకుంటారు. మరోవైపు విద్యార్థులు సంఖ్యాపరమైన సమస్యలతో పోల్చితే, రాతపూర్వక సమస్యలను సాధించడంలో వెనకబడుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలోని వివిధ సబ్జెక్టుల్లో అభ్యసన సామర్థ్యాల మదింపు కోసం నేషనల్‌ అఛీవ్‌మెంట్‌ సర్వే-2017 నిర్వహించింది. ఇందులో   3, 5, 8 తరగతుల్లో 64, 53, 42శాతం చొప్పున విద్యార్థులు మాత్రమే గణిత సామర్థ్యాలు కలిగి ఉన్నారని పేర్కొంది. ప్రాథమిక స్థాయి నుంచి మాధ్యమిక స్థాయికి వచ్చేసరికి ఈ సామర్థ్యాలు తగ్గుతున్నట్లు సర్వే వివరాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు విద్యాప్రమాణాలను అంచనా వేసే విద్యావార్షిక స్థాయి నివేదిక (ఏఎస్‌ఈఆర్‌) ఎనిమిదో తరగతిలోని 56శాతం విద్యార్థులు ఒక అంకె భాగహారం చేయలేరని, అయిదో తరగతిలో 72శాతం విద్యార్థులు అసలు భాగహారమే చేయలేరని, మూడో తరగతి విద్యార్థుల్లో 70శాతం తీసివేత చేయలేరని పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. గణితం పట్ల నెలకొన్న భయంతో ఏటా పదో తరగతి అనంతరం చాలామంది విద్యార్థులు ఆర్ట్స్‌ గ్రూపుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కరోనావల్ల కొనసాగిస్తున్న ఆన్‌లైన్‌ విద్యలో లెక్కలు అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

గణిత శాస్త్రం నాగరికతకు అద్దంలాంటిది. నానాటికీ విద్యార్థుల్లో పడిపోతున్న అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టాల్సిన తరుణమిది. ఈమధ్య కాలంలో తరగతి గది గణితం, నిజ జీవితంలో గణితానికి మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. దీన్ని అధిగమించాలంటే ప్రాథమిక స్థాయిలోని గణిత భావనల నిర్మాణం సమర్థంగా జరగాలి. అంతేకాకుండా గణిత స్వభావం ఆధారంగా పాఠ్యప్రణాళిక రూపొందించి, బోధనా పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాలి. ప్రస్తుతం తరగతి గదిలో బోధించే గణితం నిత్యజీవితంలో ఉపయోగపడేలా ఆచరణాత్మక బోధన అవసరం. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచి సమస్యల సాధనకు సరైన వ్యూహలను ఎన్నుకొనే స్వేచ్ఛనివ్వాలి. ఒత్తిడి, భయం లేకుండా గణితాన్ని అభ్యసించడానికి ఉపాధ్యాయులు కృత్యాధార బోధనకు శ్రీకారం చుట్టాలి. పిల్లలకు పాఠశాల స్థాయిలో ‘గణిత క్లబ్‌’, ‘గణిత మేళాలు’ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా గణిత భావనలపై లోతైన అవగాహన పెంపొందించాలి. విద్యాశాఖ గణిత అభ్యాసంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు మూల్యాంకన వ్యవస్థలో కూడా సంస్కరణలు తీసుకురావాలి. ఉపాధ్యాయుడు నిత్యం గణిత అభ్యసనంలో విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తూ, అభిరుచిని పెంపొందించాలి. గణిత పఠనంలో విశ్వాసం, ధైర్యాన్ని నింపాలి. అప్పుడే విద్యార్థులు సృజనాత్మక    ఆలోచనలతో ముందుకు వెళుతూ- శ్రీనివాస రామానుజన్‌, శకుంతలాదేవి వంటి గణిత మేధావులుగా ఎదుగుతారు.

- సంపతి రమేష్‌ మహారాజ్‌
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం