• facebook
  • whatsapp
  • telegram

మహమ్మారి నేర్పిన పాఠాలెన్నో!

సంక్షోభాలను చవిచూపిన సంవత్సరం

గడచిన వందేళ్లలో 2020 లాంటి సంవత్సరాన్ని ఎరుగం. మానవాళి ఇలా ఓ మహమ్మారి బారిన పడింది... మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక 1918-20 కాలంలో. అప్పట్లో స్పానిష్‌ ఫ్లూ దాదాపు 50 కోట్ల మందికి సోకింది. ప్రపంచ జనాభాలో అది మూడో వంతు. అయిదు కోట్ల నుంచి పది కోట్ల మంది ఆ అంటువ్యాధికి బలయ్యారు. నాటి మహమ్మారితో పోలిస్తే కొవిడ్‌ తీవ్రత తక్కువే. స్పానిష్‌ ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినవారిలో 10 నుంచి 20 శాతం మృతి చెందగా, కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ మరణాలు ఒకశాతంలోపే ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ జరిగిన వారిలో కొవిడ్‌ మరణాలు 2.2శాతం. ఆధునిక వైద్యంలో పురోగతి, వ్యాధికి సంబంధించి మెరుగైన అవగాహన, 21వ శతాబ్దంలో ఆరోగ్య సంరక్షణ అవకాశాలు మునుపెన్నడూ లేనిరీతిలో అందుబాటులోకి రావడం ఈవేళ మహమ్మారి తీవ్రత తక్కువగా ఉండటానికి కొంత కారణం. కానీ అంతకంటే పెద్ద కారణం... ఏ అదృష్టం వల్లో స్పానిష్‌ ఫ్లూ కంటే కొవిడ్‌ తక్కువ తీవ్రత కలిగి ఉండటం, తక్కువ ప్రాణాంతకం కావడం! అయినప్పటికీ ఈవేళ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థిక విధ్వంసం మాత్రం అప్పట్లో కంటే అనేక రెట్లు ఎక్కువ. కొవిడ్‌ నుంచి మనం మూడు పెద్ద పాఠాలను నేర్చుకోవాల్సి ఉంది. మొదటిది, అభివృద్ధి చెందుతున్న      దేశాలను... ముఖ్యంగా భారత్‌ను పీడిస్తున్న ఆరోగ్య రంగ సంక్షోభం, ఆదాయ అసమానతలకు సంబంధించినది. రెండోది గత శతాబ్దంలో పర్యావరణ విధ్వంసం వల్ల భవిష్యత్తులో తలెత్తే అవకాశమున్న ఆరోగ్య సంక్షోభాలకు సంబంధించినది. మూడోది, వచ్చే 30 ఏళ్లలో మన పిల్లలు ఎదుర్కోబోతున్న భూతాప (గ్లోబల్‌ వార్మింగ్‌) పెరుగుదల సంక్షోభం. మరిన్ని మహమ్మారులు, గ్లోబల్‌ వార్మింగ్‌... ఈ రెండూ ప్రపంచ స్థాయి సవాళ్లు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి చర్యలు అవసరం.

ఆర్థిక అసమానతలు...

అధ్వాన ఆరోగ్య సేవలు, విస్తృత పేదరికం, ఆదాయ అసమానతలకు నిలువెత్తు నిదర్శనం భారతదేశం. మన దేశంలో, ఆరోగ్య సంరక్షణ రంగాన ప్రభుత్వ వ్యయం కేవలం 1.3శాతం. ప్రపంచ దేశాలన్నింటిలో ఇది తక్కువ. మొత్తం ఆరోగ్య వ్యయంలో 30శాతం లోపే ప్రభుత్వం ఖర్చు పెట్టడం మరే దేశంలోనూ కనిపించదు. అనారోగ్యం వల్ల ఆదాయాన్ని కోల్పోవడం, చికిత్స కోసం జేబులో నుంచి ఖర్చు వల్ల దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలు ఏటా పేదరికంలోకి కుంగిపోతున్నారు. కాస్త చెప్పుకోదగిన స్థాయి నాణ్యమైన ఆరోగ్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తే చాలు... భారతదేశంలో కేవలం పదేళ్లలో పేదరికాన్ని నిర్మూలించగలం! 1-1.5 కోట్ల దాకా కొత్త ఉద్యోగాలను ఆరోగ్య సంరక్షణ సేవల్లో సృష్టించగలం! కొవిడ్‌ వ్యాధి సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందుబాటులోలేక పేద, మధ్య తరగతి వర్గాలు ఎన్ని బాధలు పడ్డాయో, చికిత్స ఖర్చులు భరించలేక ఎన్ని కుటుంబాలు ఎంత అల్లకల్లోలమయ్యాయో నెలల తరబడి చూశాం. ఈ నివారించదగ్గ బాధలు మనందరికీ మేలుకొలుపు కావాలి. కొన్ని విషయాల్లో మనం అదృష్టవంతులం. తక్కువ ధరలకు అత్యంత నాణ్యమైన మందులు, వ్యాక్సిన్లను తయారు చేసే ప్రపంచస్థాయి ఔషధ పరిశ్రమ మనకుంది. మన ఆస్పత్రులు ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన వైద్య సేవల్ని అందించగలవు. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రభుత్వాలు పేదల ఆస్పత్రి సేవలకు బీమా ఆధారిత సదుపాయాన్ని ప్రభుత్వ డబ్బుతో కొంతమేరకు ఏర్పాటు చేశాయి. మనం చేయాల్సిన మరో రెండు ముఖ్యమైన పనులున్నాయి. మొదటిది, మంచి ప్రమాణాలు కలిగిన, నమ్మదగిన ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను ప్రతి కుటుంబానికీ అందుబాటులోకి తేవాలి. తాము ఉండే చోటు నుంచి 10-15 కిలోమీటర్లలోపు తమకు నచ్చిన డాక్టర్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఆ కుటుంబానికి కల్పించాలి. అవుట్‌ పేషెంట్‌గా వీరికి డాక్టర్‌ వద్ద అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. ఇక రెండోది, వ్యాధి ముదిరిన దశలో వైద్యాన్ని పటిష్ఠంగా అందించేందుకు ప్రభుత్వ బోధనాస్పత్రులను, జిల్లా ఆస్పత్రులను బాగా మెరుగుపరచాలి. తృతీయ దశలో వైద్య సేవలకు ప్రైవేటు ఆస్పత్రుల మీద ఆధారపడితే- ఖర్చు కళ్లు బైర్లు కమ్మేలా ఉంటుంది. ఈ దశలో అందించే ఆధునిక వైద్య సేవలు ఎంతో ఖరీదైనవి. ఇక్కడ ప్రభుత్వ వైద్యం మేలు. వనరుల్ని మెరుగ్గా వినియోగించుకోవడం, వ్యాధి నిర్ధారణ, చికిత్సలో మరింత శాస్త్రీయ పద్ధతుల్ని నిర్ణయించి అమలు చేయడం ద్వారా తృతీయ దశ వైద్యంలో ప్రభుత్వం ఖర్చుల్ని తగ్గించి, నాణ్యమైన సేవలకు కూడా భరోసా ఇవ్వగలదు.

మన ప్రభుత్వాలు జీడీపీలో 1.3శాతం మాత్రమే ఆరోగ్య సంరక్షణ కోసం వెచ్చిస్తున్నాయి. మనం గనక 0.5శాతం లేదా లక్ష కోట్ల రూపాయలు అదనంగా, అది కూడా విజ్ఞతతో కుటుంబ ఆరోగ్య సేవలకు, తృతీయ దశ చికిత్సకు ఖర్చు చేయగలిగితే... మన దేశంలో ప్రతి ఒక్కరికీ మంచి ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తేవచ్చు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు తమ జేబుల్లో నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి లేకుండా చేయవచ్చు. ప్రజారోగ్యంలో ఇంత స్థాయి ఫలితాల్ని చూపే ఈ పథకాన్ని అమలు చేశాక కూడా ప్రభుత్వం ఆరోగ్య రంగంపై చేస్తున్న ఖర్చు జీడీపీలో రెండుశాతం లోపే ఉంటుంది. అప్పటికీ ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చు. కాబట్టి ప్రభుత్వాలు తాత్సారం చేయకుండా వెంటనే అందరికీ ఆరోగ్యం కోసం ఏర్పాట్లు చేయడం అత్యవసరం.

ఆరోగ్య సంరక్షణతో పాటు మనం మౌలిక వసతుల నిర్మాణానికి, విద్య-నైపుణ్యాలను మెరుగుపరచడానికి, ఉపాధి ఆధారిత పరిశ్రమలను, సేవలను ప్రోత్సహించడానికి శరవేగంగా చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ సంక్షోభ సమయంలో జరిగిన సరఫరా గొలుసుల విచ్ఛిన్నం ప్రపంచ లావాదేవీల రీతిలో మార్పు తెచ్చింది. భారత్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన దేశం 10-15 మెగా ఇండస్ట్రియల్‌ పార్కుల్ని పారిశ్రామిక కేంద్రాలుగా ఏర్పాటు చేయాలి. ఒక్కో దాంట్లో 25,000 - 50,000 ఎకరాల భూబ్యాంక్‌ను అందుబాటులో ఉంచాలి. ఈ పార్కుల వరకైనా ప్రపంచ స్థాయి మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసి, అనవసరమైన నియంత్రణల్ని తొలగించాలి. ఎన్ని ఉద్యోగాలిస్తారనే ప్రాతిపదికన ప్రోత్సాహకాలు కల్పించాలి. దీంతోపాటు, పెద్దయెత్తున కార్మికుల అవసరం ఉండే పరిశ్రమలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టి వస్త్ర, రెడీమేడ్‌, పాదరక్షలు, బొమ్మలు, తోలు, ఎలెక్ట్రానిక్స్‌ తదితరాల్లో అనవసర నిబంధనలన్నింటినీ తీసి పారేయాలి. నెట్‌వర్క్‌ ఉత్పత్తుల్లో తుది స్థాయి కూర్పు (అసెంబ్లీ) యూనిట్లకు ప్రోత్సాహకాలనివ్వాలి. మనకు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో 17శాతం మేర నిరుద్యోగం ఉంది. నైపుణ్యంలేని, కొంతమేర నైపుణ్యమున్న వారి కోసం కోట్ల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించకపోతే మనం తీవ్రమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. పేదరికాన్ని అంతం చేసి, అసమానతల్ని నిర్మూలించాలంటే మిగిలినవాటన్నింటి కన్నా ఉద్యోగాల కల్పనే మనకు అత్యంత ప్రాధాన్యాంశం కావాలి. అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారు, కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఈ అసంఘటిత రంగ శ్రామికులకు తిరిగి శిక్షణనివ్వడానికి జాతీయ స్థాయిలో ఒక బృహత్‌ ప్రయత్నం ప్రారంభించాలి. కార్మిక సాంద్ర పరిశ్రమల్లో వీరికి గౌరవప్రదమైన, ఉత్పాదకతతో కూడిన ఉపాధి అవకాశాల్ని కల్పించాలి.

మానవ తప్పిదాలతో వినాశనం

పర్యావరణ విధ్వంసం వల్ల భవిష్యత్తులో వన్యప్రాణుల నుంచి వైరస్‌లు మనుషుల్లోకి ప్రవేశించి మహమ్మారుల ప్రమాదం పెరుగుతుంది. కొన్ని దశాబ్దాల్లో అనేక వైరస్‌లు ఇతర జాతుల నుంచి మనుషుల్లోకి ఇప్పటికే వ్యాపించాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అడవుల విధ్వంసం పెద్దయెత్తున జరుగుతోంది. ఆఫ్రికాలో జనాభా విపరీతంగా పెరుగుతోంది. నానాటికీ అడవుల్ని నరికి వేస్తున్నారు. వన్యప్రాణుల మాంసానికి బాగా గిరాకీ ఉండటంతో అడవుల్లో జంతువులను విపరీతంగా వేటాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వన్యప్రాణుల్ని పెంపుడు జంతువులుగా మచ్చిక చేసుకుంటున్నారు. వీటన్నింటి వల్ల జంతు వైరస్‌లు మానవ జాతిలోకి ప్రవేశించి ప్రమాదాన్ని పెంచుతున్నాయి. వేగంగా వ్యాపిస్తూ, తీవ్ర వ్యాధులకు కారకమవుతున్నాయి. అదేవిధంగా చైనా, ఆగ్నేయాసియాల్లో, దక్షిణ అమెరికాలో అడవుల తొలగింపు, ఆహారం కోసం వన్యప్రాణుల వేట, మాంసం కోసమో, పెంచుకోవడం కోసమో అరుదైన వన్యప్రాణుల పట్ల వేలంవెర్రి వంటివి మనుషుల్లోకి వైరస్‌లను వ్యాపింపజేసే పెద్ద ప్రమాదకారకాలుగా ఉన్నాయి. కొవిడ్‌ విషయంలో అంతర్జాతీయ వైద్య పరిశోధకులు సమర్థŸమైన టీకాలను రికార్డు సమయంలో ఒక్క ఏడాదిలోనే ఉత్పత్తి చేయగలిగారు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన చాలామందిలోనూ కొవిడ్‌ తీవ్రత తక్కువగానే ఉంది. తీవ్ర ప్రభావం చూపే మహమ్మారులన్నింటి నుంచి రక్షణ కల్పించేలా పదుల వేల వ్యాక్సిన్లను సృష్టించడం అసాధ్యం. కొన్ని వ్యాధులకు సంబంధించి సర్వశక్తులతో ప్రయత్నిస్తున్నా, ఇప్పటికీ వాటికి వ్యాక్సిన్లను మానవాళి తయారు చేయలేకపోయింది. ఒకపక్క కొవిడ్‌లాగా వేగంగా వ్యాపిస్తూ మరోవైపు కొవిడ్‌ కంటే ప్రమాదకరంగా, మెర్స్‌, ఎబోలాల మాదిరిగా ప్రాణాంతకం కాగలిగే వైరస్‌ వ్యాప్తికి అవకాశముంది. కొవిడ్‌ తరహా ఇన్‌ఫెక్షన్‌, ఎబోలా తరహా ప్రాణాంతక లక్షణం ఉండే వైరస్‌ తాకిడికి ప్రపంచం గురైతే, మొత్తం మానవాళి మనుగడకే అది గొడ్డలి పెట్టవుతుంది. అడవుల్లోకి చొరబాటు, వేట, వన్యప్రాణుల మాంసం భుజించడాన్ని- ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాల్లో అడ్డుకోవడమే ఏకైక రక్షణ మార్గం. ఇది ప్రపంచం కలిసికట్టుగా కృషి చేస్తేనే సాధ్యం. కేవలం ఓ దేశం స్థాయిలో ప్రయత్నాలు సరిపోవు. మహమ్మారులకు మూలకేంద్రాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న ఆ దేశాల్లోని ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. వన్యప్రాణుల వినియోగాన్ని నిలువరించాలి. ఆర్థికంగా నష్టపోయిన దేశాలు, కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. ప్రత్యామ్నాయ వృత్తుల్లో పునరావాసానికి వారికి శిక్షణఇవ్వాలి. జీవకణాల నుంచి కల్చర్‌ ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో డిమాండుకు తగ్గ మాంసాహారాన్ని ఉత్పత్తి చేయడం, వన్యప్రాణులతో సంపర్కాన్ని తగ్గించడం... ఇవన్నీ జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ వాప్తిని తగ్గించేందుకు మనం తీసుకోవాల్సిన కీలక చర్యలు.

స్పానిష్‌ ఫ్లూ సృష్టించిన విధ్వంసం చరిత్రలో ఎవరూ మరచిపోలేనిది. 1914-18 మధ్యకాలంలో జరిగిన ప్రపంచ యుద్ధం వల్ల రెండు కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా, స్పానిష్‌ ఫ్లూ వల్ల మరణాలు అంతకు అయిదు రెట్లు ఎక్కువ. ఒక్క భారతదేశంలోనే ఒకటిన్నర కోట్ల నుంచి రెండు కోట్ల మంది దాకా మృతులైనట్లు అంచనా.

శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సురక్షితమైన, సమర్థమైన టీకాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. అత్యవసర వినియోగం కోసం అమెరికా నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ రెండు వ్యాక్సిన్లను ఆమోదించింది. రాబోయే నెలల్లో ఇంకా పలు టీకాలకు ఆమోదం లభించనుంది. 2021 చివరికి చాలామేర ప్రజలకు వ్యాక్సిన్లు అందుతాయని, మహమ్మారి సద్దుమణుగుతుందని అనుకోవచ్చు.

తమ జనాభాలో ఎక్కువ మంది కొవిడ్‌ బారిన పడటం చాలా దేశాలను వణికించింది. ఇతర  దేశాల్లో కంటే మన దేశంలో వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉంది. వ్యాధి సోకినవారిలోనూ ఎక్కువమందిలో తీవ్రత తక్కువగా ఉంది. ఫ్లూ, ఇతర కరోనా సమస్యలకు మనలో జన్యుపరమైన నిరోధం ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం కావచ్చు.

కొవిడ్‌ ప్రభావం వ్యవసాయం మీద కన్నా పరిశ్రమలు, సేవల రంగాలపై ఎంతో ఎక్కువగా ఉంది. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఉపాధిని కోల్పోయారు. దాదాపు 30 కోట్ల మంది కొత్తగా పేదలు, పస్తులుండేవారి జాబితాలో చేరిపోయారు. 1929 నాటి మహా మాంద్యం సృష్టించిన ఆర్థిక విధ్వంసాని కన్నా ఇదేమీ తక్కువ కాదు.

ఇళ్లలో పనిచేసే శ్రామికుల్లో అనేక మందికి తిరిగి ఉద్యోగాలు లభించవు. వాషింగ్‌ మెషీన్లు, రోబో స్వీపర్లు తదితర వినియోగ వస్తువులతో పనుల్ని సొంతంగా చేసుకోవడాన్ని మధ్యతరగతి ప్రజానీకం అలవరచుకొంది. పేద వర్గాల్లో మహిళలు సంపద సృష్టిలో భాగం కావడం ఇప్పటికే ప్రమాదకర రీతిలో పడిపోతోంది. ఉపాధి కలాపాల్లో మహిళల వాటా తగ్గుతున్న పెద్ద దేశం ప్రపంచంలో భారత్‌ ఒక్కటే.

యాంటీ-ఎయిడ్స్‌ మందుల్ని ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ, అత్యంత చౌక ధరకు అందిస్తున్న దేశం భారత్‌. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.6 కోట్ల మంది యాంటీ రిట్రోవైరల్‌ (యాంటీ-ఎయిడ్స్‌) చికిత్సను తీసుకుంటున్నారు. ఇతర అనేక వైరస్‌లు... సార్స్‌- 1, ఎబోలా, మిడిల్‌-ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (మెర్స్‌) మొదలైనవి వన్యప్రాణుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించి అలజడి సృష్టించాయి.


 

Posted Date: 30-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం