• facebook
  • whatsapp
  • telegram

ప్రజల ఆరోగ్యంతోనా రాజీ?

‘తగినంత పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడం ద్వారా ప్రజలకు పౌష్టికాహార భద్రత కల్పించడం’- జాతీయ ఆహార భద్రత చట్టం నిర్దేశించిన సమున్నత లక్ష్యం. నెలకు తలసరి నిర్దిష్ట పరిమాణంలో సరఫరాల ద్వారా ఆహార భద్రత ఒనగూడుతుందనుకొంటున్న ప్రభుత్వం- ఇతర ఆహార ఉత్పాదనల్లో నాణ్యతను పట్టించుకోకుండా ఆరోగ్య భద్రతను పణం పెడుతోందన్నది వాస్తవం. వంట నూనెలు, వనస్పతి, కృత్రిమ నవనీతం వంటి వాటిలో ఉండే సాచురేటెడ్‌ కొవ్వు పదార్థాలు (టీఎఫ్‌ఏ) ప్రాణాంతకంగా మారి ఏటా ప్రపంచవ్యాప్తంగా 5.4 లక్షలమంది అర్ధాంతర మరణాలకు కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ కొన్నేళ్లుగా మొత్తుకొంటోంది. టీఎఫ్‌ఏల కారణంగా చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోయి గుండె సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయన్న ఆరోగ్య సంస్థ- 2023కల్లా వాటి వినిమయాన్ని ప్రపంచ దేశాలన్నీ పూర్తిగా మానేయాలని గట్టిగా సూచించింది. పారిశ్రామికంగా ఉత్పత్తి అయ్యే ప్రమాదభరిత కొవ్వు పదార్థాల స్థానే వినియోగించగల ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ వడివడిగా వాటి దిశగా మళ్ళేందుకు ‘రిప్లేస్‌’ పేరిట ఆరు సూత్రాల కార్యాచరణను ప్రకటించింది. తదనుగుణ చర్యలకు సిద్ధం కావాలంటూ 2018లోనే ఆహార పరిశ్రమవారికి కేంద్రం తేల్చిచెప్పింది. వంట నూనెలు, వనస్పతి వంటి వాటిలో టీఎఫ్‌ఏ ఈ ఏడాది మూడు శాతానికి, వచ్చే సంవత్సరం రెండు శాతానికి పరిమితం కావాలని ఆహార భద్రత ప్రమాణాల సంస్థ తాజాగా గిరిగీసింది. నూనెలు, కొవ్వుపదార్థాల్లో టీఎఫ్‌ఏ పరిమితి 10శాతంగా 2011లో నిర్ధారించిన ప్రభుత్వం, 2015లో దాన్ని అయిదు శాతానికి తగ్గించడం తెలిసిందే. టీఎఫ్‌ఏపై ఆంక్షల కొరడా ఝళిపించిన తొలి దేశమైన డెన్మార్క్‌లో ఆర్థిక సహకార అభివృద్ధి సంఘ (ఓఈసీడీ) దేశాలతో పోలిస్తే గుండె సంబంధ వ్యాధి మరణాలు వేగవంతంగా తగ్గిపోవడం గమనార్హ విశేషమే. ఈ పరిస్థితుల్లో జనారోగ్య భద్రత రీత్యా సత్వరం టీఎఫ్‌ఏ నిషేధం దిశగా అడుగులు కదపాల్సింది పోయి, క్రమానుగత తగ్గింపులు ఎవరిని ఉద్ధరించడానికి?

ప్రపంచంలోనే అత్యధికంగా ఏటా టీఎఫ్‌ఏ కారక మరణాలు 77వేల దాకా నమోదవుతున్న దేశం ఇండియాయేనని అధ్యయనాలు చాటుతున్నాయి. గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయాలకు టీఎఫ్‌ఏ పుణ్యం కట్టుకొంటోందని వినియోగదారుల సంఘాలు మొత్తుకొంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ మధుమేహుల రాజధానిగా ఇండియా దుష్కీర్తి మూటగట్టుకోగా, తాజా ఆరోగ్య సర్వే నిర్వహించిన 22 రాష్ట్రాల్లో 19 చోట్ల పురుషులు, 16 రాష్ట్రాల్లో మహిళలు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై కొవిడ్‌ మహమ్మారి కసిగా కోరచాస్తోందన్న వాస్తవాల వెలుగులో- అన్ని దశల్లోనూ జనారోగ్య భద్రతకే ప్రాధాన్యం దక్కితీరాలి! పౌష్టికాహార లేమి, స్థూలకాయం జంట సమస్యలుగా పైకి తేలుతున్న ఇండియాలో, సాంక్రామిక వ్యాధులకు జతపడి సాంక్రామికేతర జబ్బులూ విజృంభిస్తున్న వేళ- ఆహార భద్రతా ప్రమాణాలు మరింత పటిష్ఠంగా ఉండాలి. దురదృష్టం ఏమిటంటే- దేశవ్యాప్తంగా   28.5శాతం ఆహార పదార్థాలు నాసిరకమో లేదంటే ప్రమాణాలకు తగినట్లుగా లేనివో పోగుపడ్డాయని, 39శాతం పాల నమూనాల పరిస్థితీ అదేనని జాతీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అధ్యయనంలోనే తేలింది. కల్తీ ఆహారంతో వివిధ జబ్బుల పాలపడుతున్న జనం ఏటా లక్షా 78వేల కోట్ల రూపాయల చికిత్స వ్యయం భరించాల్సి వస్తోందని పార్లమెంటరీ స్థాయీ సంఘమే 2018లో ప్రకటించింది. ‘సరైన ఆహారం తినండి- కొవిడ్‌ను ఎదుర్కోండి’ నినాదంతో రోగ నిరోధక శక్తి పెంపొందించే మార్గదర్శకాల్ని నిరుడు జూన్‌లో వెలువరించిన ప్రమాణాల సంస్థ పనిపోకడలు సాకల్యంగా మారాల్సిన సమయమిది. వచ్చే ఏడాదికల్లా టీఎఫ్‌ఏను నిషేధించి, ఆహార భద్రతకు పూచీపడే కేంద్ర సంస్థగా దాన్ని ప్రామాణీకరిస్తేనే, ఆరోగ్య భారతావని సాక్షాత్కరించేది!

- ఈనాడు ఎడిటోరియ‌ల్‌
 

Posted Date: 06-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం