• facebook
  • whatsapp
  • telegram

ప్రమాదాలకు రాచబాటలు

‘టోల్‌’ పెరుగుతున్నా అధ్వాన నిర్వహణ

జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధి, నిర్వహణను మెరుగు పరచేందుకు కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి నిర్ణీత మార్గాల్లో రహదారి పన్ను వసూళ్లను ప్రారంభించింది. సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఆయా రహదారులపై ప్రయాణించేవారే చెల్లించేలా టోల్‌ పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రారంభమైనా- అనంతరం పూర్తిగా ప్రైవేటుకే అప్పగించారు. నిర్మాణం, నిర్వహణ, బదిలీ (బీఓటీ) విధానంలోకి మారింది. కొన్ని ప్రాంతాల్లో రహదారుల నిర్వహణ బాగున్నా చాలా ప్రాంతాల్లో పరిస్థితి దుర్భరంగా మారుతోంది.

దేశవ్యాప్తంగా 2020 మార్చి నాటికి 29,666 కిలోమీటర్ల పరిధిలో 556 టోల్‌ప్లాజాలు ఉండగా... తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 42 ఏర్పాటయ్యాయి. 2018-19లో టోల్‌ వసూళ్లు రూ.24,396 కోట్లు, 2019-20 నాటికి రూ.26,851 కోట్లకు పెరగ్గా ఫాస్టాగ్‌ విధానం అమలును వేగవంతం చేయడం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.34 వేల కోట్లకు చేరుతుందని కేంద్రమంత్రి ఇటీవల వెల్లడించారు. దేశంలో కొన్ని ప్లాజాల పరిధిలో నిర్వహణ బాగున్నా, చాలా వాటి పరిస్థితి దుర్భరంగానే ఉంది. సౌకర్యాల కల్పనపై సరైన చర్యలు తీసుకోవడం లేదు. రహదారుల విస్తరణ పూర్తయిన నాటి నుంచి కొంతకాలం పాటు నిర్వహణ తీరు బాగున్నా, తరవాత సరిగ్గా పట్టించుకోవడం లేదు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఏలూరు దాటిన అనంతరం దాదాపు విశాఖ వరకు అధ్వానంగా ఉంది. రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు టోల్‌ రుసుము ఎందుకు చెల్లించాలంటూ పలువురు టోల్‌ ప్లాజాల వద్ద సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు. రహదారుల దుస్థితిపై పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెడుతున్నారు. అస్తవ్యస్త రహదారుల్లో గోతులను తప్పించే క్రమంలో పలు సందర్భాలలో ప్రమాదాల బారిన పడుతున్నారు.

జాతీయ రహదారుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం, కల్వర్టులు, వంతెనలు, రాష్ట్ర, గ్రామీణ రహదారులను అనుసంధానించే చోట సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. గత అయిదేళ్లుగా దేశవ్యాప్తంగా సగటున ఏటా 1.5లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 4.5 లక్షల మంది గాయాల బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహనాల్లో ఒక శాతం కూడా లేని మన దేశంలో 11 శాతం మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాల్లో దాదాపు 60శాతం జాతీయ రహదారులపై, 16 శాతం రాష్ట్ర రహదారులపై చోటుచేసుకుంటున్నాయి. దీన్నిబట్టి మన రహదారుల నిర్వహణ, వాహనాల తీరు, చోదక విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయో అవగతమవుతోంది. ప్రమాదాల నివారణకు ఏటికేడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నా అమలులోకి వచ్చేసరికి నీరుగారిపోతున్నాయి. ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా దాదాపు రూ.7లక్షల కోట్లు దేశం నష్టపోతున్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల లెక్క చెప్పారు. ప్రమాదాలను ఏటా పది శాతం చొప్పున తగ్గించుకున్నా దేశానికి లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ శాతం రహదారులు రెండు వరసల్లోనే ఉన్నాయి. వీటిని నాలుగు వరసలుగా అభివృద్ధి చేస్తే కొంతమేర ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది.

ఏటా క్రమం తప్పకుండా టోల్‌ రుసుములను పెంచుతున్న కేంద్రం అంతే శ్రద్ధతో రహదారుల తీరును సమీక్షించాల్సిన అవసరం ఉంది. ప్రతి వంద కిలోమీటర్ల పరిధిలో ఒక ఉన్నతాధికారికి రహదారులు, టోల్‌ ప్లాజాల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించాలి. ప్లాజాల నిర్వాహకులు రోడ్ల నిర్వహణలో సరైన ప్రమాణాలు పాటించకపోయినా, విధిగా సమకూర్చాల్సిన వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయకపోయినా సంబంధిత అధికారులను బాధ్యులను చేసేలా నిబంధనలు రూపొందించాలి. వచ్చే అయిదేళ్లలో రూ.1.34 లక్షల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న ప్రభుత్వం, అదేస్థాయిలో రహదారుల నిర్వహణ, విస్తరణపై దృష్టి సారించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. 2019లో కేంద్రం రూపొందించిన మోటారు వాహన సవరణ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేస్తే ప్రమాదాలు, మృతుల సంఖ్యకు వేగంగా అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది.

- ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు
 

Posted Date: 13-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం