• facebook
  • whatsapp
  • telegram

పారుబాకీలతో బ్యాంకులు బేజారు!

మున్నెన్నడూ లేనంత కష్టకాలం

బ్యాంకులను అసలే రుణాలకు సంబంధించిన సమస్యలు వేధిస్తున్నాయి. పైగా భారీ స్థాయి విలీనాలతో ఉత్పన్నమైన గందరగోళం. వీటికి ఇప్పుడు మహమ్మారి తోడైంది. పారు బాకీల ముప్పు మున్నెన్నడూ లేనంతగా నేడు బ్యాంకులను వెన్నాడుతోంది. వాటి నుంచి అప్పులు తీసుకున్న రుణగ్రహీత సంస్థలు పలు సమస్యల వలయంలో కూరుకుపోయాయి. అవి ఇప్పుడు అసాధారణమైన నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రిజర్వు బ్యాంకు కల్పించిన ఆరు నెలల మారటోరియం వెసులుబాటు గతేడాది ఆగస్టుతో ముగిసింది. రుణగ్రహీతలు ఇక పెండింగు బాకీలు తీర్చాలి. మరోవంక, తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడానికి నగదు సర్దుబాటు చేసుకోవాలి. అప్పులు తీర్చాలా, వ్యాపారం కొనసాగించాలా... అనే సందిగ్ధంలో పడిన సంస్థలు- రుణ బకాయిల చెల్లింపులను వాయిదా వేయాలని నిర్ణయించుకుంటున్నాయి. వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడానికి అంతంతమాత్రంగా ఉన్న తమ నగదు రాబడులను వినియోగిస్తున్నాయి. అయినప్పటికీ ఆర్‌బీఐ పథకాల కింద రుణాల పునర్వ్యవస్థీకరణకు అర్హత లభిస్తే తప్ప, అవి ‘డిఫాల్ట్‌’ ముప్పు నుంచి తప్పించుకోలేవు. దాదాపు 40శాతం బ్యాంకు రుణగ్రహీతలు మారటోరియం వినియోగించుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రానిబాకీల వర్గీకరణలో బ్యాంకులకు కల్పించిన వెసులుబాటు నిబంధనను ఆర్‌బీఐ ఉపసంహరించుకున్న వెంటనే ఇవన్నీ బకాయిలు అవుతాయి. బ్యాంకింగు రంగం అసాధారణమైన దుస్థితిని ఎదుర్కొంటోంది. వాటి రానిబాకీలు 2021-22లో భారీగా పెరుగుతాయి. ఈ ముప్పు 2022-23 సంవత్సరానికీ విస్తరించే ప్రమాదం ఉంది.

నిరర్థక ఆస్తుల తీవ్రత

రాని బాకీలు లేదా పారు బాకీలు లేదా మొండి బాకీలు... వీటిని బ్యాంకింగ్‌ పరిభాషలో నిరర్థక ఆస్తులు (నాన్‌-పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌- ఎన్‌పీఏలు)గా వ్యవహరిస్తారు. ఈ రుణాల మీద బ్యాంకులకు వడ్డీ ఆదాయం రాదు. రుణ గ్రహీత తాను తీసుకున్న రుణం మీద వడ్డీని లేదా రుణ వాయిదాను లేదా ఈ రెండింటినీ గడువు తేదీ నుంచి 90 రోజుల్లోగా చెల్లించలేనట్లయితే... ఆ రుణం ఎన్‌పీఏ అవుతుంది. వీటిని స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ), నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) అని రెండు రకాలుగా లెక్కిస్తారు. బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో వాటి మొత్తం ఎన్‌పీఏలు ఎంత శాతం ఉన్నదీ జీఎన్‌పీఏలు వెల్లడిస్తాయి. వీటి ముప్పును దృష్టిలో ఉంచుకుని, బ్యాంకులు కొన్ని నిధులను ప్రత్యేకంగా కేటాయించి పక్కన పెడతాయి. ఇలా చేసిన కేటాయింపులను (ప్రొవిజన్లను) జీఎన్‌పీఏల నుంచి తీసివేస్తే వచ్చేవి ఎన్‌ఎన్‌పీఏలు. బ్యాంకుల ఎన్‌ఎన్‌పీఏలు బ్యాంకింగ్‌ వ్యవస్థకు నిరంతరం మెడమీద కత్తిలా ఉంటాయి. బ్యాంకులు నిరర్థక ఆస్తుల రిస్కు నుంచి బయటపడుతున్న తరుణంలో మహమ్మారి దాపురించింది. 2019 మార్చిలో 9.1శాతం ఉన్న జీఎన్‌పీఏలు 2020 మార్చిలో 8.2శాతానికి క్షీణించాయి. ఇక 2020 సెప్టెంబరు నాటికల్లా ఇవి 7.5శాతానికి దిగి వచ్చాయి. అయితే, మహమ్మారి కమ్ముకొచ్చి ఆర్థిక వ్యవస్థను పిప్పి చేసింది. రుణగ్రహీతలు సంక్షోభంలో కూరుకుపోయారు. ఆర్‌బీఐ 2020 జూన్‌లో విడుదల చేసిన ఆర్థిక సుస్థిరత నివేదిక అంచనా ప్రకారం- పరిస్థితి ఇలాగే కొనసాగితే 2021 మార్చి నాటికి ఎన్‌పీఏలు 12.5శాతానికి, ఒత్తిళ్లు ఇంకా తీవ్రరూపం దాల్చితే 14.7శాతానికి చేరే అవకాశం ఉంది. తీవ్ర ఒత్తిడి పరిస్థితులు ఉత్పన్నమైతే నిరర్థక ఆస్తులు ఆర్‌బీఐ అంచనాలను మించిపోతాయి.

బ్యాంకులకు అధిక జీఎన్‌పీఏలను కట్టడి చేసే శక్తి ఉంది. స్థూల ఆర్థిక అస్థిరతల వల్లే కాకుండా విధానపరమైన మార్పులు కూడా ఎన్‌పీఏలలో ఆటుపోట్లకు దారితీస్తాయి. బ్యాంకింగ్‌ రంగ సంస్కరణల్లో భాగంగా రుణాల వర్గీకరణ నిబంధనలను అమలు చేసినప్పుడు... 1993లో జీఎన్‌పీఏలు 23.2శాతంగా నమోదై శిఖర స్థాయికి చేరాయి. అయితే ఒక దశాబ్దం తరవాత 2003-04 నాటికి 7.26శాతానికి, మరో పదేళ్ల తరవాత 2013-14 నాటికి 3.83శాతానికి క్షీణించాయి. 2015 సెప్టెంబరులో మరోసారి విధానపరమైన మార్పులు వచ్చాయి. ఆస్తుల నాణ్యతా సమీక్ష (ఏక్యూఆర్‌) పేరిట బ్యాంకుల నాసిరకం రుణాలను గుర్తించేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక ఆడిట్‌ విధానం ప్రవేశపెట్టింది. తనఖా రుణాల పునర్వ్యవస్థీకరణ ఒప్పందాల పద్ధతిని ఉపసంహరించింది. దీంతో జీఎన్‌పీఏలు 2017-18 నాటికి గరిష్ఠంగా 11.8శాతానికి చేరాయి. విధాన నిర్ణయాలకు స్థూల ఆర్థిక స్థితిగతులకు బాహ్యవాతావరణానికి అనుగుణంగా ఎన్‌పీఏలు అలా హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా కొవిడ్‌ కారక ఒత్తిడితో జీఎన్‌పీఏలు 14.5శాతం మించిపోయినా, 2022-23 నుంచి తిరోగమనం పట్టి తిరిగి ఏకఅంకె వద్ద స్థిరపడతాయి. ఏదేమైనా ఉద్దేశపూర్వక ఎగవేతల ధోరణిని అరికట్టాలి.

సామాజిక హాని

జీఎన్‌పీఏలు మహమ్మారి వల్ల లేదా ఇతర బాహ్య ఘటనల వల్ల అమాంతం పెరిగినప్పటికీ, ఒక మొండి బాకీ పర్యవసానం ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా ఉంటుంది. చక్కదిద్దలేనంత నష్టం వాటిల్లుతుంది. భారీ స్థాయి ఎన్‌పీఏలు బ్యాంకింగ్‌ వ్యవస్థను అనేక విధాలుగా అస్థిరపరుస్తాయి. వాటితో సంబంధం ఉండే అమాయక ప్రజలు ఎంతటి క్షోభకు గురవుతారో చెప్పనలవి కాదు. రాని బాకీ కోసం బ్యాంకులు చేసే కేటాయింపు వాటి లాభాలను ప్రభావితం చేస్తుంది. వాటి పెట్టుబడి పునాదులను కదిలించి వేస్తుంది. నిధుల చలామణీ తగ్గిపోతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిధుల ప్రవాహం సన్నగిల్లుతుంది. అంతిమంగా జీడీపీపై ప్రభావం పడుతుంది. కాబట్టి, మొండి బాకీ సమాజ సౌభాగ్యాన్ని తినేసే వైరస్‌ లాంటిది. రుణం తిరిగి చెల్లించాల్సిన నైతిక బాధ్యత ఎంత అవసరమో వివరిస్తూ రుణగ్రహీతల్లో చైతన్యం తీసుకురావాలి. మొండి బాకీ సమాజానికి హాని చేస్తుంది. అది వ్యవస్థాగత ముప్పు. ఈ బెడదను నివారించలేనట్లయితే, చివరకు ఎగవేత రుణాలను రద్దు చేయడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పన్నుచెల్లింపుదారుల కష్టార్జితాన్నే వినియోగించాల్సి వస్తుంది. మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఎంతో కృషి జరుగుతోంది. అలాగే రుణాలు ఉద్దేశపూర్వకంగా ఎగవేసే నేరగాళ్లకు శిక్ష పడేలా చూడటం తప్పనిసరి!

సన్నద్ధత అవసరం

పారుబాకీల ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు బ్యాంకులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. వితరణ సామర్థ్యం పెంచుకుంటూనే, తామిచ్చే రుణాల నాణ్యతను కాపాడుకోవడానికి దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించుకోవాలి. కొవిడ్‌ తెచ్చిన అసాధారణ దురవస్థను అవగాహన చేసుకుంటూ, వచ్చే రెండేళ్లో ఇంకా ఎక్కువ కాలమో బ్యాంకులు అధిక ఎన్‌పీఏలతో సహజీవనం చేయక తప్పదు. రుణాల నాణ్యత పట్ల అప్రమత్తంగా ఉండటం ఈ పరిస్థితిలో అత్యవసరం. ఆద మరచినట్లయితే బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అలా అని క్రెడిట్‌ రిస్కు తీసుకోవడంలో వెనకాడితే, ఆ వెరపు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకే గొడ్డలిపెట్టు అవుతుంది.

- డాక్టర్‌ కె.శ్రీనివాసరావు
 

Posted Date: 13-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం