• facebook
  • whatsapp
  • telegram

మొన్న గతి మాలి... నేడు గతి మారి!

సర్కారీ బడికి సొబగులద్దిన కేరళ

కేరళలోని వేలాది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు 1995కు ముందు తాము కొలువులు కోల్పోతామనే భయం పట్టుకుంది. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలపై మొగ్గు చూపడంతో... సర్కారు బడుల నుంచి పిల్లలు పెద్దయెత్తున ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరుతూ ఉండటమే అందుకు కారణం. బడి మానేస్తున్న విద్యార్థులను ఆపడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా అవేమీ ఫలించలేదు. క్యాపిటేషన్‌ రుసుములు, విద్యా రుసుములంటూ ప్రైవేటు పాఠశాలలు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నా- లెక్క చేయకుండా మధ్యతరగతి కుటుంబాలు తమ కష్టార్జితాన్ని అక్కడ ధారపోసేందుకే సుముఖత చూపేవారు.

మేల్కొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు

సరిగ్గా అప్పుడే... సర్కారీ బడుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి తాము పని చేయాల్సిన సమయం ఆసన్నమైనట్లు తేటతెల్లమైంది. కానీ, ప్రభుత్వపరంగా నిధుల కొరత వారు కార్యోన్ముఖులయ్యేందుకు ఆటంకంగా పరిణమించింది. 1995లో ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఇతర శ్రేయోభిలాషులతో కలిసి పదోతరగతి విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనతి కాలంలోనే అది ఫలితాలనిచ్చింది. సంవత్సరాంతానికల్లా పాఠ్యప్రణాళికను పూర్తి చేశారు. ఇందుకోసం రాత్రివేళల్లో బడులు నిర్వహించారు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్న విద్యార్థులపై దృష్టి నిలిపారు. మొత్తానికి గణాంకాల్లో పురోగతి ఉన్నా, నాణ్యతపరంగా కొన్ని ఖరీదైన ప్రైవేటు విద్యాలయాలే ముందు నిలిచాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చేరిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేరళ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. గడచిన ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.75లక్షల మంది విద్యార్థులు సర్కారీ బడుల్లో చేరారు. అందులో ఎక్కువ శాతం ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చినవారే కావడం విశేషం. గత నాలుగేళ్లలో ఎనిమిది లక్షల మంది కొత్త విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వం చేపట్టింది కొత్త ప్రయోగమేమీ కాదు. ఈ తరహా ప్రయత్నాలకు 2006లో వి.ఎస్‌.అచ్యుతానందన్‌ ముఖ్యమంత్రి అయినప్పుడే బీజం పడింది. పినరయి విజయన్‌ నేతృత్వంలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం 2016 మేలో ఏర్పాటయింది. విద్యారంగంలో ప్రజాస్వామ్యీకరణ, సమగ్రతలను తీసుకురావడమే ధ్యేయంగా 2016లో ‘ప్రభుత్వ విద్యారంగ పునరుజ్జీవ కార్యక్రమం (పబ్లిక్‌ ఎడ్యుకేషన్‌ రెజువెనేషన్‌ మిషన్‌)’ ప్రారంభమైంది. గడచిన నాలుగేళ్లలో ఈ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలు సాధించింది. నీతి ఆయోగ్‌ విద్యా నాణ్యతా సూచీ-2019లో కేరళ 82.02 స్కోరు సాధించింది. తద్వారా దేశంలోనే కేరళ- పాలన, విద్యాపరంగా మొదటి స్థానంలో నిలిచింది.

ఈ మిషన్‌ను ప్రారంభించడం ద్వారా కేరళ ప్రభుత్వం ఎన్నో వినూత్న పద్ధతులకు అంటు కట్టింది. 2001-02లో మొదలై, అమలు కాని ‘ఐటీ ఎట్‌ స్కూల్‌’ ప్రాజెక్టును ‘కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (కైట్‌) పేరుతో పునఃప్రారంభించింది. 15 వేల ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో సాంకేతిక సదుపాయాలను రూపొందించి, అభివృద్ధి చేయడం ఈ సంస్థ ముఖ్యోద్దేశం. కైట్‌ రూపొందించిన ‘లిటిల్‌ కైట్స్‌ ఐటీ క్లబ్స్‌’ లక్ష మందికి యానిమేషన్‌, సైబర్‌ భద్రత, హార్డ్‌వేర్‌, ఎలెక్ట్రానిక్స్‌, మలయాళం కంప్యూటింగ్స్‌, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌లలో శిక్షణనిచ్చింది. కైట్‌ ద్వారా రాష్ట్రంలోని లక్షన్నర మంది ఉపాధ్యాయులు, 50 లక్షలమంది విద్యార్థులు లబ్ధి పొందారు. 16 వేలకు పైగా ప్రభుత్వ బడుల్లో సాంకేతిక మౌలిక సదుపాయాలు అందించారు.

అందరికీ అందుబాటులో విద్య

పాఠశాలల నిర్వహణలో ప్రజాభాగస్వామ్యాన్ని కల్పించడం అతిపెద్ద ముందడుగు. స్థానిక ప్రజలే సర్కారు బడులకు యజమానులు. ఈ విధానానికీ కేఐఐఎఫ్‌బీ నిధులు సమకూర్చింది. దీంతో పాటు స్థానిక సంస్థలు అందించిన నిధులు, ఎంపీ, ఎమ్మెల్యేల నిధులు తోడై మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కేరళలో విద్యార్థులు గతంలో ప్రభుత్వ పాఠశాలలపై విముఖత చూపడానికి ఆంగ్ల బోధనలో నాణ్యత లేకపోవడం ఒక కారణం. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అంతేకాదు- విద్యార్థులు ఆంగ్లం లేదా మలయాళం మాధ్యమాల్లో దేన్నైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛనిచ్చింది. కేరళలోని అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రెండు మాధ్యమాలూ ఉంటాయి. ఈ రెండూ విద్యార్థులను సమానంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రభుత్వం సంక్షేమ విద్యావిధానానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులందరికీ ఉచితంగా యూనిఫాం, పుస్తకాలు అందజేస్తారు. తొమ్మిది, పది తరగతుల బాలికలకు- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు యూనిఫాం ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం కేరళ సర్కారీ బడుల్లోని నాణ్యమైన విద్య, వసతులు, మౌలిక సదుపాయాలు ప్రపంచంలోని ఏ ఇతర ప్రైవేటు పాఠశాలకూ తీసిపోవు. ఏటా విద్యార్థుల సంఖ్య విశేషంగా పెరగడమే సర్కారీ బడుల్లో కేరళ ప్రభుత్వం సాధించిన పురోగతికి నిదర్శనం.

- కె.ప్రవీణ్‌కుమార్‌
 

Posted Date: 13-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం