• facebook
  • whatsapp
  • telegram

తరుముకొస్తున్న నీటి సంక్షోభం

మేల్కొనకపోతే గడ్డు కాలమే

మానవ శరీరంలో 60శాతంపైగా నీరు ఉంటుంది. అంటే, మనిషి జీవించడానికి తాగునీరు ఎంత అవసరమో తెలుస్తుంది. నిత్యం వంట, స్నానంవంటివి చేయడానికి; పరిశుభ్రంగా ఉండటానికి నీరు తప్పనిసరి. ఆహారం, దుస్తులు, శాస్త్ర సాంకేతిక పరికరాలు ఉత్పత్తి చేయడానికి, వివిధ రకాల వ్యర్థాలను తరలించడానికి, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఎల్లప్పుడూ నీరు అందుబాటులో ఉండాలి. ప్రపంచంలో మానవాళి మనుగడ సక్రమంగా సాగేందుకు నీటికి ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ప్రపంచ నీటి వనరుల్లో 97.5శాతం ఉప్పునీరే. 2.5శాతం మంచినీటిలో భూగర్భ జలం 0.31శాతమే. పెరుగుతున్న జనాభా, సంపద, ఆహార అలవాట్ల మార్పు, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ తదితర కారణాలు ప్రపంచ నీటి వనరులను సంక్షోభ దిశగా నెట్టివేస్తున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుంటువడక తప్పదు. నీటి సవాళ్లను భవిష్యత్తులో ఎలా అధిగమించాలి, ప్రస్తుతం ఉన్న నీటిని ఎలా పరిరక్షించాలి, నిర్వహించాలి... మొదలైన అంశాలపై దృష్టి సారించి పరిష్కారాలు సాధించినప్పుడే మానవాళి మనుగడ సజావుగా సాగుతుంది.

‘తీవ్ర కొరత’ దేశాల్లో భారత్‌...

‘ప్రపంచ ఆహార, నీటి సంక్షోభ పరిశోధన కార్యక్రమం (2020)’ ప్రకారం అధికస్థాయిలో నీటి వినియోగం ఉన్న రంగం వ్యవసాయమే. ప్రపంచవ్యాప్తంగా ఏటా 69శాతం నీటిని వ్యవసాయానికి, 19శాతం పరిశ్రమలకు, 12 శాతం గృహావసరాలకు వాడుతున్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో వ్యవసాయం జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతోంది. నీటివనరులు ప్రపంచవ్యాప్తంగా సమానమైన రీతిలో విస్తరించి ఉండవు. వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, నీటి పొరల నిర్మాణ తీరును బట్టి అవి ఆధారపడి ఉంటాయి. ఇవి అనుకూలంగా లేని ప్రాంతాల్లో నీటి కొరత తాండవిస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో తరచూ కనిపిస్తాయి. భూగర్భ జల క్షీణత, మంచు కరిగిపోవడం, ఉపరితల జలనష్టం మొదలైన కారణాలతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 19 నీటి క్షీణత ప్రాంతాలను గుర్తించారు. వాటిలో ఉత్తర భారతదేశం, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, మధ్య ఆసియా ఉన్నాయి. సుమారు 50 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. వారిలో ఎక్కువమంది భారత్‌, పాకిస్థాన్‌, ఈజిప్ట్‌, మెక్సికో, సౌదీ అరేబియా, యెమెన్‌లలో ఉన్నారు. సంవత్సరంలో కనీసం 30 రోజులైనా నీరు అందని ప్రజల సంఖ్య 400 కోట్లు. కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశుభ్రమైన నీరు లభించడం కష్టతరంగా మారింది.

‘అంతర్జాతీయ భూగోళ - జీవగోళ కార్యక్రమం (2018)’ ప్రకారం 1950 నుంచి నీటి వినియోగం మూడు రెట్లు, జనాభా రెండు రెట్లు పెరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచంలోని 45 నగరాల్లో సుమారుగా 47 కోట్ల మంది ప్రజలు అధిక నీటి ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికిపైగా సంవత్సరంలో కనీసం కొంతకాలమైనా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అతి తీవ్రమైన నీటి కొరత తాండవించే ప్రాంతాల్లో 180కోట్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని అంచనా. 2015 నాటి నీటి లభ్యతను లెక్కలోకి తీసుకుంటే- 2050 నాటికి పట్టణాల్లో నీటిలభ్యత 66శాతం తగ్గుతుందని అంచనా. దీనివల్ల జనానికి తాగునీటిని అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఏటా రెండు లక్షల కోట్ల డాలర్లకు పైగా వ్యయమవుతుందని- నీటి కొరత, పారిశుద్ధ్య సేవా లోపాలవల్ల ఏటా 2.60 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అంచనా.

తరిగిపోతున్న భూగర్భ జలాలు

‘ప్రపంచ ఆహార, నీటి సంక్షోభ పరిశోధక కార్యక్రమం (2020)’ వెల్లడించిన ప్రకారం- ప్రపంచంలో పలుచోట్ల తాండవిస్తున్న కరవు, పెచ్చరిల్లుతున్న కాలుష్యం కారణంగా ఉపరితల జలాలు అందుబాటులో లేనప్పుడు, భూగర్భ జలమే ముఖ్యమైన నీటి వనరు అవుతుంది. ఇది ప్రపంచంలో సగం జనాభాకు తాగునీటిని అందించగలదు. పంటల సాగుకు ఉపయోగించే నీటిలో భూగర్భ జలాల వాటా 40శాతం పైనే. భూగర్భ జలాలను అధికంగా వినియోగించడంలో భారత్‌, జకార్తా, మెక్సికో, వియత్నాం, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాలు ముందున్నాయి, మరోవైపు భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. భూగర్భ జలాలను సంరక్షించాలంటే నీరు భూమిలోకి ఇంకేలా (రీఛార్జ్‌) కార్యక్రమాలు చేపట్టాలి.‘రీఛార్జ్‌’ విధానం సమర్థమైన నీటి వినియోగాన్ని ప్రోత్సహించే ఇతర చర్యలకూ ఊతమిస్తుంది.

పట్టణ నీటి సరఫరా వ్యవస్థలు రవాణా చేసే నీటిలో 10-30శాతం వృథా అవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే 70శాతం వరకు ఉంటుంది. దీన్ని ఆదాయేతర నీటివనరుగా పిలుస్తారు. ఈ నష్టాన్ని సగానికి తగ్గిస్తే తొమ్మిది కోట్ల మంది ప్రజలకు తగినంత నీరు లభిస్తుంది. దీనివల్ల నీటిపై ఒత్తిడి తగ్గుతుంది. నీటి నిల్వలు పెరగడానికి చెరువులు ఆనకట్టల నిర్మాణం, నీటి పునర్వినియోగం, భూగర్భ జలాల రీఛార్జ్‌ వంటి పద్ధతులను యుద్ధప్రాతిపదికన అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మున్ముందు తీవ్రతరమయ్యే నీటి సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కోగలం.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు (భూగర్భ రంగ నిపుణులు)
 

Posted Date: 09-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం