• facebook
  • whatsapp
  • telegram

నగరాలకు కొత్త రూపు!

‘స్మార్ట్‌’ పథకం - పెరగాలి వేగం

దేశంలో నగరాల రూపురేఖలు మార్చి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచే సదాశయంతో ‘స్మార్ట్‌ సిటీ మిషన్‌’ (ఎస్‌సీఎం) పట్టాలకెక్కింది. రెండు లక్షల కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో మోదీ ప్రభుత్వం 2015లో ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా మొదటి, రెండు విడతల్లో వంద నగరాలను ‘స్మార్ట్‌ సిటీ’ పథకం కింద ఎంపిక చేసింది. నగరాలకు మెరుగులు దిద్దాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ పథకాన్ని అయిదు నుంచి ఏడేళ్లలోగా పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నప్పటికీ- అమలులో ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునే వేగం కనిపించకపోవడం బాధాకరం. ఈ పథకం కింద ఇప్పటివరకు 5,151 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని అన్నిచోట్లా స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ)తో పాటు, నగర స్థాయి సలహా బృందం (క్లాఫ్‌), ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల ఏర్పాటు సాధ్యపడిందని ఆర్థిక సర్వే గణాంకాల్లో ఇటీవల ఘనంగా చాటుకున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఈ పథకంలో ఎన్నో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఉంది. ఎంపికైన ప్రాజెక్టులను కొన్ని నగరాల్లో స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ విభాగాలు సమర్థంగా, గడువులోపు పూర్తి చేయలేకపోతున్నాయి. గతంలో మంజూరైన నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై వినియోగ సర్టిఫికెట్ (యూసీ)లను సమర్పించడంలో కొన్ని చోట్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. దానివల్ల కేంద్రం నుంచి నిధులు సమయానికి అందడం లేదు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు నగరాలు ఈ పథకానికి ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి; తెలంగాణలో వరంగల్‌, కరీంనగర్‌ పట్టణాలు ఈ జాబితాలో ఉన్నాయి. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరికొత్త సాంకేతికతతో ‘స్మార్ట్‌’ పరిష్కారాలు కనుగొనడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఒక్కో నగరానికి కేంద్రం ఏటా రూ.100కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉండగా, ‘మ్యాచింగ్‌ గ్రాంటు’గా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.100 కోట్లు జతపరచాలన్నది నిబంధన. ఆయా నగరాల్లోని అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సేకరించి లక్ష్యాన్ని చేరుకోవాలని ఎంఓయూలో పేర్కొన్నారు. ఉదాహరణకు వరంగల్‌ నగరాన్ని తీసుకుంటే స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా రూ.2,800 కోట్ల ప్రతిపాదనలతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఇందులో కేంద్రం అయిదేళ్లలో రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, అంతే మొత్తంలో రాష్ట్రం చెల్లించే ‘మ్యాచింగ్‌ గ్రాంటు’ కలిపితే మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు అవుతుంది. మిగిలిన రూ.1800 కోట్లు పీపీపీ విధానంలో సమకూర్చుకోవాలి. 2016లో రెండో విడతలో వరంగల్‌కు ఈ ప్రాజెక్టు మంజూరైంది. అయిదేళ్లు పూర్తి కావస్తున్నా, లక్ష్యం మేరకు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. అక్కడ 36 ప్రాజెక్టులు ప్రతిపాదించగా, ఇప్పటి వరకు పూర్తయినవి కేవలం 12 మాత్రమే. మంజూరైన నిధుల మొత్తం రూ.196 కోట్లు; అందులో రూ.60 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. పథకం నత్తనడకన సాగుతున్న తీరును కళ్లకు కడుతున్న పరిణామాలివి. ఇతర పట్టణాల్లో పనులు ఈ మధ్యే కాస్త వేగం పుంజుకొన్నాయి. కరీంనగర్‌లో 46,  తిరుపతిలో 77,  విశాఖపట్నంలో 40, కాకినాడలో 64 ప్రాజెక్టులను ఈ పథకం కింద చేపట్టాల్సిన జాబితాలో చేర్చారు.

స్మార్ట్‌ సిటీకి ప్రత్యేకించి ఒక నిర్వచనం లేదని నిపుణులు చెబుతున్నారు. స్థానిక అవసరాలకు తగ్గట్టు సమస్యలకు తెలివైన, సులువైన పరిష్కారాలు చూపడమే ఆకర్షణీయ నగరానికి అసలు నిర్వచనం. నిరుడు కొవిడ్‌ కన్నా ముందు మహారాష్ట్రలోని పుణె నగరం స్మార్ట్‌సిటీ నగరాల్లో 17వ స్థానంలో ఉండగా, కరోనాపై ‘స్మార్ట్‌’ పోరులో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతో 13వ ర్యాంకుకు ఎగబాకింది. ఆరోగ్య సమాచార వ్యవస్థలను ఈ పథకంలో భాగంగా అభివృద్ధి చేసుకోవడంతో పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌- కొవిడ్‌పై సమర్థంగా పోరాడగలిగింది. స్థానికంగా ఆయా నగరాల్లోని జాతీయ సాంకేతిక సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల సాంకేతిక సహకారం సైతం ఈ పథకానికి సమకూరితే సత్ఫలితాలు సాధ్యపడవచ్చు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ స్మార్ట్‌ సిటీ పథకం పనుల అమలులో ముందు వరసలో ఉంది. విశాఖలో రెండు మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో చేపట్టిన సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల కాలుష్యం గణనీయంగా తగ్గడంతోపాటు, సోలార్‌ పలకల వల్ల జలాశయంలో ఆవిరయ్యే నీటి శాతం తగ్గడం, విద్యుత్తు బిల్లు ఏటా రెండు కోట్ల రూపాయల మేర ఆదా కావడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. రాజస్థాన్‌ జయపురలో ఈ పథకం కింద ఇంటింటికీ స్మార్ట్‌ మీటర్లు అమర్చి నీటి వృథాను అరికడుతున్నారు. ఇలా స్మార్ట్‌ సిటీ పథకంలో ముందు వరసలో నిలబడుతున్న నగరాలే ఆదర్శంగా- వంద నగరాల్లోనూ పనులు పూర్తయితే... సుమారు పది కోట్ల పట్టణ జనాభాకు ప్రయోజనం కలుగుతుంది. జాప్యానికి అడ్డుకట్టవేసి ప్రభుత్వాలన్నీ లక్ష్యసాధనవైపు అడుగులు కదపాలి.

- గుండు పాండురంగశర్మ
 

Posted Date: 16-02-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం