• facebook
  • whatsapp
  • telegram

ఇరకాటంలో గుజరాత్‌ సర్కారు

 

 

ఓ వైపు మాల్‌ధారీలు, మరోవైపు గో సంరక్షకుల నిరసనలతో గుజరాత్‌లోని భాజపా సర్కారు కిందు మీదులవుతోంది. పట్టణాలు, నగరాల్లోకి పశువుల విచ్చలవిడి ప్రవేశాన్ని నిషేధిస్తూ తెచ్చిన బిల్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. తమకు నిధులు అందిస్తామన్న హామీని విస్మరించడంపై గోశాలల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లోకి పశువులు, మేకలు, గాడిదలు వంటి జంతువుల ప్రవేశాన్ని నిరోధించేందుకు గుజరాత్‌ సర్కారు సంకల్పించింది. అందుకోసం ఆరు నెలల క్రితం ఆ రాష్ట్ర అసెంబ్లీ పట్టణ ప్రాంతాల్లో పశు నియంత్రణ (కావలి, కదలికల) బిల్లును ఆమోదించి  గవర్నర్‌ సంతకానికి పంపింది. ఆ బిల్లు చట్టంగా మారితే రాష్ట్రంలోని ఎనిమిది మున్సిపల్‌ కార్పొరేషన్లు, 162 మునిసిపాలిటీల్లోకి పశువుల ప్రవేశానికి వీలుండదు. పట్టణాల్లోకి పశువులను తరలించాలన్నా, పెంచుకోవాలన్నా లైసెన్సు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. లైసెన్సు పొందిన 15 రోజుల్లోగా యజమానులు పశువులన్నింటికీ ట్యాగులు వేయాలి. ఒకవేళ పశువులు రోడ్లపైకి వస్తే సంబంధిత యజమానికి అయిదేళ్ల జైలుశిక్షతో పాటు అయిదు లక్షల రూపాయల దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. దానిపై మాల్‌ధారీల (పశు పెంపకందారుల) నుంచి పెద్దయెత్తున నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.  

 

మాల్‌ధారీలు చాలా కాలం క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి తరలివచ్చి గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యం అంచుల వెంట స్థిరపడ్డారు. పశువులు, గొర్రెలు, మేకల పెంపకం వారి ప్రధాన వృత్తి. వాటి పాల అమ్మకం ద్వారా ఆదాయం పొందుతుంటారు. గుజరాతీ భాషలో మాల్‌ అంటే పశువులు. ధారీ అంటే పెంచేవారు అని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లును మాల్‌ధారీలు తీవ్రంగా వ్యతిరేకించారు. దాన్ని ఉపసంహరించుకోవాలంటూ మాల్‌ధారీ మహా పంచాయత్‌ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గతవారం అవి హింసాత్మకంగా మారాయి. అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, సూరత్‌ వంటి ప్రధాన నగరాలతో పాటు రాష్ట్రం నలుమూలలా రోడ్లను మాల్‌ధారీలు దిగ్బంధించారు. పాల విక్రయాన్ని స్వచ్ఛందంగా నిలిపివేశారు. సేకరించిన పాలను తీసుకెళ్తున్న వ్యాన్లు, ట్యాంకర్లను అడ్డుకొని వేల లీటర్ల పాలను రోడ్లపై పారబోసి నిరసన తెలిపారు. కొన్నిచోట్ల హింస ప్రజ్వరిల్లే పరిస్థితులు తలెత్తడంతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. పాల విక్రయాన్ని నిలిపివేయడంతో తీవ్ర కొరత ఏర్పడింది. అది సామాన్య పౌరుల్లో అసహనాన్ని పెంచింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో ఆ బిల్లుపై పునరాలోచించాలని సూచిస్తూ రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ దాన్ని తిప్పి పంపారు. ఈ పరిణామాలతో గుజరాత్‌ సర్కారు దిగివచ్చి ఈనెల 21న అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని నిర్వహించింది. చర్చ లేకుండానే బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తమ మిగిలిన డిమాండ్లనూ నెరవేర్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని మాల్‌ధారీ మహా పంచాయత్‌ స్పష్టం చేసింది. 

 

మరోవైపు గతంలో గుజరాత్‌లో లంపీ చర్మవ్యాధి సోకి గోవులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. దాంతో ముఖ్యమంత్రి గోమాత పోషణ యోజన కింద రూ.500 కోట్లు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఎలాంటి సంరక్షణకు నోచుకోని ఆవులను పెంచుతున్న వ్యక్తులు, సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తారు. ఆ నిధులు ఒక్క పైసా కూడా విడుదల కాలేదని 1750 గోశాలల నిర్వాహకులు ఆగ్రహించారు. లక్షల సంఖ్యలో ఆవులను రోడ్లపైకి వదిలివేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్దకు తోలుకువచ్చి మరీ వాటిని వదిలి నిరసన తెలిపారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి గో అధికార్‌ పేరిట ఆందోళన యాత్ర చేపడతామని గుజరాత్‌ గో సేవాసంఘ్‌ ప్రధాన కార్యదర్శి విపుల్‌ మాలి హెచ్చరించారు. మరోవైపు వీధుల్లో సంచరించే పశువుల సంరక్షణపై తమకు హామీ ఇచ్చిన మేరకు సరైన చర్యలు తీసుకోలేదని గుజరాత్‌ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ నేరం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది. గో సంరక్షకులకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి రాఘవ్‌జీ పటేల్‌ వెల్లడించారు. రాష్ట్ర జనాభాలో మాల్‌ధారీలు దాదాపు పది శాతం ఉన్నారు. వారిని శాంతింపజేయడం సర్కారుకు తప్పనిసరి అవసరం. గో సంరక్షకుల నిధులనూ త్వరితగతిన విడుదల చేయడం ఎన్నికల ముంగిట అత్యంత కీలకం. అలాగే పశువులు వీధుల్లోకి రాకుండా పటిష్ఠమైన చర్యలు సైతం తీసుకోవాల్సి ఉంది!

 

- యద్దనపూడి ఛత్రపతి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సేంద్రియ సేద్యం... భూసారం పదిలం!

‣ సమస్యల ఊబిలో అన్నదాత

‣ రైతుల ఆర్థికాభివృద్ధికి మార్గం

‣ సమర్కండ్‌లో భారత్‌ సహకార నినాదం

Posted Date: 30-09-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం