• facebook
  • whatsapp
  • telegram

కమలనాథుల కదనోత్సాహం!

తెలంగాణలో మూడేళ్ల ముందే రాజకీయ వేడి
 

ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలకు ఒక ఏడాది-ఏడాదిన్నర ముందు నుంచి రాజకీయ వేడి మొదలవడం సహజం! తెలంగాణలో మాత్రం దాదాపు మూడేళ్ళ ముందే ఆ నెగడంటుకునే సూచనలు కనిపిస్తున్నాయి! స్థానిక సంస్థలతో పాటు దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో నాలుగేళ్ళపాటైతే తెలంగాణలో పెద్దగా ఎన్నికల గోల లేదనుకున్నారంతా! కానీ అనుకోకుండా వచ్చి పడిన దుబ్బాక ఉప ఎన్నికతో పాటు తాజా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తెలంగాణలో అనూహ్య రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి! భవిష్యత్‌ సాధారణ ఎన్నికలకు సరికొత్త సమీకరణలు సంకేతంగా నిలుస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక సృష్టించిన సెగ ఒక ఎత్తయితే... హైదరాబాద్‌ మహానగర పాలక పీఠం కోసం జరుగుతున్న పోరాటం మరో ఎత్తు! బల్దియా పీఠం కోసం పోరు గతంలో ఇంత వాడివేడిగా ఎన్నడూ జరిగి ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల స్థాయి ప్రాధాన్యాన్ని ఈ ఎన్నికల చుట్టూ సృష్టించారు! రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి వ్యక్తమవుతోందంటే రాజకీయంగా వాతావరణం ఎలా వేడెక్కిందో అర్థం చేసుకోవచ్చు! జీహెచ్‌ఎంసీ పీఠం ఎవరి కైవసం అవుతుందనే దానిపై కంటే కూడా... ఈ ఎన్నికల ఫలితాల పర్యవసానాలు ఎలా ఉంటాయి? రాష్ట్రంలో రాజకీయ సమీకరణలెలా మారుతాయనే అంచనాలకు అనుగుణంగా పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి!
 

స్వల్పమే అనల్పం
రాష్ట్రంలో ఈ ముందస్తు రాజకీయ వేడికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ అనటంలో సందేహం లేదు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఉనికి తగ్గుతూ వచ్చిన భాజపా మళ్ళీ పుంజుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది! వేలు పెట్టడానికి చోటిచ్చినా... కాలు దూర్చే సత్తాగల భాజపా అధిష్ఠానం- కర్ణాటక తరవాత దక్షిణాదిలో పాగా వేయటానికున్న అనువైన వేదికగా తెలంగాణను భావిస్తోంది. ముఖ్యంగా గత సాధారణ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెల్చినప్పటి నుంచి ఆ ఆశలు, వాటిని నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయనే చెప్పాలి! రాజకీయ విమర్శల నుంచి మొదలెడితే... సామాజిక మాధ్యమాల్లో ప్రచారం దాకా ప్రతి దాంట్లోనూ భాజపా దూకుడు కనిపిస్తోంది! పోరాడితే పోయేదేమీ లేదు... ఎదగటమే తప్ప అన్నట్లుగా ప్రతి అంశంలోనూ కమలనాథులు తెరాస ప్రభుత్వంపై దుందుడుకుగా దూసుకుపోతున్నారు. నిజానికి దుబ్బాక ఉప ఎన్నిక ప్రకటన నాటికి తెరాస విజయం లాంఛనమనే భావన రాజకీయ వర్గాల్లో నెలకొంది. కానీ అది క్రమక్రమంగా ఎలా మారుతూ వచ్చిందో...అంతిమంగా ఫలితం ఏమైందో చూస్తే భాజపా వ్యవహారశైలి ఎలా సాగిందో అర్థమవుతుంది. తన పార్టీతో పాటు మాతృసంస్థ (ఆరెస్సెస్‌)వంటి అనుబంధ సంస్థలన్నింటినీ రంగంలోకి దించిన కమలనాథులు రెండువేల ఓట్లలోపు తేడాతో పైచేయి సాధించటంలో సఫలమయ్యారు. అంకెల ఆధిక్యాల పరంగా చూస్తే ఈ విజయం స్వల్పమైనదే... కానీ రాజకీయంగా మాత్రం - అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి, తెలంగాణలో వికసించాలనుకుంటున్న భాజపాకు ఇది అనల్పమైందే! అభ్యర్థిత్వం, ఇతరత్రా కొన్ని స్థానికాంశాలు తెరాస ఓటమికి కారణాలనీ, అవి మారుంటే ఫలితం ఇలా ఉండేది కాదనే -ఐతేగియితే- వాదనలెలా ఉన్నా... రాష్ట్రంలో భాజపా రాజకీయ ఆశలకు ఆ ఎన్నిక కొత్త ఊపిరులూదిందనడంలో సందేహం లేదు!
 

స్థానిక నాయకత్వం కంటే కూడా... భాజపా అధిష్ఠానంలో తెలంగాణలో అవకాశాలు, భవిష్యత్‌పై ఎక్కువ నమ్మకం కనిపిస్తున్నాయి. అందుకే వారు ఇక్కడ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సైతం అమిత్‌షా, నడ్డా, జవదేకర్‌, ఫడ్నవీస్‌, స్మృతి ఇరాని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లాంటి జాతీయ స్థాయి నాయకులు వచ్చారంటే తెలంగాణపై ఆ పార్టీ అధిష్ఠానానికున్న ప్రత్యేక దృష్టి ప్రస్ఫుటమవుతోంది. ఈ హంగామా వెనక మేయర్‌ పీఠం కంటే కూడా భవిష్యత్‌ రాజకీయ ఆకాంక్షలపై తపనే ఎక్కువ కనపడుతోంది. తమకు మేయర్‌ పీఠం రాకున్నా తెరాసకు సొంతగా కాకుండా... మజ్లిస్‌ మద్దతుతో పీఠం దక్కాలని కమలనాథులు ఆశిస్తున్నారు. అప్పుడు- ఆ రెండు పార్టీల పొత్తును ప్రజల ముందుంచి ప్రచారం చేయటానికి భాజపాకు అవకాశం చిక్కుతుంది!
 

గత ఎన్నికల నాటికి రాష్ట్రంలోని అన్ని (119) అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపాకు కార్యకర్తల బలం అంతగా లేదనేది ఆ పార్టీ నేతలే అంగీకరించే నిజం! మిగిలిన పార్టీల మాదిరిగా కాకుండా తన భావజాలాన్ని ఒంటపట్టించుకున్న నాయకులనే పార్టీ ఇన్నాళ్ళూ ప్రోత్సహిస్తూ వచ్చింది. కానీ ఎదిగే క్రమంలో ఇప్పుడిప్పుడే ఆ సూత్రానికి నీళ్ళొదిలి గేట్లు తెరుస్తోంది. దీంతో రాత్రికి రాత్రి నాయకులు, కార్యకర్తలు తయారైపోతున్నారు. తెలంగాణ ఆవిర్భావం నాటి నుంచీ రాష్ట్రంలో బలమైన విపక్ష స్థానం ఖాళీగా ఉంటూ వచ్చింది! 2018 అసెంబ్లీ ఎన్నికల తరవాత ఆ ఖాళీ కాస్తా క్రమంగా శూన్యంలా మారే పరిస్థితి కొచ్చింది! సమర్థ సారథ్యం లేక వరసగా రెండు ఎన్నికల్లో ఓడటంతో పాటు జాతీయస్థాయిలోనూ బలహీనపడటంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకంటే కూడా పార్టీ కేడర్‌ పూర్తి నిరాశలో పడిపోయి... తమ భవిష్యత్తును తాము వెదుక్కునే పనిలో పడింది. ఇప్పటికే తెరాసలోకి పోనివారు... ఇప్పుడు భాజపా వైపు చూస్తున్నారు! దుబ్బాక విజయంతో పాటు ఆ పార్టీ చూపుతున్న దూకుడు- ప్రత్యామ్నాయ రాజకీయాలు వెదుకుతున్న చాలామందిని చాక్లెట్‌లాగా ఆకర్షిస్తోంది! ఫలితంగా భాజపాలోకి వలసలు మొదలయ్యాయి. మునుముందు అవి మరింత పెరగటం సహజం! రాష్ట్రంలో కాంగ్రెస్‌ స్థానంలో ఇప్పటికే తాము రెండో ప్రధాన పార్టీగా ఎదిగినట్లు భాజపా స్వయంగా చిత్రీకరించుకుంటోంది. అంటే తెరాసకు తామే ప్రత్యామ్నాయమనే భావన కలిగిస్తోంది! కానీ ఈ భావనను వాస్తవం చేసుకోవాలన్నా, అక్కడి నుంచి అగ్రస్థానానికి చేరాలనే కల నెరవేర్చుకోవాలన్నా- అందుకు అవసరమైన పరిణత నాయకత్వం, ఔచిత్య వ్యూహాలనెంత మేరకు కమలనాథులు సమకూర్చుకుంటారనేదాన్ని బట్టి రాష్ట్రంలో రాజకీయాలు రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారతాయి.
 

తెరాసకు ‘ముందస్తు’ లాభమే!
దుబ్బాక ఎన్నికలో ఓడిపోగానే చాలామంది తెరాసకు తిరోగమనం మొదలైందని విశ్లేషించటం మొదలెట్టారు. గెలుపోటముల పరంగా కేసీఆర్‌కు దుబ్బాక దెబ్బే! కానీ కొన్ని ఎదురుదెబ్బలు మునుముందు జాగ్రత్త పడటానికి కూడా దోహదపడతాయని మరచిపోకూడదు. కేసీఆర్‌లాంటి నాయకుడు ఇలాంటి వాటిని పసిగట్టడంలో ఇంకా ముందుంటారు. నిజానికి కేసీఆర్‌ కంటే కూడా తెరాసలోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు దుబ్బాక ఫలితాన్ని చూసి జాగ్రత్తపడాలి. సిట్టింగుల్లో ఎంతమందిపై వ్యతిరేకత ఉందో, ఎవరిపై వేటు వేయాలో, ఎక్కడ కొత్తవారిని నిలబెట్టాలో ఆలోచించుకోవటానికి దుబ్బాక ఫలితం ఒకరకంగా కేసీఆర్‌కు వెసులుబాటు కల్పించొచ్చు! అంతేగాకుండా తన ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకతను విశ్లేషించుకోవటానికి, పార్టీ పరంగా లోపాలను సరిదిద్దుకోవటానికి కూడా ఈ ఎదురు దెబ్బలన్నీ కేసీఆర్‌కు లభిస్తున్న మంచి ముందస్తు అవకాశాలు. వచ్చే మూడేళ్ళలో తన ప్రభుత్వాన్ని, పార్టీని సర్దుకోవటానికి కేసీఆర్‌కు వీలు కల్పిస్తున్న మంచి పరిణామాలు! ఓటర్ల నాడి పట్టడంలో ముందుండే కేసీఆర్‌ బహుశా... ఈ పరిణామాలన్నింటి తరవాత- మూడోసారి తెరాసను విజయం దిశగా నడిపించటానికి అవసరమైన వ్యూహాలకు, పథకాలోచనలకు మరింత పదును పెడతారనటంలో సందేహం లేదు. మొత్తానికి మూడేళ్ళ ముందుగానే రగులుకున్న రాజకీయ సెగలో ఎవరు చలికాచుకుంటారో, ఎవరు చేతులు కాల్చుకుంటారో చూడాలి!
 

- రేగళ్ళ సంతోష్‌ కుమార్‌
 

Posted Date: 07-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం