• facebook
  • whatsapp
  • telegram

‘గూర్ఖాలాండ్‌’ దారెటు?

పశ్చిమ్‌ బంగ ఎన్నికలతో ఊపందుకున్న చర్చ
 

శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమ్‌బంగ రాష్ట్రంలో గూర్ఖాలాండ్‌ అంశం మరోమారు తెరమీదికొచ్చింది. మూడేళ్లుగా దాదాపు ప్రశాంతంగా ఉన్న తెరాయి ప్రాంతంలో గూర్ఖా జన్‌ముక్తి మోర్చా(జీజేఎం) మాజీ అధినేత బిమల్‌ గురుంగ్‌ అకస్మాత్తుగా పునఃప్రత్యక్షమై ఆశ్చర్యం కలిగించారు. 2017 తరవాత నేరాభియోగాలతో జనజీవితం నుంచి కనుమరుగైన గురుంగ్‌ అక్టోబరు 21న తిరిగి దర్శనమివ్వడంతోపాటు, మమతా బెనర్జీకి బాహాటంగా మద్దతు పలికి, భాజపాను తెగనాడటం సంచలనం సృష్టించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో భాజపా తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయిందని గురుంగ్‌ ఆరోపణలు సంధించారు.
 

ఉత్తర బంగ గూర్ఖాల ప్రత్యేక రాష్ట్ర డిమాండుకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. వారి అసంతృప్తి నినాదం 1907లోనే మొదలైంది. హిల్‌మెన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డార్జిలింగ్‌ (హెచ్‌ఏడీ) తమ పర్వత ప్రాంతాలకు ప్రత్యేక పాలన వ్యవస్థ ఉండాలని డిమాండు చేస్తూ మార్లీ-మింటో సంస్కరణల కమిషన్‌కు వినతి పత్రం సమర్పించింది. డార్జిలింగ్‌, జల్పాయిగురి కలిపి ప్రత్యేక పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతూ అప్పట్లోనే బెంగాల్‌ ప్రభుత్వానికి, బ్రిటన్‌లోని ఇండియా వ్యవహారాల మంత్రికి, వైస్రాయ్‌కి హెచ్‌ఏడీ విన్నవించుకుంది. బ్రిటిష్‌ పాలకులు పట్టించుకోలేదు. గూర్ఖాలు సైమన్‌ కమిషన్‌ ఎదుట 1929లో, అనంతరం 1930లో, తిరిగి 1941లో ఆ మేరకు విజ్ఞప్తులు చేశారు. 1952లో అఖిల్‌ భారతీయ గూర్ఖా లీగ్‌ ప్రతినిధులు అప్పటి ప్రధాని నెహ్రూను కిలింపాంగ్‌లో కలసి గూర్ఖా జాతి ప్రజలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాలని, బెంగాల్‌ నుంచి విడగొట్టాలని కోరారు. 1980లలో గూర్ఖాల్యాండ్‌ ప్రత్యేక రాష్ట్ర డిమాండు హింసామార్గం పట్టింది. సుభాష్‌ ఘీషింగ్‌ నేతృత్వంలోని గూర్ఖా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జీఎన్‌ఎల్‌ఎఫ్‌) చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. 1988 ఆగస్టు 22న డార్జిలింగ్‌ గూర్ఖా హిల్‌ కౌన్సిల్‌ (డీజీహెచ్‌సీ) పేరిట ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కలిగిన పాలన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఉద్యమం చల్లారింది. నాటి ఉద్యమంలో 1200మంది ప్రాణత్యాగం చేశారు. డీజీహెచ్‌సీకి ఘీషింగ్‌ ఛైర్మన్‌ అయ్యారు. అయితే డీజీహెచ్‌సీ నేతలు తమ ప్రత్యేక రాష్ట్ర డిమాండును పూర్తిగా వదులుకోలేదు. కౌన్సిల్‌ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో చేర్చాలని 2004లో ఘీషింగ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన ప్రత్యర్థులు మాత్రం వ్యతిరేకించారు. చివరికి కేంద్రం ఆ ప్రతిపాదనకు తిలోదకాలిచ్చింది. తదనంతర కాలంలో ప్రజలకు డీజీహెచ్‌సీ మీద భ్రమలు తొలగిపోయాయి. మండలిలోని పలువురు సభ్యులు ఘీషింగ్‌తో విభేదించారు. 2007లో జీఎన్‌ఎల్‌ఎఫ్‌లో చీలిక వచ్చింది. ఘీషింగ్‌ నమ్మిన బంటు బిమల్‌ గురుంగ్‌ నాయకత్వంలో జీఎన్‌ఎల్‌ఎఫ్‌ చీలిక వర్గం గూర్ఖా జన్‌ముక్తి మోర్చా(జీజేఎం)గా ఆవిర్భవించింది. 2009 సాధారణ ఎన్నికల్లో డార్జిలింగ్‌ లోక్‌సభ స్థానం పోటీలో భాజపా అభ్యర్థి జస్వంత్‌ సింగ్‌కు గురుంగ్‌ మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సింగ్‌ గెలిచినా ఎన్డీయే ఓడిపోవడంతో ప్రత్యేక గుర్ఖాలాండ్‌ ఆశలూ ఆవిరయ్యాయి. పశ్చిమ్‌ బంగ అసెంబ్లీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అన్ని మార్గాలూ మూసుకుపోవడంతో గురుంగ్‌ హింసాకాండను ఎంచుకున్నారు.
 

జీజేఎం, పశ్చిమ్‌బంగ, కేంద్రం 2011 జులైలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. గూర్ఖాలాండ్‌ టెరిటోరియల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (జీటీఏ) పేరిట పాక్షిక స్వయంపాలన వ్యవస్థ ఏర్పాటైంది. 2012లో దీనికి జరిగిన ఎన్నికల్లో జీజేఎం గెలిచింది. గురుంగ్‌, మమత ఒక్కమాట మీద నడిచినా ఎంతోకాలం కొనసాగలేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ డార్జిలింగ్‌ కొండల్లో పట్టు సాధిస్తే జీజేఎం సోదిలో లేకుండా పోతుందని గురుంగ్‌కు తెలుసు. ఫలితంగా, ఇద్దరి నడుమ పొరపొచ్చాలు తలెత్తాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన మమతా బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. డార్జిలింగ్‌ పర్వతపాద ప్రాంతాల్లోని మిరిక్‌ స్థానిక ఎన్నికల్లోనూ ఆమె పార్టీ ఘన విజయం సాధించింది. డార్జిలింగ్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బెంగాలీ భాషను నిర్బంధం చేయాలని ఆమె ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో నేపాలీ అధికంగా మాట్లాడే డార్జిలింగ్‌ అగ్గి మీద గుగ్గిలమైంది. 104 రోజుల దిగ్బంధంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు బుగ్గిపాలయ్యాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. గురుంగ్‌ మీద, అతడి అనుచరుల మీద కేసులపై కేసులు నమోదవడంతో ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. జీజేఎం చీలిపోయింది. గురుంగ్‌ అనుచరుడు బినయ్‌ తమంగ్‌ అతడికి ప్రత్యర్థిగా కొత్త వర్గం నాయకుడయ్యారు. ఇప్పుడిక- గురుంగ్‌, తమంగ్‌ వర్గాలు ఏకమవుతాయా? జీజేఎం టీఎంసీ జతకడతాయా? గూర్ఖాలాండ్‌ డిమాండ్‌కు ప్రాణం పోసే కొత్త నేతల కోసం పర్వత ప్రాంత ప్రజలు నిరీక్షించాల్సిందేనా? వీటికి ఇప్పుడే సమాధానాలు దొరకడం కష్టం. ప్రస్తుతానికైతే వేచి చూడటమే!
 

- దీపాంకర్‌ బోస్‌
 

Posted Date: 07-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం